Saturday, January 3, 2015

నువ్వైతే ఎదుటే ఉన్నావుగా డాక్టరూ.. !

దేవుడైతే కల్పన కావచ్చు..
నువ్వైతే ఎదుటే ఉన్నావుగా డాక్టరూ.. !

నిన్నే నమ్ముకుని వచ్చాను
ఏదో చేస్తావని
కుంటు బడిన నా బండి బాగు చేస్తావని

తల కిందులయ్యానో
తలే తాకట్టు పెట్టానో
ఎలాగొల్లా అడిగిన ముల్లె నీకు ముట్ట చెప్పాను   
నా భవిష్యత్తు నీకే అప్ప జెప్పాను

రేపటి సూరిడిని నే చూడాలన్నా
నన్నెవరన్నా చూడాలన్నా...
చూసుకునే దిక్కు నువ్వే


ఇంచు మించు అమ్ముకున్నాను నన్ను నేను
నమ్ముకున్నాను
నువ్వు కాపాడతావని

నిజం తెలుసా?
నేను బతికితే ఎం చేస్తానో?
ఏరోజూ కారోజూ నాలుగు మెతుకుల కోసం యుద్ధం చేస్తాను..
చావు కన్నా యుద్ధమే నయమని నా సిద్ధాంతం..
ఏం చెయ్యను.. ఆశా జీవిని.. మామూలు మనిషిని..

కానీ నువ్వేం చేసావ్?
చాలదని తల తిప్పుకు పోయావ్..
ఇప్పుడు బతుకు లేక .. బ్రతక లేక నా తల ఎక్కడ పెట్టుకునేది?
నువ్వు చెప్పి పోతే బాగుండేది..

నా ప్రాణానికి వెల కట్టి
నా ఆశలను వేళాకోళం చేసి..
నువ్వు మోసుకెళ్ళే మూటలు
బరువనిపించలేదా ఎప్పుడూ?

నీ గుమ్మం ముందు
బారులు తీరిన మా చేతకాని తనం
నీ తప్పుల గురుతులుగా
మా కన్నీటి మరకలు...
కనిపించలేదా ఎప్పుడూ?