Thursday, April 21, 2016

గురువుకు లేఖ

పంపించెయ్యండి చీకటిని నా నుండి 
కట్టి మీ ఛాయలకు తీసుకుపోండి 
తరిమికొట్టండి నేను అనే వాడిని
మీకు మోకరిల్లుతున్నాను 
మీకు మోకరిల్లుతున్నాను

పోలికలు సరిపోవు, ఎంచి చూపుతామంటే నాలా మరొకరిని 
అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తుంటాను.. అలాగే 
కాస్త అటు ఇటుగా అయినా నడవను 
మీ కాలి అడుగుల గుర్తెరిగి 
మీ మాట జ్ఞప్తికి పెట్టి 

హాస్యాస్పదమనిపించినా,
నా చేతుల్లో లేని నేను 
నన్ను మీ చేతుల్లో పెడుతున్నాను.. 
సరి లేని ఈ వంకర బుద్ధికి దిక్కు చూపండి
మీకు మోకరిల్లుతున్నాను 
మీకు మోకరిల్లుతున్నాను

మాట దాటక ఉండే 
వినయం లేదు 

మీ పాటే పాడుకుంటాను 
పదే పదే మీ పేరే చెప్పుకుంటాను 
అనే భక్తీ నాది కాదు
అందుకే 
మీకు మోకరిల్లుతున్నాను 
మీకు మోకరిల్లుతున్నాను 

ఎందుకేడుస్తున్నాడో తెలియని 
పసి పాపడి ఆర్తిని.. విని 
పరిగెత్తుకు వచ్చే అమ్మలా నన్ను దగ్గరకు తీసుకోండి 
మీ కారుణ్యపు దృక్కుల నుండీ నన్ను దూరం కానీకండి 
మీకు మోకరిల్లుతున్నాను 
మీకు మోకరిల్లుతున్నాను 


 

1 comment:

Anonymous said...

మాములుగా ఉండి, గహనంగా గురువుని ప్రాధేయపడటం అధ్బుతంగా ఉంది. గురువుకి భగవంతుడికి అభేదం కనుక ఇద్దరినీ ఒకేసారి అర్తిస్తున్నట్టుగా ఉంది. బాగు బాగు.