Wednesday, December 28, 2011

ఒక మౌనం.. ఒక మాట.. ఒక భావన.. ఒక యుద్ధం..

నిశ్శబ్దం పరుచుకు పోయింది..
ఒక శవం పుట్టినట్టు..
లోపల చలనం లేనట్టు..
ఒక లోకం చలించనట్టు..
ఒక రాత్రిని ఒక రాతిరి కమ్మేసినట్టు..

శబ్దం ఓపిక పోసుకుంటోంది..
ఒక అణచివేతను అడ్డుకున్నట్టు..
లోతున అలజడి రేగినట్టు..
ఒక లోయన రాయిని విసిరినట్టు..
ఒక కదలికను కదిలించినట్టు..

ఎలాగో అంతర్గతం బయటపడుతోంది..
ఒక యుద్ధం ఆగి ఆగి జరుగుతున్నట్టు..
సూర్య చంద్రులు వచ్చి వెడుతున్నట్టు..
ఒక దూరం దూరమవుతున్నట్టు..
ఒక సగంతో ఒక సగం సరిపడుతున్నట్టు ..

ఒక మౌనం..
ఒక మాట..
ఒక భావన..*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, December 27, 2011

బొంబాయిలో బొక్కలో అప్పాయింట్మెంటు - 2

ఉదయం అలారం మోగుతోంది.. మోగింది.. మళ్ళీ మోగింది.. 3.00 కి .. 3.30 కి .. 4.00 కి..

నోట్..
ఈ గడియారం లో టైం చూడ కండినేను నిద్ర లేచి మళ్ళీ పడుకున్నాను.. విపరీతమైన చలి.. అలసిపోయి పచ్చడి అయి పోయిన మనిషి ఏమీ అడగడు.. ఒక్క నిద్ర తప్ప.. నేనూ అదే సర్కిల్ లో మూవ్ అవుతున్నాను..కానీ లోపల బుద్ది చెపుతోంది.. నువ్వు ఇక్కడ ఈ హోటల్ లో అసహ్యమైన పరిస్థితులలో ..రెస్టు తీసుకోవడానికి కాదు.. వచ్చింది.. నీకు వేరే పని ఉంది అంటూ నిద్ర లేపేసింది..

లేచి లైట్ ఆన్ చేసాను.. పెద్ద వెలుతురు ఏమీ లేదు.. ఏదో ఉన్న వస్తువులు చూడడానికి కొంచెం కళ్ళను చిట్లించి ఉపయోగించాల్సి వచ్చింది..
రాత్రి సరిగా కనపడలేదు (చూడలేదు అనడం కరెక్ట్ ఏమో!).. గోడకి రంగులు వెలిసిపోయాయి.. కొన్ని సంవత్సరాలయి ఉంటుంది ఇవి వేసి.. నేనిచ్చిన ఒక పూట రెంటు తో రెండు సార్లు వెయ్యొచ్చు రంగులు ఇక్కడ... వీడి కమర్షియలిసం మండిపోనూ.. టీవీ వైరు తెగి పోయి ప్లగ్గు పక్కన ఉరి తీసిన శవంలా వేలాడుతోంది.. ఒక ఎర్ర వయిరు ఒక నల్ల వయిరు.. నాలిక బయట పెట్టి భయంకరంగా ఉన్నాయి.. దానికి ఎక్కడా ఒక కేబుల్ లైను కనెక్టు అయినట్టు కనిపించలేదు..ఆ టీవీ కి remote కూడా లేదు.. దాని కింద నా బాగ్ పెట్టి ఉన్న ఒక ఎరేంజ్మెంట్ ఉంది.. ఒక పక్కన దులపని షెల్ఫ్ కూడా ఉంది. అందులో ఒక సాలీడు ఫ్యామిలీ .. వై ఆర్ యు డిస్టర్బింగ్ అస్ అన్నట్టుగా చూస్తున్నాయి.. వాటికి opposite లో ఒక టెలిఫోన్ .. అది యాన్టిక్ పీసు.. తరువాత ఆ బెడ్ .. ఇప్పుడు దాని గురించి రాయక పోవడమే మంచిది..తరువాత స్నానానికి ఒక సోప్ ఇచ్చాడు.. దాన్ని సోప్ అంటారా????? అర చేతికి పావు సైజు కూడా లేదు... ఓ లావు పాటి మనిషి అర డజను సార్లు స్నానం చేసినా కూడా ఒక మామూలు సబ్బు ఈ సైజుకు రాదు.. దానికి పెద్ద పెట్టె లో పేకింగు ఒకటీ..!!! అదీ అంతంత సౌందర్యం గానే ఉంది.. ఇక సౌందర్యాల గురించి సౌకర్యాల గురించి పట్టించుకో కూడదని గట్టి నిర్ణయం తీసుకుని..గబాల్న చన్నీళ్ళు స్నానం చెయ్యడానికి పరిగెత్తాను..

చక చక రెడీ అయి దేవుడికి దణ్ణం పెట్టుకుని..అందం గా తయారయి (అనుకుని) .. మూడో అంతస్తు నుండీ మెట్లు దిగాను.. అందరూ పడుకుని ఉన్నారు.. మార్నింగ్ 6 .00 అవుతోంది.. ఇలా నిద్ర పోయి ఎంత కాలం అయ్యింది.??? ఒక్క సారి నా మీద నాకే జాలేసింది.. లగేజీ రిసెప్షన్లో పెట్టి.. ఇక వచ్చిన పనికి బయటకు బయలు దేరాను..

వీధిలో చీకటి.. పొద్దున్న ఆరు అయినా ఇంకా సూర్య భగవానుడు ముంబై లో ఫ్లయిటు దిగలేదు.. ఆయన కూడా ఎయిర్ ఇండియా ఎక్కుంటారు.. ఆటో ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుంటూ వెళ్తుంటే.. వీధిలో చక్కగా నిద్ర పోతున్న కుక్కలు కనపడి.. నీకు మాకున్న సుఖం కూడా లేదు అని వెక్కిరించి.. (బావ్ బావ్ అని..) మళ్ళీ నిద్రకు ఉపక్రమించాయి... వాటికి నా మీద ఉన్న జాలిలో పావు వంతు కూడా మా మేనేజర్కి నా మీద లేదు.. అది నా ఆలోచన.. అనుమానం.. నమ్మకం.. నిజం..


కొంచెం దూరం నడిచాక ఒక ఆటో దొరికింది..
"బయ్యా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కో జానాహే.." - అడిగాను ఆటో అతన్ని..
"బైటో జాయేంగే.." కాన్ఫిడెంట్ గా అన్నాడు..

ఒక రెండు నిమిషాలు అయ్యాక..
"కిత్నా టయిం లగేగా.. జానేకేలియే..?" అని అడిగాను..
"కహా జానా హే." అన్నాడు..
"బోలా నా.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ " - సమాధానం చెప్పటం నా వంతు అయ్యింది..
"ఇదర్ హీ హే...జాసక్తే హే.. జల్దీ " - అన్నాడు.
నాకు "వీడు తేడా.. (నేను బకరా..)" అనే ఆలోచన.. అనుమానం.. నమ్మకం.. ఒకే సారి కలిగాయి అతని మీద.. వాటిని నిజం.. చేస్తూ.. టప్పని ఆపేసాడు..


ఏమైంది ? - అడిగాను..
నేను వేరే రూట్ లో వెళ్ళాలి. "ఇక్కడి నుండీ మీకు వేరే ఆటో దొరుకుతుంది.." అని చెప్పి డబ్బులు నొక్కేసి వెళ్ళిపోయాడు..

నేను వెళ్ళ వలసిన చోటికి తీసుకు వెళ్ళడం మానేసి.. వాడు వెళ్ళే దారిలో నన్ను దింపేసాడు ... వావ్.. day started .. సరే.. ఇంకో ఆటో తీసుకుని ముంబై US Consulate కి వెళ్ళాను.. అక్కడ పెద్ద లైను..ఇంత మందీ అమెరికా వెళ్ళడానికేనా ? అందరూ టిప్ టాప్ గా తయారయి.. పొద్దున్నే వచ్చేసారు.. వివాహ వేదికలలో అమ్మాయిల కోసం అబ్బాయిలు వచ్చినట్టు.. ఆ లైన్ అంత పొడుగు ఉంది ఏంటి..? ఈ గుంపులో కేవలం వీసా అప్ప్లయి చేసే వాళ్ళే కాదు.. వాళ్ళ బంధువులు.. పక్కింటి వాళ్ళు.. అమ్మమ్మలు తాతయ్యలు.. పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న.. పెళ్లి కానీ వాళ్ళకి వాళ్ళ ..... అందరూ వచ్చి నుంచున్నారు. ఇక్కడ టీ కొట్టు వాడిని చూస్తే నాకు కొంచెం కుళ్ళు వచ్చింది.. నా మంత్లీ శాలరీ ఈజీగా వాడో వారం లో కవర్ చేసేస్తాడు..లాగుంది.. అయినా నాలో ఒక మెరుపు లాంటి..అయిడియ వచ్చింది. ఉద్యోగం వదిలేసి.. ఇక్కడ ఒక బడ్డీ కొట్టు .. పాన్ డబ్బా పెట్టుకుంటే.. early గా లైఫ్ లో రిటైర్ అయిపోవచ్చని.. ఇంతలో వెనక వాడు పద పద అని కదలని లైన్ లో నను ముందుకు తోసే ప్రయత్నం చేస్తున్నాడు.. ఎప్పుడైనా చదువు కున్న మూర్కులను ఎక్కువగా ఒక్క సారిగా చూడాలని పిస్తే ఇక్కడికి వచ్చేయచ్చు..పొద్దున్నే పళ్ళు తోముకోవడం రాదు కానీ... వీసా కోసం ప్రతి ఒక్కళ్ళూ పరిగెత్తుకొని వచ్చేసారు. పెద్ద పెద్ద అయిడియాలు !!! ఏం చెయ్యలా.. ఎక్కడెక్కడ తిరగాలా అని.. చర్చలు.. వెళ్ళేది కంపనీ పని అని ఒక్కడికీ ధ్యాస లేదు.. ఇదేదో విహార యాత్ర లాగుంది వాళ్లకి.. నాకేమో చిరాగ్గా ఉంది..నాకు నచ్చనివి మూడు..

ఒకటి : అప్లికేషన్లు ఫిల్ చేయడం
రెండు: లయిన్లో వెయిటింగ్ చెయ్యడం
మూడు : ప్రయాణం చెయ్యడం..

ఇప్పుడు ఈ మూడు నాకు మా కంపనీ వాళ్ళు పేకేజీ కింద ఇచ్చి పండగ చేసుకోమన్నారు.... ముందు ఎంత లైను ఉన్నది అని చూడకుండా.. వెనక ఎంత మంది ఉన్నారని చూసి నన్ను స్వాంతన పరచుకుంటూ.. మొత్తానికి లోపలి వెళ్ళాను.. నేను.. అనుకున్న దానికన్నా చాలా తొందరగా పని అయిపోయేటప్పటికి.. నేను మరో బిల్డింగ్కు మరో బిల్డింగ్కు కి.. తిరిగి.. పని పూర్తి కాకుండా... హోటల్ కు వెనుకకు వచ్చేసాను.. పని ఎందుకు కాలేదు అని చెప్పాల్సి వస్తే కొంత మంది గురించి నిజాలు రాయాలి. అలాంటివి పబ్లిగ్గా రాయక పోతే నేను సేఫ్ గా ఉంటాను.. ఇక్కడ మరో మాట చెప్పాలి.. US Consulate లో మనుషుల కన్నా.. నేను దిగిన హోటల్ ఓనర్ చాలా మంచి మనిషి (ఇతని గురించి మీకు ఆల్రెడీ అవగాహన ఉన్నదని నమ్ముతున్నాను.. లేని యెడల పైనుండీ మళ్ళీ చదవండి..).

హోటల్ కు వచ్చి కూలబడ్డాను.. బట్టలు సర్దుకుని.. మా travelling agent కి ఓ నాలుగు సార్లు కాల్ చేశాను.. మూడు సార్లు వాళ్ళ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసి .. ఆయన పక్కనే ఉన్నారు. కాసేపాగి ఫోన్ చెయ్యమని చెప్పి పెట్టేసింది.. ఇంతలో నలభై missed కాల్స్ .. ఎవరా అని చూస్తే .. రియల్ ఎస్టేట్ వెంకట రావ్.. పోనీలే అని ఫోన్ చేస్తే. నా బాలన్సు మొత్తం ఊదేసే దాకా మాట్లాడాడు.. మీరు బడ్జెట్ చేంజ్ చెయ్యాలి సార్.. మీరు లొకేషన్ మారాలి సార్.. మీరు అపార్ట్మెంట్ అయినా adjust అవ్వాలి సార్.. permissions దేముంది సార్. మీరు దిగింతరువాత వచ్చేస్తాయి.. ముందు మాత్రం payment ఇచ్చేయాలి.. అని ఏవేవో చెప్పి తను entertain అయ్యి.. ఫోన్ పెట్టేసాడు..

ఇంతలో మా agent ఫ్రీ అయ్యి.. నాకు కాల్ చేసాడు.. నేను చెప్పడం మొదలు పెట్టాను..ఏం లేదండి.. మిమ్మల్ని disturb చేసాను ఏమనుకోవద్దు.. రాత్రి 8 .50 ఫ్లైటు హైదరాబాద్ కి బుక్ చేసారు కదా.. ఏమైనా ప్రీ పోన్ చేయించ గలరా? నేను వచ్చిన పని అయిపోయింది..

మా agent జగన్నాద్.. జాతక చక్రాలు వేసి.. తారాబలం, లగ్న బలం..తిది అన్నీ చూసి.. కన్య కింగ్ ఫిషేర్ లో.. ఇంద్రుడు ఇండిగోలో .. సూర్యుడు ఎయిర్ ఇండియా లో ఉన్నారు... కనుక కొంచెం కర్చు ఎక్కువ అవుతుంది.. ఏం చేయ మంటారు? అన్నాడు.. మనసు కన్య వైపే వెళ్ళినా .. మా HR ని అడిగి చెపుతాను అన్నాను.. అప్పటికి నేను రియలైజ్ అయ్యిన విషయం నా ఫోన్ లో బాలన్సు దాదాపు అయిపోయింది.. నేను రోమింగ్ లో ఉన్నాను.. అన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది..

వెంటనే మా HR కి ఫోన్ చేసి ఉన్న కొంచెం బాలన్సు తో..ఇలా చెప్పాను..

A relation ship between employee and HR should be like fish and water and not like fish and fisherman..

ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను.. అర్ధం కాక పోతే మళ్ళీ అడుగు.. అసలు అర్ధమే తప్పనుకుంటే.... హలో.. హలో... హలో.. హలో... అక్కడ ల్యాండ్ లైన్ కి సిగ్నల్ కట్ అయ్యింది.. ఇక్కడ ఎకౌంటు నిల్ అయ్యింది. సో..

11 గంటల నుండీ 12 వరకూ తెలీకుండా టైం అయిపోయింది.. కానీ 12 దాటితే ఇంకో రోజు extra బిల్లు వేస్తాడు మా హోటల్ వాడు. సో.. అక్కడి నుండీ బయట పడీ.. ఏం చెయ్యాలో తెలీక .. ఏమీ చెయ్యక.. రాత్రి 8.50 వరకూ నేను ఏవో కష్టాలు.. ఎన్నో చికాకులు.. పడి పడీ.. సమయాన్ని వృధా చెయ్యడం ఎలా అనే కోర్సు నేర్చుకున్నాను.. చేతిలో కర్చు పెట్టడానికి డబ్బులు లేవు. laptop ఉంది battery లేదు.. ఫోన్ ఉంది బాలన్సు లేదు.. (అసలు దీనిమీదే ఒక పోస్టు రాయచ్చు) అయితే..ఇన్ని ఆనందాల తరువాత.. నా 8.50 ఫ్లైటు ఈ రోజు కూడా కేవలం గంటన్నర delay అవ్వడం తో.. పరిపూర్ణం గా నా కోర్సును పూర్తి చేయగలిగాను..

Happies.. Endings...
*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Saturday, December 24, 2011

బొంబాయిలో బొక్కలో అప్పాయింట్మెంటు - 1

ఒకే సరే. ఉంటాను.. వెళ్ళాక ఒక సారి ఫోన్ చేస్తాను... కాబ్ వాడు బయట వెయిటింగ్ చేస్తున్నాడు.. బయ్ బయ్.. అందరికీ చెప్పి బయలుదేరాను..సాయంత్రం 5 .30 కి కాబ్ ఎక్కాను.. ఆ బెంగళూరు ట్రాఫిక్ లో ఎక్కడైనా ఆలస్యమవుతుందేమో అని 9 గంటల ఫ్లైటుకు మూడున్నర గంటల ముందే బయలు దేరాను.. ఎవరైనా తొందరగా వెళ్ళు బాబు అని చెపుతారు.. నేను కాబ్ అతనికి క్లియర్ గా చెప్పను .. నాయన కాస్త తొందరగా కాకుండా మెల్లగా తీసుకుని వెళ్ళు.. అని.. కాసేపు నిద్రపోవచ్చు అని..

అప్పటికి పడుకుని .. కాస్తంత కంటికి నిద్ర దొరికి చాలా రోజులైంది.. థాంక్స్ టు మై ప్రాజెక్ట్..ఇంత చెప్పినా.. ఆ కాబ్ డ్రైవర్ మంచి బిజీ ట్రాఫిక్ రోడ్డ్లు వదిలేసి.. తన పనితనమంతా చూపించి.. అడ్డ దారిలో ఒక గంట ఇరవై నిమిషాల్లో పట్టుకొచ్చేసాడు.. వెనకాల మత్తుగా పడుకున్న నన్ను సర్ సర్.. ఐర్పొర్ట్ వచ్చేసింది అని నా దగ్గర ఇచ్చేలోపే డబ్బులు లాగేసుకుని లగేజితో సహా కార్లోంచి తోసేసాడు.. నాకు బిల్లు ఇవ్వలేదు. ఇక మా కంపెనీ వాడికి నేను ఎక్కడినించి క్లయిం చేసుకోవాలో అని ఆలోచిస్తుంటే.. ఆ డబ్బులు ఇంక రావని అర్ధం అవ్వడానికి ఎక్కువ టైం పట్టలేదు. మరి ఫ్లయిటు వచ్చేదాకా ఎలా టైం వేస్టు చెయ్యలా అని అనుకుంటూ లోపలకు నడిచాను ..

అప్పుడే నా చేతిలో ఫోను గుర్తుకు వచ్చింది .. చాలా రోజులుగా నాకు ఎవరు ఫోన్ చేసినా నేను ఎత్తి మాట్లాడలేదు.. వాళ్ళందరికీ ఫోన్ చేసి.. క్షమాపణలు చెప్పాలని (టైం పాస్ కి..అంతే..) డిసైడ్ అయ్యాను.. అయితే ఇప్పుడు వాళ్ళందరూ ఫుల్ బిజీ.. ముందు పనికి మాలిన పాటలు తరువాత అవి పెట్టుకోవడానికి డబ్బులు అని ఏవో వంకర వాయిసులు వినపడడం తప్ప ఒరిజినల్ గా ఎవడికి ఫోన్ చేసానో వాళ్ళకి నేను కనక్ట్ కాలేక పోయాను.. ఇక్కడినుండీ నాకు అవమానాలు మొదలైనాయి..హలో.. హా బయ్య.. "మైన్ శివ బోల్ రహహూ.. గ్యార బజేతక్ వహా రహూంగా" అని హోటల్ రూం వాడికి ఫోన్ చేసి నా అందమైన హిందీని పరీక్ష చేసుకున్నాను.. ఎయిర్ పోర్ట్లు లో దిగంగానే.. అక్కడ పిక్ చేసుకోవడానికి నాకోసం వెయిట్ చేస్తాడు అన్న మాట.. ఇది మా ఇద్దరి మద్య undarstanding . కానీ తరువాత అర్ధం అయ్యింది.. వాడి understanding వేరే ఉందని..

ఏం చెయ్యాలో తెలియక అక్కడ పిజ్జా, burgerల కేసి చూడ్డం.. పెప్సి బాటిళ్ళ కేసి చూడ్డం.. వీటిలో ఏవి కొంటే మా కంపనీ వాళ్ళు రిఎమ్బర్స్ చేస్తారో లేదో అని చూడ్డం.. ముసలి వాళ్ళ కేసి చూడ్డం.. చిన్న పిల్లల కేసి చూడ్డం.. అమ్మయిల కేసి (ఇదే ఫస్ట్ రాయాలేమో..??? రాయకూడదా..???) చూడ్డం..ఇలా ఏదోలా కాలం నడిపిస్తున్నా.. బాగా పని చేసి చేసి. ఒక్క సారి ఏం చెయ్యాలో తెలియక పోతే.. ఎంత ప్రోబ్లేమో అప్పుడే అర్ధం అయ్యింది..

ఒక అనౌన్సుమెంటు వస్తోంది.. మీరు ఎక్కవలసిన ఫ్లైటు ఒక గంట లేటు.. అని.. సినిమాకోసం ఎదురు చూసే ప్రేక్షకుడికి "వర్మ బెజవాడ" చూపించి టార్చర్ చేసినట్టు అయ్యింది.. నా పరిస్తితి..ఎన్నో చూసాం .. ఇది చూడలేమా అని.. ధైర్యం చెప్పుకున్నా.. కానీ .."ఇది జస్ట్ ట్రైలెర్ అంతే.. తరువాత సినిమా చూపిస్తాం" అని దాని అర్ధం అని నాకు తెలియలేదు..

ఇంతలో ఫోన్ వస్తోంది..
సర్ హైదరాబాద్ ఎప్పుడు వస్తారు????? సర్.. ప్లాట్ చూస్తానన్నారు.. రెట్లు చాలా తక్కువ లో ఉన్నాయి.. సర్ .. ఇప్పుడు తీసుకోక పోతే.. మీకు ఇళ్ళు దొరకవు.. మీరు ఇళ్ళు కొనలేరు.. మీకు సొంత ఇంటి భాగ్యం లేదు అనీ.. ఆల్రెడీ అన్నీ బుక్ అయ్యిపోయాయి..అనీ.. మీరు బుక్కవ్వడమే మిగిలింది అనీ.. చెప్పుకుని వస్తున్నాడు.. సరే ఇన్కమింగ్ ఫ్రీ అని నేనూ.. ఏదో మాట్లాడడం మొదలు పెట్టాను.. ఇల్లు కట్టారా? ఎంత? ఎక్కడ? ఎప్పుడు? ఎలా? పేపర్లు ఉన్నాయా.. ?పనికొస్తాయా..?అని పది ప్రశ్నలు వేసాను. మీరు రండి సర్ .. వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం.. అని పెట్టేసాడు.. రియల్ ఎస్టేట్ వెంకట రావు..

ఇంతలో కరుణించిన ఎయిర్ ఇండియా అనుకున్నంత ఆలస్యానికీ వచ్చేసింది.. ఇక హడావిడి మొదలు.. చిన్నప్పుడు స్కూలు వదలగానే.. పిల్లలు పరిగెత్తినట్టు.. ఫ్లయిట్ రెడి అనీ.. మీల్స్ రెడీ .. అన్నంత అందంగా చెప్పగానే.. అందరూ పోలో అనీ పరిగేతారు.. నేనూ నలుగురిలో (తో)నారాయణ.. :)

ఫ్లైటులో ..
తినడానికి మంచి తిండి లేదు..
ఎదురుకుండా టీవీ లేదు..
చదువుకోవడానికి పేపరు లేదు..
వినడానికి ప్లేయర్ లో battery లేదు..
టోటల్ గా ఇలా .. Enternaining గా నా ప్రయాణం మొదలయింది....ఆ తరువాత ఒక గంటన్నర లేని.. రాని .. మర్యాదలు చేసి.. వెళ్లిపోయేటప్పుడు .. ఇంక దిగు.. కూర్చుంది చాలు.. అనీ పంపించేసారు ఎయిరిండియా వారు.. మనలో మన మాట.. మొదటి సారి ఒక యంగు ఎయిరు హోస్టెస్ కనపడింది.. ఆ విమానంలో ఇలాంటివి చాలా అరుదు.. పెద్ద సినిమా హీరోలకు హిట్టు లాగ.. హి హి హి..

దిగి మా హోటల్ (హెల్ హోల్) వాడికి ఫోన్ చేసాను..

నేనూ :- "బయ్య. మే ఆయాహూ.." (ఆ...నేను తగలడ్డాను.. )
హోటల్ సోదరుడు : -హా కహా హి ఆప్ (దేశంనుద్దరించినట్టు ఎందుకంత కంగారు.. ఎక్కడున్నావ్ ???? )
నేనూ :- ఎయిర్ పోర్ట్ మే హూ.. ఆప్ కహా హి.. (తొక్కలో హిందీ .. నాకు రాదు.. నీకు అర్ధం కాదు.. )
హోటల్ సోదరుడు : - మేరె బంధ ఆగాయ వాహ.. అభి కాల్ కారేగా... (నీకు చుక్కలు చూపించడానికి ఒకడిని పంపాను వస్తాడు.. రెడీ గా ఉండు.)
నేనూ :- జి..జీ .. (సరే... ఏడు..)

అర్ధ రాత్రి.. ఏమో.. ! బాగా చలిగా ఉంది.. కానీ పట్ట పగలు లాగా జనాలు తెగ తిరుగుతున్నారు.. ఇక్కడ ఎవడూ నిద్ర పోడా..లేక నిద్దర పట్టని వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేస్తుంటారా..? ఎయిర్ పోర్ట్ అనీ కూడా లేకుండా.. గుప్పు గుప్పు మని సిగరెట్లు తాగుతున్నారు ఒక్కొక్కళ్ళు..

సిగరెట్టు అయితే.. కంపు గానీ.. వీళ్ళ స్టయిలు చూస్తే.. మాత్రం అబ్బబ్బ.. ఏముంది! అనీ పించింది.. దీని కోసమైనా ఒక సిగరెట్టూ పట్టుకోవాలి అనిపించింది.. అలవాటు లేని పని అవసరమా అనీ ఆగిపోయాను..

ఒక గంట.. తరువాత మా (నాకు.. బయ్యకి..)మధ్య.. కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గాక.... నా ఫోన్ లో బాలన్సు , ఒంట్లో ఓపిక.. అయిపోయాక.. నెమ్మదిగా ఒంటిగంటకు వచ్చాడు ఒకడు.. వాడి పేరు మనిష్ (వాడు మనిషా??).. క్లారిటీ ఉన్నవాటికి ఇప్పుడు చర్చలు వద్దు.. ముందుకు వెళ్దాం..వెళ్లి కాబ్ లో కూర్చున్నాక.. ఎయిర్ పోర్ట్ పార్కింగ్ డబ్బులు నా చేత కట్టించుకున్నాడు. ఆ డబ్బులు నాకు హోటల్ బిల్లో కట్ చెయ్యాలని.. చెప్పి మొత్తుకున్నాను.. ఇంతలో ఒక కార్డు తీసి ఇచ్చాడు.. కార్డులో సింఫనీ హోటల్ అనీ ఉంది.. నాకు అర్ధం కాలేదు.. అదేంటి. నేనూ మాట్లాడింది ఈ హోటల్ వాళ్ళతో కాదు అనీ. అడగ బోతే.. మీ హోటల్ వాడు నాతో మాట్లాడాడు.. భయ పడకండి అనీ.. భయపెట్టి తీసుకెళ్ళాడు.. ఆ హోటల్ కి ఈ హోటల్ కి నక్కకి నాగ లోకానికి ఉన్న తేడా.. నాకు అర్ధం అయ్యింది దెబ్బబడింది అని. వాడితో ఇంకో గంట చర్చ చేసి చిరాకు చేసి.. వేసి.. ఇద్దరం ఏదో ఒప్పందం కొచ్చాం.


హోటలుకు రాగానే.. రిసెప్షన్ లో కొన్ని ప్రశ్నలు.. టపి టపి మని వేసాడు.

నీ పేరు.. శివ చెరువు
ఊరు.. బెంగళూరు..
ఎందుకొచ్చావ్.. పనిలేక..
ఎన్ని రోజులున్తావ్? .. అదృష్టం బాగు పడేవరకూ..
ఈ హోటల్ కే ఎందుకొచ్చావ్ ..? దిక్కు లేక..
ఐడి కార్డు? - ఉంది..

నేనూ కొన్ని ప్రశ్నలు అడిగా.. ఊరికే ఉంటే.. అమాయకుడనుకున్తారని...

నీళ్ళు ? వాడుకోకూడదు ..
కర్రెంటు ..? గారంటీ లేదు..
ఇంటర్నెట్ ? పెట్టించలేదు ..
రూం ? నీట్ గా ఉండదు..
టీవీ ? ఉంది పని చేయదు..
కేబుల్ ? పైన సమాధానం చెప్పాను కదా..?
AC ? చలి కాలం లో అవసరమా?
హీటర్? మొదటి ప్రశ్న చూడు..

అక్కడితో అతని సమాధానాలకు నేనూ సంతుష్టుడనై.. తదుపరి చర్చలకి ముందుకు కదిలాను.. ముంబాయిలో ఏ హోటల్ అయినా మధ్యాన్నం 12 నుండీ తరువాత రోజు 12 వరకు మాత్రమే కవుంటు చేస్తాయట.. అంటే.. నేనూ రాత్రి రెండు గంటలకి వచ్చినా మధ్యాన్నం 12 గంటలకి వెళ్లిపోవాలి అనీ అర్ధం.. ఇప్పుడు అసలు చికాకు.. మొదలయింది..

ఫ్లయిటు లేటు..
కాబూ లేటు..
వచ్చిందా మాట్లాడుకున్న హోటలుకు కాదు.
డబ్బులా నాకే బొక్క..
టైమా మధ్యాన్నం 12 వరకే..
ఇంక.. ఆనందం నషాళానికెక్కి.. "సిగరెట్" అని గట్టి గా అరిచాను.. (దీనికి పెద్ద relevance లేదు.. ఇంటర్వెల్ అని చెప్పటానికి తప్ప..)
అలవాటు లేని వాడికి సిగరెట్లు ఇవ్వరు అని.. పంపేసారు.. నేనూ కూడా డిసెంట్ గా వాళ్లకి రెస్పెక్ట్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళిపోయాను..----------------------------------------------------
ఇంతకీ నేనూ బొంబాయి ఎందుకు వచ్చానన్నది.. తరువాత బాగంలో విపులంగా చెపుతా.. ;)


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, December 20, 2011

కాలానికి ఇంత ప్రాముఖ్యత..?

కాలానికి నిన్న.. నేడు.. రేపు..
లేవు..!
అవి వున్నవే నాకే..

నాది అనుకున్న కాలం నిలబడదు..
అలానే నేనూ ఆగిపోలేను..
కలిసి కాలం, నేను కాసేపు ప్రయాణం చేస్తాం..

ఏదో ఓ రోజు నేను లేనప్పుడు.. ప్రయాణం ఆగిపోతుంది..
అప్పుడు కాలం కూడా ఎటో వెళ్ళిపోతుంది..


నిన్నటిలోనూ నిలకడగా లేదు ..
నేటికి నడక సరిగాలేదు..
రేపటికి ఎప్పటికీ చేరుకోదు...

అయినా ఎందుకో ఈ కాలానికి ఇంత ప్రాముఖ్యత..?


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, December 14, 2011

మనుగడ!
అదిగో బొమ్మ కనపడుతోంది..
పాత్రలు లేవు
వస్తువులు లేవు
సంఘటనలు లేవు
లక్షణాలు లేవు
లక్ష్యాలు లేవు
అయినా అది బొమ్మే..!

ఎక్కడినుండో ఒక పాట వినపడుతోంది
స్వరాలూ లేవు
వాయిద్యాలు లేవు
అక్షరాల వరసలు లేవు
గాత్రం లేదు
గాయకుడు లేడు
అయినా అది వినసొంపైన పాటే..!

దూరంగా ఓ దారి ఎదురుచూస్తోంది
దిశ లేదు
దశతిరగడం లేదు
అడుగు పడదు
నడక సాగదు
అయినా ఇది ప్రయాణమే
పుట్టుక నుండీ చావు వరకూ..!


జీవితం ఇలానే కదులుతోంది..
అర్ధరహితమైనా
అర్ధవంతమైనా
ముగిసే వరకూ...
షరతులు వర్తించే మనుగడ!

Sunday, December 11, 2011

అతడు నేనేమిటో!?

ఆలోచనలకు పుట్టుకనిచ్చినవాడెవ్వడు..
చేతలకు చేవ అయినదతడెవ్వడు..
చేసినదెవ్వడు..?

ఊపిరిని వాక్కుగ మలచిన వాడెవ్వడు..
ఆ మాటకు బలమెవ్వడు..
బదులెవ్వడు?

నయనములకు చూపెవ్వడు..
దృక్కుకు దృశ్యమెవ్వడు..
స్పందనకు భావమెవ్వడు?

చీకటికి నలుపెవ్వడు..
వెలుగుకు వరమెవ్వడు..
రేపగలు వాడెవ్వడు?

ఎవడో..!
ఎవడో..?

అతడెవరో? నేనెవరో?
అతడికి నేనెవరో?
అతడు, నేను ఏమిటో?
అతడు నేనేమిటో!?*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.