Wednesday, April 4, 2012

ఇక ఇక్కడ మనమే.. ఇక ఎప్పుడూ మనమే..
నువ్వు నేను దగ్గరగా వచ్చేసాం.
ఏ దూరాలు మధ్యన రానంతగా..

నువ్వు నేను కలిసిపోతున్నాం..
ఏ కలలకి ఇక తావు లేనంతగా..

గడియారం ఆగిపోయినట్టుంది..
ఊహలు సెలవు తీసుకున్నట్టుంది..
గుండె నిండుగా మత్తుపట్టినట్టుంది..
ఒక కొత్త ప్రపంచం పుట్టినట్టుంది..

భూమ్యాకర్షణ శక్తికి
దూరంగా.. పక్షి మల్లె ఎగురుతున్నట్టు..

నిశి రాతురులు కూడా
అందంగా.. వెలుగు రేఖలు సృష్టిస్తున్నట్టు

మారాలని మనలాగే..
ఆనందంగా.. ప్రకృతి మన రంగులద్దుకున్నట్టు

ప్రతీ క్షణం జ్ఞాపకమవగలిగేట్టు
పూర్తిగా జీవించేస్తూ..

మనమే శాశ్వతమయినట్టు..
మనకే తెలియనట్టు..
ఉండిపోదాం ఇలాగే..
నువ్వు నేను...

ఇక మనకి ప్రయాణం లేదు..
మజిలీలు.. మలుపులు.. లేవు..

మనం చేరుకున్న తీరాలు..
మనలని వదిలి పోవు.
మనం దూరమైన భారాలు..
మనలని చేరుకోలేవు..

ఇక ఇక్కడ మనమే..
ఒక నువ్వు.. ఒక నేను..

ఇక ఎప్పుడూ మనమే..
ఒక నువ్వు.. ఒక నేను..

2 comments: