Monday, November 19, 2012

ఇలా అనిపించింది.. 2 - భయం...రక రకాల భయాలు..

ప్రతిదానికి కాక పోయినా. తరచూ ఎదో ఒక విషయంలో మనిషి భయపడుతూ ఉంటాడు.. అనుకున్నది అవదనో.. లేకపోతే..! నచ్చింది జరగదనో...!

మనిషి ఇష్టా ఇష్టాలు లేకుండా ఉండలేడు.. ఏదీ ఆశించకుండా బ్రతకలేడు.. కనుక ఎదో రకమైన భయం తప్పనిసరి.. ఎందుకంటే.. ఏదైనా కావాలనుకున్నపుడు దాని ప్రత్యుత్పత్తులు లేకుండా అది దొరకదు కదా..!?

కొసమెరుపేంటంటే... ఒక్కోసారి భయం మంచే చేస్తుంది..


Friday, November 16, 2012

రవి కాంచనిది కవి కాంచును ..

అలా వీధిలో పోతున్నా..
ఇంట్లో వార్తలు చూస్తున్నా..
ఆఫీసులో పని చేస్తున్నా..
వంటింట్లో వాసనలు ఘుమ ఘుమ లాడినా..
నిద్రలేస్తాడు....

వీడికి పగలు లేదు.. రాత్రి లేదు..
నలుగురున్నా.. ఒంటరిగా పడున్నా తేడాల్ తెలీదు..
ఓ 'మాట'నేస్తాడు .. చేతులు దులిపేసుకుంటాడు. 

అక్కడెక్కడో నక్షత్రాలు..
ఇంటెదురుగా   ఒక అమ్మాయి..
బస్టాపులో బిచ్చగత్తె ..
సినిమా హాలులో సిగరెట్టూ ..
రాసి పాడేసిన పుస్తకం..
గాలికెగిరే కాగితం..
గొంతు దిగని కంద కూరా..
దిక్కుమాలిన జీవితం...
అన్నీ కావాలి..
వెధవకి ..

ఒక నిమిషం ఆగలేడు..
అర క్షణం ఆలోచించుకోనీడు ..
ఆత్రం పీనుగ ..
 
ఎంతసేపూ ఒకటే..
చెప్పేసుకుందామని..
కక్కేసుకుందామని

పాపిష్టి తాపత్రయం..

చరిత్ర..
దేశ కాల పరిస్థితులు..
నేమాని వారి పంచాగం..
బ్లా(బా)గుకొచ్చే బంధు మిత్రులు 
గుమ్మం దగ్గర పిల్లి..
దయతలచిన విధ్యుత్ విభాగం..
 ఏం జరుగుతోందో తెలీని ఒక హఠాన్ పరిణామం ..
 
గోడెక్కి కూచున్న ఆలోచనలు..
అటో ఇటో పడి...
అక్షరాలై కాగితాన్ని ఆశ్రయిస్తాయి..
కొన్ని పదాలు పుట్టి..
చూస్తుండగానే..పెరిగి పెద్దవవుతాయి..
ఓటు హక్కు సాధించినట్టు తలెగరేస్తాయి..
ఊర్లేలినట్టు..
ఊరెరిగింపు కు బయలుదేరతాయి..

అప్పుడు గానీ..
వాలంటరీ రిటైర్మెంటు తీసుకుని..
కుదుట పడడు..  ప్రాణి..


వయసైపోయినా.
పని లేక పోయినా..
పోడు.. అక్కన్నించీ..
పోనీ పైకీ పోడూ ..
పాడు తృష్ణ 
మళ్ళీ మళ్ళీ వెనక్కొచ్చి

తను రాసిన ఘన కార్యాన్ని చూసుకుని..

చేతి లోకి తీసుకుని మురిసిపోతుంటాడు..
ఒకింత కంట తడి పెట్టుకుంటాడు..

పిచ్చి నాయన..
ఎలా బతుకుతాడో..ఇలా అయితే.. !!!!


Wednesday, November 7, 2012

నిన్నటి రోజు..!

..ఒక జ్ఞాపకం..
ఒక గడిచిపోయిన నిజం..
నిన్నటి రోజు..!

చెప్పలేని సంతోషం
చెప్పుకోలేని కష్టం
రెండూ భాగాలే అందులో..

ఎలా చూసినా ...!
వెళ్ళిపోయిన ఆరోజు ఎందుకో
ఇంకా గొప్పగానే కనపడుతోంది..
అది నాదేనని ఇంకా గర్వం గానే ఉంటుంది..

ఏం చెప్పను..?
ఎంత చెప్పినా ఇంక దాచుకోలేను
ఎంత అరిచినా మర్చిపోలేను

ఆరోజుకి...
ఈ రోజుకీ నేనంటే ఇష్టం.. కాబోలు..
అందుకే మళ్ళీ మళ్ళీ వెనక్కి పిలుస్తుంది..

చిన్న పాపలా...
అందమైన అమ్మాయిలా...
అమ్మలా

హితునిలా..
తిరుగుబాటుదారునిలా
దేవుడిలా...

వధువులా
క్రతువులా
నా ఏకైక శత్రువులా