Monday, May 14, 2012

అలా.. అలా.. అలా.. అని..



నిన్న ఇంటిముందు అతుకుల బొంత కట్టుకున్న ఓ ముసల్ది అడుక్కుంటోంది..
రాతిరి కంట్లో ఓ యువతీ నగ్నంగా కదుల్తోంది..
ఇద్దరూ స్త్రీలే..!
ఎవరి గురించి రాయాలి..?
ఏమని రాయాలి..?

కళ్ళముందే సగం చిరిగిన శ్రీ శ్రీ రచనలని సెకండ్ హ్యాండుకు కొనుక్కున్నాడెవడో  ..
శభ్ధభేరికి స్పీకర్లు తగిలించి బూతు పాట వింటూ.. నవ్వుకున్నాను..
రెండూ సాహిత్యాలే..!
ఎవరి గురించి రాయాలి..?
ఇప్పుడేమని రాయాలి..?

ఒళ్ళు విరుచుకుని రక్తాన్ని రూపాయిగా మార్చుకుంటున్నాడెవడో..
అద్దాల మేడల్లో, చలువ రాతి బండల్లో, నన్ను నేను సమాధి చేసుకుని శయనిస్తున్నాను ..
అటూ ఇటూ.. మనుషులే..@!
ఎవరి గురించి రాయాలి..?
ఎలాగ రాయాలి..?


కసిరే.. కొరికే..కత్తులు దూసే ఒకరి పిలుపు ..
కాల్చే.. కదిల్చే.. కన్నీరు దాచే.. ఒకరి మౌనం.
ఈ భారాల దూరాల.. మధ్య..!
ఎవరి గురించి రాయాలి..?
ఏమైందని రాయాలి?

కోరిన కోర్కెలు తీర్చే దైవం ఒకటి..
నచ్చిన చట్టం రాసే దెయ్యం ఒకటి..
నాణేనికి చెరొక వైపూ నేనే..!
ఎవరి గురించి రాయాలి..?
ఎటువైపు రాయాలి?

నాలో లేనిది నేను చూడలేను..
నేను కానిది అనుభవంలోకి తేలేను.. అనుభూతి చెందలేను
అందుకే నాగురించి రాస్తాను..
ఇప్పుడు నాలో ఓ కోణాన్ని ఆవిష్కరిస్తాను..

అయినా..!
నా ఖంఠం పెద్దదవ్వాలని..
నా కలం కదిలించాలని..
ఎవరో ఎందుకు కలగంటారు..?
నా అక్షరాలను తరచి తరచి చదవాలని..
ఎవరో ఎందుకు తపస్సు చేస్తారు..?
నేనెవరో వాళ్లకు తెలియదు..
కనీసం కన్నెత్తైనా చూడరు.. నన్ను
నాకు తెలుసు..!

ఇది నేనేమిటో చెప్పుకోవాలన్న నా తాపత్రయం..
అంతే..
అందుకే..
ఎప్పటిలా అందంగా ఒక అబద్దం రాసేస్తాను..
జీవితం అందమైనది.. జీవించు.. అని..
నీవు నేను వేరు కాదు.. ప్రేమించు.. అని..

అలా..
అలా..

అలా..
అలా..

అలా..
అలా..

అని..


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.


6 comments:

రమణ said...

Great expression. I hear you.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

బావుందండి

భరత్ said...

నన్ను మింగేసే ఆవేదన ఒకటి,
నన్ను నడిపించే ఆవేశం ఒకటి,
నాణేనికి రెండు వైపూలా నేనే...

మీ భావుకత చాలా బాగుంది

శివ చెరువు said...

రమణ గారు.. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు.., ధన్యవాదాలు..

భరత్ గారు..
నా ఇన్ని పదాలను.. టక్కున చెప్పమంటే.. బదులుగా.. మీరు రాసిన ఈ కామెంట్ని చెపుతాను ఎవరికైనా... మీకు అభ్యంతరం ఉండదుగా. :) ధన్యవాదాలు..

చైతన్య said...

:-)

శివ చెరువు said...

చైతన్య గారు.. Great to see you coming back :)