Tuesday, December 24, 2013

నేను నీతోనే ఉన్నాను....


అనుకున్నాననుకో నీగురించి...
అలా ఓ నవ్వు కదులుతుంది నాలో..

పొరపాటున అనుకోలేదనుకో..
ఏమైందో ఈరోజు నాకనిపిస్తుంది..
మళ్ళీ నాలో నవ్వు బయలుదేరుతుంది

ఎదురుగా నువ్వుంటావు..
నేనేమో ఇంకా నవ్వేస్తుంటాను..
ఓయ్.. ఏమైంది? అని నువ్వడిగినప్పుడు
చివరికి నా నవ్వే నా సమాధానమైపోతోంది..

ప్రతి సారి కలుస్తాం..
అలా కలిసి నడుస్తాం..
ఎప్పుడు కలిసామో.. !
ఎంత దూరం నడిచామో..!
లెక్కలెపుడూ నాకు గుర్తుండవు
ఇంకొద్ది సేపు అయితే బావుణ్ణు అనిపిస్తుంది తప్ప....

మాటలు సమయంతో దోర్లిపోతాయి..
ఇంకా మౌనంతో ఏదో మిగిలిపోయినట్లే ఉంటుంది..

అక్కడి నుంచీ ఒకరికొకరం మళ్ళీ కలుసుకుందామని కదుల్తాం..

ఇంక రాత్రిళ్ళు నా కష్టాలు నాకే అర్ధం కావు..
ఏరోజుకారోజు కళ్ళు ఎప్పుడు మూత పడుతున్నాయో తెలీడం లేదు..
కలలు రావడం లేదు...
పోనీ పూర్తిగా మెలకువగా ఉన్నానా..! అదీ తెలీదు..

నీతో ఉండని సమయం వెతికి వెతికి ప్రతిసారి
నే ఓడిపోతూనే ఉన్నాను..
ఇదిగో ఇప్పుడూ నేను నవ్వుతూనే ఉన్నాను..
నేను నీతోనే ఉన్నాను....

- Picture credit goes to original photographer or source. In case of any objections it will be removed.

Saturday, July 6, 2013

నేను మాత్రం మారిపోయాను , ఎలాగ జరిగిందీ ఇది?


పనికి రాని సూత్రాలు
గిరి గీసుకున్న గురుతులు
ఏది నేను రెండింటిలో?

పేర్చుకున్న నమ్మకాలు
నమ్ముకున్న బంధాలు
ఏది నేను రెండింటిలో?

ఏరుకొచ్చిన ఆలోచనలు
పోగుచేసుకున్న పోలికలు
ఏది నేను రెండింటిలో?

చదువు
సంపాదన
అనుభవం
ఆకారం పోసుకున్న మాంసపు ముద్ద
ఏది నేను ఇన్నింటిలో?

కోపం
భయం
ఆవేశం
ఆర్తి
ఆనందం
ఆశ
అసహ్యం
ఏది నేను వీటన్నింటిలో?

ఎప్పటి నించీ..
నేను దాచుకున్నవి
నాతో పోల్చుకోవడం మొదలు పెట్టాను ?

ఎలాగ
నావైనవి
నేనవడం తెలుసుకోలేక పోయాను?

ఎప్పటిలా వర్షపు చినుకులు అమాయకంగా
నన్ను పలకరిస్తున్నాయి..

నేలపై అప్పుడే పుట్టిన చిన్న మొలక
నన్ను చూసి నవ్వుతోంది

క్రమం తప్పకుండా సూర్యుడు రోజూ
నా దగ్గర హాజరు వేయించుకుంటాడు

ప్రతి రాతిరి అంతే ప్రేమగా
నాకు జోల పాడుతుంది

అన్నీ అలాగే ఉన్నాయ్
నేను మాత్రం మారిపోయాను

ఎలాగ జరిగిందీ ఇది?

Sunday, June 23, 2013

నాలో నేను నీతో నేనుప్రతి క్షణం ఒక పుట్టుక..
ప్రతి క్షణం ఒక మరణం
మధ్యలో నువ్వు

అనుకోని ఒక ఊహ
అందమైన ఒక నిజం
రెండూ నువ్వే

ఒక వేడుక
ఒక వేకువ
నువ్వు లేనిది లేదు 

నువ్వు పక్కన లేకున్నా
నీ ఏకాంతంలో నేనుంటాను

నీతో ఉన్నప్పుడు
సూర్యుడి కంటే ఒక పెద్ద వెలుగులో లీనమైపోతాను

అక్కడ
ఆద్యంతాలు లేవు
తలపులు జనించవు
అస్తిత్వాలు ద్వనించవు
సమయానికి అర్ధం స్పురించదు 
ఒక అధ్బుతం
ఒక ఆశ్చర్యం
ఎలా చూసినా ఓ వైభవం
కళ్ళను కప్పేస్తుంది
ఎక్కడో నిశ్శబ్దం సన్నగా పాటలు పాడుతుంది 
నిదుర కన్నా మత్తు ఒకటి గట్టిగా దుప్పటిలా చుట్టుకుంటుంది 
నాకు నన్ను లేకుండా చేస్తుంది

ఇలాంటప్పుడే
సరిగ్గా
ఏమిటిది అనే ప్రశ్న మాత్రం నాకు రాదు..
వచ్చినా అడగను 
సమాధానాలు మాత్రం
వినీ విన్నట్టు ..
తెలిసీ తెలియనట్టు

నాలో నేను
నీతో నేను
ఉండిపోతుంటాను 

Sunday, June 2, 2013

Who ?? short film written by Siva Cheruvu


Please watch add your valuable comments and feed back which will help us to improve and do better next time

Thanks,
Siva Cheruvu

Tuesday, April 16, 2013

ఎంత ప్రయత్నించినా.. మౌనాన్నీ ఆశ్రయించలేకున్నాయి..

ఏమని రాయను ..?
ఎంతని ఒదిగిపొమ్మనను పదాల్లో
నాలోని నిన్ను..

అలా.. ఇలా
అని
ఎలాగ చెప్పను..?

ఎన్నని ..
ఉపమానానికి దొరకని ఊహలు..
ఎక్కడ చూసినా కనపడే గురుతులు
నీ వెనుక తిరిగి నలిగిన దారులు..
నీతో కలిసి నడిచిన అడుగులు

నా మీద నేనే కోప్పడతాను
లో లోపల నవ్వుకుంటాను
అంత మందిలో నిన్ను వెతుక్కుంటాను
ఉన్నట్టుండి ఉలిక్కి పడతాను..

ఎందుకో తెలీదు కానీ..
మళ్ళీ మళ్ళీ నిన్ను తలుచు కుంటాను..
నువ్వూ నన్నే చూస్తున్నట్టనుకుంటాను..
వేల లక్షల అధ్బుతాలను చూసిన వాడిలా..
అలా ఆగిపోతుంటాను..

దాచలేని  ఆలోచనలు
చేతకాని మాటలు
వెలిగించిన నిశి రాతురులు
విదిలించిన సిరా చుక్కలు
ఇన్నిన్ని కాగితాలూ..
అన్నీ కలిసినా
ఎంత ప్రయత్నించినా..

నువ్వెవరని
నాకేమౌతావని..
చెప్పలేక పోతున్నాయి..
పూర్తిగా మౌనాన్నీ ఆశ్రయించలేకున్నాయి..

Sunday, March 31, 2013

నేను రాసిన పాట 2ఏమో ఏమిటో?
చూడని తూరుపో?
మునుపెరుగని మెలకువో ఏమో?
ఏమో ఏమిటో?


నమ్మలేనీ ఓ ఋజూవులా
నిజంగా
నిజంలా
ఒంటరితనం ఓడిందనీ ఏమైందనీ
ఏం జరిగిందనీ?


నీ అడుగే ఇలా
నాతో జత పడీ
మలుపడగనీ దారిలో మనమై
మనదే పయనమై..

-----------

దిక్కులన్ని చుట్టి వచ్చే లెక్కలేని ఊహలే
చుక్కలన్ని లెక్క పెట్టే చేతలన్ని జ్ఞాపకాలై
ఆ నిన్నటి రోజులే.. నన్నొదిలి వెళ్ళాయి నేడే..
అవునో ఏమో ఇదేమో ?

నాకే తెలీని నన్నే నువ్వే
చూపావనే సంగతి
నమ్మనీ
నను నమ్మనీ

ఒంటరితనం ఓడిందనీ ఏమైందనీ
ఏం జరిగిందనీ?
ఏమో ఏమిటో?
చూడని తూరుపో?
మునుపెరుగని మెలకువో ఏమో?
ఏమో ఏమిటో?

-----------------------------------------------

naaa naananaa  naaaa naananaaa

---------------------------------------------


ఏం మాట్లాడిందో గానీ ఇన్నాళ్ళ ఈ పరిచయం
ఇది అని చెప్పనే లేను నాలో నీ ప్రయాణం
నువ్వూ నేననే గీత లేనే లేదని
తెలిసిన ఈ రోజు మళ్ళీ పుట్టానో ఏమో

నిన్నటీ ఆ ఊహలే..
లేవని
ఇక లేవనీ
అడుగడుగునా ఆనందమే మనదైందనీ..
మనమయ్యిందని..


నీ అడుగే ఇలా
నాతో జత పడీ
మలుపడగనీ దారిలో మనమై
మనదే పయనమై..

Tuesday, February 19, 2013

శివమై నిలవాలని..

ఏది మంచి ఏది చెడు అని నన్నడగొద్దు
నేనూ నిన్ను అడగను

ఎందుకంటే..?
నా అభిప్రాయాలు నాకున్నాయి
నీ నమ్మకాలు నీకున్నాయి..

ఒక చిన్న ఆనందం
గొప్ప అనుభూతి
ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు..

చెప్పుకోలేనంత అసహ్యం
దాచుకోలేనంత కోపం
నామీద నాకే..ఒక్కసారిగా !!!
ఏదైనా చెడు చేసినప్పుడు..

మళ్ళీ చెపుతున్నా..
అడగద్దు నన్ను..
ఏది మంచి ఏది చెడు అని..

నా ఆలోచనలు నాకున్నై..
నీ లెక్కలు నీకున్నై..

రాకు నా జోలికి రాకు..
నేనెవరో తేల్చే ప్రయత్నం చెయ్యకు.

నీ కళ్ళు నన్ను నీకు తప్పుగా చూపించచ్చు..
నీ మెదడులో పేరుకు పోయిన అనుభవాలు నిన్ను తప్పు దారి పట్టించ్చొచ్చు
నీ మననం నేను లేని చోటికి నిన్ను తీసుకు పోవచ్చు..
నన్ను బదులు నీవెవరినో కలుసుకోవచ్చు. చివరికి

ఒక్క సారికి విను..
పెట్టేయ్ పక్కన పెట్టేయ్
అన్నీ పక్కన పెట్టేయ్
నీకు తెలిసినవి..
నా గురించి తెలుసుకున్నవి..
అన్నీ
అన్నీ..

నాకు తెలుసు ఎందుకు వినాలి?
అని నువ్వడుగుతావ్!

నా సమాధానం నీకు నవ్వు తెప్పించోచ్చు
కాని ఇది నిజం
నేనెవరో నాకూ తెలీదు..!
అవును అందుకే చెపుతున్నాను

దేవుడినా?
దెయ్యాన్నా?
మనిషినా?
పశువునా?
మరేదైనా నా?
ఎవరు నేను ?
తెలీదు..
ఇది నిజం..

నా దగ్గర ఏ కొలమానాలూ లేవు..
ఏ మాత్రం తెలివితేటలు లేవు
ఇది నాకూ ఒక సమాధానం లేని పొడుపు కధే..

కానీ ఇది నిజం..
ఇది మాత్రం నిజం..

ఒక యుద్ధం చేస్తుంటాను
ఒక నరకం చూస్తుంటాను లోపల
ఒక ఆశతో బ్రతుకుతున్నాను ఎప్పుడూ

ఒకటే మిగలాలని..
ఒక్కటై  మిగలాలని..
శివమై నిలవాలని..

Sunday, February 3, 2013

నువ్వు నేను ఏకాంతానికి తోడు ..మాట్లాడినపుడు
మనతో మౌనమాడినపుడు

ఒకరి రూపునొకరు పొదివి పట్టుకోవడానికి
కేవలం కన్నులు చాలనపుడు..
లోపల ఒక గీత చెరిగిపోయింది..
ఒక కొత్త అడుగు పడింది..
దూరం దూరమైంది

అప్పుడు
నా భుజానిపై నీ తల వాల్చినపుడు
ఊపిరి తెలిసేంత దగ్గరగా ఇద్దరం దగ్గరౌతున్నపుడు

మరింకేమీ తోచలేదు
మనసుకు మరో మననం లేదు
అంతా ఒక్కటే..
పూర్తిగా నీవే.. నీవే..

ఆ దగ్గర తనంలోనూ
నువ్వు దూరం గా జరుగుతున్నపుడు 
మళ్ళీ మళ్ళీ రమ్మంటూ మూగవైనపుడు
అంతే అందంగా రెప్పలు వాలుస్తున్నప్పుడు 

నిజంగా !
ఏదో ఒక అద్భుతమే జరిగింది..

అప్పుడు ప్రపంచం లో
ఇద్దరే ఉన్నారు..

అవును ..

పచ్చని తోట..
నవ్వే పూలు..

దూరంగా కదిలే కడలి
హృదయం హోరు..

నీలాకాశం
నింపేసిన నక్షత్రాలు

అస్పష్టంగా
పొగ మంచు గీసే చిత్రాలు

ఏవీ కనపడలేదు..
మరింకేమీ తెలియడం లేదు

ఒక్కటే ఉందిక్కడ
ఏకాంతం..

నువ్వు నేను
తోడుగా..

Thursday, January 24, 2013

నువ్వెందుకు గుర్తొస్తావ్ ?

ఎందుకు గుర్తొస్తావ్
నువ్వెందుకు ఎందుకు గుర్తొస్తావ్ ?

నువ్వు లేక
నాకు నేను లేని
లేమిలో
నన్ను చూసి వెక్కిరించడానికా ..?

కనపడే అందరిలానే
నేనూ ఉంటాను..
కానీ కళ్ళలో జీవమే ఉండదు
పెదవి పై నవ్వాడదు
నా మొఖం పై ఏ భావం కదలదు.
నా మననం నిను దాటదు..
నిజానికి నాలో ఏ కదలికా ఉండదు
బహుశా.. నువ్వు లేక నేను కేవలం
ఒక నిశ్చల నిర్లిప్త విగ్రహం కాబోలు ..

ఒంటరి తనానికి అద్డంలాగా
కాలిపోతున్న బూడిద లాగా
ముళ్ళ జల్లు లో మసలుతున్న గాయం లాగ
మరలి రాని నిన్నటి రోజులనుండీ పారిపోలేక
మసి పట్టిన మనసు గొంతు నులిమి పారెయ్యలేక
ఎందుకు బ్రతుకుతున్నానో తెలియక బ్రతుకుతున్నాను..

జ్ఞాపకాల అంచున అస్త వ్యస్తంగా కనపడే నీ బొమ్మను.. చెరపలేక..
చూస్తూ ఊరుకుంటున్నాను..

నా ఇంత నాశనం నిన్ను తృప్తి పరిచినట్టు లేదు..!
అంతగా ...
అందుకేనా ఇంకా నా వెంట పడుతున్నావ్?

నువ్వు తప్ప మరేదీ తోచని తనాన్ని
తేలికగా తీసుకోలేక,
నిన్నటి నిశీధి చక్రాల కింద నలిగిపోతుంటే
నవ్వి పోవడానికా..? గుర్తొస్తావ్
నువ్విలా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తావ్ ?

ఎందుకు గుర్తొస్తావ్
నువ్వెందుకు ఎందుకు గుర్తొస్తావ్ ?
Monday, January 7, 2013

ఆడది ఇవాళా 'రేపూ'

వీధులు ..
గృహ గర్భాలయాలు
మాధ్యమాలు
మస్తిష్కాలు
కళాశాళలు
కొన్ని కళా కేంద్రాలు
కళా విహీనమై పోతున్నై..
వెర్రి కలలు వేస్తున్నై..

హృదయాంతరాళలో విశ్వం కూలిపోతోందనీ..
బుద్ది నిద్రపోతోందనీ
కామం వలువలూడదీసుకుని
వివస్త్రగా పరిగెడుతోందనీ
లెక్క లేనన్ని కళ్ళు చూస్తూనే వున్నై...
నిస్సుగ్గు గా వాటి నోర్లు చాచుతూనే ఉన్నాయ్...

ఒకడికి ఉద్యమం
ఒకడికి వ్యాపారం..
ఒకడికి కాలక్షేపం
మరొకడికి జీవనోపాది..
ప్రతి ఒక్కడి అంతర్ముఖం
మరెంతో అంతర్మధనం..
ఇంకెంతో అర్ధం లేని తనం..
వస్తోంది పూర్తిగా బయటకి
వస్తోంది..

కళ్ళకు కట్టుకుని
గుండెకు హత్తుకుని
కావాలని
కావాలని..

పనికి
చేత కాని తనానికి..
అహానికి
ఆగ్రహానికి
ముక్కలై
వక్కలై పోయింది..
బలైపోయింది..

కోర్కెల అగ్ని గుండంలో హవిస్సు మల్లే..
బతికున్న శవాల మెడలో దండకు మల్లే..
డబ్బున్న మేడల గదిలో జల్లిన అత్తరు మల్లే..
వాడి వాడుకలో.. వాడు
వస్తువై పోయింది..

ఏవీ  అన్నం పెట్టిన చేతిని అమ్మా అని పిలిచిన గొంతుకలు..?
గురు పత్నికి నమస్కరించిన శిరసులు..?
ఎక్కడ సొదరికిచ్చే లాలిత్యం.. ? ప్రేమ ?
ఎక్కడ ప్రతి వొక్కరిలో దైవాన్ని చూసే సంస్కృతి..?

ఎక్కడ కనీసం మనిషి గా గుర్తించే ప్రవృత్తి..?
మనిషి మనిషి గా జీవించే ప్రయత్నం..?
ఏమిటీ నీరసిస్తున్న ప్రమాణం..?
నిరసన ప్రయాణం...!

Sunday, January 6, 2013

సృష్టి కర్త..

అంతటా ఉన్నాడు..
అన్నీతానై ఉన్నాడు..

ఉదయాన సూర్యుని చూసినపుడు...
సాయంత్రం చీకటిలో కలిసినప్పుడు
రాతిరి చంద్రుడు వెన్నెలను కురిసినపుడు
నిదురించిన నేను తిరిగి పగలు చూసినపుడు 
ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టినపుడు

అంతటా ఉన్నాడు..
అన్నీ తానై ఉన్నాడు..

తల్లిగా బిడ్డను పొదివి పట్టుకున్నపుడు
తండ్రిగా తప్పును సరి జేస్తూ కన్నెర్ర జేసినపుడు
బిడ్డడిగా నను బతిమాలుకున్నపుడు
భార్యవై నాలో భాగమైనపుడు
గురువై దారి చూపినపుడు 
ఆప్త బందువై దర్సనమిచ్చినపుడు 

అంతటా ఉన్నాడు..
అన్నీ తానై ఉన్నాడు..


ఆనందంలో..
ఆర్తిలో..
కన్నీటి ధారగా..

ఆహార్యంలో
వ్యక్త అవ్యక్త భావనలో
అంతరాత్మ ప్రతినిధిగా

చేసే పనిలో
చూసే ప్రతి దృశ్యంలో
మననమై మనసులో
అను కదలికలో 
లో..లో.


అనంతమై..
నిత్యమై..
సత్యమై..

అంతటా ఉన్నాడు..
అన్నీ తానై ఉన్నాడు..

Saturday, January 5, 2013

రామ బాణం కోసం వెదుకుతున్నాను

లేడు ఎక్కడో ఆ శత్రువు..
వేచి ఉంటున్నాడు
కాపు కాచి ఉంటున్నాడు
నాలోనే
ఎప్పుడూ ఓ అవకాసం కోసం!


లేడు ఎక్కడో ఆ ఆప్తుడు..
నీడై ఉన్నాడు
నాతోనే..
నిజం చూస్తున్నాడు
నీరు గారిపోకంటూ
నేల వాలిపోకంటూ
నిద్దుర లేపుతున్నాడు
మత్తు దులుపుతున్నాడు


సంధ్యలు లేని చీకటి వెలుగుల మధ్య
కొన్ని వేల, లక్షల సార్లు తారస పడతారు ఇద్దరూ..
కాసేపు సంధి
కాసేపు యుద్ధం
ఎప్పుడూ అవిరామం
వీళ్ళ మధ్య..
నా లోపల!

యోగి లా
త్రిశంకు స్వర్గపు భోగిలా...
నిరంతరం... రోగిలా

పట్టు విడుపులు చేత కాక...
విడుదల లేక..

శ్మశాన వైరాగ్యం తో...
వేయి తలల రావణుడిలా
రామ బాణం కోసం వెదుకుతున్నాను