Sunday, November 23, 2014

నాది కల కాదుఅబద్ధం అనుకునుకుందామా ... ?
అవకాసమే లేదు..
నేను కళ్ళు మూసుకునీ లేను, నాది కలా కాదు
మరి ఎందుకు ఇంతలా పరిగెడతాను నీతో ...
ఆలోచనలతో, అడుగులతో...  అలిసిపోకుండా?
అద్దం లో నన్ను చూసుకున్నట్టు, నిన్ను చూస్తాను
అందుకే నువ్వు నాకేమౌతావని నన్ను నేను అడగలేదు  
కాని .. చిత్రంగా .....
నాకో ఉనికి ఉందా లేదా అనే ప్రశ్న.. నాకే
మళ్ళీ మళ్ళీ వేసుకుని .. నేనే ఏదో సమాధానం చెప్పుకుని
నీ వైపు తిరుగుతాను ..
తీరా నువ్వేమో !
నెత్తిన కొమ్ములు పెట్టి నాలిక బయట పెట్టి
నన్ను వెక్కిరిస్తుంటావు
కాసేపు చిన్న పిల్లలా
కాసేపు అమ్మలా
అందమైన అమ్మాయిలా...
అప్పుడప్పుడు అమ్మోరిలా
అవతారాలెత్తే నువ్వు
అన్నీ నువ్వే అవుతావని...  నేను మాత్రం ఏం ఊహించాను ?
కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా
ఒడిలో తల పెట్టుకు పడుకున్నా
నవ్వీ నవ్వీ కన్నీళ్ళొచ్చినా   
గొంతు పెగలని నిస్సబ్దంలోనైనా
ఊపిరి తెలిసేంత దగ్గర అయినా
ఊపిరాడనంత దూరం లో ఉన్నా
నువ్వే నా ఉదయపు వెలుగు 
నువ్వే నా రాతిరి చీకటి
నీతోనే నా ప్రతి రోజూ

ఆ సాయంత్రం..ఆరు గంటలవుతోంది.. ఆ పార్కు చివరన ఆఖరి బెంచి..ఎక్కడికో విసిరేసినట్టుగా వుంది.. అతను చాల సేపటినించీ అక్కడే కూర్చున్నాడు ..శూన్యం లోకి చూస్తూ..

సన్నగా మబ్బుపట్టి ఉంది ఆకాశం. మెల్లగా గాలి వీస్తోంది ...వర్షపు చినుకులని కూడా రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది ఆ గాలి ..ఓ పక్క చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు, మరో పక్క ముసలి వాళ్ళు కాలక్షేపం కబుర్లేవో చెప్పుకుంటున్నారు, అలసిపోయిన వారం రోజులను మర్చిపోడానికి నడి వయస్సు వారు వారి వారి కుటుంబ సమేతంగా వచ్చారు.. అంతటా సందడి సందడిగా ఉంది... అయినా.. ఇవేవీ అతనికి ఎంత మాత్రమూ తెలుస్తున్నట్టు అనిపించడం లేదు..

చూస్తుంటే.. అతనికి ఈ ప్రదేశం కొత్త అని అనిపించడం లేదు ..ఆ పచ్చని చెట్లు .. ఎదురుకుండా కొంచెం దూరం లో కనపడే ఆ సెలయేరు... అతని కళ్ళలో ముద్ర వేసినట్టు ఉన్నాయ్..

ఎక్కడినుంచో అతనికి మాటలు వినపడుతున్నాయి...అతని కళ్ళు రెప్పలార్పుతున్నై ..

"చిన్నీ .. చిన్నీ .. నిన్నే.. ఆగమంటున్నానా .. నేనింక పరిగెత్తలేను రా.." అంటున్నరెవరో

ఆ గొంతు ఎవరినో గుర్తు చేస్తోంది అతనికి..

తలెత్తి చూస్తున్నాడు.. అతని ముందు నిలబడి ఉందొ అమ్మాయి.. చేతిలో ఓ పిల్లాడు..

ఆమె ఒక్క నిమిషం ఆగింది . ఇద్దరికీ దాదాపు ముఖం లో ఎటువంటి కవళికలు లేవు.. వెంటనే ఆమె కొంత చొరవ తీస్కుని .. పక్కన కూర్చుంది ..

అతనింకా ఆమెని చూసిన ఆశ్చర్యపు అనుభూతినుండి తెరుకున్నట్టు లేదు.. ఏమీ మాట్లాడట్లేదు..

ఎలావున్నావు ? - అడిగిందామె

తెచ్చుకున్న ఓ నవ్వు నవ్వాడతను..

తిరిగి అడిగాడు ...నువ్వు?
సమాధానంగా ఆ చిన్న పిల్లాడి తలనిమురుతూ ... బాగున్నాను అంది..

ఆమె : చాలా కాలం అయ్యింది మనం కలిసి
అతను : దాదాపు ఎనిమిదేళ్ళు ..

ఆమె : టైం చాలా వేగంగా వెళ్ళిపోతుంది
అతను : అవును

అతను: ఎప్పుడు వచ్చారిక్కడికి ?
ఆమె: ఈమధ్యనే!

అతను : అవును ఎవరో చెప్పారు.. నువ్వు వేరే వూరు వెళ్ళిపోయావని..
ఆమె: పెళ్లి అయ్యినతరువాత..

ఆమె : ఆ తరువాత ఇప్పుడే రావడం...ఊరు చాలా మారి పోయింది..ఈ పార్కు..మన కాలేజి ..మాత్రం అలాగే ఉన్నాయ్.. నీకు గుర్తుందా మనం మొదటిసారి ఇక్కడే కలిసాం..

అతను: గుర్తుంది..నువ్వు కాలేజికి వెళ్ళావా?
ఆమె: ఓ సారి చూద్దామనిపించి..

కొన్ని ఏళ్ళ క్రితం ....
సాయంత్రం అవుతోంది.. విద్యార్ధులు కళాశాల నుంచి బయటకి వస్తున్నారు. అంతా ఎప్పటిలానే ఉంది. పెద్దగా హడావిడీ లేకుండా ఎవరికి వారు ఇళ్ళకు బయలు దేరుతున్నారు... పరీక్షల సమయం వస్తోందేమో కొందరు మార్కుల వేట గురించి చర్చించుకుంటున్నారు. సాయంత్రమైనా, ఎండా కాలం ప్రవేశించింది కనుక సూర్యుడి వేడిమి ఇంకా తగులుతూనే వుంది.

మాటలు వినపడుతున్నాయి...

నడిచే ఆమెకు చేయి అడ్డు పెట్టి అతను చెపుతున్నాడు : ఆగు .. ఒక్క సారి నేను చెప్పేది విను.. నన్ను అర్ధంచేసుకోడానికి ప్రయత్నించు..

బతిమాలుకుంటున్నాడు. ఏదో బాధలో ఉన్నట్టుంది అతని ధోరణి

ఆమె చాలా విసుగ్గా అన్నది : నన్నోదిలేసేయ్ .. దీనిగురించి ఇప్పటికే చాలా సార్లు నీకు చెప్పాను. ఇక మీదట చెప్పను.

'ఎంతకీ నీమాట నీదేనా, కావాలంటే మీ పెద్ద వాళ్ళతో నేను మాట్లాడతాను ' - ఇంకా ఏదో చెప్ప ప్రయత్నం చేస్తున్నాడు..

నీకర్ధం కావట్లేదు ... ఏదో కాసిన్ని రోజులు కలిసి స్నేహితుల్లా ఉన్నంత మాత్రాన - ఆమె అంటోంది

అతనొక్కసారి ఆమె కేసి సూటిగా చూసాడు.. స్నేహితుల్లానా!...?

అవును ముమ్మాటికీ అంతే - ఆమె ఖచ్చితంగా చెప్పేసింది

అతను ప్రశ్నించాడు ...స్నేహం అనే గీతని మనం ఎన్ని సార్లు దాటామో నీకు గుర్తు లేదా ?

ఆమె మారు మాట్లాడలేదు.

అతని నుండీ ఇంకా ఏవేవో ప్రశ్నలు ... ఆమె ఏమీ అనట్లేదు .. స్తబ్దంగా ఉండిపోయింది

కొన్ని కొన్నిటికి మాత్రం యేవో సమాధానాలు చెపుతోంది..

ఇప్పటికే ఈ సంభాషణ చాల సార్లు జరిగినట్టుంది. అతనిలో ఆవేశం .. విసుగు.. స్పష్టంగా కనపడుతున్నాయి..

అతను చాలా సంసిద్దంగా వచ్చినట్టున్నాడు.. పై జేబు లోంచి ఒక బ్లేడు తీసాడు

ఆమె ఒక్క క్షణం కళ్ళు విప్పార్చి చూసింది...

ఇప్పుడు చెప్పు అన్నాడతను..

ఏం చేస్తావ్ ? అని అతని చెయ్యి విదిలించుకుని ఆమె అక్కడినించీ వెళ్లి పోయింది..

అందరూ వెళ్ళిపోయారు..

కళ్ళ నిండా అలజడి ..దైన్యం.. నింపుకుని ఉన్నాడతను ..

ఆశ పూర్తిగా చచ్చిపోయిన వాళ్ళు ఎలా తయారవుతారు ..? అతనూ అలాగే ఉన్నాడు..

అస్తమిస్తోన్న సూర్యుడి ఎరుపు అతని ముఖం పై ప్రస్పుటంగా కనపడుతోంది.

కూలిపోయిన పేక మేడలా అతను .. తన మోకాళ్ళపై కూలిపోయాడు ..చూపు స్పష్టతను కోల్పోతోంది...మెల్లగా కళ్ళు మూసుకుపోతున్నాయి...స్పృహ కోల్పోయాడు ..

చేతి మణికట్టు దగ్గర సన్నగా తెగిన రెండు మూడు గాట్లు ఆపకుండా ఒంట్లోని రక్తాన్ని బయటకు పంపేస్తున్నాయి.

తరువాత రోజు న్యూస్ పేపర్లో ఇదే వార్త..ప్రేమ విఫలమై ఓ యువకుని ఆత్మ హత్యా ప్రయత్నం ...
పలానా కాలేజీలో పలానా అబ్బాయి పలానా అని..కింద రెండు లోకల్ ads ..

ఇప్పుడు ..
అతను : తరవాత చాలా ఆలోచించాను..తొందర పడ్డానేమో అనిపించింది. తప్పు చేసానని తెలిసింది.. ఎక్కువగా వెంటపడి నిన్ను మరీ ఇబ్బంది పెట్టాను.. నీ వైపు నించీ ఆలోచించ లేక పోయాను.. ఆలస్యం గా అర్ధం చేసుకున్నాను..నిన్ను కలిసి క్షమించమని అడుగుదామనుకున్నాను.. కాని అప్పటికే నువ్వు ఇక్కడ లేవు..ఎందుకో తెలియదు కాని మళ్లీ నిన్ను కలవాలని ప్రయత్నం చెయ్యలేదు.. బహుశా గిల్టీ ఫీలింగ్ కావచ్చు... మళ్ళీ గతం గురతుకొస్తుందని కావచ్చు.. తట్టుకోలేని భాదలో .. ఆవేశంలో.. నేను చేసిన ఆ తప్పు.. నాకు నేను వేసుకునే శిక్ష అనుకున్నాన్ను కాని..

ఆ పిల్లాడిని ఆడుకోవడానికి వదిలేసి ఆమె చెప్పడం మొదలు పెట్టింది..

ఆమె: ఆరోజు నేను నీకోసం హాస్పిటల్ కు వచ్చాను.. నిన్ను చూడడానికి చాలా మందే వచ్చారు.. మీ పెద్ద వాళ్ళు గుక్క పట్టి ఏడుస్తున్నారు.. అందరూ నన్నొక నేరస్తురాలిగా చూసారు.. కాని నాకవేవీ పెద్ద విషయం అనిపించలేదు.. నువ్వే...స్పృహ లేక ఉన్నావు..నాకు నోట మాట రాలేదు.. కేవలం నా పంతం తీసుకెళ్ళింది నిన్ను నన్ను అక్కడి దాకా.. అయినా నేనారోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వు చెప్పింది విని వుండాల్సింది.. మనిషి తన ప్రస్తుతం కంటే .. గతాన్ని తల్చుకుని ఎక్కువ ఏడుస్తాడు.. అందులోనే జీవిస్తాడు.. అందులోనే చనిపోతాడు.. I am now part of it. మనమేదైనా తప్పు చేస్తే మన అనే వాళ్ళు మనకోసం ఎంత భాద పడతారో ఆరోజు చూసాను.. ఏడుపాపుకోలేక పోయాను.. ఊహించుకోడానికి కూడా భయమేస్తుంది ఆ రోజు.. అందుకే అక్కడినుంచీ వెళ్లి పోయాను.. నిన్ను కలిసి చాలా మాట్లాడదామనుకున్నాను ..మా పెద్దవాళ్ళు నన్ను వేరే వూరు తీసుకెళ్ళిపోయారు.. తరువాత ఎన్ని సార్లు రావాలనుకున్నా ఆగిపోయాను... నాకప్పటికే పెళ్ళైపోయింది..

ఆమె చెప్పడం ఆపేసింది... కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి...

అతను, ఆమె కళ్ళ నీళ్ళు తుడవలేక ... అనాలోచితం గానే.. చేతులు అదుపులో పెట్టేకునే ప్రయత్నం చేస్తున్నాడు..

నీకు పెళ్లయిందా..? అడిగిందామె..

లేదు చెప్పాడతను..

ఆమె మరింత ఏడుస్తుంది..

దూరంగా ఎవరో వస్తున్నారు...ఆమె వచ్చే తన ఏడుపు ని బలవంతం గా ఆపుకుంటోంది ...

Meet my husbend పరిచయం చేసింది..

కొంత సేపు మాటలు అయ్యాక ... ఆమె తన భర్తని, బాబుని తీసుకుని అక్కడినుంచీ వెళ్ళిపోయింది..
అతను ఇంకా అక్కడే వున్నాడు..అతని కళ్ళలో మాత్రం ఇంకా ఆమె కనపడుతోంది..చాల సేపటి తరువాత..అతను కూడా అక్కడి నించీ వెళ్ళిపోయాడు...


.
.
.