Tuesday, February 14, 2012

సముద్రం ...
ఎప్పుడో ఓ సారి నా రాతలు ఆగిపోదామనుకుంటాయి ..
అప్పుడే నువ్వు తారస పడతావు..
ఒక చల్లని స్పర్శలా

నీ గొంతులో తెలియని అందమైన సంగీతం
చీకటిలో మెరుపు తీగలా కదలిక
చూడాలి చూడాలి అనిపించే నువ్వు
మొత్తం గా ఏదో మాయ జరుగుతుంది..

అప్పుడే అమాంతం నా చుట్టూ నీ నీలం రంగు తెరలు చుట్టేస్తావు..
నా నిండుగా నీ మాటలు నింపేస్తావు ..

ఈ తీరం నుండీ నువ్వు ఎక్కడ వరకూ పరచుకుని ఉన్నావో
అక్కడాకా నీతో నన్ను తీసుకుని వెళ్తావు..

ఆగని మన నవ్వులు ..
ఇసుకలో కాలి గురుతులు
సాగిపోయిన గాలి కబురులు
నువ్వు పరిచయం చేసిన స్నేహితులు..
నేను పంచుకున్న నా జ్ఞాపకాలు
కాలం కాసేపు తీసుకున్న విరామం
దగ్గరగా దూరంగా
వెళ్ళమని వెళ్ళద్దని అల్లరి చేస్తూ నువ్వు..
చూస్తూ చూస్తూ వదిలి వెళ్ళలేని నేను..
అలా ఎంత సేపు ఉన్నానో నీతో ...
గురుతు జేసుకుంటూ మళ్ళీ ఏవో కాగితాలు నింపడం మొదలు పెడతాను..

నిజం చెప్పనా?
ఇప్పుడు కూడా నాకు నీతోనే ఉన్నట్టు ఉంది


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

2 comments: