Wednesday, December 2, 2015

అది రాదు.. చిటికెన వేలైనా కదపదు
ఒక ఎదురుచూపు, రేపు వస్తుంది అని
ఒక ఆశ, రేపు కలుస్తుంది అని..
ఒక భయం, రేపు వస్తుందేమో అని
ఒక కల, రేపు రావాలి అని
ఒక ఉత్సాహం, రేపటిని చూడాలి అని..
అది రాదు..

అదెప్పుడూ భవిష్యత్తులోనే ఉంటుంది
దూరం గా రంగులు చూపిస్తూ,
నచ్చిన, తోచిన ఊహలు కల్పిస్తూ,
మోసం చేస్తూనే ఉంటుంది.

రేపటి కోసం నేటిని
పరిగెత్తించే వాళ్ళను చూసి తనలో తానే నవ్వుకుంటుంది.
నిద్ర లేని కళ్ళతో, తెరలు తెరలు గా రేపటి ఆలోచనల్లో
నలిగే వాళ్ళను చూసి బిగ్గరగా గేలి చేస్తుంది

అది భాదను ఒదార్చదు
యోగ క్షేమాలు అడగదు
పలకరించను చుట్టమూ కాదు..
చూసిపోను పక్కనా లేదు.
ఎవరి గురించీ దానికి లెక్క లేదు ..
అందుకే,
తన చిటికెన వేలైనా కదపదు.
కారణం, దానికి ఉనికే లేదు...

ఇప్పటికి నిప్పెట్టి
రేపటి కోసం చేసే ప్రయాణం
ఎప్పటికీ పూర్తి కాదు..

దృష్టిని కప్పెట్టి
రేపటి కోసం వేసే అడుగు
ఏ తోవనూ గమ్యం చేరదు

దుప్పటి ముసుగెట్టి
రేపటి కోసం కాసే పందెం
ఏలాగూ ఓటమి పాలు కాక తప్పదు..

ఈరోజే నేస్తం
'ఇప్పుడొ'క్కటే బ్రతుకు
ఇదొక్కటే వాస్తవం

Wednesday, October 7, 2015

నమస్సులు
ఊపిరి పోస్తున్న గాలికి
చూస్తున్న ఆకాశానికి
చూడనిస్తున్న వెలుగుకి
బరువు మోస్తున్న భూమికి
బతుకైన నీటికి..
నమస్సులు

గుచ్చే చలికి
కాల్చే ఎండకి
తడిమే చినుకుకి
స్పర్శిస్తున్నందుకు
నమస్సులు 

ప్రాణం నిలబెట్టేందుకు..
తామే అన్నమయే మొక్కలకు
నిలబడి నీడనిచ్చే తరువులకు  
నవ్వులనరువిచ్చే గడ్డి పూలకు
నమస్సులు

రంగులకు
రాగాలకు
నమస్సులు

జన్మనిచ్చిన వారికి
జన్మ తరింపజేసే వారికి
నమస్సులు

ఉదయాన్నే కళ్ళు
తెరుచుకున్నందుకు
అది ఈరోజూ జరిగినందుకు..

మూసి తెరుచుకునే కళ్ళు
రేబవళ్లు
శాశ్వత నిద్రకు నన్ను సిద్దపరుస్తున్నందుకు
నమస్సులు

Friday, September 25, 2015

I love you


I love you
More than you know
More than I can explain

I am just short of words and expressions when comes to you.
Not because I don't have them for you.
But they are not enough for you

When comes to anything,
you are my first preference.
But... As I feel you as part of me, I become lenient some times.

Not that I don't care for you
Not that I forget you
It just happens.. sometimes.. in some ways..
Compromise is the only choice that I am left with and
you are the only one I see that is standing beside me

You just don't know how much I feel.. blessed
Having you with me.

God, Guru, Mother and you
I don't think .. I need anything else for my life

Saturday, August 29, 2015

నేను - గడ్డి పోచతరగని కొండ, మన కష్టం మనకి
పక్కనోడి వేదనా? గడ్డి పోచ

పడలేము బాబోయ్, ఏ మాటలు
అందామా వేరొకరిని, ఏముందీ గడ్డి పోచ

సాక్షాత్తూ నరక ద్వారాలే, వంకర, చులకన చూపులు
గుచ్చేదా ఎవ్వరినైనా? హ హ  గడ్డి పోచ

నాకొస్తేనే కష్టం
నా అన్న వాళ్లకొస్తేనే ఆపద
నాదో పరిధి
నేనే అంతా
మిగిలినదంతా గడ్డి పోచ

ఓనమాలు దిద్దుకున్నాం
అవరసరాల చుట్టూ తిరుగుదామని
ఉన్మాదపు తెరలు కప్పుకున్నాం
వాస్తవాల దృక్కులు మసక బారిద్దామని

తాగే నీటి బాటీలు
ఫాస్ట్ ఫుడ్డు పార్సెల్ కవరూ
పొగలొదిలే పెట్రోలూ
తాగి పడేసే సిగరెట్టు పీక
ఏదైనా!

చరిత్ర గా మారే పచ్చని చెట్లు
టెక్నాలజీ మత్తులో తూలుతూ
పోగేసిన గుట్టల గాడ్జెట్లు
వేసేద్దాం భవిష్యత్తుకు గుంతల రోడ్లు
దగ్గరలో దూరాలు
ఎంతైనా!

వాడి పడేద్దాం
వాడి పాడేసుకుందాం
లేకుండా ఏ చచ్చు ఆలోచనా కూడా..
ఏమైతేనేం తరువాతి తరాలు..
చూస్తూనే ఉందాము మసి పట్టిన ఆకాశపుటంచులకేసి  
ఇంకా కావాలని ఏవో తళుకుమనే తారలు

వాడుకునొదిలేద్దాం
లేకుంటే
వదిలించుకుందాం
వస్తువైనా,
మనిషైనా
వాళ్ళ భంధాలైనా
సో కాల్డ్ విలువలైనా

నేను కానిది
మోయలేని బరువు
నేను అనేది
నాకు హిమాలయాలు

నాది కాదంటే,
కానీ నాశనం 
నాకొక్కటే లెక్క
నా ప్రయోజనం
కాకుంటే ఏదైనా, గడ్డి పోచ!

Tuesday, July 28, 2015

దరిద్రాన్ని ప్రచారం చేసుకుందాం..
వృద్దాప్యం కాదు కాళ్ళు జాపుకు కూర్చోడానికి
పసితనమూ కాదు.. పళ్ళు బయట పెట్టి నవ్వితే చాలు అనుకోవడానికి..
విధ్యార్ధివి..
కాబోయే ఉద్యోగివి,
సంపాదనకు వయసోచ్చిందని,
పదవులేవో వెలగపెట్టమనీ
గుర్తుచేస్తుంటుంది సమాజం పెద్దల పేర. వెంటపడి.

IIT చదివావా? ఎన్నవ ర్యాంకు?
ఎక్కడ? అలాగా? ఎలాగా?
ప్రశ్నలతో ఎదుర్చూస్తోంది ఉద్యోగ ప్రపంచం .. ఊరిస్తూ దూరంగా కంటపడి

ఆశగా అడుగులేద్దామా? భయపడి ఆగిపోదామా?
వినోదం ఓ పక్క.. విద్య ఓ పక్క
ఆటా? అటా? ఇటా? ఎటు?
ఏ టెక్నాలజీ? ఏ కంపనీ? జీతం మెంతో?
అయోమయం లో మునకలేస్తోంది విద్యార్ధి రధం.. కుంటుపడి

ఏ కోర్స్ లో ఎంత లాభమోస్తోంది?
షార్ట్ టర్మ్ ఆ? లాంగ్ టర్మ్ ఆ?
రాంకర్లు ఎంత మంది ఉండాలి? ఎలా మునుపటి కన్నా ఎక్కువ మార్కులు రావాలి?
ఏం చేసినా ఫీజులు పెంచుకునేలా ఉండాలి..
వ్యాపారం లో పెద్ద పెద్ద అడుగులేస్తోంది కళాశాలల రణం, కొంటూ ఒక్కో బడి

నిర్లక్ష్యం, మోసం, పోటీ, పేరు, పరుగు,
రీజియన్, రిలీజియన్, రిజర్వేషన్ ,
డబ్బు, మార్పు, గుర్తింపు, పట్టింపు,
అమ్మకాలు, ఇంకా నమ్మకాలు..

ఇన్ని కరువుల మధ్య, ఇన్ని నాసి రకం ఎరువుల మధ్య,
ఎదిగే చదువులు
పంటకు రాకుండానే.. ఎన్ని సార్లు కోతకు గురవుతున్నాయో !?
అవసరాలకు కాక, లాభాలకు చేసే ఈ వ్యవసాయం
ఒక చెట్టుకు మరో కాయను కాయక మానదు కదా..!

సారవంతమైన నేలను..
బీడు పడే భూములు గా తాయారు చేసే కర్షక, కార్మిక సోదరులకు..
లాల్ సలాం.. లాల్ సలాం..

కలాం లాంటి పెద్దలు కూడా ఇక లేరు,
అందుకే..
పొరపాటున మొలకోచ్చాయా?
తున్చేద్దాం.
మిగిలేవి పాడు మొక్కలేగా?
బాగా ఎదిగాక నిప్పు పెట్టి.. అందులో ఆత్మ హత్య చేసుకుందాం..
సజీవ దహనాల సంబరాలు చేసుకుందాం..
మన దరిద్రాన్ని మనమే గణాంకాలు గా ప్రచారం చేసుకుందాం..
ఈ పరిణామాల పరిమాణం మోయలేని దౌతున్నందుకు..
మనలో మనమే మౌనం పాటిద్దాం....

Sunday, July 19, 2015

తేలని ఒక చిక్కు ముడినింగి రాలిపోతున్నా
నేల కుంగి పోతున్నా
ఒక్కటే ఆశ
నిన్నటి  రోజలు వెళ్లి పోయాయని..
కనీసం ఈరోజు మనతో ఉందని. అది బాగుంటుందని..


చీకటి దుప్పటి లా కప్పేసుకుంటున్నా..
దారి చూపే దీపం దరికి ఇంకా చేరకున్నా..
ఒక్కటే ఆశ
ఎలాగో ఈరోజు వెళ్ళిపోతుందిలేనని
మళ్ళీ రేపోస్తుందని.. అదన్నా బాగుపడుతుందని

నెల నెలా వచ్చే ఆ చిల్లర కాసులు
అకస్మాత్తుగా ఓ నెల రావు
అయినా ఏ నెలా కర్చులు మాత్రం తక్కువ కావు..
కష్టమెంత కష్ట పడినా...
కలలు మాత్రం దగ్గర కావు.
బతుకు గుమ్మాల్లో కొత్త ఉదయపు కళలు  కనీసం తొంగి చూడవు

ప్రశాంతతని పరుగులకిచ్చి..
సమయానికి బరువులు తగిలించి
బారులు తీరిన కోర్కెల చిట్టాలో.. ఏది తగ్గించాలో తెలీక
ఎటు చివర మొదలు పెట్టాలో అర్ధంకాక ..
అలసిన అమాయక జీవితాలు..
ఆగిపోయాయా అన్నట్టుగా నడుస్తున్నాయి..

ఉన్న అప్పులు తీర్చు కోవడం ఒక ఆశయం
కొత్త అప్పులు చేర్చుకోవడం ఒక అవసరం
ఈ పద్మవ్యూహంలో..
ఆవేశాలు
ఆలోచనలు
నిరాశలు
ఎదురు చూపులు
ప్రతి రోజు ఒక తప్పనిసరి యుద్ధం చేస్తూనే ఉన్నాయి..

గెలిచినా
ఓటమి పాలైనా
ఓరిమి ఎంత చూపినా..
స్థిమిత పడని ఈ ప్రయాణం,
మధ్య తరగతి మహా కావ్యం
ఎన్నటికి సుఖాంత మయ్యేనో ..
తేలని ఒక చిక్కు ముడిగా మిగిలి పోయేనో..

Thursday, April 16, 2015

అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ..

అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా
నిన్ను వెతుక్కుంటూ ఉంటాను..

అక్కడక్కడ కన్ను...
ఎప్పుడో చెవి..
కన్నవి విన్నవి కలిపి నిన్నూహించుకుంటాను..

పుస్తకాలేవో ఏవో చదివేస్తుంటాను..
అర్ధం అయిన కాకున్నా

మళ్ళీ...
నీతో అవసరాలు తగ్గినపుడు
అర్జీలు లేనప్పుడు
నేనేదో దారి చూసుకుంటూ ఉంటాను..
----------
మధ్యలో అటో ఇటో ఎవరో ఒకరు..
పాపం
పుణ్యం
అని
గుర్తు చేస్తుంటారు..ఆలోచింపజేస్తారు.. భయపెడతారు.. పరిగెట్టిస్తారు.. నీ పేర 
ఎవరి తీరు వారిది.
ఎవరి దారి వారిది..
కాని .. నా దారే ఏంటో తెలీకుండా పోతుంది..

ఎన్ని కధలో..
యోగివని
కరుణామయుడవని
క్రూరుడవని
కోపిష్టివాడవని
రాజువని
బిచ్చమెత్తుకునే వాడివని
ముంచేవాడివి నువ్వేనని
తేల్చే వాడివి నువ్వేనని..

అన్నీ నువ్వే ఎలా అయ్యావో..?
నీకు ఎందుకింత పనో ... ?
నాకు అర్ధం కాలేదు..
అక్కడే అసలు నేనేంటో అనే ప్రశ్న మొదలయింది..

ఇక అక్కడ నుంచీ మొదలు..
అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా
నిన్ను వెతుక్కుంటూ ఉంటాను..
సమాధానం నువ్వు తప్ప మరెవరో చెప్పలేరని..

ఇక అక్కడక్కడ
నా ఇష్టాలు, అయిష్టాలు
కష్టాలు, నష్టాలు
పరిచయాలు..
పనికి మాలిన పనులు ఏవో నన్ను దారి మళ్లిస్తుంటాయి..

నాలో, నాది.. నేను అనే ఆలోచన...
విసుగు, కోపం, విరక్తి అనే అలజడి
సంతోషం, ఉత్సాహం, అనే తాత్కాలిక ఊరట
అటు ఇటూ కదిపేస్తూ.. కుదిపేస్తూ ఉంటై..

అదిగో సరిగ్గా ఇలాంటప్పుడే..
మళ్ళీ. నువ్వు గుర్తొస్తావ్..
గుర్తుకొచ్చినప్పుడల్లా
నిన్ను వెతుక్కుంటూ ఉంటాను..

నువ్వూ నాకోసం ఎదురు చూస్తుంటావని  అనుకుంటూ 

Saturday, January 3, 2015

నువ్వైతే ఎదుటే ఉన్నావుగా డాక్టరూ.. !

దేవుడైతే కల్పన కావచ్చు..
నువ్వైతే ఎదుటే ఉన్నావుగా డాక్టరూ.. !

నిన్నే నమ్ముకుని వచ్చాను
ఏదో చేస్తావని
కుంటు బడిన నా బండి బాగు చేస్తావని

తల కిందులయ్యానో
తలే తాకట్టు పెట్టానో
ఎలాగొల్లా అడిగిన ముల్లె నీకు ముట్ట చెప్పాను   
నా భవిష్యత్తు నీకే అప్ప జెప్పాను

రేపటి సూరిడిని నే చూడాలన్నా
నన్నెవరన్నా చూడాలన్నా...
చూసుకునే దిక్కు నువ్వే


ఇంచు మించు అమ్ముకున్నాను నన్ను నేను
నమ్ముకున్నాను
నువ్వు కాపాడతావని

నిజం తెలుసా?
నేను బతికితే ఎం చేస్తానో?
ఏరోజూ కారోజూ నాలుగు మెతుకుల కోసం యుద్ధం చేస్తాను..
చావు కన్నా యుద్ధమే నయమని నా సిద్ధాంతం..
ఏం చెయ్యను.. ఆశా జీవిని.. మామూలు మనిషిని..

కానీ నువ్వేం చేసావ్?
చాలదని తల తిప్పుకు పోయావ్..
ఇప్పుడు బతుకు లేక .. బ్రతక లేక నా తల ఎక్కడ పెట్టుకునేది?
నువ్వు చెప్పి పోతే బాగుండేది..

నా ప్రాణానికి వెల కట్టి
నా ఆశలను వేళాకోళం చేసి..
నువ్వు మోసుకెళ్ళే మూటలు
బరువనిపించలేదా ఎప్పుడూ?

నీ గుమ్మం ముందు
బారులు తీరిన మా చేతకాని తనం
నీ తప్పుల గురుతులుగా
మా కన్నీటి మరకలు...
కనిపించలేదా ఎప్పుడూ?