Monday, June 11, 2018

గుడిలో దేవుడు...!!


------------------------------

చీకటితో లేస్తావు
పగలంతా తలుపులు తెరుచుకు చూస్తావు
ఓసారయిన వచ్చిపోతానని

నను చూస్తూనే ఉంటావు,
అయినా రోజంతా ఎదురుచూస్తావు
ఓమాటు అయినా నీ గుమ్మం తొక్కుతానని

కబురులు పంపుతావు,
ఉన్నానని గుర్తు చేస్తుంటావు, యేలాగో అలాగ
అయినా... ఊరంతా తిరుగుతాను కాని
నీ వైపుకు కదలను..
నీ ఊసుకు చనువీయను

చూసి చూసి, అలసి
నువ్వు అలాగే శయనిస్తావు..
మళ్ళీ ఎప్పటిలా..
చీకటితో లేస్తావు

నీకో మాట చెప్పనా!
నీకు తెలియనిది ఏముంది..
ఎంత తిరిగుతున్నా నేను కట్టేసి ఉన్న బందీనే..
ఒకటీ రెండూ కాదు.. శృంఖలాలు.
కొన్ని నేను కట్టుకున్నవి .. కొన్ని నన్ను పట్టుకున్నవి

ఈ ఎదురు చూపులు నువ్విక పడలేవు
నీ కష్టం నేను చూడలేను
కనుక నువ్వేరా..
వచ్చి నన్నెత్తుకెళ్ళు..
నన్నెత్తుకు తీసుకెళ్ళు..
ఆడుకుందాం కలిసి సంతోషంగా

కాళీయ మర్దనం లా
రావణాసుర వధ లా
నరకాసుర పీడాహరణం లా

1 comment:

  1. దేవుడితో అనుబంధం మరోలా ఎలా ఏర్పరుచుకోవచ్చో క్రొత్తగా చెప్పారు. నాకు నచ్చింది.

    ReplyDelete