Friday, October 28, 2011

ఆ మబ్బుల వెనుక ఏమున్నాయో? అని.
చాలాసేపటి నుండీ..
ఏవో ఏవో ఆకారాలుగా.. మబ్బులు కనిపిస్తున్నాయి..
వాటిని గాలులు ఎక్కడికో తోసుకు పోతున్నాయి..

ఆ మబ్బుల వెనుక ఏమున్నాయో? అని.
ఒక చిన్న ఆశతో నా కళ్ళు అటువైపే చూస్తున్నాయి..

కాసేపు దగ్గరగా వెళ్లి చూసోద్దామంటే
దూరం ఎక్కువుండి పోయింది.
దూరంగా చూస్తుంటే..
దగ్గరగా వెళ్ళే బుద్ధి, బుద్ధి మానుకోనంది..

వెలుగును ముక్కలు చేసి..
నగిషీలు చెక్కినట్టు.

కనురెప్పలు..
చప్పుడాపుకున్నట్టు

నిద్దుర లేచిన నీడలు..
వెలుతురును కౌగిలించుకున్నట్టు..

ఆనందం..
ఆకస్మిక తనిఖీ చేస్తున్నట్టు..

అప్పుడే..
అక్కడే పుట్టినట్టు.

నా ఆలోచనలు
పయనిస్తున్నాయి.. పరుగులు తీస్తున్నాయి..

అలా అలా ..మరి కాసేపటికి..
నేను అలిసిపోకూడదని ..
అంత ఎత్తు నుండీ..
ఆ మేఘాలు వర్షమై కదిలాయి.. ..

అభిషేకం జరిగినట్టు తడిసిపోయాను..
నేను..

ఆఖరికి చూసాను కదా..!
అక్కడ ఆకాశం అంతా తెల్ల మొహం వేసుక్కూర్చుంది..

శూన్యం చుట్టుకున్న..
లేమిలా..
అక్కడ నా ఆశలు తప్ప ఏమీ లేవు..

అటుపై...
ఏమీ లేని నా ఆశలు అక్కడ లేవు..*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, October 19, 2011

నీతో ఉన్నప్పుడు..

నీవేలే..
చెప్పని ఒక మాటైనా..

తలపుల తపనల గడి ..తడుతున్నా..
నీవేలే..

నీవేలే..
చప్పున చిర్నవ్వు దాచుకున్నా..

నన్ను దాటే నేను
నీవేలే..

నీవల్లే..
నీవల్లే...

తూరుపు నుండి ఓ గీతం పెదవి కదిపింది..
గతం చెరిగిపోయింది..
పూర్తిగా కాలం చనిపోయింది..
ఆశ్చర్యంగా.. నాలోని నిను చూస్తూ.. చూస్తూ..

ఆకాశం తల దించుకుంది..
వెన్నెలా చిన్నబోయింది..
వేకువా ఆగిపోయింది..
... మన కలయికను స్పృశిస్తూ...

ఆగిఉన్నా నాలో పరుగులు ఆగవు ..
ఊపిరికి తన ఉనికిని వెదకక తప్పదు..
కన్నులకు జాగరణ కాక దారి లేదు....
నన్ను కోల్పోతున్నానని తెలిసినా...
నేనేమి చేయగలను ..? ఇక
నీతో ఉన్నప్పుడు..

నీవైపోవడం తప్ప..!*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Thursday, October 13, 2011

ముగింపు తెలియదు వీటికెక్కడో..
వెన్నెలా ఎప్పుడూ ఉండదు..
సూర్యుడు ఎప్పుడూ చూస్తూనే ఉండడు..
చలికి చలేసినప్పుడు తప్ప రాదు..
వర్షమా..! వచ్చి పోయే అతిధి అంతే..
వీటితో పాటూ శాశ్వతం కానివెన్నో..!

ఇసకను వొత్తిన అడుగులూ
అలుపూ..
మజిలీలు
దూరాలు..
పరిచయాలు..
పరిస్తితులూ..
సంబరాలు..
సంబారాలు..
అన్నిటినీ స్పృశించీ కదులుతూ ఉంటుంది.. ఈ ప్రయాణం.

కొన్ని తీరాలు కలిసినట్టే ఉంటాయి..
కానీ ఎక్కడా కలవవు..
అలానే కొన్ని ప్రయాణాలూ మొదలవుతాయి..
ముగింపు తెలియదు వీటికెక్కడో..

ఆ తెలియని తనమే
నేటిని నిదురపుచ్చుతుంది
రేపటికి మేలుకొలుపుతుంది..

Saturday, October 8, 2011

నిన్ను ఎన్నుకుని నేను చేసిన తప్పుకా?నాయకుడా..
నాయకుడా..

ఒకటే..
కష్టాలు..
కష్టాలు..
కష్టాలు..
ఆరుస్తావా.. బాధ తీరుస్తావా..?

లక్షలు పోగు చేసుకుంటూ నువ్వు..
అక్షరాలు లేక నా పిల్లలు

తప్పులను కప్పుకుంటూ.. ఒప్పుల అతుకులతో నువ్వు..
ఎప్పుడు చినుగులు పడుతుందోనని వేసుకున్న బట్ట భయంతో.. నా యాలి

విద్యుత్ బిల్లుల పని లేని పేద్ద.. పేద్ద.. ఇండ్లలో నువ్వు...
చీకటి నిండిన గూడులో నేను

ఎక్కడికెళ్ళినా పది.. పాతిక మంది మూకతో నువ్వు..
అరక్షతో వీధిలో నేను..

టీవీలలో ఠీవిగా ప్రచారంలో నువ్వు..
కనీస గుర్తింపు కార్డు దొరకక నేను..

సర్కారు ఇచ్చే వాహనాలలో విహారానికి నువ్వు..
కర్చులకు జడిసి అటు ఇటూ కదలలేని నేను..

మిద్దెల మీద మిద్దెలతో ఇంకా విత్తు మత్తులోనే నువ్వు..
పన్నులకు.. నీ పంపకాలకు, .. ఇంకా పంతాలకు అప్పుల పాలైన నా కుటుంబం

పొరపాటున కాలం చెల్లి.. వెళ్లి పోయావా నువ్వు.. ?
బందులు.. పనికిమాలిన సెలవులు.. బలవంతపు అంజలి ప్రకటనలు...నాకు

నువ్వు ఉన్నా పోయినా ..
నష్టం నాకే ..

ఎందుకయా నువ్వు..?
ఉన్నది?

ఎవరికీ ప్రతినిదివి నువ్వు..?
నాకా?
నిన్ను ఎన్నుకుని నేను చేసిన తప్పుకా?
.
.
అయివుంటుంది..
అందుకే.. ఈ పశ్చాతాపం..
ఈ శిక్ష..

అవునూ..!
నువ్వు కాక పోతే.. మరొకడు వచ్చాడే అనుకో?
నా పిచ్చి గాని..
వాడు నన్ను ఉద్దరించేవాడని నమ్మకమేముంది..?
పట్టించుకోకు నేనన్న మాటలు..
ఏవో ప్రేలాపనలు..

చిన్నప్పుడు పెద్దవాళ్ళెవరో చెప్పారు..
తెలియని దైవం కన్నా.. తెలిసిన దెయ్యం మేలట

నేను మారను..
నువ్వూ మారకు..
మనమింతే..
మనకింతే..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, October 3, 2011

హాపి హైదరాబాద్...


వర్షాలతో సరిగ్గా నడవడానికి కూడా లేకుండా రోడ్లు..
ఎక్కడానికి లేకుండా బస్సులు..
అవసరానికి లేకుండా కరెంటు..
అవకాశాలు పెరిగిన ఆటోవాలాలు..
జీవనాధారం పోగూడని ఉసూరుమంటూ ఉద్యోగస్తులు..
సెక్యూరిటీ లేని సెక్యూరిటీ గా పోలీసు సోదరులు
ధరలు పెరిగి నెత్తి నోరూ బాదుకుంటున్న సామాన్య జనం తో..
మీరు బాగున్నారా ? అంటూ దూరవాణి ప్రశ్నలు..

ఆశలు ఆశయాలు..
కలిసిలేక.. కలవలేక..

తినడానికి..
వినడానికి..
ఉండడానికి..
ఊరట చెందడానికి..
భయానికి..
భాద్యతకి..
తరుణోపాయంలేక..
తప్పక..
బ్రతకడానికి..

మొత్తంగా హైదరాబాదు క్షేమంగానే ఉంది..