Tuesday, July 28, 2015

దరిద్రాన్ని ప్రచారం చేసుకుందాం..
వృద్దాప్యం కాదు కాళ్ళు జాపుకు కూర్చోడానికి
పసితనమూ కాదు.. పళ్ళు బయట పెట్టి నవ్వితే చాలు అనుకోవడానికి..
విధ్యార్ధివి..
కాబోయే ఉద్యోగివి,
సంపాదనకు వయసోచ్చిందని,
పదవులేవో వెలగపెట్టమనీ
గుర్తుచేస్తుంటుంది సమాజం పెద్దల పేర. వెంటపడి.

IIT చదివావా? ఎన్నవ ర్యాంకు?
ఎక్కడ? అలాగా? ఎలాగా?
ప్రశ్నలతో ఎదుర్చూస్తోంది ఉద్యోగ ప్రపంచం .. ఊరిస్తూ దూరంగా కంటపడి

ఆశగా అడుగులేద్దామా? భయపడి ఆగిపోదామా?
వినోదం ఓ పక్క.. విద్య ఓ పక్క
ఆటా? అటా? ఇటా? ఎటు?
ఏ టెక్నాలజీ? ఏ కంపనీ? జీతం మెంతో?
అయోమయం లో మునకలేస్తోంది విద్యార్ధి రధం.. కుంటుపడి

ఏ కోర్స్ లో ఎంత లాభమోస్తోంది?
షార్ట్ టర్మ్ ఆ? లాంగ్ టర్మ్ ఆ?
రాంకర్లు ఎంత మంది ఉండాలి? ఎలా మునుపటి కన్నా ఎక్కువ మార్కులు రావాలి?
ఏం చేసినా ఫీజులు పెంచుకునేలా ఉండాలి..
వ్యాపారం లో పెద్ద పెద్ద అడుగులేస్తోంది కళాశాలల రణం, కొంటూ ఒక్కో బడి

నిర్లక్ష్యం, మోసం, పోటీ, పేరు, పరుగు,
రీజియన్, రిలీజియన్, రిజర్వేషన్ ,
డబ్బు, మార్పు, గుర్తింపు, పట్టింపు,
అమ్మకాలు, ఇంకా నమ్మకాలు..

ఇన్ని కరువుల మధ్య, ఇన్ని నాసి రకం ఎరువుల మధ్య,
ఎదిగే చదువులు
పంటకు రాకుండానే.. ఎన్ని సార్లు కోతకు గురవుతున్నాయో !?
అవసరాలకు కాక, లాభాలకు చేసే ఈ వ్యవసాయం
ఒక చెట్టుకు మరో కాయను కాయక మానదు కదా..!

సారవంతమైన నేలను..
బీడు పడే భూములు గా తాయారు చేసే కర్షక, కార్మిక సోదరులకు..
లాల్ సలాం.. లాల్ సలాం..

కలాం లాంటి పెద్దలు కూడా ఇక లేరు,
అందుకే..
పొరపాటున మొలకోచ్చాయా?
తున్చేద్దాం.
మిగిలేవి పాడు మొక్కలేగా?
బాగా ఎదిగాక నిప్పు పెట్టి.. అందులో ఆత్మ హత్య చేసుకుందాం..
సజీవ దహనాల సంబరాలు చేసుకుందాం..
మన దరిద్రాన్ని మనమే గణాంకాలు గా ప్రచారం చేసుకుందాం..
ఈ పరిణామాల పరిమాణం మోయలేని దౌతున్నందుకు..
మనలో మనమే మౌనం పాటిద్దాం....

Sunday, July 19, 2015

తేలని ఒక చిక్కు ముడినింగి రాలిపోతున్నా
నేల కుంగి పోతున్నా
ఒక్కటే ఆశ
నిన్నటి  రోజలు వెళ్లి పోయాయని..
కనీసం ఈరోజు మనతో ఉందని. అది బాగుంటుందని..


చీకటి దుప్పటి లా కప్పేసుకుంటున్నా..
దారి చూపే దీపం దరికి ఇంకా చేరకున్నా..
ఒక్కటే ఆశ
ఎలాగో ఈరోజు వెళ్ళిపోతుందిలేనని
మళ్ళీ రేపోస్తుందని.. అదన్నా బాగుపడుతుందని

నెల నెలా వచ్చే ఆ చిల్లర కాసులు
అకస్మాత్తుగా ఓ నెల రావు
అయినా ఏ నెలా కర్చులు మాత్రం తక్కువ కావు..
కష్టమెంత కష్ట పడినా...
కలలు మాత్రం దగ్గర కావు.
బతుకు గుమ్మాల్లో కొత్త ఉదయపు కళలు  కనీసం తొంగి చూడవు

ప్రశాంతతని పరుగులకిచ్చి..
సమయానికి బరువులు తగిలించి
బారులు తీరిన కోర్కెల చిట్టాలో.. ఏది తగ్గించాలో తెలీక
ఎటు చివర మొదలు పెట్టాలో అర్ధంకాక ..
అలసిన అమాయక జీవితాలు..
ఆగిపోయాయా అన్నట్టుగా నడుస్తున్నాయి..

ఉన్న అప్పులు తీర్చు కోవడం ఒక ఆశయం
కొత్త అప్పులు చేర్చుకోవడం ఒక అవసరం
ఈ పద్మవ్యూహంలో..
ఆవేశాలు
ఆలోచనలు
నిరాశలు
ఎదురు చూపులు
ప్రతి రోజు ఒక తప్పనిసరి యుద్ధం చేస్తూనే ఉన్నాయి..

గెలిచినా
ఓటమి పాలైనా
ఓరిమి ఎంత చూపినా..
స్థిమిత పడని ఈ ప్రయాణం,
మధ్య తరగతి మహా కావ్యం
ఎన్నటికి సుఖాంత మయ్యేనో ..
తేలని ఒక చిక్కు ముడిగా మిగిలి పోయేనో..