Tuesday, July 5, 2011

ఆమె తో..

తను వెళ్లి పోతోంది.. నాకు ఇంకా పని వున్నా.. నేను బయటకి వచ్చేసాను..సిస్టం కూడా షట్ డౌన్ చేయలేదనుకుంటా..! కాస్త తొందరలో ఉన్నాను మరి.

కొంత మందికి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారనే ఆలోచనే ఎప్పుడూ కూడాను.. అలాంటి వాళ్ళ కళ్ళు నామీద పడ్డాయి. నేను పట్టించుకోకుండా లోపలినుండీ వెలుపలకు వచ్చేసాను.

ఈరోజు ఎరుపు రంగు శారీ వేసుకుంది. ఆమెని చీరలో చూడడం ఇదే మొదటి సారి నాకు. అసలే ఆ రంగంటే ఇష్టం నాకు, అందునా శారీ..ఇప్పుడు నాలో కవి పుట్టుకొస్తాడేమో అని అనుమానం వచ్చేసింది. అమ్మాయిలు ఎప్పుడూ అందంగానే ఉంటారు. పైగా అదే అమ్మాయిలు కొత్తగా కనిపించినప్పుడు కాస్త ఎక్కువ అందంగా కనపడుతుంటారు.

తననే అనుసరిస్తున్నాను. ఆమె గమనించే ఉంటుంది, కాని నేను వెనుకే ఉన్నట్టు తనకి తెలియనట్టు ముందుకు వెళుతోంది. అమ్మాయిలు ఎప్పుడూ ముందు అబ్బాయిలే చొరవ తీసుకోవాలని చూస్తుంటారని గుర్తుకొచ్చింది. Friday కావడం మూలాన సాయంత్రం ఏదో బయటకి వెళ్ళే ప్లాన్ వేసుకుందని తెలుసుకున్నాను. తన పొడవాటి జుట్టు ముడులు వేయకుండా అలానే వదిలేసింది. ఆమె నడుస్తుంటే అవి కూడా నాలాగే ఆమెననుసరిస్తున్నాయేమో అనిపించింది నాకు.

ఆమెని పలకరించడానికి ఉపక్రమించాను..excuse me .. హలో మిమ్మల్నే.. కొత్తగా చేరినట్టునారు కంపెనీలో?

"అవును" ముక్తసరిగా సమాధానమిచ్చింది ఆమె.

"అదే ఆ రిపోర్టింగ్ టీం లో చూసాను మిమ్మల్ని" అని ఏదో చెప్పబోయాను. ఆమె నా మాటలకి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు లేదు. "నేను మీ నెక్స్ట్ block లో పని చేస్తున్నాను" కొనసాగించాను.

వెనక పడే వాళ్లకి అమ్మాయిలు ఎంత ప్రియారిటి ఇస్తారో తెలిసింది అప్పుడు నాకు. ఒక్క క్షణం నన్ను నేను తిట్టుకున్నాను "నీకు ఇవ్వన్నీ అవసరమా?" అని. కాని ఆ ఎరుపు రంగు శారీ గుర్తుకు వచ్చి మళ్ళీ ఓ అడుగు ముందుకు వేసాను. దగ్గర దగ్గర ఇద్దరం కలిసే నడుస్తున్నాం కాని ఓ నిమషం ఏం మాట్లాడుకోలేదు.
ఆమెని పలకరించినప్పుడు నన్ను చూసిన ఆమె కళ్ళు మాత్రం ఇంకా నాకు అలానే కనపడుతున్నాయి.

ఆఫీసునుండీ బస్టాప్ ఎంతో దూరంలో లేదు. రెండు నిమిషాలు నడక అంతే. ఈ రెండు నిమిషాలు ఆమెతో పాటే నడుస్తూ అడుగులు లెక్క పెట్టుకుంటున్నాను. అడుగువేస్తే నేల కందిపోతుందేమో అన్నట్టు నడుస్తోంది ఆమె... గాలికి, దూది పింజె మెల్ల మెల్లగా ముందుకు వెడుతున్నట్టు..నిశ్సబ్దంగా ఒక లయతో ఉంది అది. ఎక్కడ అందంగా కనిపించదు ఈమె నాకు? అనే అనుమానం వచ్చింది.

.
.
.
.
.

ఇప్పటికే చాలా సేపు అయ్యింది ఇక్కడికి వచ్చి. బహుశా ఒక అరగంట దాటి ఉంటుంది. బస్సులు రావడం లేదు. మొదటిసారి బస్సు టైం కి రాకపోవడం నచ్చింది నాకు. ప్రతి నిమిషానికీ చేతి గడియారం చూసుకుంటోంది. ఎదురుచూపులు..కాస్త విసుగు..కాస్త కోపం..ఒకింత తొందర.. అన్నీ ఆమెలో స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏది ఏమైనా గడియారం గడిచేకొద్దీ ఆమె నాకు మరింత అందంగా కనపడుతోంది..ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాను.. అమ్మాయిలు ఎంత అందంగా వుంటారు? అయినా .. లేకపోతే అబ్బాయిలు మరి ఎలా వెంటపడతారు..? ఒక పిచ్చి ప్రశ్న ఒక పనికిమాలిన సమాధానం.. ఆలోచించడం ఆపేస్తే మంచిదేమో! లేకపోతే నన్ను నేను తిట్టుకోవాలి.

బస్సులు రావడం లేదో ఏమో, అంత పెద్ద రద్దీగా ఏమీ లేదు ఇక్కడ. ఎవరో మాట్లాడుకుంటున్నారు. ట్రాఫిక్ వల్ల ఈ పూట బస్సు రూట్లు మార్చారు..అని.
దొరికిన వాళ్ళు దొరికినట్టు ఏవో ఆటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయినా ఇంకా జనాలు ఉంటూనే ఉన్నారు. ఇలా ఉన్నా నేను ఇంటికి ఎలాగ వెళతాను అన్న ఆలోచన మాత్రం నాకు రావడం లేదు ఎందుకో? అయినా ఇంకాస్త సేపు ఇక్కడే ఉండి నేను ఏం చెయ్యాలి? అసలు ఇక్కడ ఎందుకు వున్నాను? ఆమె కోసమా? అసలు ఆమే ఎందుకు? ఇంత కాలం లేనిది ఇప్పుడెలా? ప్రశ్నలు మోహరిస్తున్నాయి..

Excuse me .. ఎవరో పిలుస్తున్నారు. ఎవరు? ఆమే!? Excuse me .. నా సెల్ ఫోన్ మిస్ అయ్యింది. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక సారి మీ ఫోన్ నుండీ నా ఫోన్ కి కాల్ చేసుకోవచ్చా? మొత్తం బాలన్సు అయ్యేదాకా మాట్లాడుకోమని చెపుదామన్నంత ఉత్సాహం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడకుండా జేబులోంచి ఫోన్ తీసి ఇచ్చాను.
ఆమె ఒకసారి చెక్ చేసుకుని చెప్పింది.. థాంక్ గాడ్ నా సెల్ ఫోన్ ఎక్కడికీ పోలేదు, డెస్క్ దగ్గరే మర్చిపోయాను. ఫోన్ ఇచ్చినందుకు థాంక్స్.. అని తిరిగి ఆఫీసుకు బయలుదేరింది.

ఏమన్నా అనుకుంటుందేమో అని కూడా లేకుండా తన వెనుకే అలాగే వెళ్లిపోదామనిపించిది ఆఫీసుకు.. కానీ పని వొదిలేసి పారిపోయిన నన్ను ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చావని నా చుట్టూ వాళ్ళు చూసే చూపులు గుర్తొచ్చాయి.. అవి వెక్కిరింతో.. జాలో..కోపమో.. అర్ధమయి చావదు.. ఆ చావు కన్నా ఇక్కడ చావడమే మేలని ఆగిపోయా..

అయిదు నిమిషాలు..
పది నిమిషాలు..
పావుగంట..
ఆమె ఇంకా రావడం లేదు..

ఎక్కడో ఆశ, వెనక్కి వచ్చినతరువాత మళ్లీ నాతో మాట్లాడుతుందని.. అందుకే వెళ్ళ బుద్ది కావడం లేదు. కానీ ఎంత సేపని ఇలా ఎదురు చూసేది? ఆమె అక్కడినుండీ ఇంకా ఎక్కడికైనా వెళ్లిపోయుంటే? ఆఫీసులో మళ్ళీ పని పడి ఆగిపోయిందా? ఎందుకని ఇంకా రాలేదు?

సరే, ఈలోపల ఏదో ఆలోచన..ఇందాక తన సెల్ ఫోన్ కు నా మొబైల్ నుండీ కాల్ చేసింది కదా.. అంటే తన నెంబర్ దొరికినట్టే.. అనుకుంటూ డయల్డ్ కాల్స్ చూసాను. ఎంత తెలివి గలది? కాల్ చేసిన తరువాత డయల్డ్ కాల్స్ లోంచి తన నెంబర్ డిలీట్ చేసి మరీ ఫోన్ ఇచ్చింది. నన్ను నేను తిట్టుకోవడం మొదలు పెట్టాను.. పని ఉండి పలకరించింది కానీ నీ మీద ఏదో పుట్టి కాదు. అయినా నిన్నేమైనా ఇక్కడ ఎదురు చూడమని చెప్పిందా? వెధవ.. వెదవన్నర వెధవ.. నడువు ముందు ఇక్కడి నుంచీ.

సరే ఏదో ఆటో వస్తోంది..
బాబు శాంతి నగర్ వస్తావా? అడిగాను. మీటర్ వెయ్యను సార్ మరి పర్లేదా? తిరిగి నన్నే ప్రశ్నించాడు. ఆటో వాళ్ళు ఎలాగూ చెప్పింది వినరు. మరి పెద్ద ఏదో చాయిస్ ఇచ్చినట్టు అడగడమెందుకో "మీటర్ వెయ్యను సార్ మరి పర్లేదా?". ఇప్పుడు వీడిని మీటర్ వెయ్యమని నేను అడిగానా? నాటకాలూ వీడూనూ.. సరే ఎంత తీసుకుంటావ్? నూట యాబై ఇవ్వండి అన్నాడు. పక్కనే ఉందికదయ్యా 100 చేస్కో అన్నాను. లేదు సార్ ఇంకో ఆటో చూస్కోండి. వాడి నమ్మకం ముందు నేను ఓడిపోయాను.. సరే కానీ 150 ఖాయం చేసుకుందాం.

ఎక్కి కూర్చున్నాను. ఈ సారి ఆమె వస్తుందేమో అని వెనక్కు చూడలేదు. మరో సారి నిరాశకు గురికావడం నాకు ఇష్టం లేదు. ఆటో బయలుదేరింది.

excuse me ..excuse me .. మిమ్మల్నే..ఎక్కడినుండో ఒక గొంతు..అది ఆమెదే.. ఆటో ఆగింది..

నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. నేను కూడా మీతోపాటూ ఆటోలో రావచ్చా?

తప్పకుండా.. అని నా మాట పూర్తి కాకుండానే తను చొరవ తీసుకుని లోపల కూర్చుంది.

To be continued ..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

3 comments:

  1. కధ ఆసక్తికరంగా ఉంది.. గతం ఎమన్నా నేమరేసుకుంట్టున్నరేమో అని కూడా అనిపిస్తోంది ... కధ అంతా అబ్బాయి వైపు నుంచే ఉంది.. అమ్మాయి మనోగతం కూడా తెలుస్తే బాగుంటుంది ఏమో.. నా ఆలోచనలు ఎలా ఉన్నా కధ ఆరంభం బాగుంది.. ఈ టెంపో క్యారీ చేస్తూ కధ సాగుతుంది అని అనుకుంటున్నాను ... అల్ ది బెస్ట్ !!

    సరదాగా ఇంకో విషయం.. ఈ ఆటో లో ప్రేమకధ రెండో సారి అనుకుంట... మీకు ఆటలతో అనుబంధం బాగా ఉన్నట్లు ఉంది ;)

    ReplyDelete
  2. hi siva ..epudu varuku bagundi..migitha story chadavaka cheputhanu

    ReplyDelete