Friday, May 27, 2016

ఒక చొక్కా తెచ్చుకున్నాను ... నేను మిగిలానువెంట తెచ్చుకున్నానో
లేక ముచ్చట పడి కొనుక్కున్నానో
లేక ఎవరైనా ఇచ్చారని వెంట తీసుకోచ్చానో ...
ఏమో ?
ఒక చొక్కా తెచ్చుకున్నాను ...

వేసుకుని తిరుగుతున్నాను.. చాలా కాలంగా
దాని మీద ఇష్టం పెరిగి
చక్కా నేను 'చొక్కా'ని పోయాను..
కొద్దిగా
కొద్ది కొద్దిగా
చిరగడం మొదలు పెట్టింది..


ఇంకా చుట్టూ పక్కల
రంగు రంగుల చొక్కాలు
కనపడ్డం మొదలు పెట్టాయి

కొన్నిటిని చూసి అలాగే రంగులద్దుకున్నాను
ఇంకొన్నిటిని చూసి అలమారలో దాచుకున్నాను

నెమ్మదిగా చొక్కాల సంఖ్యా పెరిగింది
అలమార పెరిగి పెరిగి ఒక ఇనుప రాతి గోడల భవంతి అంత అయ్యింది..

ఏదో భయం..
నా చొక్కాకి ఏం జరుగుతుందోని
ఏ చొక్కాని ఎవరెత్తికెళ్ళిపోతారోని

ఆలోచించి
ఆలోచించి
ఒక కాపలా వాడిని పెట్టాను
వాడికి జీతం ఇవ్వాలి కనుక
నేను అదనపు సంపాదన మొదలు పెట్టాను

కాలం
వెళ్ళిపోతోంది

అదనానికి సరైనన్నిసమస్యలు,
మధ్యలో చొక్కాకు వేసుకుంటూ వచ్చే కుట్లు
కాపలా వాడి అల్లరి
భవంతి మరమ్మత్తులు
అన్నీ
సర్వ సాధారణమై పోయినాయి..

చివరికి
చొక్కాలో కుట్లు తప్ప
గుడ్డ ముక్క మిగల్లేదు
ఇప్పుడు దీన్ని చొక్కా అనలేను

ఆ భవంతి చొక్కాని 'పాడై' పోకుండా ఆపలేదు
కాపలావాడు కనీసం చూడడు
వెంట తెచ్చుకున్న చొక్కాలు ఏ మాత్రం
ఈ మార్పు నుండీ నా చొక్కాని కాపాడలేవు

అయిపొయింది
కుట్లు విడిపోతున్నాయి..
దారపు తునకలు రాలి కింద పడిపోతే
ఊడ్చి భవంతి బయట పాడేస్తున్నారు..

ఇప్పుడు
చొక్కా లేదు
భవంతి లేదు
కాపలావాడు లేడు
కుట్లు కూడా లేవు

నేను మిగిలాను

===================

చొక్కా = శరీరం
చిరుగు = జబ్బు
కుట్లు = మాత్రలు
రంగులు = లక్షణాలు
భవంతి = నాది అనుకునే వైశాల్యం
కాపలా వాడు = జాగ్రత/భయం


Monday, May 23, 2016

పిచ్చితో 'కలిసి' పోతున్నానునిన్న వేసుకున్న చొక్కా
చిరిగిపోయింది

నోట వేసుకున్నకూడు
కింద నుంచీ వెళ్ళిపోయింది
మిగిలిన కూడు పాచి పోయింది
ఏదీ 'అలానే' ఉండిపోలేదు

రాతిరి చీకటి సూర్యుడితో వెళ్లి పోయింది
సూర్యుడి స్పర్శ సంధ్యతో చల్లారి పోయింది
ఏదీ 'అలానే' ఉండిపోలేదు

నీడ నిచ్చిన చెట్టు నేల రాలి
వెళ్లి పోయింది
ఎక్కడో బూడిదవ్వడానికి

చుట్టు పక్కల కొత్త చిరుగురులు మాత్రం
సంభందం లేనట్టు
ఎప్పుడు నీడ నిస్తామా అని ఎదురు చూస్తున్నై

జడన కూర్చిన పువ్వూ
దేవతార్చనకు చేర్చిన పువ్వూ
కోయక చెట్టుకు విడిచిన పువ్వూ
అన్నీ వాడి పోయాయి, కొంచెం అటు ఇటుగా
పోనీ..
కోసిన కత్తి వాడీ..???
"మిగల్లేదు ఏదీ.."

నిన్నటి ప్రశాంతత ఆకాశంలో నేడు లేదు
నేటి ఉదృతి రేపు కనపడదు
వెళ్ళిపోతుంది ఎక్కడికో..

చరిత్ర పుస్తకాలన్నీ
'జరిగి' పోయాయని చెపుతున్నాయి
భవిష్యత్తు పై ఆశలన్నీ
ఈరోజు "గడిచి" పోతుందని కోరుకుంటున్నాయి

ఎక్కడ చూసినా
ఒకలా ఏదీ లేదు..
నిలబడి లేదు ఏదీ, 'కదిలి' పోతోంది
ఎక్కడో 'కలిసి' పోతోంది

జనించి,
గడించి,
గతించి పోతోంది.. జగత్తు

ఇంత జరుగుతున్నా.. కళ్ళ ముందే
కల్ల అనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ
'నేను మాత్రం' మిగిలిపోతానన్న
పిచ్చితో 'కలిసి' పోతున్నాను ..Monday, May 16, 2016

ముసలి ప్రాణం వెళ్ళిపోయింది..

మండు వేసవిలో ఉంది, 'గుండె' 
బలవంతం గా కొట్టుకుంటున్నట్టు, ఎప్పుడో అప్పుడు ఆగిపోఏట్టు 

మండువా లోగిలి లాగుంది, 'మనసు' 
ఏదైనా వచ్చి మీద పడేట్టు, ఇప్పటికే పడీ పడీ శిధిలమైనట్టు 
 
ఆకలి మందు లేక మైకమౌతోంది, 'తనువు' 
వేసే అడుగు ఈడుస్తున్నట్టు, ఇప్పుడో అప్పుడో పడిపోఏట్టు 

శాశ్వత నిద్రకు సన్నద్ధమౌతోంది, 'నేను' 
గతం అఘాధమై, అనుభవాలు గాయాల పూలమాలలై,మనుషుల జ్ఞాపకాలు చారికలై,
సింహావలోకనం జరుగుతోంది. 
చెంపపై కన్నీరు జారుతోంది. 
ఇది భాధలకు సెలవనుకుంటూ .. 
ఓపిక లేని నవ్వు పెదాలకు చేర్చి.. 
ఎక్కడికెల్తోందో తెలీకుండా వెళ్ళిపోయింది..