Thursday, January 24, 2013

నువ్వెందుకు గుర్తొస్తావ్ ?

ఎందుకు గుర్తొస్తావ్
నువ్వెందుకు ఎందుకు గుర్తొస్తావ్ ?

నువ్వు లేక
నాకు నేను లేని
లేమిలో
నన్ను చూసి వెక్కిరించడానికా ..?

కనపడే అందరిలానే
నేనూ ఉంటాను..
కానీ కళ్ళలో జీవమే ఉండదు
పెదవి పై నవ్వాడదు
నా మొఖం పై ఏ భావం కదలదు.
నా మననం నిను దాటదు..
నిజానికి నాలో ఏ కదలికా ఉండదు
బహుశా.. నువ్వు లేక నేను కేవలం
ఒక నిశ్చల నిర్లిప్త విగ్రహం కాబోలు ..

ఒంటరి తనానికి అద్డంలాగా
కాలిపోతున్న బూడిద లాగా
ముళ్ళ జల్లు లో మసలుతున్న గాయం లాగ
మరలి రాని నిన్నటి రోజులనుండీ పారిపోలేక
మసి పట్టిన మనసు గొంతు నులిమి పారెయ్యలేక
ఎందుకు బ్రతుకుతున్నానో తెలియక బ్రతుకుతున్నాను..

జ్ఞాపకాల అంచున అస్త వ్యస్తంగా కనపడే నీ బొమ్మను.. చెరపలేక..
చూస్తూ ఊరుకుంటున్నాను..

నా ఇంత నాశనం నిన్ను తృప్తి పరిచినట్టు లేదు..!
అంతగా ...
అందుకేనా ఇంకా నా వెంట పడుతున్నావ్?

నువ్వు తప్ప మరేదీ తోచని తనాన్ని
తేలికగా తీసుకోలేక,
నిన్నటి నిశీధి చక్రాల కింద నలిగిపోతుంటే
నవ్వి పోవడానికా..? గుర్తొస్తావ్
నువ్విలా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తావ్ ?

ఎందుకు గుర్తొస్తావ్
నువ్వెందుకు ఎందుకు గుర్తొస్తావ్ ?
Monday, January 7, 2013

ఆడది ఇవాళా 'రేపూ'

వీధులు ..
గృహ గర్భాలయాలు
మాధ్యమాలు
మస్తిష్కాలు
కళాశాళలు
కొన్ని కళా కేంద్రాలు
కళా విహీనమై పోతున్నై..
వెర్రి కలలు వేస్తున్నై..

హృదయాంతరాళలో విశ్వం కూలిపోతోందనీ..
బుద్ది నిద్రపోతోందనీ
కామం వలువలూడదీసుకుని
వివస్త్రగా పరిగెడుతోందనీ
లెక్క లేనన్ని కళ్ళు చూస్తూనే వున్నై...
నిస్సుగ్గు గా వాటి నోర్లు చాచుతూనే ఉన్నాయ్...

ఒకడికి ఉద్యమం
ఒకడికి వ్యాపారం..
ఒకడికి కాలక్షేపం
మరొకడికి జీవనోపాది..
ప్రతి ఒక్కడి అంతర్ముఖం
మరెంతో అంతర్మధనం..
ఇంకెంతో అర్ధం లేని తనం..
వస్తోంది పూర్తిగా బయటకి
వస్తోంది..

కళ్ళకు కట్టుకుని
గుండెకు హత్తుకుని
కావాలని
కావాలని..

పనికి
చేత కాని తనానికి..
అహానికి
ఆగ్రహానికి
ముక్కలై
వక్కలై పోయింది..
బలైపోయింది..

కోర్కెల అగ్ని గుండంలో హవిస్సు మల్లే..
బతికున్న శవాల మెడలో దండకు మల్లే..
డబ్బున్న మేడల గదిలో జల్లిన అత్తరు మల్లే..
వాడి వాడుకలో.. వాడు
వస్తువై పోయింది..

ఏవీ  అన్నం పెట్టిన చేతిని అమ్మా అని పిలిచిన గొంతుకలు..?
గురు పత్నికి నమస్కరించిన శిరసులు..?
ఎక్కడ సొదరికిచ్చే లాలిత్యం.. ? ప్రేమ ?
ఎక్కడ ప్రతి వొక్కరిలో దైవాన్ని చూసే సంస్కృతి..?

ఎక్కడ కనీసం మనిషి గా గుర్తించే ప్రవృత్తి..?
మనిషి మనిషి గా జీవించే ప్రయత్నం..?
ఏమిటీ నీరసిస్తున్న ప్రమాణం..?
నిరసన ప్రయాణం...!

Sunday, January 6, 2013

సృష్టి కర్త..

అంతటా ఉన్నాడు..
అన్నీతానై ఉన్నాడు..

ఉదయాన సూర్యుని చూసినపుడు...
సాయంత్రం చీకటిలో కలిసినప్పుడు
రాతిరి చంద్రుడు వెన్నెలను కురిసినపుడు
నిదురించిన నేను తిరిగి పగలు చూసినపుడు 
ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టినపుడు

అంతటా ఉన్నాడు..
అన్నీ తానై ఉన్నాడు..

తల్లిగా బిడ్డను పొదివి పట్టుకున్నపుడు
తండ్రిగా తప్పును సరి జేస్తూ కన్నెర్ర జేసినపుడు
బిడ్డడిగా నను బతిమాలుకున్నపుడు
భార్యవై నాలో భాగమైనపుడు
గురువై దారి చూపినపుడు 
ఆప్త బందువై దర్సనమిచ్చినపుడు 

అంతటా ఉన్నాడు..
అన్నీ తానై ఉన్నాడు..


ఆనందంలో..
ఆర్తిలో..
కన్నీటి ధారగా..

ఆహార్యంలో
వ్యక్త అవ్యక్త భావనలో
అంతరాత్మ ప్రతినిధిగా

చేసే పనిలో
చూసే ప్రతి దృశ్యంలో
మననమై మనసులో
అను కదలికలో 
లో..లో.


అనంతమై..
నిత్యమై..
సత్యమై..

అంతటా ఉన్నాడు..
అన్నీ తానై ఉన్నాడు..

Saturday, January 5, 2013

రామ బాణం కోసం వెదుకుతున్నాను

లేడు ఎక్కడో ఆ శత్రువు..
వేచి ఉంటున్నాడు
కాపు కాచి ఉంటున్నాడు
నాలోనే
ఎప్పుడూ ఓ అవకాసం కోసం!


లేడు ఎక్కడో ఆ ఆప్తుడు..
నీడై ఉన్నాడు
నాతోనే..
నిజం చూస్తున్నాడు
నీరు గారిపోకంటూ
నేల వాలిపోకంటూ
నిద్దుర లేపుతున్నాడు
మత్తు దులుపుతున్నాడు


సంధ్యలు లేని చీకటి వెలుగుల మధ్య
కొన్ని వేల, లక్షల సార్లు తారస పడతారు ఇద్దరూ..
కాసేపు సంధి
కాసేపు యుద్ధం
ఎప్పుడూ అవిరామం
వీళ్ళ మధ్య..
నా లోపల!

యోగి లా
త్రిశంకు స్వర్గపు భోగిలా...
నిరంతరం... రోగిలా

పట్టు విడుపులు చేత కాక...
విడుదల లేక..

శ్మశాన వైరాగ్యం తో...
వేయి తలల రావణుడిలా
రామ బాణం కోసం వెదుకుతున్నాను