Thursday, December 13, 2012

నా విడుదలకు నోచుకోని చిత్రాలు.. ;)

కారణాలేమైనా... కొన్ని అనుకున్న కధలు.. రాసుకున్న నా కధలు, కాగితాన్నెక్కినా కెమెరా దాటి పూర్తిగా బయట పడలేదు..

వాటి పేర్లు..

1. Ctrl + Z
2. పోస్టు చెయ్యని ఉత్తరం
3. బ్లాక్ అండ్ వైట్
4. మరణం తరువాత - after death
5. చూస్తున్నావా?
6. నువ్వు, నేను - ఈ సమాజం..

సరే... మీలో ఎవరైనా "నటన మీద ఆసక్తి ఉన్న వాళ్ళు" అయినా, "వీడియో ఎడిటింగ్ తెలిసిన వాళ్ళు / నేర్చుకున్న వాళ్ళు" అయినా.. " వాయిస్ రికార్డింగ్ టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు " అయినా  ఉంటే ఒక మంచి కధ ఉన్న షార్ట్ ఫిలిం లో మీరు వర్క్ చేద్దాం అనుకుంటే.. మీ ఈమెయిలు ID గాని ఫోన్ నెంబర్ గాని ఇక్కడ కామెంట్స్ లో పోస్ట్ చెయ్యండి...

మీ వివరాలు (Comments) గోప్యం గానే ఉంచబడతాయి... నేను పబ్లిష్ చెయ్యను...

మీరు పంపిన వివరాల ద్వారా నేను మిమ్మల్ని కాంటాక్ట్  చేయగలను..

PS : నేనే నా ఈమెయిలు ID ఇవ్వచ్చు కాని నాకు మెయిల్ ఇన్కమింగ్ outgoing సర్వర్ తో ఏదో ప్రాబ్లం ఉంది.. సో.. నేను నా మెయిల్స్ మిస్ అయ్యే chances కూడా ఉన్నాయ్..


Monday, December 10, 2012

నువ్వు లేకుండా మిగిలిపోయాను..ఇంకా అడుగులు ఆగనిదే
ఇంకా మాటలు పూర్తవనిదే
యెందుకు మాయమైపోయావ్?
నువ్వెందుకిలా చేసావ్?

వెలుగు రాలిపోలేదు
చీకటింకా రాలేదు
యెందుకు కనపడకుండా పోయావ్?
నువ్వెందుకిలా చేసావ్?

తోడుంటావనుకున్నాను..
దూరమైపోయావ్
వెళ్ళిపోయి భారమైపోయవ్
నాకై నన్నొదిలేసావ్

నువ్విక రాలేనన్నావ్
నన్నిక రావొద్దన్నావ్..
జ్ఞాపకాలు పడేసి చాల్లే పొమ్మన్నావ్..
నువ్వెందుకిలా చేసావ్?

యే మనిషిని కలిసినా.. యెక్కడకి వెళ్ళినా.. యేం చూసినా
ప్రతివొక్కరూ...
నువ్వు లేవని గురుతుచేస్తున్నట్టే వుంది..
మాటి మాటికీ వెక్కిరిస్తున్నట్టే వుంది

రాతిరి చంద్రుడు రావడం లేదు
పగలు సూర్యుడిని చూడడానికి నాకు ధైర్యం చాలడం లేదు

నచ్చినా..
నచ్చకపోయినా..
దిక్కులేక ..ఏ దిక్కున నువ్వు లేక..
చీకటినే చూస్తున్నాను..

మనసు చెప్పుకునేందుకు.
కోప్పడేందుకు..
కష్టం గుప్పిట విప్పుకునేందుకు..
కన్నీళ్ళో చ్చేదాకా  నవ్వుకునేందుకు..
కలిసి సచ్చేటందుకు..
ఎవరున్నారిప్పుడు?

నిజం చెప్పు.. !
నీకు మాత్రం తెలియదా..?
నువ్వు, నేను అని రెండు గా లేమని..?
తెలిసీ.. నువ్వెందుకిలా చేసావ్?

పాపం నువ్వేం చేస్తావ్ లే ?
నీ నూకలైపోయాయి...
వెళ్లిపోయావ్? 

నేనే..
ఏదో పాపం చేసుంటాను..
అందుకే..
నూకలు దాచుకుని ..
నువ్వు లేకుండా మిగిలిపోయాను..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, November 19, 2012

ఇలా అనిపించింది.. 2 - భయం...రక రకాల భయాలు..

ప్రతిదానికి కాక పోయినా. తరచూ ఎదో ఒక విషయంలో మనిషి భయపడుతూ ఉంటాడు.. అనుకున్నది అవదనో.. లేకపోతే..! నచ్చింది జరగదనో...!

మనిషి ఇష్టా ఇష్టాలు లేకుండా ఉండలేడు.. ఏదీ ఆశించకుండా బ్రతకలేడు.. కనుక ఎదో రకమైన భయం తప్పనిసరి.. ఎందుకంటే.. ఏదైనా కావాలనుకున్నపుడు దాని ప్రత్యుత్పత్తులు లేకుండా అది దొరకదు కదా..!?

కొసమెరుపేంటంటే... ఒక్కోసారి భయం మంచే చేస్తుంది..


Friday, November 16, 2012

రవి కాంచనిది కవి కాంచును ..

అలా వీధిలో పోతున్నా..
ఇంట్లో వార్తలు చూస్తున్నా..
ఆఫీసులో పని చేస్తున్నా..
వంటింట్లో వాసనలు ఘుమ ఘుమ లాడినా..
నిద్రలేస్తాడు....

వీడికి పగలు లేదు.. రాత్రి లేదు..
నలుగురున్నా.. ఒంటరిగా పడున్నా తేడాల్ తెలీదు..
ఓ 'మాట'నేస్తాడు .. చేతులు దులిపేసుకుంటాడు. 

అక్కడెక్కడో నక్షత్రాలు..
ఇంటెదురుగా   ఒక అమ్మాయి..
బస్టాపులో బిచ్చగత్తె ..
సినిమా హాలులో సిగరెట్టూ ..
రాసి పాడేసిన పుస్తకం..
గాలికెగిరే కాగితం..
గొంతు దిగని కంద కూరా..
దిక్కుమాలిన జీవితం...
అన్నీ కావాలి..
వెధవకి ..

ఒక నిమిషం ఆగలేడు..
అర క్షణం ఆలోచించుకోనీడు ..
ఆత్రం పీనుగ ..
 
ఎంతసేపూ ఒకటే..
చెప్పేసుకుందామని..
కక్కేసుకుందామని

పాపిష్టి తాపత్రయం..

చరిత్ర..
దేశ కాల పరిస్థితులు..
నేమాని వారి పంచాగం..
బ్లా(బా)గుకొచ్చే బంధు మిత్రులు 
గుమ్మం దగ్గర పిల్లి..
దయతలచిన విధ్యుత్ విభాగం..
 ఏం జరుగుతోందో తెలీని ఒక హఠాన్ పరిణామం ..
 
గోడెక్కి కూచున్న ఆలోచనలు..
అటో ఇటో పడి...
అక్షరాలై కాగితాన్ని ఆశ్రయిస్తాయి..
కొన్ని పదాలు పుట్టి..
చూస్తుండగానే..పెరిగి పెద్దవవుతాయి..
ఓటు హక్కు సాధించినట్టు తలెగరేస్తాయి..
ఊర్లేలినట్టు..
ఊరెరిగింపు కు బయలుదేరతాయి..

అప్పుడు గానీ..
వాలంటరీ రిటైర్మెంటు తీసుకుని..
కుదుట పడడు..  ప్రాణి..


వయసైపోయినా.
పని లేక పోయినా..
పోడు.. అక్కన్నించీ..
పోనీ పైకీ పోడూ ..
పాడు తృష్ణ 
మళ్ళీ మళ్ళీ వెనక్కొచ్చి

తను రాసిన ఘన కార్యాన్ని చూసుకుని..

చేతి లోకి తీసుకుని మురిసిపోతుంటాడు..
ఒకింత కంట తడి పెట్టుకుంటాడు..

పిచ్చి నాయన..
ఎలా బతుకుతాడో..ఇలా అయితే.. !!!!


Wednesday, November 7, 2012

నిన్నటి రోజు..!

..ఒక జ్ఞాపకం..
ఒక గడిచిపోయిన నిజం..
నిన్నటి రోజు..!

చెప్పలేని సంతోషం
చెప్పుకోలేని కష్టం
రెండూ భాగాలే అందులో..

ఎలా చూసినా ...!
వెళ్ళిపోయిన ఆరోజు ఎందుకో
ఇంకా గొప్పగానే కనపడుతోంది..
అది నాదేనని ఇంకా గర్వం గానే ఉంటుంది..

ఏం చెప్పను..?
ఎంత చెప్పినా ఇంక దాచుకోలేను
ఎంత అరిచినా మర్చిపోలేను

ఆరోజుకి...
ఈ రోజుకీ నేనంటే ఇష్టం.. కాబోలు..
అందుకే మళ్ళీ మళ్ళీ వెనక్కి పిలుస్తుంది..

చిన్న పాపలా...
అందమైన అమ్మాయిలా...
అమ్మలా

హితునిలా..
తిరుగుబాటుదారునిలా
దేవుడిలా...

వధువులా
క్రతువులా
నా ఏకైక శత్రువులా

Saturday, October 27, 2012

ఇలా అనిపించింది.. 1మనకు ఉన్న శక్తీ సామర్ధ్యాలను గానీ .... మనం శిక్షణ ద్వారా అలవర్చుకున్న ఏదైనా నైపుణ్యాన్ని గానీ.. ఏమైనా గాని భగవత్ ప్రసాదం గా స్వీకరించాలి. అది ప్రసాదితము అనే జ్ఞాపకము ఎప్పుడూ లోపల తిరుగుతూ ఉంటే అది నేనే... ఇది నేనే.. అని మనలని మనం అనవసరంగా వేటితోనూ రిలేట్ చేసుకోకుండా సహాయ పడుతుంది.. గర్వాన్ని మనకి దూరాన పెడుతుంది..

Monday, October 22, 2012

నేను రాసి పాడిన పాట..

నేను రాసి పాడిన పాట..Original song is from Kannada movie ""Yello malayagithe "" This is not a translation just own lyrics for a pre - composed tune. I know there will be hell out of mistakes in singing.. as I am not a singer :).

Monday, October 15, 2012

ఈ రోజు యుద్ధం ముగిసింది..ఒక నేను కి , నేననుకునే నా ఇంకో నేను తో
ఎక్కడలేనీ యుద్ధాలు లోపల..

ఏదో వద్దని..
ఇంకేదో చేద్దామని..
జఠరాగ్ని గూర్చీ
మోహపు మాయ గూర్చీ
జిహ్వ గూర్చీ
ఆయనాల గూర్చీ.
అనయనాల గూర్చీ
అనన్యాల గూర్చీ
అన్యముల గూర్చీ
ఇదే నేనని.. ఇదీ నేనేనని..
ఒకటే.. ఒకటే.. గొడవ..

రోజూ యుద్ధం జరుగుతూనే ఉంటోంది..

ఏదో కాలుతున్న వాసన..
ఏమిటది..?
మెదడేమో?
లేదు గుండె కూడా కావచ్చు..!

ఏదో మసి పట్టిన సూచన..
ఏమిటది..?
ప్రతిదీనా?
లేదు చూసే కన్నులు కూడా కావచ్చు..!

ఏదో బూడిదయిన నిరూపణ..
ఏమిటది..?
నా దృష్టిలో నువ్వేనా..?
లేదు నేను కూడా కావచ్చు..!

ఎవరో రంగులు వదిలి తెల్ల చీరలు చుట్టుకుంటున్నారు..
ఎందుకని?
నన్ను నమ్ముకున్నందుకా?
లేదు నన్ను అమ్ముకుందుకు కూడా కావచ్చు..!

ఇక్కడే ఎక్కడో ఇందాక శబ్దాలు వినపడ్డాయి..
ఏవిటవి ?
నన్ననుసరించే అడుగులవా?
లేదు అవి నా ఆఖరి కదలికలు కావచ్చు..!


వెళ్లి పోతున్నాను.. వెళ్లి పోతున్నాను..
నా గుడ్డి ఆలోకనలతో ..
జరిగిన నా ప్రయాణాన్నీ వెలివేస్తూ వెళ్ళిపోతున్నాను..
వెనక్కు రాకూడదని.. వెళ్ళిపోతున్నాను..

వెక్కిరించే నా బూడిదని చూడలేక వెళ్ళిపోతున్నాను..

నా అతిశయాలను నిరూపించుకోలేక దూరంగా పోతున్నాను..
సిగ్గుతో పారిపోతున్నాను..

ఈ రోజు యుద్ధం ముగిసింది..
నేను ఓడిపోయాను..*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.Sunday, September 23, 2012

'అవును' సినిమా చూసారా?


'అవును' సినిమా చూసారా?

చూడక పోతే చూడండి.. మీరు హర్రర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్ట పడే వారైతే.. ఈ సినిమా మిమ్మల్ని కంప్లీట్ గా entertain చేస్తుంది.. వాళ్ళు బాగా చేసారు. వీళ్ళు బాగా తీసారు.. సినిమా కధ ఇది అని చెప్పను గాని.. ఒక్క మాటలో నేనేమి చెప్పాలనుకున్నానో చెపుతాను.. అర్జెంటు గా రవి బాబు దగ్గర అసిస్టెంట్ అయిపోవాలి అనిపించింది. ఇంత వరకూ ఏ సినిమా కీ నేను భయపడ్డట్టు గుర్తులేదు.. కానీ ఈ సినిమా కి భయ పడ్డాను.. అలా ఇలా కాదు.. అయిపోతే పోదాం రా బాబూ.. ఏం చేస్తాడో ఏంటో.. అన్నట్టు.. 

ఒక low budget సినిమాని .. పెద్ద cast లేకుండా.. ఇంత బాగా ఎలా తీయగలరు.. ? ఎంత బుర్ర చించు కున్నా ఇంకా అర్ధం కావడం లేదు..

ఒక కొత్త సినిమా చూద్దాం అనుకుంటే.. కొత్తగా ఉన్నది చూద్దాం అనుకుంటే.. ఆలోచించకండి..

You are going to LOVE this.........!


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, September 17, 2012

అసలు నువ్వు నాకేమౌతావ్?


సంధ్యను తుంపేస్తావ్
ఆదిత్యుడిని పని మాన్పించేస్తావ్..
రేచుక్కలు నా కంటికి కట్టేస్తావ్..
నిశ్చలంగా..
నిర్ధయగా..
నిరాటంకంగా..

నిన్నడిగానా?
పిలవమని...
కలవమని..
చూడమని.
నన్ను చంపమని

నువ్వొక..
ప్రమాదం

నువ్వొక..
మళ్ళీ మళ్ళీ పేలే మందు పాతర

నువ్వొక..
తీసుకోలేని నిజం
దాచుకోలేని నైజం
నా మనసుకి

యెందుకిలా..?
యెందుకిలా..!
అగ్ని వేదిక కు ఆహ్వానం పలుకుతావ్..
విశ్వ వ్రుష్టి ని తీసుకొస్తావ్
నా మీద పగ పడతావ్
నన్నింతగా భయపెడతావ్

సంకెళ్ళు చుడతావ్
స్వాతంత్రం ప్రకటిస్తావ్
మాటేసి.. ఒక మాటేసి..

కవ్విస్తావ్
కన్నెగరేసి

ఎర్రనీ పెదాల మధ్య
నా లోచనలు ముంచేస్తావ్..

దూరంగా జరిగి వెక్కిరిస్తావ్

ఉరి తీస్తావ్
బ్రతికిస్తావ్
ఓ సారి చూసేసి మళ్ళీ నవ్వేసి

నన్నెందుకిలా వేధిస్తావ్?
నాకెందుకిలా అనిపిస్తావ్?
నన్నింతగా సాధిస్తావ్?

చూస్తూ
చూస్తూ
పూర్తిగా చుట్టేస్తూ?
ఇంతకంటే నన్నేం చేస్తావ్?
అసలు నువ్వు నాకేమౌతావ్?


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Friday, September 14, 2012

గట్టిగా అరిచి చెప్పు నన్ను మళ్ళీ అడగొద్దని..


వైకుంఠం.. కైలాసం ..
ఎక్కడో.. ఎక్కడో!!
ఇక్కడ మాత్రం ఒకటే .. పాతాళం ..

ఏదేదో కావాలని
తామేదో అవ్వాలని
దేవులాడే..
దేవురించే..
నల్ల దివ్వెల మధ్య

ఎవరు ఊడుస్తారు? పోసిన చీకటి రాసులని
ఎవరు ఏరుకొస్తారు.. ? రాలిపోయిన సూర్యుడి రెక్కలని..

ద్వంద్వం .. ద్వంద్వం ..
లోపలా.. బయటా..
ఎక్కడ చూసినా.. ద్వంద్వం ..
అంచనాల మధ్య..
అవసరాల మధ్య..
భూమ్యాకాశాల అంత

పేరుకే ..
ఊరికే ..
మాటలూ, ప్రగల్భాలూ.. అతుకుల చేతలూ
సంజాయిషీలుగా నామమాత్రపు చేవకు..

పోలికలు
ఒకరి చక్కెరల అక్కరలు
కారణాల కర్మాగారాలు..
అదుపుతప్పిన వాక్కు వరసలు
విసృఖలంగా దిక్కులకు పోయే దృక్కులు  
ఒప్పులు తూచే తప్పుడు తూకాలు
చెప్పుకుంటూ పోతే .. తప్పినవెన్నో లెక్కలు!

ఎవడొస్తాడు..?
ఎవ్వడూ రాడు!
ఈ కంతలని పూడ్చడానికి
ఈ వ్యత్యాసాలకి చితి పేర్చడానికి 

ఆలోచించావా ఎపుడైనా..?
ఉన్నాడా.. అని ??
నువ్వూ నేనూ తిరిగే ఈలోకంలో..
నేను నేను అనే లోకుల్లో!
అంతటి వాడు..

చెప్పు..
అనిపించిన
ఆ నిజం చెప్పు
నిజం చెప్పు..
లేడని..

గట్టిగా అరిచి చెప్పు
నన్ను మళ్ళీ అడగొద్దని..


 *picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Sunday, August 19, 2012

నేను నీకు పోలికలు తేలేను

కవులు అమ్మాయిలను ఎందుకు ఎక్కువగా కవితా వస్తువుగా తీసుకుంటారో నాకు మునుపు అర్ధం అయ్యేది కాదు...
ఈరోజు నిన్ను చూస్తున్నపుడు అర్ధం అయ్యింది.

వాళ్లకి మాటల్లో చెప్పడానికి సరిపోనంత..
వ్యక్త పరచడానికి చాలనంత..
అనుభూతి మిగిలిపోయి ఉంటుంది.

ఏ ఉపమానం తీసుకున్నా ఎంతో కొంత లోటు..
ఎంత అద్భుతాన్ని తీసుకొచ్చినా ఇంకా ఏదో కొరత..
ఎన్ని ఆశ్చర్యాలను పోగుచేసినా సరిపోని కొలత..
ఏం చేస్తారు వాళ్ళు మాత్రం..!?!

ఏం చేస్తున్నాను నేను మాత్రం..?!
నిన్నటికన్నా.. ఈ రోజు నువ్వు మరింత అందంగా ఉన్నావని
ఏరోజుకారోజు అనుకోవడం నాకు అలవాటయిపోయింది..

చెపితే నమ్మవు కానీ..!
నీకై నేనెదురు చూసినపుడల్లా..
నిన్ను క్షణం చూసినా చాలనుకుంటాను
చూసిన ఆ క్షణం మాత్రం.. నన్ను మరొక్క క్షణమని బ్రతిమాలుతుంది
అక్కడినుండీ క్షణాలు.. నిమిషాలై.. రోజులైనా..
నాలో అదే ఆత్రం.. నిన్ను తలుచుకుంటూనే ఉంటుంది..

గడ్డి పూలు..
సన్నని, చల్లని,  గాలిలో వర్షపు తుంపరలు..
సముద్రం దగ్గర శభ్దం
కోరుకున్న నిశ్శబ్దం
నచ్చిన పుస్తకం
శాస్త్రిగారి పాట
అలసినప్పటి నిద్దుర
ఇవన్నీ ఒప్పుకున్నాయి.. నేను చెప్పింది నిజమేనని

ఎందుకని అడగద్దు.. గానీ..
ఆ ఒక్క మాట నీకూ చెపుతాను
"నేను నీకు పోలికలు తేలేను"
 

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Sunday, July 15, 2012

అందుకే నువ్వు నన్ను.. మళ్ళీ.. మళ్ళీ చూస్తావు..ప్రతి రోజూ నీవిచ్చే ఉదయం కోసం..
రాతిరి నువ్వొచ్చే కలకోసం..
ఎదురుచూస్తుంటాను..

నీ ఆలోచనలలో నేను ఉన్నానా..? అంటూ..
నాలో ఓ శబ్దం ఎప్పుడూ ధ్వనిస్తూ ఉంటోంది..
ఏం? చెపితే దాన్ని ఆపగలను?
అయినా ఆపుదామనుకున్నపుడల్లా.. ఏం జరుగుతుందో తెలుసా?
సరిగ్గా అప్పుడే..!
ఉసిగొల్పుతున్నట్టు.. ఎక్కడికో నెడుతున్నట్టు.. నీవైపే లాగుతున్నట్టు.
నువ్వు ఓ చూపు విసురుతావు..
నిజం తెలియదు నీకు..
అది నన్నేం చేయగలదో..

నాలోని ఆనందం పూర్తిగా.. అమృతం తాగేస్తుంది..
లక్షల కోట్ల తరంగాలను లేవదీస్తుంది..
ప్రతీ క్షణం ఒక అద్భుతం..ఒక ఆశ్చర్యం.. సృష్టింపబడుతుంది ..
ఇక ఆగదు.. అక్కడినుండీ నాలో నేనే నవ్వుకోవడం .. నీతో నా ప్రయాణం

తలుచుకున్నపుడల్లా..
గడ్డి పూవులాగా..
వర్షపు వాసన లాగా..
అద్దం పై. ఆవిరి చారిక లాగా..
నేలపై నీటి అద్దంలాగ..
ఎంతందంగా అనిపిస్తావో నువ్వు..
నా మాటల్లో చెప్పలేను..

నీవేనుకే నా అడుగులను..
పరిగెత్తే ఆలోకనలను
ప్రతిచోట నిను చూసే నా కనులను..
నీనుండి యెలానూ దాచలేను..
నా ప్రతి ఒక్క మాటలోనూ
నీవు నాకేమిటో చెప్పకుండా ఉండలేను..

నాకు తెలుసు..
చీకటి రంగును పూసుకున్న నీ నీడ కూడా..
నా కళ్ళలో ఎంత వెలుగును నింప గలదో నువ్వు చూసే ఉంటావు....

అందుకే నువ్వు నన్ను..
మళ్ళీ.. మళ్ళీ చూస్తావు..


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.


Saturday, June 30, 2012

నేనో ఖాళీగా ఉన్న కవిని..

నేనో ఖాళీగా ఉన్న కవిని..
ఊసుపోక ఊరికే ఏదో రాద్దామనుకున్నాను..
మరీ ఏదీ రాయక పోతే..
కవిని కూడా కాక.. ఖాళీ వాడినైపోతాను ..
అందుకే
ఒక కాగితం తెచ్చుకున్నాను..
ఒక కలం వెదుక్కున్నాను ..
భగవంతుని వేడుకున్నాను..

దేశ కాల పరిస్థితుల గురించి..
మనుషుల గురించి..
అమానుషాల గురించి..
మానాల అవమానాల గురించి..
ప్రేమ గురించి.. పనికిమాలిన విషయాల గురించి..
అన్యాయాల న్యాయాల గురించి..
కారణాల అకారణాల గురించి..
ఏదో ..
ఏదో..
రాద్దామనుకున్నాను..

ఏమీ తట్టని నేను..
ఖాళీగా ఉన్నా కవినే..!
పరవాలేదులే, ఏదో ఒకటి ! పద ! అని ..
పదాలు కలపడానికి తయారయ్యాను..
అయినా చదివే వారు లేని అనాధ కవితలకి
కంటెంట్ ఏదైతే ఎవరికీ కావాలి?

కాగితానికి కలాన్ని అంటించాను..
కాలమెంత కదిలినా..
ఎంత ఒత్తినా ..
అక్షరం పుట్టదే..?
అంతంత మాత్రమైనా అడుగేయదే..
జిగురంటుకున్నట్టు..
ఒట్టు పెట్టుకున్నట్టు..!

ఆశ్చర్యంగా...
ఎక్కడో ఒక చిన్న అలికిడి మూలుగుతున్నట్టు...
చూద్దును కదా కాగితం ఏడుస్తోంది.

ఏం జరిగిందని అడిగాను..
కలం కాలం చేసిందని చెప్పింది..
శవాన్నించి కూడా ఏదో ఆశించే నన్ను చూస్తే నాకే జాలేసింది..
ఆ క్షణం నన్నెవరో కొట్టినట్టనిపించింది..

దెబ్బ కనపడదు....
ఈ గాయం ఇక మానదు..
మిగిలిన కన్నీటిని సిరాగా మార్చినా
రాసేందుకు కలం తిరిగి రాదు..

అందుకేనేమో.. నేను ఖాళీగా ఉండిపోయాను..
అయినా నేనో కవిని..
ఆశ్చర్యం..!!!*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Thursday, June 21, 2012

ఇది కదా జీవితం..!


 
 
కొంత కాలం
కొన్ని  నిజాలు కొన్ని అబద్దాలు..
కొన్ని అనుభవాలు..
కొన్ని సన్నివేశాలు
నిండిన కొంత మంది మనుషులు..
ఇదేగా జీవితం..


కొంత కాలం
కాసిన్ని నమ్మకాలు..
లోపల కొన్ని భయాలు..
అణచలేని ఆవేశాలు..
నవ్వుకునేంత అమాయకత్వం
దాచుకోలేనంత ప్రేమ
ఇదేనేమో జీవితం..

ఎప్పటికీ 
ఒక నవ్వు..
ఒక తోడు..
కొంత ఆనందం..
కాసింత సంతృప్తి..
అప్పుడప్పుడూ.. ఎప్పుడూ.. నేను లేని నేను..
ఇది కదా జీవితం..!
*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, June 11, 2012

నువ్వు నాకు.. ఒక వ్యసనానివి..నువ్వు నాకు..
ఒక అందమైన సమస్యవి..

చేరాలనిపించే నరకం..
కావాలనిపించే వ్యసనం..
చెయ్యద్దనుకునే ఒక తప్పు..
నువ్వే నాకు..

రావాలనిపించే వేసవి
నేనెదురుచూసే చీకటి..
వద్దనిపించే ధ్యాస ..
నాలో ఈ ద్వంద్వం
నీవల్లే..

వడగళ్ళ వాన
నిశ్శభ్దపు భంగిమ
అర్ధం తెలియని మననం 
తప్పుకోలేని వాస్తవం
తప్పని ఇష్టం
ఇదే నాకు నువ్వు..

వద్దు వద్దు అనుకునే..నువ్వు ..
వద్దనుకున్నపుడల్లా దగ్గరగా అనిపిస్తావు..

కావాలనిపించే నువ్వు..
అంతకు అంత దూరంగా నిలబడతావు..

ఒక "అవును".. ఒక "కాదు" మధ్య..
ఎప్పుడూ నువ్వే కనిపిస్తావు..

ఒక తట్టుకోలేని ఆనందం..
ఒక తరమలేని భాధ..

నాతో..
నాలో..
నేనై..
ఒక నువ్వు..


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, May 23, 2012

నీవు లేని నేను.. నేను లేని నీవు..ఎటువంటి ప్రమాద హెచ్చరికలు లేవు..
ఏదో జరుగుతుందనే లెక్కలూ లేవు..
మరి ఎందుకిలా అయ్యింది?
మనం ఎందుకు విడిపోయాం..?

ఎటువంటి స్పర్దలు లేవు..
వెనుక ఏదో దాచుకున్న పరదాలూ లేవు..
మరి ఏం జరిగింది?
ఒకరికొకరు ఇలా లేకుండా పోయాం?

పెంచిన దూరం..
ఏమిచేసుకోను?

మిగిల్చిన శోకంలో
ఏమైపోను?

పగిలిపోయిన అద్దానికి..
కాలిపోయిన జీవితానికి ..
మిగిలిపోయిన గురుతులను
ఏమని దాచుకోను?

మూసుకు పోయిన ఖంఠానికి
కూలిపోతున్న ఈ శిధిలానికి
కొత్తగా ఇంకా..
ఏం మెరుగులు కోరుకోను..?

వెళ్ళిపోతున్నానని ఒక్కమాట అనలేదే?
వస్తున్నావా అని ఒక్కసారైనా అడిగి చూడలేదే?
నువ్వు!!

ఈ నరకం చూడలేక..
ఈ శవాన్ని ఉరి తీయలేక!
నీవు లేక..
నాలో నేనే మాట్లాడుకుంటున్నాను
ప్రశ్నలు వేసుకుని సమాధానాలు దొరకక నన్ను నేనే నిందించుకుంటున్నాను..

నీవు లేని నేను..
ఇలా వున్నాను..
నేను లేని నీవు
ఉన్నావో లేదో?
నాకు తెలియదు..


బాగున్నావని అనుకోని.. స్వాంతన చెందనా?
ఏమయ్యావో నని మరింత మధన పడనా.. ?
ఇంతకంటే బాధకు నిర్వచనం ఉంటుందా?

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, May 14, 2012

అలా.. అలా.. అలా.. అని..నిన్న ఇంటిముందు అతుకుల బొంత కట్టుకున్న ఓ ముసల్ది అడుక్కుంటోంది..
రాతిరి కంట్లో ఓ యువతీ నగ్నంగా కదుల్తోంది..
ఇద్దరూ స్త్రీలే..!
ఎవరి గురించి రాయాలి..?
ఏమని రాయాలి..?

కళ్ళముందే సగం చిరిగిన శ్రీ శ్రీ రచనలని సెకండ్ హ్యాండుకు కొనుక్కున్నాడెవడో  ..
శభ్ధభేరికి స్పీకర్లు తగిలించి బూతు పాట వింటూ.. నవ్వుకున్నాను..
రెండూ సాహిత్యాలే..!
ఎవరి గురించి రాయాలి..?
ఇప్పుడేమని రాయాలి..?

ఒళ్ళు విరుచుకుని రక్తాన్ని రూపాయిగా మార్చుకుంటున్నాడెవడో..
అద్దాల మేడల్లో, చలువ రాతి బండల్లో, నన్ను నేను సమాధి చేసుకుని శయనిస్తున్నాను ..
అటూ ఇటూ.. మనుషులే..@!
ఎవరి గురించి రాయాలి..?
ఎలాగ రాయాలి..?


కసిరే.. కొరికే..కత్తులు దూసే ఒకరి పిలుపు ..
కాల్చే.. కదిల్చే.. కన్నీరు దాచే.. ఒకరి మౌనం.
ఈ భారాల దూరాల.. మధ్య..!
ఎవరి గురించి రాయాలి..?
ఏమైందని రాయాలి?

కోరిన కోర్కెలు తీర్చే దైవం ఒకటి..
నచ్చిన చట్టం రాసే దెయ్యం ఒకటి..
నాణేనికి చెరొక వైపూ నేనే..!
ఎవరి గురించి రాయాలి..?
ఎటువైపు రాయాలి?

నాలో లేనిది నేను చూడలేను..
నేను కానిది అనుభవంలోకి తేలేను.. అనుభూతి చెందలేను
అందుకే నాగురించి రాస్తాను..
ఇప్పుడు నాలో ఓ కోణాన్ని ఆవిష్కరిస్తాను..

అయినా..!
నా ఖంఠం పెద్దదవ్వాలని..
నా కలం కదిలించాలని..
ఎవరో ఎందుకు కలగంటారు..?
నా అక్షరాలను తరచి తరచి చదవాలని..
ఎవరో ఎందుకు తపస్సు చేస్తారు..?
నేనెవరో వాళ్లకు తెలియదు..
కనీసం కన్నెత్తైనా చూడరు.. నన్ను
నాకు తెలుసు..!

ఇది నేనేమిటో చెప్పుకోవాలన్న నా తాపత్రయం..
అంతే..
అందుకే..
ఎప్పటిలా అందంగా ఒక అబద్దం రాసేస్తాను..
జీవితం అందమైనది.. జీవించు.. అని..
నీవు నేను వేరు కాదు.. ప్రేమించు.. అని..

అలా..
అలా..

అలా..
అలా..

అలా..
అలా..

అని..


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.


Thursday, April 26, 2012

నీకు అర్ధం అయ్యింది కదూ..!?
నువ్వు గురుతుకు వచ్చినపుడల్లా..
నిన్నటి రోజును చూస్తాను.
నీతో ఉంటాను..

నువ్వు గురుతుకు వచ్చినపుడల్లా..
ఈరోజైనా ననుకుంటాను..
నీతో అందామనుకుంటాను..

నువ్వు గురుతుకు వచ్చినపుడల్లా..
రేపటి రంగులు చూస్తుంటాను
తెల్లారిందా అని అనుకుంటాను..

దగ్గరగా కూర్చున్నప్పుడు
కలిసి అడుగులు వేస్తున్నపుడు
ప్రతి సారీ నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు
అనుకుంటూ ఉంటాను లక్షల మార్లు..
నీతో ఇదే అందామని..

దూరంగా ఉన్నప్పుడు
కలవాలని కదలికలు కలగన్నప్పుడు
ప్రతిసారీ నిన్ను వదలలేనప్పుడు
నీకేమీ అనిపించదా? అనుకుంటాను అన్ని మార్లూ..
నీతో ఇదే అందామనీ అనుకుంటాను..

నీ మాటల వెనుక అర్ధం..
అర్ధం కాదు..
మాటలకోసం వెతుక్కోవడం..మాత్రం
అర్ధం అర్ధమయినట్టు ఉంటుంది...

నువ్వు చూస్తున్నపుడు
అర్ధం కాదు..
చూడనట్టుంటావు చూడు.. అప్పుడేదో
అర్ధం అయినట్టుంటుంది..

నీతోనే ఉన్నప్పుడు..
గంటల కొద్దీ సమయం తేలిపోతున్నప్పుడు
నీతో అడుగులు పడుతున్నపుడు..
నీవేదైనా అడిగినపుడు..
అర్ధం కాదు..

నేనై లేనప్పుడు
క్షణాలు క్షణమైనా కదలనప్పుడు
నీకై అడుగులు పడుతున్నపుడు
నిన్నేదో అడగాలన్నపుడు
అర్ధం అయినట్టుంటుంది.

ఇదే ఇదే....
సూటిగా చెప్పలేనపుడు..
సూదులై గుచ్చుతున్నపుడు
సుడులై తిరుగుతున్నప్పుడు

నువ్వు నవ్వుతావు.
అప్పుడే ఏదో తెలిసినట్టనిపిస్తుంది..

తెలిసినది తెలుసో లేదో నన్న చిన్న అనుమానం అక్కడితో సెలవు తీసుకుంటుంది..
చెప్పాలా వద్దా అన్న సందేహమే తాను లేనంటుంది....
నేనేమంటున్నానో.. నీకు అర్ధం అయ్యింది కదూ..!?


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, April 4, 2012

ఇక ఇక్కడ మనమే.. ఇక ఎప్పుడూ మనమే..
నువ్వు నేను దగ్గరగా వచ్చేసాం.
ఏ దూరాలు మధ్యన రానంతగా..

నువ్వు నేను కలిసిపోతున్నాం..
ఏ కలలకి ఇక తావు లేనంతగా..

గడియారం ఆగిపోయినట్టుంది..
ఊహలు సెలవు తీసుకున్నట్టుంది..
గుండె నిండుగా మత్తుపట్టినట్టుంది..
ఒక కొత్త ప్రపంచం పుట్టినట్టుంది..

భూమ్యాకర్షణ శక్తికి
దూరంగా.. పక్షి మల్లె ఎగురుతున్నట్టు..

నిశి రాతురులు కూడా
అందంగా.. వెలుగు రేఖలు సృష్టిస్తున్నట్టు

మారాలని మనలాగే..
ఆనందంగా.. ప్రకృతి మన రంగులద్దుకున్నట్టు

ప్రతీ క్షణం జ్ఞాపకమవగలిగేట్టు
పూర్తిగా జీవించేస్తూ..

మనమే శాశ్వతమయినట్టు..
మనకే తెలియనట్టు..
ఉండిపోదాం ఇలాగే..
నువ్వు నేను...

ఇక మనకి ప్రయాణం లేదు..
మజిలీలు.. మలుపులు.. లేవు..

మనం చేరుకున్న తీరాలు..
మనలని వదిలి పోవు.
మనం దూరమైన భారాలు..
మనలని చేరుకోలేవు..

ఇక ఇక్కడ మనమే..
ఒక నువ్వు.. ఒక నేను..

ఇక ఎప్పుడూ మనమే..
ఒక నువ్వు.. ఒక నేను..

Friday, March 23, 2012

ప్రేమించడం తప్ప మరో మార్గం కనపడడం లేదు..
మనుషుల ఆలోచనల లోతులెంతో
మధ్య అఘాధాలూ అంతే..
దృక్కుల తీవ్రతలెంతో..
మధ్య దూరాలు అంతే..

ఆధిక్యత కావాలి..
వాళ్ళమీద వాళ్లకి..
ఇతరుల మీద కూడా..!

ప్రత్యేకత కావాలి..
వాళ్లకి కేటాయింపబడినట్టు..
ఇతరుల మధ్య కూడా..!

ఒకరి పొరపాటు..
మరొకరి కాలక్షేపం..
ఒకరి లోపం
మరొకరి వినోదం..
ఒకరి గెలుపు
మరొకరికి చరిత్ర..
ఒకరికి మరొకరు..
దైనందిన జీవితం..

'నాదే' సత్యమని వాదన..
'నేనే' నిజమని నర్తన..
ఆపనేలేరు..
ఏవో లెక్కల మీద కోర్కెలు..
లెక్కకు మించిన చిక్కులు..
దాటిపోలేరు..

సర్దుకుపోవడం ఓటమి ఒకరికి..
కలిసి ఉండడమే కావాలి మరొకరికి..
ఎవరి దారి వారిది..
ఎవరి తీరు వారిది..
ఎవరికి వారే ఇక్కడ..

అభద్రతాభావం
అహంభావం
అనుమానం
అనునయం

కొన్ని తెలుసుకోలేరు...
కొన్ని తెలుసుకోవాలనుకోరు..
కొన్ని అర్ధం కావు..
కొన్నిటికి అర్ధమే లేదు..

క్షమించలేక..
క్షమించుకోలేక..
నరకాన్ని నిర్మాణం చేసుకుంటూ
స్వర్గం కోసం ఎవరిమీదో దాడికి దిగుతుంటారు

ఏమిటో వీళ్ళు.. వీళ్ళ అమాయకత్వం..
ఏమి చెయ్యొచ్చు వీళ్ళని..?!

క్షమించడం సులభం కాదు..
శిక్షించడంతో ప్రయోజనమే లేదు..

ప్రేమించడం తప్ప మరో మార్గం కనపడడం లేదు..

Thursday, March 22, 2012

ఉగాదిని ఎందుకు?

ఉగాదిని ఎందుకు మరిచిపోయాను..?

ఎవరో ఒకరు పలకరిస్తేనో.. ఎవరో గుర్తుచేస్తేనో తప్ప నాకు గుర్తుకు రాదా ఉగాది..?

ఏమిటో.. హ్యాపీ న్యూ ఇయర్ .. అనగానే.. వారం ముందే మెదడు దాని చుట్టూ తిరుగుతుందే? మరి ఉగాది ఏం చేసిందని.. దానిని మరిచిపోయాను..?

బహుశా.. ఆఫీసులకు.. స్కూళ్ళకు సెలవు లేకుంటే... ఇంకేమాత్రం ఉంటుందో గుర్తు..?

సరే.. ప్రశ్నలు మానేస్తా.. ఉగాది శుభాకాంక్షలు చెప్పేస్తా..

ఇదే నూతన తెలుగు సంవత్సరానికి శుభఆహ్వానం. ఎల్లరకూ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు..

శివ చెరువు ..

Saturday, March 17, 2012

ఆనందాలు..

అప్పుడప్పుడూ నన్ను నేను తిట్టుకున్నా.. ఎప్పుడూ మాత్రం నాకు నేను గొప్పగా కనపడతాను.. నాకు నా కధలో నేనే హీరో అనిపిస్తుంది. అసలు అలానే చూసుకోవడం నాకు ఇష్టం. అదే నిజం.. ఎప్పుడైనా సరే అద్దం ముందు నిలుచున్నప్పుడు తెలియకుండా మన మొహంలో ఒక నవ్వు, ఒక వెలుగు కనపడతాయే... అలాంటిదే ఇది కూడా..

వెనక్కి తిరిగి చూసుకుంటే.. చాలా సంవత్సరాలు.. ఎన్నో పరిచయాలు. ఎన్నెన్నో సంఘటనలు.. కానీ చాలా కొన్నే గుర్తుంటాయి. కొంతమందినే మళ్ళీ కలవాలనుకుంటాం. ఎందుకో నాకూ తెలియదు. దానికీ ఇప్పుడు నేను రాయబోఏదానికి పెద్ద relevance ఏమీ లేదు.. కానీ ఏవో జ్ఞాపకాల గురించి రాద్దామనిపించి ఇలా మొదలు పెట్టాను అంతే..

చిన్నప్పటినుండీ ఇప్పటివరకూ చూసుకుంటే... ఇప్పటికిప్పుడు గురుతుకొస్తున్న బహుశా మరిచిపోలేని నా కధలో సన్నివేశాలు.. వీటిని తలుచుకుంటే..ఒక ఆనందం.. ఒక చిన్న నవ్వు.. నా గతం ఎంత బావుంది అనే ఒక గర్వం..


 • అమ్మని ముద్దలు చేసి అన్నం పెట్టమని మారం చేయడం. తినకుండా అలిగి కూర్చోవడం.
 • పదో తరగతి పాసయినప్పుడు నాన్న ఇచ్చిన రెండు రూపాయల కాగితం
 • అప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలో తెలియదు కానీ.. చాలా చిన్న పిల్లాడిని.. విజయవాడలో వదిలి అమ్మ నాన్న ఒక రోజుఏదో ఊరు వెళ్లారు. అప్పుడు రోజంతా ఏడిచాను.. వచ్చాక ఉబ్బిపోయిన నా మొహం చూసి భాదలో అమ్మ ఒక రెండుతగిలించింది..
 • మొదటి సారి ఐదో తరగతిలో హాస్టల్ జీవితం.. అప్పుడు తిన్న జోతి బేకరి.. రస్కుల పాకెటు
 • ఐదు పైసల చిల్లర కోసం నారాయణ మెడికల్ షాప్ చుట్టూ తిరగడం.. అతను నన్ను వింతగా చూడ్డం.
 • మొదటి సారి నేను క్రికెట్ లో తీసిన పరుగు , రెడ్ క్రాస్ బిల్డింగ్లో
 • కారు రేకుల షెడ్ కింద నిలబడి.. పైన పడే వడగళ్ళను గమనించడం.. కింద పడ్డవాటిని తింటూ చప్పరించడం .. నానాజీ గారింట్లో
 • విపరీతమైన వర్షంలో .. ఆ రాత్రి కరంటు పోయింది.. ఆతరువాత ఏం జరిగింది? నేను పోలీసు స్టేషన్ రోడ్డు లో సైకిల్ తొక్కుతూ పూర్తిగా తడిసిపోయాను .. తరువాత జ్వరం..
 • ఆరోతరగతి లో క్లాస్స్ సెకండ్ రావడం
 • ఏడో తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ తీసుకోవడం.. అప్పటిదాకా సర్టిఫికేట్ అంటే ఏమిటో తెలియదు నాకు..
 • పార్వతి మేడం పెట్టిన తొడపాసం..
 • రవిగాడిని వీరేశం మాస్టారు కొడుతుంటే లోపల లోపల నవ్వుకోవడం
 • కబడిలో నాకు వచ్చిన బొచ్చె ప్రైజు ఎవరో తీసుకోవడం .. నేను ఏడవడం.. లోలోపల
 • పాటలపోటీలో సెకండు ప్రైజు.. హి హి హి... లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్.. అన్న మాట
 • డబ్బులు వసూలు చేసుకోవడం కోసం భగవాన్ స్వీట్స్ షాప్ ముందు గంటలు గంటలు కూర్చోవడం..
 • సంతోష్ గాడు నాకు sorry చెప్పిన రోజు.. క్రికెట్ లో గొడవైందని.
 • నాకు పుస్తకాలు అర్ధం అవుతాయని.. నేను ఇంకొకళ్ళకి అర్ధం అయ్యేట్టు చెప్పగలనని.. నాకు తెలిసిన నా టెన్త్ రోజులు..
 • బాలిగాడు ఊరొదిలి వెళ్ళిపోతూ నన్ను రావొద్దని చెప్పిన రోజు..
 • పక్కింటికి వెళ్లి చూసిన కాశి మజిలి కథలు.. దూర దర్శన్ సీరియల్
 • అర్ధ రూపాయి రెంటుకు తీసుకొచ్చిన్న చందమామలు.. బాల మిత్రలు..
 • మొట్ట మొదట ఆడిన వీడియో గేం.. Mario.. అనుష వీడియో గేమ్స్
 • మొదటిసారి దిలీప్ గాడితో షేర్ చేసుకున్న పునుగులు..
 • ఆదిత్య రూమ్లో నా మొదటి బర్త్ డే పార్టి.. (అప్పటికి నేను ఆదిత్య ఒకరికి ఒకరు తెలియదు..)
 • దియేటర్ లో మూడు సార్లు చూసిన తొలిప్రేమ సినిమా .. అప్పటికి నాకు సినిమా అలవాటు లేదు..
 • సరిగా రాని కేబుల్ సిగ్నల్ సరిచేస్తూ.. ఈటివిలో వచ్చే 'రహస్యం' సీరియల్ చూడడం..
 • వెతుక్కుంటూ రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్ళడం.. వాళ్ళ నాన్న గారి పరిచయం..
 • పొద్దున్నే నాలుగు గంటలకు లేచి నిద్రకు మొహం వాచిపోయినట్టుండే హాస్టల్ పిల్లల్ని చూసి నవ్వుకోవడం...
 • సొంతగా వండుకుని బిరియాని చేసుకోవడం..
 • తాటకి (రామాయణంలో) బొమ్మ దగ్గర.. గోదారి గట్టు దగ్గర.. పుస్తకాలు తెరుచుకుని చదువుకోవడం..
 • బస్సెక్కి ఊరెళ్ళే అమ్మ నాన్నలని వెనకాల సైకిలు వేసుకుని వెళ్లి టాటా చెప్పడం..
 • ఎండా కాలం లో ముప్పై నలభై ఓవర్ల క్రికెట్.. ఆడడం..
 • క్రికెట్ గ్రౌండ్ లో parellel బార్స్..
 • నాటకాలలో జిల్లా స్టాయి అవార్డు.. (కన్సొలేషన్ ప్రైజ్ :) )
 • అన్నయ్య వాళ్ళ స్నేహితుల మధ్యలో కూర్చుని విన్న 'దిల్ సే' సినిమా పాటలు..
 • వేగంగా సైకిల్ తొక్కడం లో నాతో నేను పెట్టుకున్న పోటీలు..
 • ఒక సాయంత్రం నేను మొదటి సారి చూసిన నరసన్న..
 • నేను రాసిన మొదటి కధ..
 • వర్షం పడే కొంచెం సేపు ముందు వీధి దీపాల వెలుగులో నేను చూసిన ఓ అందమైన అమ్మాయి.. సామాన్యం గా ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి.. అనుకునేవాడిని..
 • అర్ధరాత్రుళ్ళు వీధుల మీద పడి అంటించిన పోస్టర్లు..
 • మొదటి సారి కలిపిన పానకం..
 • ఇంట్లో ల్యాండ్ లైన్స్ కి వచ్చే మిస్స్డ్ కాల్స్..ఎవరై ఉంటారా అని ఆలోచించడం..
 • నా ICETరాంకును చూసి గర్వ పడ్డ నాన్న..
 • తిరిగి తిరిగి వచ్చి..అలిసి నిద్ర పోతున్న నాకు "యు ఆర్ సెలెక్టెడ్" అని వచ్చిన మొదటి ఉద్యోగం..
 • విశాఖ పట్నంలో నేను చూసిన సముద్రం..
 • సముద్రం లాంటి మనుషులు..
 • మొదటి సారి మల్లూరు ట్రిప్..
 • గుళ్ళో రాజు పరిచయమైన రోజు..
 • ఊరినించీ వచ్చే ప్రతి సారి సెండ్ ఆఫ్ ఇచ్చే స్నేహితులు..
 • శ్రీ శ్రీ భిక్షు వర్షీయసి..
 • బాల గంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి..
 • హైదేరాబాద్లో గంటల కొద్ది నడిచిన రోజులు..
 • కాప్మార్క్లో హరి, సోము.. శర్మ .. వీళ్ళతో మాట్లాడిన ప్రతి రోజు..
 • జీటాలో నిద్ర మాని పని చేసిన ప్రతి రోజు..

వెనక్కి తిరిగి చూసుకుంటే.. మరి ఏం కష్టాలు పడ్డావు? అని ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్పలేను.. ఎందుకో ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం దొరకదు.. ఒక పెద్ద ప్రమాదం నుండీ ప్రాణాలతో బయట పడితే ముందు 'ప్రమాదం' గురించి ఎవరూ మాట్లాడరు. 'ప్రాణాలతో బ్రతికి బయట పడడం' గురించి మాట్లాడతారు. మొదటిది ఒక 'ఏమవుతుందో అన్న ఆత్రుత/భయం' అయితే రెండోది ఫలితం తాలూకు 'ఆనందం'. ఎప్పుడూ ఫలితమే గుర్తుంటుంది.. ప్రమాదం కాదు..

మీకు కూడా ఇలాంటివే బోలెడు అనుభవాలు.. ఆనందాలు ఉండి ఉంటాయి.. వాటిని రాసి పదిలం గా దాచి పెట్టుకోండి.. ఎప్పుడో ఒకసారి తీసి చదువుకోండి..

చూడండి, నేను పందెం కాస్తాను.. మీరు చదువుతూ చదువుతూ మధ్యలో.. నవ్వకపోతే నేను..నా పేరు....................

Friday, March 16, 2012

వీళ్ళే.. కావాలి..
బలహీనతల గడువు వెనుక
బలి పశువుల గోడు వెనుక
లేని తలుపుల వెనుక
పొడుపుకధల గదుల వెనుక
వీళ్ళే..వీళ్ళే..
మనుషులు

కదం తొక్కడానికి
పదం కలపడానికి
రధం కదలడానికి
రణం జరగడానికి
కావాలి.. కావాలి..
వీళ్ళే.

కళ్ళను గుచ్చే సూదులు
గుండెను తుంచే చేతులు
బుద్ధిని మార్చే మందులు
జబ్బుని పెంచే చదువులు
వీళ్ళే.... వీళ్ళే..
మనుషులు..

రంగం సిద్ధం కావాలన్నా..
రక్తపుటేరులు చూడాలన్నా..
స్వేదం కాలువలవ్వాలన్నా..
సాంతం సాగరమీదాలన్నా..
కావాలి.. కావాలి..
వీళ్ళే.

లెక్కలేనితనం
సిగ్గులేని తనం
అనాగరికం
చరిత్రలో అతి పెద్ద ఘోరం
వీళ్ళే.... వీళ్ళే..
మనుషులు..

ఒక ఓటమికి ఒక గెలుపుకు మధ్య..
ఏదో జరగాలన్నా వీళ్ళే..
కట్టెలు మోపై కలవాలన్నా..
రావణ కాష్టం కాలాలన్నా..
వీళ్ళే.. కావాలి..

వేరే ఎవరొస్తారు..?
ఇంకేం చేస్తారు..?
ఉన్నది వీళ్ళే..
ఉన్నది ఇంతే..

ఏదో వ్యధ
తెలియని లోతున
ఒకటే నిర్లిప్తత
ఏమీ చేయలేమని..

ఏదో తాపత్రయం
వెనుక లెక్కలేనన్ని ఆశయాలు
ఒకటే ఎదురు చూపు
ఏదో జరగాలని..*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, March 6, 2012

పార్శ్వాలు అనేకం...నేను..
ప్రపంచం..
ఎవరి ప్రపంచంలోనో నేను..
నాదో ప్రపంచం..
నాతో ఒక ప్రపంచం..

అది నాదే ..
కానీ దానికి నేనేమీ కాను...

నేనో ప్రపంచాన్ని చూస్తున్నాను..
నేనాగితే అది నన్ను వెక్కిరిస్తుంది..

నన్నో ప్రపంచం చూస్తోంది..
నేనాడితే అది తనలా ఉంటుంది..

చెరొక వైపూ చూస్తూ..
రెండు పట్టాలపైనా ప్రయాణం చేస్తూ..
కలుసుకోలేక..
కలహాల పాలైపోవడం పరిపాటే..

గమ్యమోకటే ..
విడి విడి గా దారులే కనపడవు..
కలిసి పోలేక..
కన్నీళ్ళ పాలై పోవడం కధతో పాటే..

పార్శ్వాలు అనేకం...
నాకు..

పార్శ్వాలు అనేకం...
ప్రపంచానికి ..

పార్శ్వాలు అనేకం...
పిచ్చికి..


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, February 20, 2012

ఓ రాత్రి ..సత్యం..శివం ..

సమయం రాత్రి 8 .40

గాలి బాగా ఎక్కువ వీస్తోంది.. కానీ వాతావరణంలో వేడి వలన దాని ప్రభావం అంత ఆహ్లాదంగా ఏం లేదు. ఏదో సర్దుతున్నట్టు శబ్దం వస్తోంది.. అక్కడ ముందే ఏర్పాటు చెయ్యబడ్డ బల్ల మీద రెండు గ్లాసులు.. ఒక రెండు పెద్ద బాటిళ్ళ మందు.. కలుపుకోవడానికి సోడా. ఇంకా కాస్త ఏదో తినే పదార్ధాలు ఒక దాని తరువాత ఒకటి చేరుకుంటున్నాయి.. రెండు కుర్చీలు ఒక దానికి ఎదురుగా ఒకటి మొహాలు చూసుకుంటూ ఎవరో వస్తారన్నట్టు ఉన్నాయి. ఉన్న అంతస్తు చాలా ఎక్కువలోనే అయినా దోమల చప్పుడు బాగానే ఉంది. కింద నేల కూడా కాస్త దుమ్ము కొట్టుకు పోయి ఉంది. అక్కడికి ఎవరూ చాలా కాలంగా వచ్చినట్టు లేరు.

ఒక పావు గంట తరువాత ఇద్దరు వ్యక్తులు వచ్చి కూర్చున్నారు.

"మొత్తానికి శివం..!!! నువ్వు లైఫ్ లో చాలా achieve చేసావ్ రా.. నిన్ను చూస్తే కుళ్ళుగా ఉంది.." అన్నాడు సత్యం..

నన్ను చూస్తే నా..? ఎందుకు? - ప్రశ్నించాడు శివం

ఇల్లు.. పెద్ద ఆస్తి.. మంచి కుటుంబం.. స్టార్ గా గొప్ప పేరు.. చెపుతున్నాడు సత్యం...

ఆపు ఆపు .. ఇవన్నీ నీకు ఉన్నాయిగా ..? కాక పోతే నీకు మంచి డైరెక్టర్ గా పేరు అంతే..! నన్ను స్టార్ చేసిందీ నువ్వే.. పూర్తి చేసాడు శివం

సరే సరే... అయినా మనిద్దరిలో నువ్వే పొపులర్ అని ఒప్పుకోవాలి.. మరి.. నవ్వేసాడు.. సత్యం.. "ఏ మాత్రం కలపను ?" ప్రశ్నని మాటలో కలిపేసాడు..

అయినా నీకో విషయం చెప్పనా.. పక్కన వాడికి ఉన్న దాన్ని కుళ్ళు కోక పోతే నేను మనిషిని ఎలా అవుతాను? ఇంకేదో అవుతాను.. ప్రమాణం కాదు కానీ.. ఒక చిన్న ఉదాహరణ చెపుతాను. చిన్న స్కూల్ పిల్లాడిని తీసుకో వాడికి పరీక్షలో పాస్స్ అయిన వెంటనే ఆనందం దొరకదు. తన కన్నా ఎవరికీ ఎక్కువ మార్కులు వచ్చాయి అని తెలుసుకునే దాక. తనకే ఎక్కువ వచ్చాయి అనుకునే దాక..

"అయితే మనిద్దరం రాసే పరీక్ష ఏమిటో?" చీర్స్ అంటూ గ్లాస్ కలిపాడు శివం..

"సింపుల్.. జీవితం " నోట్లోనే సమాధానం పెట్టుకున్నాడు సత్యం.

శివం మాట్లాడడం మొదలు పెట్టాడు.
"50 వయసొచ్చాక ఇప్పుడిక జీవితం ఏముంది? అంతా అయిపోయింది. కొన్ని సినిమాలు.. కొంతమంది మనుషులు.. చెప్పుకోవడానికి కొన్ని సక్సెస్లు, బ్రతికి ఉన్నంత కాలం తినడానికి తాగడానికి డబ్బు.. బయటకి వెళ్తే లెజెండ్ అంటారు.. కావలసిన అంత మంది వంగి వంగి దండం పెడతారు. ఏదో ఒక రోజు ఏ జబ్బో పట్టుకుంటే హాస్పిటల్ కి అక్కడి నుండి అటు పైకి దగ్గరుండి పంపేస్తారు. అయ్యింది ముందే అయిపోయింది.. ఇప్పుడేమి మిగలలేదు."

'అక్కడే పప్పులో కాలేశావు' చెపుతున్నాడు సత్యం. ఎంత మంచి కదా వస్తువైనా.. ఎంత గొప్పగా ఒక కధ మొదలైనా దానికి ఒక క్లైమక్ష్ కావాలి. అప్పుడే ఆ కధ అయిపోయినట్టు. ముగింపు లేని కధ మొగుడు పోయిన ఆడది లాంటిది. దానికి ఉన్న పాత్రలలో ఎవరికి వండి పెట్టాలో తెలియదు.

"ఇది. నువ్వు రాసే కమర్షియల్ కధ కాదురా ఈడియట్. లైఫ్ . లైవ్. ముందే పైన ఒకడు రాసి పెట్టేసాడు. దాని గురించి నువ్వేమీ వర్రీ కానక్కరలేదు.నువ్వనుకుంటే రైటర్ అయ్యావా? నేను అనుకుంటే హీరో అయ్యానా? అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు." గ్లాసు కింద పెట్టాడు శివం.

నువ్వన్న ఆ పై వాడి పేరే కాలం. వాడు నీకు ఎప్పుడూ ఒక అవకాసం ఇచ్చాడు. ఎంచుకున్న దాన్ని బట్టి నీ కధలో పాత్రలు, వాటి నిడివి ఇంకా సన్నివేశాలు నిర్దేశిస్తాడు. నిజం చెప్పు.. నువ్వనుకోకుండా హీరో అయ్యావా? నీ అనుమతి లేనిదే నీ కొడుకు నీ సినీ వారసుడయ్యాడా? జీవితం అంతా నువ్వు తీసుకున్న నిర్ణయాలకు చాయిస్ కాదా?

ఉదాహరణకి నీకో చిన్న గది ఇచ్చాను అనుకుందాం. దానిలో నువ్వేం ఏర్పాటు చేస్తావనేది నీ ఇష్టం. నువ్వు ఒక పెద్ద బల్ల పెడితే.. తరువాత వంట సామానులు గాని. చేసిన వంట కానీ .. ఇలా బాటిళ్ళు గాని ఏవైనా రావచ్చు.. అది తరువాత కధ .. కానీ నీ నిర్ణయం తోనే ఇవన్నీ వస్తాయి. ఎవరికో కొంత మందికి మాత్రం .. ఆ టేబుల్ మీద ఏం పెట్టాలో కూడా నిర్ణయించుకునే అవకాసం ఉంటుంది. సత్యం గొంతుకలోకి జారే మందు తన వేగం పెంచింది..

చాలు చాలు.. ఒప్పుకుంటాను.. నువ్వేమంటే అదే.. ఒకటి నన్ను చూసి కుళ్ళుకుంటున్నాను అని అనడం ఆపు. రెండు.. వేరే ఏమైనా మాట్లాడు. లేదా మాట్లాడకు. ఎప్పుడు ఏ టాపిక్ మాట్లాడతావో తెలియదు. నీ సోది నాకు ఫారెన్ పుస్తకాలలో భాష లాగ సగం అర్ధమే కాదు. ఇంకా ఆ క్రియేటివిటీ కి కాస్త టాప్ కట్టేయి..కొంచెం సేపు.

ఒరే ఫూల్ ... ఈ క్రియేటివిటీ యే నీకు ఎన్నో హిట్ సినిమాలిచ్చింది. భాధలో ఉన్న వాడికి స్వాంతన కావాలి. కొంతమందికి అది పక్కన వాళ్ళ మీద పది ఏడవడంలో ఎక్కువ దొరుకుతుంది. అది ఒక రకమైన ఆనందం వెతుక్కోవడం. ఇక మాటలంటావా ? తాగేదే మాట్లాడడానికి. నువ్వేమైన నా సినిమాలో హీరోయిన్ వా..? మాట్లాడకుండా నిన్ను చూస్తూ కూర్చోవడానికి.. అయినా నీ కన్నా వాళ్ళే నయం. ముందు వాళ్ళే మాట్లాడతారు. అర్ధం కాలేదని మళ్ళీ మళ్ళీ అడుగుతారు. కళ్లెగరేసాడు సత్యం.

అవునవును. నువ్వు చెప్పేది నాకే అర్ధం కాదు. వాళ్ళకేమర్ధమౌతుంది. పైగా లాంగ్వేజ్ ప్రాబ్లం. అదో గ్రహాంతర వాసుల సంభాషణ. నువ్వు నీ హీరోయిన్లు... చెప్పింది వినరు. వచ్చింది తప్ప మరోటి చెయ్యరు. కాన్సెర్ కి తలనొప్పికి ఒకే మందు వాడే రకం. నీకు వాళ్ళే కరెక్టు. గొంతులో ఒక వెటకారపు నవ్వు కలిపేసాడు శివం. అయినా అమ్మాయిలు లేకుండా సినిమా తీయలేవ? ఓన్లీ నన్ను పెట్టి. వరైటీగా? సినిమా హాల్లో చూసేవాడికి ఏమో గాని.. ప్రతి టేక్కీ అంతంత మేకప్ ఉన్న వాళ్ళ మొహాల్లో మొహాలు పెట్టి చూడలేక చచ్చిపోతున్నా. పైగా ఈ వయసులో ఆ ఇరవై ఏళ్ళ బక్క పల్చ అమ్మాయిలు నాపక్కన అవసరమా? కావాలంటే నేను ప్రోడ్యుస్ చేస్తాను .. చెప్పు తీస్తావా నువ్వు ?

నీ బుద్ది వికసించింది కానీ. నీ వెరైటీ వికటిస్తుంది. అప్పుడు నువ్వు నేను మాత్రమే సినిమా చూసుకోవాలి. గుర్తుంచుకో.. నిన్ను నిన్ను గానే, హీరోయిన్ ని హీరోయిన్ లాగానే చూస్తారు ప్రేక్షకులు. వాళ్లకి కావలసింది ఒక పూర్తి పేకేజీ. కొంచెం నవ్వు. కొంచెం రోమాన్స్. కొంచెం ఏడుపు. కొంచెం వయోలేన్సు. వాళ్ళ అభిమాన హీరో .. ఒక నాజూకు నార్త్ అమ్మాయి. Maximum ప్రేక్షకులకు సినిమా ఒక ఫార్ములా (a+b)2 = a2 + 2ab + b2 లాగ.. నువ్వు '+' బదులు '-' గాని '=' ఇంకొటేదో వాడతాను. కొత్త ఫార్ముల Derive చేస్తాను అని అనకూడదు. కావాలంటే 'a' కి 'b' కి వాల్యూస్ మార్చుకో. నిన్ను ఎవరూ ఏమీ అనరు. పైగా క్రియేటివిటి అంటారు.

అలవాటు పడ్డవాళ్ళకి సినిమా వ్యసనం. తీసేవాళ్ళకి అది వ్యాపారం. ఇక్కడ ఎప్పుడూ లాభం గురించే మాట్లాడతారు.

సింపుల్. కొలమానాలు.. దినుసులు మారిపోతే వంట మారిపోతుందని అందరికీ తెలుసు. కానీ వంట మాడిపోతుందనో.. సొమ్ము కాదనో ఎవరూ ప్రయత్నం చెయ్యరు. నిజం చెప్పు ఇన్ని సినిమాల్లో అవే కధలు.. అవే పాత్రలతో నువ్వు ఎన్ని సినిమాలు చెయ్యలేదు?

ఒప్పుకుంటాను.. బదులుగా అన్నాడు శివం. నీకు తెలియనిది ఏముంది. ఒక దర్శకుడు వస్తాడు. వాడు నాకు పెద్ద ఫ్యాన్ అంటాడు. నాకో బిగ్ హిట్ ఇవ్వడమే జీవిత ఆశయమని కష్టపడి ఒక కధ రాసానని అంటాడు. అది చూస్తే నా పాత సినిమాల అమ్మమ్మకు తమ్ముడి రెండో కొడుకు కూతురిలా ఉంటుంది. కధని కధలా చెప్పరు. ఎవరో చూసేలా.. ఎవరో వినేలా.. హర్షించేలా ఉండాలన్నదే వాళ్ళ సిద్దాంతం. అందుకే నా సినిమాలు. నేను ఒకే రకం గా ఉంటాం. సినిమాలో నేను ఒక పాత్ర కాదు. కధకి తగినట్టుగా నేను ఉండనక్కరలేదు. ఎవరూ ఎందుకు అని ప్రశ్నించరు? నాతో సహా. నేను నిర్మాతకి సెల్లింగ్ ఫాక్టర్ అంతే. ఇలాంటివి తట్టుకోలేకే ఒక సారి నా డబ్బులతో ఒక మంచి సినిమా తీసాను. దాన్ని అవార్డు సినిమా అన్నారు. కానీ అది నా కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్. లేచి అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టాడు శివం.

ప్రొడ్యుసర్ కి నా స్టార్ ఇమేజ్ కావాలి. డేట్స్ కావాలి. కొంతమందికి నాతో పని చేసామన్న పేరు కావాలి. ఇంక అభిమానులు. వాళ్లకి నేను ఇలానే ఉండాలి అని ఒక ఆశ. వాళ్ళ డబ్బులతో ప్రతీ రిలీస్ నీ పెద్ద పండగ లాగ చేస్తారు. కానీ అది నాకోసం కాదు. నేను వాళ్ళ జిల్లా అనో ..తాలూక అనో. లేక వాళ్ళ జాతికి సంభందించిన వాడిని అనో. ఎవరికో కొందరికే నా నటన చూడాలని ఉంటుంది. నా పర్సనల్ లైఫ్ లో ఒక ఇంసిడెంట్ వాళ్ళకి ఒక పెద్ద న్యూస్. ఇంక నేను ఎవరూ అని ఎవ్వరికీ అక్కర్లేదు. స్టేజ్ మీద కనపడితే ఈలలు వేస్తారు. చప్పట్లు కొడతారు. ఆనందంతో బట్టలు చించుకుంటారు. వీళ్ళకోసం నేను ఎప్పుడూ నటిస్తూనే ఉంటాను. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది యే ఒక్కరికైనా తృప్తి సంతోషం..ఉండాలని.. కానీ అది నేను ఇంతవరకూ చూడలేదు. అసలు ఒకరిని ఇలాగ ఉండమని.. ఇలాగే ఉండాలని మరొకరి ఆలోచన.. ఎక్ష్పెక్తే షన్ నాకు నాన్ సెన్స్ అనిపిస్తాయి..

'అవునా ..?' కళ్ళు పెద్దవి చేసాడు సత్యం.

'వెటకారమా' - గట్టిగా ప్రశ్నించాడు శివం.

సత్యం మెల్లగా చెపుతున్నాడు. కాక మరేమిటి? నీ తప్పుకు ఎవరినో కారణం గా చూపిస్తున్నావు నువ్వు. నీకు పేరు కావాలి. డబ్బు కావాలి. సో.. వాళ్ళకి కావలసినట్టు ఉంటే నీకు కావలసినవి నీకు దొరుకుతాయి. ఇట్ ఇస్ జస్ట్ సెల్ఫ్ఇష్నెస్ .

గాలి జోరు పెరిగింది. వాతవారంలో ఒక రకమైన బరువు చోటు చేసుకుంది. సమయం పదకొండు గంటలు దాటింది. నగరంలో అక్కడక్కడ దీపాలు మిగులుతునాయి. బయట జనం తిరిగే చప్పుడు తగ్గింది. మేడ మాత్రం ఇద్దరి గొంతుకలు మాత్రమే వింటోంది ఎక్కువగా..

చూడు నాకు మాత్రమే నచ్చిన కధలు రాస్తే ఇరోజే ఇంటికి వెళ్లి పోవాలి. నలుగురు చూడాలి అని అనుకుంటే దానికి మసాల కావాలి. నేనిన్ని రోజు చేసింది ఇదే. నో రిగ్రెట్స్.

నా కధలు గమనించావా..? హీరో ఎప్పుడూ ఒక భాద్యతగలవాడిగా కనిపించడు. అందుకే వాడు హీరో. హీరోయిన్ అని చెప్పుకునే దానితో వాడు మాట్లాడే మాటలు డిసెన్సి కి దూరం గా రాసినవే. అవే డైలాగులు సెన్సారు వాళ్ళు అక్కడక్కడా మ్యూట్ చేస్తారు. వాటిని చిన్న పిల్లడు కూడా గుర్తు పట్టేస్తాడు. ఇంక ప్రేక్షకులలో చాలా మంది అవే మళ్ళీ మళ్ళీ చెప్పుకుని నిర్మాతకు ప్రచారం డబ్బులు మిగులుస్తారు.

దాదాపు ప్రతి మనిషిలో చీకటి పార్శ్వాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా సినిమా వాటిని సాటిస్ఫై చెయ్యడానికే పనిచేస్తోంది. వినోదం కోసం కాదు. ఏదో సందేశం కోసమో.. సమాజం కోసమో అసలే కాదు.

సగం కట్టీ కట్టని చీరలో అమ్మాయిని చూడడం తోనో ... ఒకడు ఒక దెబ్బకి పది మందిని మట్టి కరిపిస్తే నో లేచి చప్పట్లు కొట్టి ఊగిపోయేవాళ్ళు ఎంత మంది ఉన్నారో.. అది వాళ్లకి రియల్ లైఫ్ లో వర్క్ అవుట్ కానీ ఒక ఫాంటసి.
దాన్ని మరింత ఇంటెన్సివ్ గా చూపించే డైరెక్టర్లు నాలాంటి వాళ్ళు ఎంత మందో..!

ఒక కాలేజీ విద్యార్ధి లెక్చరర్ ని నలుగురి ముందు వెటకారంగా .. ఇంకా ఒక్కోసారి అసభ్యంగా కూడా మాట్లాడతాడు. అది చూసి పది మంది క్లోజ్ అప్ advertisement లో పార్టిసిపేట్ చేస్తారు. అది తప్పని ఎంతమంది థియేటర్ లోంచి లేచి వెళ్ళిపోతారు..? యే ఒక్కరూ వెళ్ళరు. నీకు తెలుసు గా ఆ సినిమా సూపర్ హిట్.

రక్తాలు వచ్చేదాకా కొట్ట్కోవడం యాక్షన్ . భూతు మాటలు ఎంటర్టేయిన్మేంట్ . బ్లేడుతో కోసుకోవడం సెంటిమెంట్. ఇవేవీ నిజానికి చూపించనక్కరలేదు. దీన్ని ఎవ్వరూ ప్రశ్నించరు. కానీ యే సినిమాలోనో ఏ పార్టీ జెండానో యే మూలో కనపడితే దాన్ని పెద్ద గొడవ చేస్తారు. రీళ్ళు తగల పెడతారు. మనుషులే పోతుంటే పార్టీ చిహ్నాలని ఎమ్చేసుకుంటారు ఎవరైనా? పిచ్చితనం. ప్రతీ మనిషిలో ఎంతో కొంత విచ్చలవిడి తనం దాగి ఉంటుంది. దాన్ని satisfy చెయ్యడానికే ఇది అవసరం. అందుకే అన్నాను ఇది బిజినెస్. వాళ్ళకి కావలసింది పడేసి. నీకు కావలసింది నువ్వు తీసుకున్తున్నావు.

నిజం నిశ్శబ్దంగా ఉన్న నగరం లాంటిది. దాని నుంచీ నీకు అర్ధం అయ్యింది తీసుకోవచ్చు. కానీ అది మారదు.
చుట్టూ చూస్తూ అన్నాడు సత్యం.

'నేను నీతో పూర్తిగా ఏకీభవించక పోయినా.. ఇప్పుడు నువ్వన్న నిజంలో తప్పు ఎవరిది అని నేను మాట్లాడను. ఎందుకంటే అది నన్ను భాధ పెడుతుంది. అయితే ఒక్కటి ఒప్పుకుంటాను. తప్పు జరుగుతోంది. కానీ.. ఇంత మాట్లాడుతున్న నువ్వు కూడా మారడం లేదు. చూసావా?' - అన్నాడు ప్రశ్నిస్తున్నట్టు శివం.

అప్పుడే వర్షం మొదలవుతోంది..సన్నటి గాలి ఏదో అంటోంది.

సమాధానం నీకు తెలిసిందే. నేను చెప్పిందే. "నేను బ్రతకాలి" నేను అంటే నా కుటుంబం. నేను అంటే నా వాళ్ళు . నేను అంటే నా ఆశలు. నేను అంటే నా భయాలు. నేను అంటే నా అహం. నేను అంటే ఒక చట్రం. నేను అంటే ఒక వ్యసనం.

ఇద్దరి మద్య ఒక క్షణం నిశ్శబ్దం మెదిలింది. విపరీతమైన గాలి. చినుకులు పెద్దవి కాసాగాయి.. చుట్టూ విద్యుత్ ఆగిపోయింది. చంద్రుడు ఆ మెడ మీద ఒక కొత్త దీపం వెలిగించాడు.

చూసావా ఇప్పుడు నీళ్ళు కలుపుకునే పని తప్పింది మనకి.. ఒక రకమైన నవ్వు నవ్వాడు సత్యం.

ఒక వేళ నీళ్ళు ఎక్కువైతే .. భుజలేగారేసాడు శివం .

మత్తు మనం కలుపుకుందాం.. గట్టిగా నవ్వాడు సత్యం. మంచి ఆలోచనే కదా..??


Sunday, February 19, 2012

దేవుడా నీకో మాట..
నీవేరో చూసానా..
నీ పేరు చెప్పుకున్నానే గాని.. నీ మాట విన్నానా..
నా ధ్యాసలో గాక నీ జాడ తెలిసేనా..?

ఎలాగో..?
కోర్కెలను చదివితే దాని పేరు భక్తి ..
తెలియక తలచుకుంటే పుణ్యం..
నీ ఇంటి వీధిలో నాలుగు సార్లు తిరిగితే జ్ఞానం..

నాది చదువు కాదు..
తెలివితేటలా లేవు ..
నీవా అర్ధం కావు..
ఎందుకనో ఈ మైత్రి నీకు నాకు..?

ఏంచేసానని నీకు..
ఏమవుతానని ..
నాకే తెలియనప్పుడు..
ఎమైపోతానోనని..!
ఎలాగయా నీవోచ్చేవు..
ఏలాగయా నన్నొదలవు ..?

స్థిమితమే లేని స్థితిలో
నీవు నాతో ఎందుకు ఉంటావో?
ఎలా తిరిగుతావో?
లెక్కలు లేకుండా..
గడియారం చూడకుండా..
అనాలోచితంగా పిలుస్తూనే ఉంటాను నేను..
వేటినీ లెక్క చేయక వచ్చేస్తుంటావు.. నువ్వు..

చూసావా?
చూసావా?
నువ్వు నువ్వంటానేమిటి నేను..!?

గౌరవం లేదు..
వేరు చేసి మాట్లాడతాను..
ఎక్కడివాడివో అని వాదిస్తుంటాను..
అయినా..
నువ్వు నన్ను వదలవు..!

అందుకే..
మనలో మన మాట..
ఎవరైనా అడిగితే?
నువ్వు పరిచయమేనంటాను..
నువ్వూ అలానే చెప్పుకో..

ఫరవాలేదులే
నేనేమనుకోను..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Friday, February 17, 2012

ఎంత గొప్ప బంధం/భయం
చీకటికి వెలుగంటే భయం..
ఏదో చేస్తుందని..

వెలుగుకు చీకటంటే భయం..
ఏం జరుగుతుందో అని..

అయినా..
ఒక దానికి మరొకటి కావాలి..
"ఉన్నాను.." అని చెప్పుకోవడానికి..
అవకరాలు చూపించడానికి..
అవసరాలు తీర్చుకోవడానికి..

వెలుగు సేద తీర్చుకోవడానికి చీకటే రావాలి..
చీకటికి నిలబడడానికి వెలుగులో ఒక ఆధారం కావాలి..

పగలు పరపతి వెనుక
కావలసిన నటన
వీలైనన్ని ముసుగులు

రాతిరి పనులు కనుక
రాశులు పోసిన లాభం
చాలనన్ని కోణాలు

బయటకు అతిశయాలు పోతాయి కానీ..
అటు ఇటుగా పోయి
అవి కొత్త పుంతలు తొక్కవు..
సమాజం దాన్ని.. వింత పోకడలని ప్రచారం చేస్తుందని వాటికి ఎరుకే...!

అవకాశాలు ఏవో కళ్లెగరేస్తాయి కానీ...
కాసేపు ఇక్కడ అక్కడ
అద్దెకు దిగుతూ ఉంటాయి..
ఇచ్చి పుచ్చుకునే పంపకాలకు అవి అలవాటే..

లోపల లోపలే దాపెట్టేసి..
బయటకి మాత్రం భయాన్ని జయించినట్టు
భాయి భాయి అని చేతులు కలిపేసుకుంటాయి.
తప్పని సరి స్నేహాన్ని నటిస్తూ..
వెనుక వెనుక భుజాలు ఎగరేసుకుంటాయి..*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, February 14, 2012

డాక్టర్ల మోసం.. దయచేసి ఆపండి..

నాకు కూడా డాక్టర్ల వలన ఒక చెడ్డ అనుభవమే ఎదురయింది.. అది రెండు రోజుల ముందు.. చేతి మీద
దద్దుర్లు లాగ వస్తే ఏంటో అని బయపడి డాక్టర్ వద్దకు వెళ్ళాను.. రెండు ఇంజక్షన్లు చేసి ముప్పై మాత్రలు రాసారు.. తరువాత రోజు పొద్దున్నకి అది ఇంకా పెద్దది అయిపోయింది... నాకు భయం వేసి పరిగెత్తాను .. ఆ డాక్టర్ మహాను భావుడు నా చేతిలో ఏం లేదు.. స్కిన్ స్పెషలిస్ట్ వద్దకు పో అన్నాడు. ఆ కాడికి అన్ని (ముప్పై ) మాత్రలు రాయడం ఎందుకు.. దండుగ.. ఇప్పుడవి ఎవరి నెత్తిన పోయాలి.. అన్నట్టు నేను ఏ స్పెషలిస్ట్ వద్దకు వెళ్ళాలో పేరుతో సహ అతగాడే సూచించాడు. ఎంత మంచి వాడు.. పాపం..

ఆ స్కిన్ స్పెషలిస్ట్ తక్కువ ఏమీ తినలేదు.. నాలుగు బ్లడ్ టెస్ట్లు షుగర్ తో కలిపి .. ఇంకేవో టెస్ట్లు రాసాడు . నా వయసుకు బ్లడ్ టెస్ట్ లో షుగర్ details అవసరమా .. సర్ సమస్య ఏంటి అండి ఎందుకు ఇలా వచ్చింది అంతే సమాధానం లేదు. రిపోర్ట్లు రాని అని పంపేశాడు. రిపోర్టు వస్తే తప్ప చూసి చెప్పలేని ఈయన ఎంత చదువుకున్నారో???? ఏం స్పెషలిస్టో ...?ఎంత విసుగు తెప్పించారో చెప్పలేను... ఆ టెస్ట్లు చేసే వాళ్ళతో కలిపి.

తీర చూస్తే ఏమైంది.. అమ్మ వారు పోసింది అంటూ పక్కింటి పెద్దావిడ చూడ గానే చెప్పింది. నాకు అయినా కర్చు దగ్గర దగ్గర1500ల రూపాయలు .. ఎంత మోసం..? చూసి చూడగానే ఇది కనీసం ఏమి ఉండచ్చు అన్న వివరాలు కూడా ఇవ్వకుండా భయపెట్టి టెస్టులు రాసి.. డబ్బులు గుంజేసారు..

టెస్ట్లు ల వివరాలు కూడా వచ్చాయి.. అంతా నొర్మల్.. ఇప్పుడా డాక్టర్ ఏం చెపుతారో?

చదువు కున్న డాక్టర్లు .. ఇదేనా చెయ్య వలసినది..?

డబ్బులు పెట్టలేని వాళ్ళ పరిస్థితి ఏంటో? దయచేసి ఆలోచించండి..

అందరూ చెడ్డ వారు ఉండరు .. అలాగే అందరూ మంచి వాళ్ళు ఉండరు. కానీ మంచి గా ఉండ దానికి ప్రయత్నం చెయ్యొచ్చు గా..?

మరీ డబ్బుకు అంత మొహం మొత్తేసిందా ?????

Do not exploit ignorance of people and make money. It is not good for you or for society.

నేను గొప్ప డాక్టర్లను కూడా చూసాను.. వారికీ శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను..

సముద్రం ...
ఎప్పుడో ఓ సారి నా రాతలు ఆగిపోదామనుకుంటాయి ..
అప్పుడే నువ్వు తారస పడతావు..
ఒక చల్లని స్పర్శలా

నీ గొంతులో తెలియని అందమైన సంగీతం
చీకటిలో మెరుపు తీగలా కదలిక
చూడాలి చూడాలి అనిపించే నువ్వు
మొత్తం గా ఏదో మాయ జరుగుతుంది..

అప్పుడే అమాంతం నా చుట్టూ నీ నీలం రంగు తెరలు చుట్టేస్తావు..
నా నిండుగా నీ మాటలు నింపేస్తావు ..

ఈ తీరం నుండీ నువ్వు ఎక్కడ వరకూ పరచుకుని ఉన్నావో
అక్కడాకా నీతో నన్ను తీసుకుని వెళ్తావు..

ఆగని మన నవ్వులు ..
ఇసుకలో కాలి గురుతులు
సాగిపోయిన గాలి కబురులు
నువ్వు పరిచయం చేసిన స్నేహితులు..
నేను పంచుకున్న నా జ్ఞాపకాలు
కాలం కాసేపు తీసుకున్న విరామం
దగ్గరగా దూరంగా
వెళ్ళమని వెళ్ళద్దని అల్లరి చేస్తూ నువ్వు..
చూస్తూ చూస్తూ వదిలి వెళ్ళలేని నేను..
అలా ఎంత సేపు ఉన్నానో నీతో ...
గురుతు జేసుకుంటూ మళ్ళీ ఏవో కాగితాలు నింపడం మొదలు పెడతాను..

నిజం చెప్పనా?
ఇప్పుడు కూడా నాకు నీతోనే ఉన్నట్టు ఉంది


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Friday, February 10, 2012

ప్రశ్నల మననం..ఎపుడూ ఇంతే..
సమాధానాలను వదిలేసి ప్రశ్నలను పట్టుకెళ్ళి పోతుంది..
మనసు..
తరువాత రెంటినీ జత పరచడంలో ఎంతో సాధించాననుకుంటుంది..

ప్రశ్నలు ఎక్కువే!
సమాధానాలు ఎక్కువే!
అందుకే ముందు ఏవో ఆధారాలు తయారు చేసుకుంటుంది..

కొన్ని ఎంచుకున్న సమాధానాలలోనుండీ..
మళ్ళీ ఒకటి ఏరి పెట్టుకుంటుంది.. దానిని ఓ ప్రశ్నకు తగిలిస్తుంది..

తదుపరి చిన్న పిల్లాడిలా..
పలకమీద రాసిన అక్షరాలను చెరిపినట్టు తన సమాధానాన్ని తానే ఖండిస్తుంది..
ముందు వెనుకలు తడబడుతూ ఉంటుంది..

తనలో తానే మాట్లాడుకుంటుంది.
పోలికలకోసమని.
లోపల లోపల పోటీల కోసమని.

చాటుగా కదలికలను గమనించుకుంటూ ఉంటుంది...
వేగంతో ఉన్నా..
వెనుకబాటులో ఉన్నా..

చర్చించుకుంటుంది వేరెవరూ లేకుండానే..
నిర్ణయాలు తీసుకుంటుంది..
నిర్ణేతగా తనే వ్యవహరిస్తుంది..
విచిత్రం గా తనకు తానే సర్ది చెప్పుకుంటుంది.

అలసిపోదు.. ఎందుకో?
ఇష్టమైనా వదులుకుంటుంది
కష్తమైనా నిలుపుకుంటుంది.
కొన్నిటిలో ఓటమి ఒప్పుకోదు ఎలాగో..

దగ్గరతనం తనది..
దూరంగా ఆలోకనలూ తనవే..
మౌనం వెనుక..
మాటల అర్ధం వెనుక..
తనని తాను వింటూ కదిలిపోతుంది..

ఎప్పుడూ విద్యార్దిలానే వ్యవహరిస్తుంది..
ఏవో వివరణలను తయరుచేసుకుంటుంది..
తెలియదనుకుంటుంది..
తెలుసుకుంటూ ఉంటుంది..
తేలిపోతూ చిన్న చిన్న మజిలీలను దాటుకుంటూ
గమ్యాన్ని చేరుకుంటుంది..


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, January 23, 2012

సమాధానం లేని ప్రశ్నలు..
ఏదేదో ఏదో ఏదో ..
ఏమని ఆమెని
వర్ణించ వర్ణము లేదు ..
వెల్లువల ఆమని ..

సమయానికి సమయం తెలియదే
ధ్యాసకింక విడుదలే లేదులే
ఇదెలా..?

ఒక్క చూపు చంపేస్తోంది
ఒక్క మాట బ్రతికిస్తోంది..
ఒక్కో క్షణమెలా జీవితమైనదో..?

హృదయపు కదలని కదలిక
బడలిక ఎరుగని పరుగులు మొదలిక..
ఆగిపోయిన కాలంలో అడుగుల మొదలు ఎలాగో?

నాకు నేను లేనని తెలిసి
ఆమె, నేను లేమని తెలిసి
ఉన్న మేమెలా .. మనం అని.. ఎలా ? తెలుసుకున్నామో ..?*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Thursday, January 5, 2012

ఎంత గొప్పది ఈ సన్నివేశం.. ?!మబ్బులు చిక్కి పోయి..
ఆకాశంలో రంగులు మారుతున్నాయి..
అలసిన వర్షం విశ్రాంతి తీసుకుంటోంది..
అప్పుడప్పుడే బయటకొస్తున్న సూర్యుడి వెలుతురు కళ్ళను గుచ్చుతోంది.

గాలి బరువెక్కి ..
చలిని కదలనివ్వడం లేదు..
వాతావరణం ఒక పరిమళాన్ని అద్దుకుంది..
అటు ఇటు గా.. ఏదో ఒక ఆవిరి ఊపిరి కదలికలని బయట పెడుతోంది..

ఓ చిన్న మొలక మీద మిగిలిన ఆఖరి నీటి చుక్క..
ముత్యం లాగ మెరుస్తోంది..
ప్రపంచం లో మిగిలిన విలువైన ఖజానా ఇదే అన్న అనుమానం వచ్చేట్టు!

వాన వచ్చి ప్రవహించిన నేల..
మట్టిలో ఒక అచ్చువేసింది..
ఇదే విశ్వాన్ని దర్శింపజేసే గొప్ప చిత్ర రాజమేదో చూపిస్తున్నట్టు!

అక్కడక్కడ నిలిచిపోయిన నీటి చుక్కలు ఒక చోట చేరి..
పైనున్న ఆకాశాన్ని ప్రతిబింబిస్తున్నాయి..
ఎక్కడైనా ఇంత కన్నా.. అందమైన పగిలిన అద్దం దొరకదేమో!

సన్నటి.. చల్లని నీటి తుంపరలు..
ఒక మృదువైన వెచ్చని స్పర్శను గురుతుకు తెస్తున్నాయి..
అనేకానేక మార్లు అందే .. ప్రియురాలి మొదటి ముద్దు బహుశా ఇదే కావచ్చు !

నేల మీద మెరుపులు..
నీటి అడుగుల చప్పుళ్ళు..
తయారు చేయని అత్తరు వాసన..
అలజడిలో ఒక ఆనందం..
ఎంత గొప్పది ఈ సన్నివేశం.. ?!
దర్శకుడా నీకు జోహార్లు..
నన్ను ప్రేక్షకుడిని చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు..


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.