Saturday, March 17, 2012

ఆనందాలు..

అప్పుడప్పుడూ నన్ను నేను తిట్టుకున్నా.. ఎప్పుడూ మాత్రం నాకు నేను గొప్పగా కనపడతాను.. నాకు నా కధలో నేనే హీరో అనిపిస్తుంది. అసలు అలానే చూసుకోవడం నాకు ఇష్టం. అదే నిజం.. ఎప్పుడైనా సరే అద్దం ముందు నిలుచున్నప్పుడు తెలియకుండా మన మొహంలో ఒక నవ్వు, ఒక వెలుగు కనపడతాయే... అలాంటిదే ఇది కూడా..

వెనక్కి తిరిగి చూసుకుంటే.. చాలా సంవత్సరాలు.. ఎన్నో పరిచయాలు. ఎన్నెన్నో సంఘటనలు.. కానీ చాలా కొన్నే గుర్తుంటాయి. కొంతమందినే మళ్ళీ కలవాలనుకుంటాం. ఎందుకో నాకూ తెలియదు. దానికీ ఇప్పుడు నేను రాయబోఏదానికి పెద్ద relevance ఏమీ లేదు.. కానీ ఏవో జ్ఞాపకాల గురించి రాద్దామనిపించి ఇలా మొదలు పెట్టాను అంతే..

చిన్నప్పటినుండీ ఇప్పటివరకూ చూసుకుంటే... ఇప్పటికిప్పుడు గురుతుకొస్తున్న బహుశా మరిచిపోలేని నా కధలో సన్నివేశాలు.. వీటిని తలుచుకుంటే..ఒక ఆనందం.. ఒక చిన్న నవ్వు.. నా గతం ఎంత బావుంది అనే ఒక గర్వం..


 • అమ్మని ముద్దలు చేసి అన్నం పెట్టమని మారం చేయడం. తినకుండా అలిగి కూర్చోవడం.
 • పదో తరగతి పాసయినప్పుడు నాన్న ఇచ్చిన రెండు రూపాయల కాగితం
 • అప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలో తెలియదు కానీ.. చాలా చిన్న పిల్లాడిని.. విజయవాడలో వదిలి అమ్మ నాన్న ఒక రోజుఏదో ఊరు వెళ్లారు. అప్పుడు రోజంతా ఏడిచాను.. వచ్చాక ఉబ్బిపోయిన నా మొహం చూసి భాదలో అమ్మ ఒక రెండుతగిలించింది..
 • మొదటి సారి ఐదో తరగతిలో హాస్టల్ జీవితం.. అప్పుడు తిన్న జోతి బేకరి.. రస్కుల పాకెటు
 • ఐదు పైసల చిల్లర కోసం నారాయణ మెడికల్ షాప్ చుట్టూ తిరగడం.. అతను నన్ను వింతగా చూడ్డం.
 • మొదటి సారి నేను క్రికెట్ లో తీసిన పరుగు , రెడ్ క్రాస్ బిల్డింగ్లో
 • కారు రేకుల షెడ్ కింద నిలబడి.. పైన పడే వడగళ్ళను గమనించడం.. కింద పడ్డవాటిని తింటూ చప్పరించడం .. నానాజీ గారింట్లో
 • విపరీతమైన వర్షంలో .. ఆ రాత్రి కరంటు పోయింది.. ఆతరువాత ఏం జరిగింది? నేను పోలీసు స్టేషన్ రోడ్డు లో సైకిల్ తొక్కుతూ పూర్తిగా తడిసిపోయాను .. తరువాత జ్వరం..
 • ఆరోతరగతి లో క్లాస్స్ సెకండ్ రావడం
 • ఏడో తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ తీసుకోవడం.. అప్పటిదాకా సర్టిఫికేట్ అంటే ఏమిటో తెలియదు నాకు..
 • పార్వతి మేడం పెట్టిన తొడపాసం..
 • రవిగాడిని వీరేశం మాస్టారు కొడుతుంటే లోపల లోపల నవ్వుకోవడం
 • కబడిలో నాకు వచ్చిన బొచ్చె ప్రైజు ఎవరో తీసుకోవడం .. నేను ఏడవడం.. లోలోపల
 • పాటలపోటీలో సెకండు ప్రైజు.. హి హి హి... లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్.. అన్న మాట
 • డబ్బులు వసూలు చేసుకోవడం కోసం భగవాన్ స్వీట్స్ షాప్ ముందు గంటలు గంటలు కూర్చోవడం..
 • సంతోష్ గాడు నాకు sorry చెప్పిన రోజు.. క్రికెట్ లో గొడవైందని.
 • నాకు పుస్తకాలు అర్ధం అవుతాయని.. నేను ఇంకొకళ్ళకి అర్ధం అయ్యేట్టు చెప్పగలనని.. నాకు తెలిసిన నా టెన్త్ రోజులు..
 • బాలిగాడు ఊరొదిలి వెళ్ళిపోతూ నన్ను రావొద్దని చెప్పిన రోజు..
 • పక్కింటికి వెళ్లి చూసిన కాశి మజిలి కథలు.. దూర దర్శన్ సీరియల్
 • అర్ధ రూపాయి రెంటుకు తీసుకొచ్చిన్న చందమామలు.. బాల మిత్రలు..
 • మొట్ట మొదట ఆడిన వీడియో గేం.. Mario.. అనుష వీడియో గేమ్స్
 • మొదటిసారి దిలీప్ గాడితో షేర్ చేసుకున్న పునుగులు..
 • ఆదిత్య రూమ్లో నా మొదటి బర్త్ డే పార్టి.. (అప్పటికి నేను ఆదిత్య ఒకరికి ఒకరు తెలియదు..)
 • దియేటర్ లో మూడు సార్లు చూసిన తొలిప్రేమ సినిమా .. అప్పటికి నాకు సినిమా అలవాటు లేదు..
 • సరిగా రాని కేబుల్ సిగ్నల్ సరిచేస్తూ.. ఈటివిలో వచ్చే 'రహస్యం' సీరియల్ చూడడం..
 • వెతుక్కుంటూ రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్ళడం.. వాళ్ళ నాన్న గారి పరిచయం..
 • పొద్దున్నే నాలుగు గంటలకు లేచి నిద్రకు మొహం వాచిపోయినట్టుండే హాస్టల్ పిల్లల్ని చూసి నవ్వుకోవడం...
 • సొంతగా వండుకుని బిరియాని చేసుకోవడం..
 • తాటకి (రామాయణంలో) బొమ్మ దగ్గర.. గోదారి గట్టు దగ్గర.. పుస్తకాలు తెరుచుకుని చదువుకోవడం..
 • బస్సెక్కి ఊరెళ్ళే అమ్మ నాన్నలని వెనకాల సైకిలు వేసుకుని వెళ్లి టాటా చెప్పడం..
 • ఎండా కాలం లో ముప్పై నలభై ఓవర్ల క్రికెట్.. ఆడడం..
 • క్రికెట్ గ్రౌండ్ లో parellel బార్స్..
 • నాటకాలలో జిల్లా స్టాయి అవార్డు.. (కన్సొలేషన్ ప్రైజ్ :) )
 • అన్నయ్య వాళ్ళ స్నేహితుల మధ్యలో కూర్చుని విన్న 'దిల్ సే' సినిమా పాటలు..
 • వేగంగా సైకిల్ తొక్కడం లో నాతో నేను పెట్టుకున్న పోటీలు..
 • ఒక సాయంత్రం నేను మొదటి సారి చూసిన నరసన్న..
 • నేను రాసిన మొదటి కధ..
 • వర్షం పడే కొంచెం సేపు ముందు వీధి దీపాల వెలుగులో నేను చూసిన ఓ అందమైన అమ్మాయి.. సామాన్యం గా ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి.. అనుకునేవాడిని..
 • అర్ధరాత్రుళ్ళు వీధుల మీద పడి అంటించిన పోస్టర్లు..
 • మొదటి సారి కలిపిన పానకం..
 • ఇంట్లో ల్యాండ్ లైన్స్ కి వచ్చే మిస్స్డ్ కాల్స్..ఎవరై ఉంటారా అని ఆలోచించడం..
 • నా ICETరాంకును చూసి గర్వ పడ్డ నాన్న..
 • తిరిగి తిరిగి వచ్చి..అలిసి నిద్ర పోతున్న నాకు "యు ఆర్ సెలెక్టెడ్" అని వచ్చిన మొదటి ఉద్యోగం..
 • విశాఖ పట్నంలో నేను చూసిన సముద్రం..
 • సముద్రం లాంటి మనుషులు..
 • మొదటి సారి మల్లూరు ట్రిప్..
 • గుళ్ళో రాజు పరిచయమైన రోజు..
 • ఊరినించీ వచ్చే ప్రతి సారి సెండ్ ఆఫ్ ఇచ్చే స్నేహితులు..
 • శ్రీ శ్రీ భిక్షు వర్షీయసి..
 • బాల గంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి..
 • హైదేరాబాద్లో గంటల కొద్ది నడిచిన రోజులు..
 • కాప్మార్క్లో హరి, సోము.. శర్మ .. వీళ్ళతో మాట్లాడిన ప్రతి రోజు..
 • జీటాలో నిద్ర మాని పని చేసిన ప్రతి రోజు..

వెనక్కి తిరిగి చూసుకుంటే.. మరి ఏం కష్టాలు పడ్డావు? అని ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్పలేను.. ఎందుకో ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం దొరకదు.. ఒక పెద్ద ప్రమాదం నుండీ ప్రాణాలతో బయట పడితే ముందు 'ప్రమాదం' గురించి ఎవరూ మాట్లాడరు. 'ప్రాణాలతో బ్రతికి బయట పడడం' గురించి మాట్లాడతారు. మొదటిది ఒక 'ఏమవుతుందో అన్న ఆత్రుత/భయం' అయితే రెండోది ఫలితం తాలూకు 'ఆనందం'. ఎప్పుడూ ఫలితమే గుర్తుంటుంది.. ప్రమాదం కాదు..

మీకు కూడా ఇలాంటివే బోలెడు అనుభవాలు.. ఆనందాలు ఉండి ఉంటాయి.. వాటిని రాసి పదిలం గా దాచి పెట్టుకోండి.. ఎప్పుడో ఒకసారి తీసి చదువుకోండి..

చూడండి, నేను పందెం కాస్తాను.. మీరు చదువుతూ చదువుతూ మధ్యలో.. నవ్వకపోతే నేను..నా పేరు....................

2 comments:

 1. nostalgia is always great, be it happiness or sorrow...!

  ReplyDelete
 2. :) :) మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

  ReplyDelete