Monday, July 30, 2018

చివరికి.. ఓ మంచి రోజు

ముద్రలు వేసుకుపోయిన అనుభవాలు
వేళ్ళూనుకు పోయిన ఆలోచనలు
వెరసి జ్ఞాపకాల వేదికలు ..

కాసిన్ని తలచుకుని గుర్తు చేసుకుంటే
కాసిన్ని గుర్తొచ్చి పొలమారుతాయి

కావాలనుకున్నా ఆ రోజులు అలాగే తిరిగి రావు
వద్దనుకున్నా వాటి మరకలు ఇంకా చెరిగి పోవు

విడిచిన బట్టల్ని, తిరిగి తొడుక్కున్నట్టు
గడిచిన కాలాన్ని
తిరిగి జీవిస్తుండడమే ఈ జ్ఞాపకాలతో వ్యవహారం అంతా 

కాసేపు అద్దంలో చూసుకోడానికి తప్ప
వేసుకుని బయటకి పోడానికి పనికి రావు ...

రాతిరి కల పగటికి మాయమైనట్టు 
వాస్తవంలో అడుగులు పడే కొద్దీ.. 
జ్ఞాపకాలు మరుగునపడి కనుమరుగైపోతాయి.. 
కాలం గిర్రున తిరుగుతుంది 

తిరిగి ఎక్కడో,
ఎప్పుడో,
గుర్తున్నానా అంటూ 
తిరిగి పరిచయం చేసుకోడానికి 
ఓ శుభ ముహూర్తాన ఎదురుపడతాయి 

అప్పుడు కళ్ళు నులుముకుని 
బుర్రకి పదును పెట్టి
తలని గోడకి కొట్టి విశ్వ ప్రయత్నం చేసినా..
వయసు మళ్ళిన ముదుసలి బుద్ధి కి 
జ్ఞాపకాలు జ్ఞప్తికి  రావు 

చివరికి..
జ్ఞాపకాలు అనాధలై వీధిన పడతాయి
మనిషి మరపు తో కలిసి మరణానికి దగ్గరవుతుంటాడు  

ఓ మంచి రోజు 
రెండూ లేకుండా పోతాయి.. 


Monday, July 16, 2018

ఆలోచన - ఒక విచిత్రమైన పదం..

ఆలోచన
ఒక విచిత్రమైన పదం..

దీనికి నిన్న నేడు రేపు లనే తేడా లేదు
తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనే భేదం లేదు

విన్నవి చూసినవి
అక్కడా ఇక్కడా ఏరుకున్న విషయాలను
ఊహకి .. భావనలకు జోడించి
గాలిలో మేడలు లేపుతుంది

అటు ఇటు పోలేక
కూలిన ఆ మేడల శిధిలాల లోనే
నలుగుతూ జీవిస్తుంది

వాస్తవం గా వాస్తవాన్ని చూసే ఆలోచన,
ఆలోచనకు ఎప్పుడు వస్తుందో?

Tuesday, July 10, 2018

ఓ తీగె.. తెగి

ఓ తీగె.. తెగి ఊపిరాడక
విల విల లాడింది

చూడలేక.. చూసి ఊరుకోలేక
తెచ్చుకుని కొంత పుడమిని తోడిచ్చాను
దాహమంటే ఇంత నీరిచ్చాను
తాగి అలసి పడుకుండి పోయింది, ఆరోజుకి

తెల్లారి చూస్తే, నవ్వుతూ పలకరించింది
ప్రతిరోజూ గుమ్మంలో అడుగు పెట్టే ముందు
నా తల .. ఆ తీగె ఎలావుందో అని చూస్తూ
లోపలికి కదిలేది.
నేనెటువైపు పోతే అటువైపే చూసేది

కొత్త చిగురులు తొడిగినా
వేర్లు ఊనినా
ఏమాత్రము ఎదిగినా
ఒక సంతోషం.. ఇంట్లో బిడ్డ పెరుగుతున్నట్టు

ఓరోజు.. తీగె మల్లెలేసింది
ఆ అందాన్ని చూస్తూ ఆనందంలో మునిగిపోయాను
ఎవరో గుడికి తీసుకుపోతాం అన్నారు
ఇంకెవరో మా ఇంట్లో శుభకార్యం ఉందన్నారు
చూస్తిని కదా ఇంకొకరు ఎవరో పోయారన్నారు
దారిని పోయేవాళ్ళు పరిమళం బాగుంది పట్టుకుపోతాం అన్నారు...

నేను మాత్రం కదల్లేదు.. వదల్లేదు
కనీసం ముట్టను లేదు
అమ్మ ఒడిలో పాపలా
అన్నపూర్ణమ్మ చేతిలో ముద్దలా
సద్గురు చూపులా ఉన్న
ఆ మల్లె నేసిన తీగని
ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను..
అది చాలనుకున్నాను
అదే చాలనుకున్నాను