Thursday, January 24, 2013

నువ్వెందుకు గుర్తొస్తావ్ ?

ఎందుకు గుర్తొస్తావ్
నువ్వెందుకు ఎందుకు గుర్తొస్తావ్ ?

నువ్వు లేక
నాకు నేను లేని
లేమిలో
నన్ను చూసి వెక్కిరించడానికా ..?

కనపడే అందరిలానే
నేనూ ఉంటాను..
కానీ కళ్ళలో జీవమే ఉండదు
పెదవి పై నవ్వాడదు
నా మొఖం పై ఏ భావం కదలదు.
నా మననం నిను దాటదు..
నిజానికి నాలో ఏ కదలికా ఉండదు
బహుశా.. నువ్వు లేక నేను కేవలం
ఒక నిశ్చల నిర్లిప్త విగ్రహం కాబోలు ..

ఒంటరి తనానికి అద్డంలాగా
కాలిపోతున్న బూడిద లాగా
ముళ్ళ జల్లు లో మసలుతున్న గాయం లాగ
మరలి రాని నిన్నటి రోజులనుండీ పారిపోలేక
మసి పట్టిన మనసు గొంతు నులిమి పారెయ్యలేక
ఎందుకు బ్రతుకుతున్నానో తెలియక బ్రతుకుతున్నాను..

జ్ఞాపకాల అంచున అస్త వ్యస్తంగా కనపడే నీ బొమ్మను.. చెరపలేక..
చూస్తూ ఊరుకుంటున్నాను..

నా ఇంత నాశనం నిన్ను తృప్తి పరిచినట్టు లేదు..!
అంతగా ...
అందుకేనా ఇంకా నా వెంట పడుతున్నావ్?

నువ్వు తప్ప మరేదీ తోచని తనాన్ని
తేలికగా తీసుకోలేక,
నిన్నటి నిశీధి చక్రాల కింద నలిగిపోతుంటే
నవ్వి పోవడానికా..? గుర్తొస్తావ్
నువ్విలా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తావ్ ?

ఎందుకు గుర్తొస్తావ్
నువ్వెందుకు ఎందుకు గుర్తొస్తావ్ ?
No comments:

Post a Comment