Monday, February 20, 2012

ఓ రాత్రి ..సత్యం..శివం ..

సమయం రాత్రి 8 .40

గాలి బాగా ఎక్కువ వీస్తోంది.. కానీ వాతావరణంలో వేడి వలన దాని ప్రభావం అంత ఆహ్లాదంగా ఏం లేదు. ఏదో సర్దుతున్నట్టు శబ్దం వస్తోంది.. అక్కడ ముందే ఏర్పాటు చెయ్యబడ్డ బల్ల మీద రెండు గ్లాసులు.. ఒక రెండు పెద్ద బాటిళ్ళ మందు.. కలుపుకోవడానికి సోడా. ఇంకా కాస్త ఏదో తినే పదార్ధాలు ఒక దాని తరువాత ఒకటి చేరుకుంటున్నాయి.. రెండు కుర్చీలు ఒక దానికి ఎదురుగా ఒకటి మొహాలు చూసుకుంటూ ఎవరో వస్తారన్నట్టు ఉన్నాయి. ఉన్న అంతస్తు చాలా ఎక్కువలోనే అయినా దోమల చప్పుడు బాగానే ఉంది. కింద నేల కూడా కాస్త దుమ్ము కొట్టుకు పోయి ఉంది. అక్కడికి ఎవరూ చాలా కాలంగా వచ్చినట్టు లేరు.

ఒక పావు గంట తరువాత ఇద్దరు వ్యక్తులు వచ్చి కూర్చున్నారు.

"మొత్తానికి శివం..!!! నువ్వు లైఫ్ లో చాలా achieve చేసావ్ రా.. నిన్ను చూస్తే కుళ్ళుగా ఉంది.." అన్నాడు సత్యం..

నన్ను చూస్తే నా..? ఎందుకు? - ప్రశ్నించాడు శివం

ఇల్లు.. పెద్ద ఆస్తి.. మంచి కుటుంబం.. స్టార్ గా గొప్ప పేరు.. చెపుతున్నాడు సత్యం...

ఆపు ఆపు .. ఇవన్నీ నీకు ఉన్నాయిగా ..? కాక పోతే నీకు మంచి డైరెక్టర్ గా పేరు అంతే..! నన్ను స్టార్ చేసిందీ నువ్వే.. పూర్తి చేసాడు శివం

సరే సరే... అయినా మనిద్దరిలో నువ్వే పొపులర్ అని ఒప్పుకోవాలి.. మరి.. నవ్వేసాడు.. సత్యం.. "ఏ మాత్రం కలపను ?" ప్రశ్నని మాటలో కలిపేసాడు..

అయినా నీకో విషయం చెప్పనా.. పక్కన వాడికి ఉన్న దాన్ని కుళ్ళు కోక పోతే నేను మనిషిని ఎలా అవుతాను? ఇంకేదో అవుతాను.. ప్రమాణం కాదు కానీ.. ఒక చిన్న ఉదాహరణ చెపుతాను. చిన్న స్కూల్ పిల్లాడిని తీసుకో వాడికి పరీక్షలో పాస్స్ అయిన వెంటనే ఆనందం దొరకదు. తన కన్నా ఎవరికీ ఎక్కువ మార్కులు వచ్చాయి అని తెలుసుకునే దాక. తనకే ఎక్కువ వచ్చాయి అనుకునే దాక..

"అయితే మనిద్దరం రాసే పరీక్ష ఏమిటో?" చీర్స్ అంటూ గ్లాస్ కలిపాడు శివం..

"సింపుల్.. జీవితం " నోట్లోనే సమాధానం పెట్టుకున్నాడు సత్యం.

శివం మాట్లాడడం మొదలు పెట్టాడు.
"50 వయసొచ్చాక ఇప్పుడిక జీవితం ఏముంది? అంతా అయిపోయింది. కొన్ని సినిమాలు.. కొంతమంది మనుషులు.. చెప్పుకోవడానికి కొన్ని సక్సెస్లు, బ్రతికి ఉన్నంత కాలం తినడానికి తాగడానికి డబ్బు.. బయటకి వెళ్తే లెజెండ్ అంటారు.. కావలసిన అంత మంది వంగి వంగి దండం పెడతారు. ఏదో ఒక రోజు ఏ జబ్బో పట్టుకుంటే హాస్పిటల్ కి అక్కడి నుండి అటు పైకి దగ్గరుండి పంపేస్తారు. అయ్యింది ముందే అయిపోయింది.. ఇప్పుడేమి మిగలలేదు."

'అక్కడే పప్పులో కాలేశావు' చెపుతున్నాడు సత్యం. ఎంత మంచి కదా వస్తువైనా.. ఎంత గొప్పగా ఒక కధ మొదలైనా దానికి ఒక క్లైమక్ష్ కావాలి. అప్పుడే ఆ కధ అయిపోయినట్టు. ముగింపు లేని కధ మొగుడు పోయిన ఆడది లాంటిది. దానికి ఉన్న పాత్రలలో ఎవరికి వండి పెట్టాలో తెలియదు.

"ఇది. నువ్వు రాసే కమర్షియల్ కధ కాదురా ఈడియట్. లైఫ్ . లైవ్. ముందే పైన ఒకడు రాసి పెట్టేసాడు. దాని గురించి నువ్వేమీ వర్రీ కానక్కరలేదు.నువ్వనుకుంటే రైటర్ అయ్యావా? నేను అనుకుంటే హీరో అయ్యానా? అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు." గ్లాసు కింద పెట్టాడు శివం.

నువ్వన్న ఆ పై వాడి పేరే కాలం. వాడు నీకు ఎప్పుడూ ఒక అవకాసం ఇచ్చాడు. ఎంచుకున్న దాన్ని బట్టి నీ కధలో పాత్రలు, వాటి నిడివి ఇంకా సన్నివేశాలు నిర్దేశిస్తాడు. నిజం చెప్పు.. నువ్వనుకోకుండా హీరో అయ్యావా? నీ అనుమతి లేనిదే నీ కొడుకు నీ సినీ వారసుడయ్యాడా? జీవితం అంతా నువ్వు తీసుకున్న నిర్ణయాలకు చాయిస్ కాదా?

ఉదాహరణకి నీకో చిన్న గది ఇచ్చాను అనుకుందాం. దానిలో నువ్వేం ఏర్పాటు చేస్తావనేది నీ ఇష్టం. నువ్వు ఒక పెద్ద బల్ల పెడితే.. తరువాత వంట సామానులు గాని. చేసిన వంట కానీ .. ఇలా బాటిళ్ళు గాని ఏవైనా రావచ్చు.. అది తరువాత కధ .. కానీ నీ నిర్ణయం తోనే ఇవన్నీ వస్తాయి. ఎవరికో కొంత మందికి మాత్రం .. ఆ టేబుల్ మీద ఏం పెట్టాలో కూడా నిర్ణయించుకునే అవకాసం ఉంటుంది. సత్యం గొంతుకలోకి జారే మందు తన వేగం పెంచింది..

చాలు చాలు.. ఒప్పుకుంటాను.. నువ్వేమంటే అదే.. ఒకటి నన్ను చూసి కుళ్ళుకుంటున్నాను అని అనడం ఆపు. రెండు.. వేరే ఏమైనా మాట్లాడు. లేదా మాట్లాడకు. ఎప్పుడు ఏ టాపిక్ మాట్లాడతావో తెలియదు. నీ సోది నాకు ఫారెన్ పుస్తకాలలో భాష లాగ సగం అర్ధమే కాదు. ఇంకా ఆ క్రియేటివిటీ కి కాస్త టాప్ కట్టేయి..కొంచెం సేపు.

ఒరే ఫూల్ ... ఈ క్రియేటివిటీ యే నీకు ఎన్నో హిట్ సినిమాలిచ్చింది. భాధలో ఉన్న వాడికి స్వాంతన కావాలి. కొంతమందికి అది పక్కన వాళ్ళ మీద పది ఏడవడంలో ఎక్కువ దొరుకుతుంది. అది ఒక రకమైన ఆనందం వెతుక్కోవడం. ఇక మాటలంటావా ? తాగేదే మాట్లాడడానికి. నువ్వేమైన నా సినిమాలో హీరోయిన్ వా..? మాట్లాడకుండా నిన్ను చూస్తూ కూర్చోవడానికి.. అయినా నీ కన్నా వాళ్ళే నయం. ముందు వాళ్ళే మాట్లాడతారు. అర్ధం కాలేదని మళ్ళీ మళ్ళీ అడుగుతారు. కళ్లెగరేసాడు సత్యం.

అవునవును. నువ్వు చెప్పేది నాకే అర్ధం కాదు. వాళ్ళకేమర్ధమౌతుంది. పైగా లాంగ్వేజ్ ప్రాబ్లం. అదో గ్రహాంతర వాసుల సంభాషణ. నువ్వు నీ హీరోయిన్లు... చెప్పింది వినరు. వచ్చింది తప్ప మరోటి చెయ్యరు. కాన్సెర్ కి తలనొప్పికి ఒకే మందు వాడే రకం. నీకు వాళ్ళే కరెక్టు. గొంతులో ఒక వెటకారపు నవ్వు కలిపేసాడు శివం. అయినా అమ్మాయిలు లేకుండా సినిమా తీయలేవ? ఓన్లీ నన్ను పెట్టి. వరైటీగా? సినిమా హాల్లో చూసేవాడికి ఏమో గాని.. ప్రతి టేక్కీ అంతంత మేకప్ ఉన్న వాళ్ళ మొహాల్లో మొహాలు పెట్టి చూడలేక చచ్చిపోతున్నా. పైగా ఈ వయసులో ఆ ఇరవై ఏళ్ళ బక్క పల్చ అమ్మాయిలు నాపక్కన అవసరమా? కావాలంటే నేను ప్రోడ్యుస్ చేస్తాను .. చెప్పు తీస్తావా నువ్వు ?

నీ బుద్ది వికసించింది కానీ. నీ వెరైటీ వికటిస్తుంది. అప్పుడు నువ్వు నేను మాత్రమే సినిమా చూసుకోవాలి. గుర్తుంచుకో.. నిన్ను నిన్ను గానే, హీరోయిన్ ని హీరోయిన్ లాగానే చూస్తారు ప్రేక్షకులు. వాళ్లకి కావలసింది ఒక పూర్తి పేకేజీ. కొంచెం నవ్వు. కొంచెం రోమాన్స్. కొంచెం ఏడుపు. కొంచెం వయోలేన్సు. వాళ్ళ అభిమాన హీరో .. ఒక నాజూకు నార్త్ అమ్మాయి. Maximum ప్రేక్షకులకు సినిమా ఒక ఫార్ములా (a+b)2 = a2 + 2ab + b2 లాగ.. నువ్వు '+' బదులు '-' గాని '=' ఇంకొటేదో వాడతాను. కొత్త ఫార్ముల Derive చేస్తాను అని అనకూడదు. కావాలంటే 'a' కి 'b' కి వాల్యూస్ మార్చుకో. నిన్ను ఎవరూ ఏమీ అనరు. పైగా క్రియేటివిటి అంటారు.

అలవాటు పడ్డవాళ్ళకి సినిమా వ్యసనం. తీసేవాళ్ళకి అది వ్యాపారం. ఇక్కడ ఎప్పుడూ లాభం గురించే మాట్లాడతారు.

సింపుల్. కొలమానాలు.. దినుసులు మారిపోతే వంట మారిపోతుందని అందరికీ తెలుసు. కానీ వంట మాడిపోతుందనో.. సొమ్ము కాదనో ఎవరూ ప్రయత్నం చెయ్యరు. నిజం చెప్పు ఇన్ని సినిమాల్లో అవే కధలు.. అవే పాత్రలతో నువ్వు ఎన్ని సినిమాలు చెయ్యలేదు?

ఒప్పుకుంటాను.. బదులుగా అన్నాడు శివం. నీకు తెలియనిది ఏముంది. ఒక దర్శకుడు వస్తాడు. వాడు నాకు పెద్ద ఫ్యాన్ అంటాడు. నాకో బిగ్ హిట్ ఇవ్వడమే జీవిత ఆశయమని కష్టపడి ఒక కధ రాసానని అంటాడు. అది చూస్తే నా పాత సినిమాల అమ్మమ్మకు తమ్ముడి రెండో కొడుకు కూతురిలా ఉంటుంది. కధని కధలా చెప్పరు. ఎవరో చూసేలా.. ఎవరో వినేలా.. హర్షించేలా ఉండాలన్నదే వాళ్ళ సిద్దాంతం. అందుకే నా సినిమాలు. నేను ఒకే రకం గా ఉంటాం. సినిమాలో నేను ఒక పాత్ర కాదు. కధకి తగినట్టుగా నేను ఉండనక్కరలేదు. ఎవరూ ఎందుకు అని ప్రశ్నించరు? నాతో సహా. నేను నిర్మాతకి సెల్లింగ్ ఫాక్టర్ అంతే. ఇలాంటివి తట్టుకోలేకే ఒక సారి నా డబ్బులతో ఒక మంచి సినిమా తీసాను. దాన్ని అవార్డు సినిమా అన్నారు. కానీ అది నా కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్. లేచి అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టాడు శివం.

ప్రొడ్యుసర్ కి నా స్టార్ ఇమేజ్ కావాలి. డేట్స్ కావాలి. కొంతమందికి నాతో పని చేసామన్న పేరు కావాలి. ఇంక అభిమానులు. వాళ్లకి నేను ఇలానే ఉండాలి అని ఒక ఆశ. వాళ్ళ డబ్బులతో ప్రతీ రిలీస్ నీ పెద్ద పండగ లాగ చేస్తారు. కానీ అది నాకోసం కాదు. నేను వాళ్ళ జిల్లా అనో ..తాలూక అనో. లేక వాళ్ళ జాతికి సంభందించిన వాడిని అనో. ఎవరికో కొందరికే నా నటన చూడాలని ఉంటుంది. నా పర్సనల్ లైఫ్ లో ఒక ఇంసిడెంట్ వాళ్ళకి ఒక పెద్ద న్యూస్. ఇంక నేను ఎవరూ అని ఎవ్వరికీ అక్కర్లేదు. స్టేజ్ మీద కనపడితే ఈలలు వేస్తారు. చప్పట్లు కొడతారు. ఆనందంతో బట్టలు చించుకుంటారు. వీళ్ళకోసం నేను ఎప్పుడూ నటిస్తూనే ఉంటాను. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది యే ఒక్కరికైనా తృప్తి సంతోషం..ఉండాలని.. కానీ అది నేను ఇంతవరకూ చూడలేదు. అసలు ఒకరిని ఇలాగ ఉండమని.. ఇలాగే ఉండాలని మరొకరి ఆలోచన.. ఎక్ష్పెక్తే షన్ నాకు నాన్ సెన్స్ అనిపిస్తాయి..

'అవునా ..?' కళ్ళు పెద్దవి చేసాడు సత్యం.

'వెటకారమా' - గట్టిగా ప్రశ్నించాడు శివం.

సత్యం మెల్లగా చెపుతున్నాడు. కాక మరేమిటి? నీ తప్పుకు ఎవరినో కారణం గా చూపిస్తున్నావు నువ్వు. నీకు పేరు కావాలి. డబ్బు కావాలి. సో.. వాళ్ళకి కావలసినట్టు ఉంటే నీకు కావలసినవి నీకు దొరుకుతాయి. ఇట్ ఇస్ జస్ట్ సెల్ఫ్ఇష్నెస్ .

గాలి జోరు పెరిగింది. వాతవారంలో ఒక రకమైన బరువు చోటు చేసుకుంది. సమయం పదకొండు గంటలు దాటింది. నగరంలో అక్కడక్కడ దీపాలు మిగులుతునాయి. బయట జనం తిరిగే చప్పుడు తగ్గింది. మేడ మాత్రం ఇద్దరి గొంతుకలు మాత్రమే వింటోంది ఎక్కువగా..

చూడు నాకు మాత్రమే నచ్చిన కధలు రాస్తే ఇరోజే ఇంటికి వెళ్లి పోవాలి. నలుగురు చూడాలి అని అనుకుంటే దానికి మసాల కావాలి. నేనిన్ని రోజు చేసింది ఇదే. నో రిగ్రెట్స్.

నా కధలు గమనించావా..? హీరో ఎప్పుడూ ఒక భాద్యతగలవాడిగా కనిపించడు. అందుకే వాడు హీరో. హీరోయిన్ అని చెప్పుకునే దానితో వాడు మాట్లాడే మాటలు డిసెన్సి కి దూరం గా రాసినవే. అవే డైలాగులు సెన్సారు వాళ్ళు అక్కడక్కడా మ్యూట్ చేస్తారు. వాటిని చిన్న పిల్లడు కూడా గుర్తు పట్టేస్తాడు. ఇంక ప్రేక్షకులలో చాలా మంది అవే మళ్ళీ మళ్ళీ చెప్పుకుని నిర్మాతకు ప్రచారం డబ్బులు మిగులుస్తారు.

దాదాపు ప్రతి మనిషిలో చీకటి పార్శ్వాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా సినిమా వాటిని సాటిస్ఫై చెయ్యడానికే పనిచేస్తోంది. వినోదం కోసం కాదు. ఏదో సందేశం కోసమో.. సమాజం కోసమో అసలే కాదు.

సగం కట్టీ కట్టని చీరలో అమ్మాయిని చూడడం తోనో ... ఒకడు ఒక దెబ్బకి పది మందిని మట్టి కరిపిస్తే నో లేచి చప్పట్లు కొట్టి ఊగిపోయేవాళ్ళు ఎంత మంది ఉన్నారో.. అది వాళ్లకి రియల్ లైఫ్ లో వర్క్ అవుట్ కానీ ఒక ఫాంటసి.
దాన్ని మరింత ఇంటెన్సివ్ గా చూపించే డైరెక్టర్లు నాలాంటి వాళ్ళు ఎంత మందో..!

ఒక కాలేజీ విద్యార్ధి లెక్చరర్ ని నలుగురి ముందు వెటకారంగా .. ఇంకా ఒక్కోసారి అసభ్యంగా కూడా మాట్లాడతాడు. అది చూసి పది మంది క్లోజ్ అప్ advertisement లో పార్టిసిపేట్ చేస్తారు. అది తప్పని ఎంతమంది థియేటర్ లోంచి లేచి వెళ్ళిపోతారు..? యే ఒక్కరూ వెళ్ళరు. నీకు తెలుసు గా ఆ సినిమా సూపర్ హిట్.

రక్తాలు వచ్చేదాకా కొట్ట్కోవడం యాక్షన్ . భూతు మాటలు ఎంటర్టేయిన్మేంట్ . బ్లేడుతో కోసుకోవడం సెంటిమెంట్. ఇవేవీ నిజానికి చూపించనక్కరలేదు. దీన్ని ఎవ్వరూ ప్రశ్నించరు. కానీ యే సినిమాలోనో ఏ పార్టీ జెండానో యే మూలో కనపడితే దాన్ని పెద్ద గొడవ చేస్తారు. రీళ్ళు తగల పెడతారు. మనుషులే పోతుంటే పార్టీ చిహ్నాలని ఎమ్చేసుకుంటారు ఎవరైనా? పిచ్చితనం. ప్రతీ మనిషిలో ఎంతో కొంత విచ్చలవిడి తనం దాగి ఉంటుంది. దాన్ని satisfy చెయ్యడానికే ఇది అవసరం. అందుకే అన్నాను ఇది బిజినెస్. వాళ్ళకి కావలసింది పడేసి. నీకు కావలసింది నువ్వు తీసుకున్తున్నావు.

నిజం నిశ్శబ్దంగా ఉన్న నగరం లాంటిది. దాని నుంచీ నీకు అర్ధం అయ్యింది తీసుకోవచ్చు. కానీ అది మారదు.
చుట్టూ చూస్తూ అన్నాడు సత్యం.

'నేను నీతో పూర్తిగా ఏకీభవించక పోయినా.. ఇప్పుడు నువ్వన్న నిజంలో తప్పు ఎవరిది అని నేను మాట్లాడను. ఎందుకంటే అది నన్ను భాధ పెడుతుంది. అయితే ఒక్కటి ఒప్పుకుంటాను. తప్పు జరుగుతోంది. కానీ.. ఇంత మాట్లాడుతున్న నువ్వు కూడా మారడం లేదు. చూసావా?' - అన్నాడు ప్రశ్నిస్తున్నట్టు శివం.

అప్పుడే వర్షం మొదలవుతోంది..సన్నటి గాలి ఏదో అంటోంది.

సమాధానం నీకు తెలిసిందే. నేను చెప్పిందే. "నేను బ్రతకాలి" నేను అంటే నా కుటుంబం. నేను అంటే నా వాళ్ళు . నేను అంటే నా ఆశలు. నేను అంటే నా భయాలు. నేను అంటే నా అహం. నేను అంటే ఒక చట్రం. నేను అంటే ఒక వ్యసనం.

ఇద్దరి మద్య ఒక క్షణం నిశ్శబ్దం మెదిలింది. విపరీతమైన గాలి. చినుకులు పెద్దవి కాసాగాయి.. చుట్టూ విద్యుత్ ఆగిపోయింది. చంద్రుడు ఆ మెడ మీద ఒక కొత్త దీపం వెలిగించాడు.

చూసావా ఇప్పుడు నీళ్ళు కలుపుకునే పని తప్పింది మనకి.. ఒక రకమైన నవ్వు నవ్వాడు సత్యం.

ఒక వేళ నీళ్ళు ఎక్కువైతే .. భుజలేగారేసాడు శివం .

మత్తు మనం కలుపుకుందాం.. గట్టిగా నవ్వాడు సత్యం. మంచి ఆలోచనే కదా..??


2 comments:

  1. @శివ
    నువ్వు రాసే చాలా కథల్లో, ఎదో తెలియని మరియు అంతు చిక్కని వేదాంతం, నైరాస్యం నాకు కనిపించాయి. అల జరగడం కేవలం నా గ్రాహ్యత కావొచ్చు.
    ఈ కథ లో కూడా లైఫ్ ఈస్ ఎ కాంప్రమైస్ అనే సత్యాన్ని చక్క గా చెప్పావ్..

    ReplyDelete
  2. ప్రస్తుత తెలుగు సినిమా స్థితి వెనకాల ఉన్న నిజాల్ని చెప్పే ప్రయత్నం చేశారనుకుంటా. కథ ఓపెనింగ్ లో తొడిగిన మొగ్గ కథలోపల పుష్పించలేదు. దాంతో ఫలం దక్కలేదని నాకనిపిస్తోంది.

    ReplyDelete