
మబ్బులు చిక్కి పోయి..
ఆకాశంలో రంగులు మారుతున్నాయి..
అలసిన వర్షం విశ్రాంతి తీసుకుంటోంది..
అప్పుడప్పుడే బయటకొస్తున్న సూర్యుడి వెలుతురు కళ్ళను గుచ్చుతోంది.
గాలి బరువెక్కి ..
చలిని కదలనివ్వడం లేదు..
వాతావరణం ఒక పరిమళాన్ని అద్దుకుంది..
అటు ఇటు గా.. ఏదో ఒక ఆవిరి ఊపిరి కదలికలని బయట పెడుతోంది..
ఓ చిన్న మొలక మీద మిగిలిన ఆఖరి నీటి చుక్క..
ముత్యం లాగ మెరుస్తోంది..
ప్రపంచం లో మిగిలిన విలువైన ఖజానా ఇదే అన్న అనుమానం వచ్చేట్టు!
వాన వచ్చి ప్రవహించిన నేల..
మట్టిలో ఒక అచ్చువేసింది..
ఇదే విశ్వాన్ని దర్శింపజేసే గొప్ప చిత్ర రాజమేదో చూపిస్తున్నట్టు!
అక్కడక్కడ నిలిచిపోయిన నీటి చుక్కలు ఒక చోట చేరి..
పైనున్న ఆకాశాన్ని ప్రతిబింబిస్తున్నాయి..
ఎక్కడైనా ఇంత కన్నా.. అందమైన పగిలిన అద్దం దొరకదేమో!
సన్నటి.. చల్లని నీటి తుంపరలు..
ఒక మృదువైన వెచ్చని స్పర్శను గురుతుకు తెస్తున్నాయి..
అనేకానేక మార్లు అందే .. ప్రియురాలి మొదటి ముద్దు బహుశా ఇదే కావచ్చు !
నేల మీద మెరుపులు..
నీటి అడుగుల చప్పుళ్ళు..
తయారు చేయని అత్తరు వాసన..
అలజడిలో ఒక ఆనందం..
ఎంత గొప్పది ఈ సన్నివేశం.. ?!
దర్శకుడా నీకు జోహార్లు..
నన్ను ప్రేక్షకుడిని చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు..
*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.
Thursday, January 5, 2012
ఎంత గొప్పది ఈ సన్నివేశం.. ?!
Posted by శివ చెరువు at 10:16 AM
Subscribe to:
Post Comments (Atom)

1 comments:
అందమైన ప్రకృతి దృశ్యాన్ని మీరు మరింత అందమైన అక్షరవర్ణచిత్రంలా చిత్రించి మా కళ్ళకి చూపించినందుకు మీకు కృతజ్ఞతలు. చాలా చాలా బాగుంది. :)
Post a Comment