Wednesday, August 3, 2011

ఆమెతో - కధ రెండవ భాగం
ఆమె తో మొదటి భాగం ఇక్కడ చదవగలరు.

ఈమె అర్ధం కావడం లేదు..
ఏమీ పట్టనట్టు .. నేనంటే పడనట్టు ఉంటోంది.. ఇప్పుడేమో వచ్చి ఇదే ఆటోలో ఎక్కింది. ఇప్పుడు నేను ఏమర్ధం చేసుకోవాలి? కాస్త పాసిటివ్ గా ఆలోచిస్తే..ఈమెకి నామీద మంచి అభిప్రాయమే ఉండి ఉంటుంది...లేకుంటే ఎందుకు వచ్చి నాతో ప్రయాణం చేస్తుంది..? లేదు లేదు ఉంటే నాతో ముందే మాట్లాడి ఉండేది. ఏదో అవసరం అంతే..మరింకేమీ కాదు. లోపల ఆలోచనలు రెండు రకాలుగా తిరుగుతున్నాయి.. అయినా ఈమెకి నామీద ఉండే అభిప్రాయంతో నాకేమి నిమిత్తం? అసలు ఈమె వెనుక నా ఆలోచనలు ఎందుకు పరిగెడుతున్నాయి?

కొత్తగా చేరిన సహఉద్యోగి అని పరిచయం చేసుకోవడం నా ప్రయత్నం కాదు..
నేను అని ఇక్కడ ఒకడిని ఉన్నాను అని ఆమెకి తెలియడం కాదు నాకు కావలసింది..
కలిసి బయలు దేరాము కనుక కాసేపు మాట్లాడాలనే ఊహ లేదు నాలో..
ఏదో ప్రత్యేకత ..
మరి ఏమై ఉంటుంది? కారణం..?
ఇది కాస్త లోతైన విషయమే.. చెప్పలేను..వివరణ లేదు దీనికి.. నిజమా కదా అని ఒక్కోసారి నన్ను నేను తడిమి చూసుకుంటాను.. ఆమెని చూసినపుడల్లా..

కొంత కాలంగా గమనిస్తున్నాను.. ఒక ఆకర్షణ ఆమెని చూసినపుడల్లా.. మునుపెన్నడూ ఆమెతో నేను మాట్లాడి ఎరుగను. ఇదే మొదటి పరిచయం. అయినా నాకు మొదటి పరిచయంలోనే ఇంత కంఫ్యూషన్ ఇంత హెసిటేషన్ ఉంటే.. రేపటి నుండీ నేను ఈమెతో ఏం మాట్లాడతానో.. ఎలా మాట్లాడతానో.. ? ఎక్కువగా నాతో నేను మాట్లాడేస్తూ గడిపేస్తున్నాను.. అయినా ఆ మాటల నిండా ఆమె ఉంది...

ఆలోచనలను కట్టేస్తున్నట్టు ఆమె మాట్లాడడం మొదలు పెట్టింది.. నా పేరు.. అనన్య , మీ పేరు అభిరామ్ అట కదా? ఇందాక ఆఫీసులో చెప్పారు.

ఏం చెప్పారో? మంచిగా చెప్పరా .. మరో రకంగా ఏమైనా చెప్పారా? మనుషులు ముందు ఒక రకంగా మాట్లాడతారు.. వెనుక మరో రకంగా మాట్లాడతారు.. వాళ్ళు మునుపే చాలా మంది గురించి వాళ్ళు ఎదుట లేనపుడు అసహ్యంగా మాట్లాడుకున్నవి నేను విని ఉన్నాను. వీళ్ళకి వేరొకరి గురించి మాట్లాడవలసిన అవసరం ఎందుకు వస్తుంది అసలు? బహుశా జీవితంలో ఎక్కువ శాతం వీళ్ళు ఇతరుల గురించిన వ్యంగ్య వ్యాఖ్యానాలకోసమే వెచ్చిస్తారు కాబోలు..! అసలు ఈమెతో ఎవరు నాగురించి చెప్పారు? ఏమని?

నేను అడిగే అవకాసం తను నాకు ఇవ్వలేదు.

కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్న ప్రొమోషన్స్ కి సంభందించి లిస్టు వచ్చిందిట. అందులో మొదట మీపేరు ఉంది అని అందరూ చెప్పుకుంటున్నారు. congratulations అని ఆమె తన మాటను కొనసాగించింది. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారుట..? ఎప్పుడూ లేనిది ఈ రోజు ఎర్లీ గా వెళ్ళిపోయాడు ప్రొమోషన్ సంగతి ముందే తెలిసి సెలెబ్రేట్ చేసుకోవడానికి అని అనుకుంటున్నారు.. పూర్తి చేసింది.

నేను అనుకున్నంత reserved కాదు ఆమె. పరిచయం ఉన్న వాళ్లకు మల్లె మాట్లాడేస్తోంది. ఒక వేళ నాకు అవకాసం ఇచ్చినా ఇంత చొరవగా నేను మాట్లాడేవాడిని కానేమో?

"ఇంతకు ముందు మీరు ఈ వే లో వెళ్ళడం నేను చూసాను. నేను ఈ రోజు ఇప్పటికే ఆలస్యం అయ్యాను. కనుక కాస్త త్వరగా వెళ్ళవలసి వచ్చి మీ హెల్ప్ అడిగాను. ఒక బర్త్ డే పార్టీ ఉంది."

"ఎక్కడ?" అసంకల్పితంగా అడిగాను నేను.

'శివాజీ నగర్ లో'

"పరవాలేదు లెండి అది నేను వెళ్ళే దారిలోనే ఉంది.. అక్కడి నుండీ ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఇల్లు"

ఆ తరువాత ఒక రెండు నిమిషాలు ఇద్దరి మధ్యన మాటలు లేవు. ఆమె మాట్లాడడానికి ఏమీ లేదు. నేను ఏమి మాట్లాడాలో తెలియదు. మాట్లాడితే ఎమనుకుంటుందో అని కాబోలు? అమ్మాయి మాట్లాడితే చొరవ .. అదే అబ్బాయి మాట్లాడ ప్రయత్నిస్తే మరేదో అర్ధం ఉందంటారు .. అది వేళాకోళమైనా అందులో నిజం లేక పోలేదు.

"ఎలా వుంది ఆఫీసు వాతావరణం?" అడిగాను నేను..

"బానే ఉంది.. ఇంకా అలవాటు పడాలి.." తల పైకి కిందకీ ఆడిస్తూ చెప్పింది.

కాస్త విశాలమైన నుదురు.. చంద్రుడు వంపులు తిరిగి ఉన్నాడా అన్నట్టు కనుబొమ్మలు.. మధ్యలో చిన్న బొట్టు.. దానికి అంటి ఉన్న కాస్త కుంకుమ.. లేత గోధుమ రంగు కన్నులు. కన్నుల మీదకు పడే జుట్టు ను ధిక్కరిస్తూ, రెప రెపలాడిస్తూ కనుబొమ్మలు.. అందమైన రాళ్ళ మధ్యలో అమర్చ బడ్డ జలపాతపు రూపు మల్లె ముక్కూ.. ఎరుపు రంగుకు కాస్త దగ్గరగా పెదవులు.. తెల్లని ఛాయా..

అమ్మాయిలు ఇంత అందంగా ఎందుకు ఉంటారు???? ఈ ప్రశ్న ఆమెని నేను అడగలేదు.

మీరు ఎప్పటి నుండీ ఇక్కడ పని చేస్తున్నారు?

"ఒక రెండు సంవత్సరాలయింది" సమాధానమిచ్చాను.

ఏం చదువుకున్నారు?

" MCA " ఇక్కడే యూనివెర్సిటి నుండీ చేశాను.. మళ్ళీ చెప్పాను

ఓహ్! మంచి తెలివితేటలున్నవాళ్ళన్నమాట ..మీరు? నవ్వింది..

నేనూ నవ్వి ఊరుకున్నాను..

ఆమె మాట వేగంగానూ లేదు.. అలా అని మెల్లగా మాట్లాడనూ లేదు.. మధ్యస్థం గా ఉంది. మాట్లాడాలా వద్ద అన్నట్టుగా లేదు ఆమె మాట..మాటలో స్పష్టత కనపడుతోంది.

మీది ఈ ఊరేనా? ఈ సారి ప్రశ్నించడం నేను మొదలు పెట్టాను..

"లేదండీ.." ఈ మధ్యనే నాన్న గారికి ట్రాన్స్ఫర్ అయ్యింది.. డిల్లీ నుండీ వచ్చాము మేము

తెలుగు బానే మాట్లాడుతున్నారు.. కొనసాగించాను నేను.

మేము తెలుగు వాళ్ళమేనండి కానీ కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నాము అంతే.. ఆమె పూర్తి చేసింది.

మీరేమి చదువుకున్నారు? అని అడిగే లోపే ఆమె వెళ్ళవలసిన శివాజీ నగర్ వచ్చేసింది..

ఉంటాను అని అక్కడ దిగేసి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు కనీసం థాంక్స్ అని కూడా చెప్పలేదు..

నేను మాత్రం మొదటి సారి సిటీలో ట్రాఫిక్ ఎక్కవ లేనందుకు చింతిస్తూ 'ముందుకు వెళ్ళమని' ఆటో అతనితో చెప్పాను ..

ఆ సందు తిరిగేంత వరకూ నా చూపులు అటు వైపే నడిచాయి.. మరి కాసేపటికి నేను దూరంగా వెళ్ళిపోయాను..

To be continued ...

1 comment:

  1. auto story bagundi..mothom complete chestha inka baguntundi..

    ReplyDelete