Monday, October 16, 2017

గమనించారా?

కళ్ళు బయటకి వచ్చి,
మెడ ముందుకి కదిలి, 
నడుం వంగినట్టయ్యింది
చేతిలోకి మొబైల్ వచ్చి

ఆటలు, పాటలు 
పాఠాలు, పాత స్నేహాలు
వంటలు, బట్టలు
సందేశాల సందేహాల గుట్టలు
తల నొప్పులు
అన్నిటికి ఒకటే అదే అయ్యింది,
చిరునామా.

ఊరు పోతుంటే వెంటే.
నిదుర పోతుంటే వెంటే.
నడుస్తూంటే.. 
వాహనాలు నడుపుతూ వెంటే.
పనుల్లో ఆపని పనిగా ఉంటోంది

పిక్కులు
కిక్కులు
కావాలంటూ నరక ద్వారాలకు దగ్గరగా పోయే 
అమాయక చక్రవర్తులారా

లెక్కలు
మించి
వాడుక నుండీ వ్యసనానికి చేరువ అయ్యిన
ఆరాటపెళ్లికొడుకులారా

తోవలు
తప్పి
వేరొకరి నమ్మకాన్నో తెలివి తక్కువతనాన్నో వాడుకునే
దొంగనాయళ్ళారా

అవసరం 
మారిందని గుర్తించారా?
మార్పు అవసరం అని గమనించారా?

అవకరం
అనవసరం అని ఆలోచించారా?
ఆలోచన అవసరం గమనించారా?


Thursday, August 31, 2017

నేను బతికే ఉన్నాను..!

పెద్దగా మార్పు లేదు ఆలోచనలో
పెను మార్పులేవీ లేవు జీవితంలో

తింటున్నాను
నిద్రపోతున్నాను
అనాలోచితం గా ... అస్పష్టంగా అలా కదిలిపోతున్నాను రోజూ..

చాలా వాటికి ఎందుకు అని ప్రశ్నించటం మానేసాను
ఎన్నిటికో చలించడం మానేసాను
సూర్య చంద్రులు వచ్చిపోతున్నారు, చుట్టుపక్కల కొంత మంది రాలిపోతున్నారు
నేను మాత్రం ఇలా.. అదోలా ఉండిపోతున్నాను ...

నాది నిరాశ కాదు..
నాది నిర్లిప్త ధోరణి కాదు..
ఎదో ఒక శూన్యం ఆవహించింది అంతే..

నాకు కోపం వస్తోంది
నాకు కన్నీరు వస్తోంది
నేను నవ్వుతున్నాను కూడా..
నిజంగా

నేను బతికే ఉన్నాను
కానీ ఎందుకో తెలీడం లేదు..
అదే ప్రతి రాతిరి సమస్య

నేను బతికే ఉన్నాను
ఎందుకంటే నేను వెదకటం ఇంకా ఆపలేదు
అదే ప్రతి వేకువ ఆశ

Sunday, March 5, 2017

మళ్ళీ .. ఇక్కడే ముగుస్తుంది

ఒక సందర్భం ఎదురవుతుంది
ఒక క్షణం వస్తుంది
ఒక్క సారి అయినా అనిపిస్తుంది

ఏంజరుగుతోంది అని.. తెలీక
ఎవరూ నీలో ఖాళీని ని పూరించక
ఒంటరిగా మిగిలే ఆ సమయం
ఖచ్చితంగా వచ్చి తీరుతుంది 

ఎవరితోనైనా...
చెప్పుకున్న మాటలు సరిపోవు
ఏఊరు తిరిగినా..
తెగిన చెప్పులు తప్ప ఏమీ మిగలవు
ఎంత చేసినా..
పెరిగే బరువుకు, బారులు తీరిన ఏదురుచూపులకు, సమాధానాలు దొరకవు

అప్పుడు సరిగ్గా అప్పుడే
ఆశలకు అనుమానాలు పుడతాయి
అలసట కూడా అలిసిపోతుంది
ఆవేశం కన్నీళ్లు గా బయటకు పొర్లుతుంది
ఓరిమీ తన ఓటమి ఒప్పేసుకుంటుంది   
ఒక పెద్ద యుద్ధం ముగిసి..
నిశ్శబ్దమే నిలుస్తుంది అంతటా

సాక్షిగా, కొంత కాలం జీవితం గడిపేస్తావు
కానీ ఎక్కడో .. ఎప్పుడో ..

ఒక సందర్భం ఎదురవుతుంది
ఒక క్షణం వస్తుంది
ఒక్క సారి అయినా అనిపిస్తుంది

ఏంజరుగుతోంది అని.. తెలీక
ఎవరు నీలో ఖాళీని ని పూరిస్తారో తెలీక 
ఒంటరితనం నుంచీ తప్పించుకోవాలనుకునే. ఆ సమయం
ఖచ్చితంగా వచ్చి తీరుతుంది

ప్రతి కధ ఇక్కడే మొదలవుతుంది
ఇక్కడే ముగుస్తుంది
మళ్ళీ

Saturday, January 14, 2017

హాస్యాస్పదం


ఏదో చెప్పాలని అనిపిస్తోంది
కానీ రక రకాల ఆలోచనలు ముసిరి
ఏం చెప్పాలనుకున్నానో
మర్చిపోయేట్టు చేస్తున్నాయి

వీధిలో బిచ్చగాడికి ఒక రూపాయి వేసేందుకు
సిద్ధంగా లేని నేను
ఏదో చెప్పాలనుకోవడం హాస్యాస్పదం

పక్కనున్న వాడిని నవ్వుతూ పలకరిస్తే
నన్నేమి అడుగుతాడో అని భయపడే నేను
ఏదో చెప్పాలనుకోవడం హాస్యాస్పదం

ఎవరికో కష్టం కలిగిందని తెలియడం తో, ఏదో ఒక టీవీ ఛానల్ మార్చినట్టు
నా దిక్కును మరో పక్కకు మార్చే నేను
ఏదో చెప్పాలనుకోవడం హాస్యాస్పదం

బాధ్యతలని నెరవేర్చి గొప్ప అనుకోవడం
నాకూడు సంపాదనే గొప్పగా చెప్పుకోవడం
కలలో కూడా నేనొక్కడినే ఉంటూ ఉండడం
అలవాటైన నేను ..
ఏదో చెప్పాలనుకోవడం హాస్యాస్పదం

అన్నట్టు ... నేనేం చెప్పాలనుకున్నాను ?
రక రకాల ఆలోచనలు ముసిరి
ఏం చెప్పాలనుకున్నానో
మర్చిపోయేట్టు చేస్తున్నాయి

నీ పని నువ్వు చేసుకుంటే స్వార్ధపరుడంటారు
పక్కన వారిని గురించి పట్టించుకుంటే
నీకు పనే లేదా అని అంటున్నారు ..

నేను స్వార్ధ పరుడినో .. పని లేని వాడినో తెలీక ..
నాలో నేనే
నవ్వుకుని ఆగిపోతున్నాను
చివరికి నా పని నేను చేసుకుంటున్నాను

ఎందుకంటే ఇలాంటప్పుడు ..
ఏదో చెప్పాలనుకోవడం హాస్యాస్పదం

Sunday, January 8, 2017

నువ్వు నేను అనే కలయిక, నాకో వేడుక


గట్టిగా అరిచి చెప్పాలనేంతగా
ఎప్పటికి వదిలి పోలేనంతగా
నువ్వు నేను అనే కలయిక
నాకో వేడుక

తెలీదు మౌనం గొంతుక ఇంత పెద్దదని
తెలీదు తెలుగు ఇంత బాగుంటుందని
తెలీదు రెప్ప పాటుకు ఇంత సమయం పడుతుందని
ఈ క్షణం వచ్చేదాకా

చాలా బాగుందని చెపితే చిన్నబుచ్చినట్టుంటుంది
చెప్పలేనంతగా ఉందంటే సరిపుచ్చి నట్లుంటుంది
రెండూ ఒప్పుకోలేను
ఏదీ సరిగా చెప్పలేను
ఇది జీవించడం తప్ప

ఒక్కటే దారి, నీతోనే
ఒకటే దరి, నువ్వే
ఇంతే
ఇంతకు మించి మరి లేదు
ఇంతకు మించింది లేదు