Sunday, June 23, 2013

నాలో నేను నీతో నేనుప్రతి క్షణం ఒక పుట్టుక..
ప్రతి క్షణం ఒక మరణం
మధ్యలో నువ్వు

అనుకోని ఒక ఊహ
అందమైన ఒక నిజం
రెండూ నువ్వే

ఒక వేడుక
ఒక వేకువ
నువ్వు లేనిది లేదు 

నువ్వు పక్కన లేకున్నా
నీ ఏకాంతంలో నేనుంటాను

నీతో ఉన్నప్పుడు
సూర్యుడి కంటే ఒక పెద్ద వెలుగులో లీనమైపోతాను

అక్కడ
ఆద్యంతాలు లేవు
తలపులు జనించవు
అస్తిత్వాలు ద్వనించవు
సమయానికి అర్ధం స్పురించదు 
ఒక అధ్బుతం
ఒక ఆశ్చర్యం
ఎలా చూసినా ఓ వైభవం
కళ్ళను కప్పేస్తుంది
ఎక్కడో నిశ్శబ్దం సన్నగా పాటలు పాడుతుంది 
నిదుర కన్నా మత్తు ఒకటి గట్టిగా దుప్పటిలా చుట్టుకుంటుంది 
నాకు నన్ను లేకుండా చేస్తుంది

ఇలాంటప్పుడే
సరిగ్గా
ఏమిటిది అనే ప్రశ్న మాత్రం నాకు రాదు..
వచ్చినా అడగను 
సమాధానాలు మాత్రం
వినీ విన్నట్టు ..
తెలిసీ తెలియనట్టు

నాలో నేను
నీతో నేను
ఉండిపోతుంటాను 

4 comments:

  1. చాలా బాగా చెప్పారు..

    ReplyDelete
  2. సుజ్జిగారు ధన్యవాదాలు అండి

    ReplyDelete
  3. మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతుంటాను. మీ కవితల్లోని భావావేసం నాకు నచ్చింది.

    ReplyDelete