Thursday, July 28, 2011

ఒక అర్ధం లేని ప్రశ్న ...కలలకు మెలకువా?
కన్నులకు తీరని ఆకలా?
ఊహలకు వీధి దీపమా?
నిను దాటిన ఆలోచనలకు సంకెలా?
నీ వెనుక నా పరుగులకు వేగమా?
ఏది వీటిలో నీ చూపుకు అర్ధం?

నిదుర చెడినా నీవే..
గాలిలో రాతల నిండుగ నీవే..
అస్పష్టంగా కదలిపోయే ఆ మేఘాల రూపులో నీవే..
వెనుక చుక్కలూ నీవే..
రాతిరి చలికి వెచ్చదనమై నా అంత దగ్గరగా నీవే..
నేనలవాటు పడిన ఆశ్చర్యానివి నీవే..
ఈ వరుసకు లయ నీవే..

అన్నీ నీవై పోతున్నపుడు...
నా ప్రశ్నకు అర్ధమేముంటుంది ..
అయినా అది ఒక పిచ్చి ప్రశ్నే అవుతుంది...*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, July 25, 2011

ఎవరి వ్యతిరేకత అది?ఆకాశం పగిలి నెత్తిమీద పడుతున్నట్టు ఉంటుందా?
ఏకాంతంలో ఎవరి పాట వారికి కూడా వినపడనట్టు గా ఉంటుందా?
కలిసే యత్నంలో కెరటం కసిగా తోసేసినట్టు ఉంటుందా?
ఆకాశంలో సూరీడు తన శక్తిని అంతటినీ బరువుగా బుజాలపై వదిలేసినట్టు ఉంటుందా?
నిప్పు కణికలు వడగళ్ళు అయి వర్షిస్తున్నట్టు ఉంటుందా?
నిశి అన్ని రంగులని తొక్కిపెట్టినట్టు ఉంటుందా?
నీడలు కూడా దొరకని మనిషి రూపమల్లె ఉంటుందా?
అంతరంగాన అఘాదం ఊడలై వేళ్ళూనుకుపోయినట్టు ఉంటుందా?
అంతః చక్షువులు పొడుచుకున్నట్టు ఉంటుందా?

ఎంత భయంకరంగా ఉంటుంది ?
వ్యతిరేకత?

ఎవరి వ్యతిరేకత అది?
ఎవరి పై వారి వారిదై ఉంటుంది..
అందుకే అది అంత ప్రమాదమైనది
అంతగా భయానకమైనది
అంత భరించరానిది..

చివరకు మిగిలేది - బుచ్చి బాబు

చివరకు మిగిలేది - పుస్తకం ఎప్పటి నుండో చదవాలి అని ఆలోచన.. కానీ కుదరలేదు.. ఎందుకు?

కొనడానికి బద్ధకం.. - ఒక లక్షణం
షాపుకు వెళ్ళాలి అనేంతగా ఆ పుస్తకంలో ఏముంది? - ఒక అనుమానం
మతి మరపు.. - ఒక జబ్బు
ఇప్పుడు చదవాలి అన్న ఆత్రుత లేకపోవడం - ఒక అమాయకత్వం
ఇంకా ఇంకా.. ఇంకా

అవును నిజమే "మనిషి తన చేష్టలకు ఎప్పుడూ ఏవో కారణాలు వెతుక్కుంటూ ఉంటాడు".

కారణాలు ఏవైనా ఈ పుస్తకం చదవడం లో అనుకున్న సమయానికన్నా జాప్యం చేసాను. పుస్తకం కొని చదవడం మొదలు పెట్టేముందు ఎవరినో తెలిసినవాళ్ళని .. (నాలాగ .. కాదు కాదు.. నాకంటే చాలా ఎక్కువగా పుస్తకాల పురుగులైన వారినే) ఆ పుస్తకం పై వారి అభిప్రాయం అడిగాను... ఆ పుస్తకమా ఎడుకుకొన్నావు దండుగ.. ఇప్పటికే నేను రెండు సార్లు చదివాను. అర్ధం కాక మధ్యలోనే వదిలేసాను. నా జీవితం లో రెండు సార్లు చదివినా పుస్తకమంటే అదే తెలుసా? అడిగితే ఆ పుస్తకమేదో నేనే ఇచ్చేవాడిని.. అన్నాడు. మరొకరు అది ఏమిటో తెలియలేదు అని అనేసారు.

ఇదేమిటి ఈ పుస్తకంలో ఎముందబ్బా?
అనవసరంగా కొన్నానా?
ఇప్పుడు చదవాలా వద్దా?
కొట్టువాడు వెనుకకు తీసుకోడు.. అయినా కొన్న పుస్తకం వెనుకకు ఇచ్చే అలవాటు.. ఆలోచన నాకు లేవు..
అసలు అంత అర్ధం కానీ విషయం ఏముంది ఈ పుస్తకంలో?
అసలిది పుస్తకమేనా మరే లిపిలో రాసిన ఆదిమానవుల చరిత్రా?

ఏమో ? ఏముందో ? కానీ ఈ పుస్తకం చదవక మునుపే ఇందులో ఏదో ఉంది అనేది నా నిశ్చిత అభిప్రాయం.. ఆ అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో నాకూ తెలియదు. అదే నన్ను పుస్తకం కొనేదాకా..ఇప్పుడు ఈ పుస్తకం ముందు కూర్చునేలా చేసింది.

సరే.. చదివేస్తే పోలా! ఒక తెగింపు.. ఒక పనికి నన్ను నేను పురికోల్పుకున్నాను.. ఏ పుస్తకం చదివినా మొదట ముందు మాట నుండీ చదవడం నా అలవాటు.

రచయిత బుచ్చిబాబు అన్నారు.. ఈ పుస్తకంలో ఏముందో? నాకు చాలా లోపాలు కనిపించాయి.. ముద్రణకు కావాలి అని అంటే.. గతంలో పత్రికలలో అచ్చు వేయబడ్డ ఈ సీరియలు అంతా అట్ట కట్టి ఇచ్చేసాను అని.

మొదటి కొన్ని పేజీలు సరిగా అర్ధం కావడం లేదు. యాస.. రచయిత శైలి.. వగైరా వంటివి..

అలా అలా చదువుకుంటూ వెడితే.. పూర్తిగా పుస్తకం పూర్తి చేస్తే. నాకు 267 పేజీల కవిత్వం కనపడింది. మనిషి ఆలోచనలు.. అనుభవాలు.. ఎలా పెర్సీవ్ చేసుకుంటాడో ఆయన అద్భుతం గా రాసారు.

సరే..
నేను చెప్పదలచినది ఏమంటే..

ఇది నేను చదివిన ఉత్తమ పుస్తకం అని..

అయితే ఒక లోపమేమంటే.. (లోపం అనొచ్చో లేదో తెలీదు నాకు) కానీ కధ అంతా ఒక దయానిది అనే పాత్ర (మగ పాత్ర) ను పెట్టి నడిపించి అతని దృక్కోణం లోనుండి మాత్రమే కధను నడిపినట్టు అనిపించింది.
మరిన్ని పార్శ్వాలు కనపరచి ఉంటే ఇంకా గొప్పగా అనిపించేదేమో..

ఇది విమర్శా కాదు.. విశ్లేషణ కాదు. అభిప్రాయం మాత్రమే..

శివ చెరువు

Monday, July 18, 2011

అదే అర్ధం కాని ..నన్ను నేను కనుగొంటున్నాను

నిరంతరం అంతరాయం లేని..
ఒక శబ్దం .. ఒక హోరు.. లోపల నుండీ..
ఆ సముద్రం యేమని చెపుతోందో.?
తెలుసుకుందామని ప్రయత్నిస్తే
అదే అర్ధం కాని సంగీతం వినపడుతోంది..

అలుపు, విసుగు లేని ..
ఓ స్పర్శ.. ఓ పలకరింపు.. లోపల నుండీ..
ఆ సముద్రం ఎందుకు ఓదారుస్తోందో?
తెలుసుకుందామని ప్రయత్నిస్తే
అదే అర్ధం కాని చనువు దగ్గరగా అనిపిస్తోంది..

ఆగిపోవడం ఆగడం లేని
ఆ నడక.. ఆ నాట్యం.. లోపల నుండీ..
ఆ సముద్రం ఎటువైపుకు పయనిస్తోందో?
తెలుసుకుందామని ప్రయత్నిస్తే
అదే అర్ధం కాని దృశ్య కావ్యం గోచరిస్తోంది..

తిరగపడ్డ పడవలు
విసుగుపడ్డ సుడులు
ఎగసి పడే కెరటాలు
కాన రాని నిధుల శిధిలాలు
నురగలు కడిగే అరుగులు

తెలుసుకుందామని ప్రయత్నిస్తే..
నన్ను నేను కనుగొంటున్నాను

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, July 13, 2011

ఉన్నది నీవే.. మిగిలిపోతున్నదీ నీవే!
నీరుగారిపోకు
దారినుండి జారి పోకు
వెనుకకు నీ అడుగులు పడనీకు..

పద..
పద ..
ముందుకు పద..

రేపటితో పరిచయం ఎవడికి?
నిన్నలో నిలిచిపోయే అవకాసం ఎవడికి?
నీకా?
నాకా?

తప్పు చేస్తావా?
చేయి!
ఈ రోజు కాకుంటే రేపటి రోజును..దక్కించుకుంటావ్ ..

కానీ తప్పుకుపోతావా?
పో!
పో!
పోతే పో!
శాశ్వతంగా పో!
అదే రేపటి రోజు పూర్తిగా అనంతమైన చీకటిలోకి తోయబడతావు..
ఆ కారు చీకట్లు కూడా నీ సృష్టి అని గురుతుకొచ్చినప్పుడల్లా. నీ నీడ నిన్ను భయపెడుతుంది...

ఇంకెవరో వచ్చి నడిపిస్తారని
నువ్వెదురు చూసే ఆ ముహూర్తం
లేదని.. రాదనీ నీకూ తెలుసు

సరిపెట్టుకునే..
సర్దుకుపోయే..
సరదా రోజులు అయిపోయాయి.. వెళ్ళిపోయాయి.

ఉన్నది నీవే..
మిగిలిపోతున్నదీ నీవే!

సమస్య నీవైనపుడు..
ఆ పరిష్కారమూ నీవే అయి ఉండాలి..

ప్రశ్నలు నీవైనపుడు..
బదులూ నీవుగానే మారాలి

పద..
పద ..
ముందుకు పద..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Sunday, July 10, 2011

అందుకే మనమధ్య ఏ మాటలూ మిగలలేదు'నేను' అని అనుకున్నపుడల్లా..
'నీవు' అని తెలుసుకుంటున్నాను..
'నా' జాడ తెలియనపుడల్లా
'నిన్ను' వెతుకుతున్నాను..

నిలుపలేను నిమిషమైనా నా నడక
నీతో ..

క్షణ కాలం కనపడవు ఏమో?
గుండె చప్పుడు ఆగిపోయినట్టవుతుంది నాకు

మరి కాసేపటికి ఎదురవుతావా?
వేల సంవత్సరాలకు ఊపిరి పోసినట్టవుతుంది మళ్ళీ..

ఎన్ని లక్షల సార్లు జన్మించానో
ఎన్ని వేల కోట్ల ఊహలకు ఊపిరినిచ్చానో
నీవే నిండుగా..

ప్రతి ఉదయం రంగుల వెలుగై నిలిచింది.
చీకటికి ఎప్పటికీ సెలవే మిగిలింది..
నీవే నిండగా..

నిజముగా నిజం..
నువ్వు మాత్రమే నా నిజం..

నీతో నే చెప్పని ఈ మాటలు..
'నీ' 'నా' 'మన' దగ్గరతనంలో నీవెప్పుడో తెలుసుకున్నావన్న సంగతి నాకూ తెలుసు..

అందుకే మనమధ్య ఏ మాటలూ మిగలలేదు


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Wednesday, July 6, 2011

నిశ్శబ్దం మాట్లాడుతోంది..

ఒక అద్భుతం దర్శనమిచ్చినపుడు

ఒక ఆశ్చర్యం తలుపు తట్టినపుడు

ఒక శోకం నిదుర చెడినప్పుడు

ఒక దూరానికి అడుగుల అవసరం లేనపుడు

ఒక నమ్మకం నిశ్చలమైనపుడు

ఒక ఎదురుచూపుకు పనిలేనపుడు

ఒక భాషకు కన్నులు రచన చేస్తున్నప్పుడు

ఒక నువ్వు ఒక నేను లేనప్పుడు

ఒక మాటకు మాటలు లేనపుడు

నిశ్శబ్దం మాట్లాడుతోంది..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, July 5, 2011

ఆమె తో..

తను వెళ్లి పోతోంది.. నాకు ఇంకా పని వున్నా.. నేను బయటకి వచ్చేసాను..సిస్టం కూడా షట్ డౌన్ చేయలేదనుకుంటా..! కాస్త తొందరలో ఉన్నాను మరి.

కొంత మందికి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారనే ఆలోచనే ఎప్పుడూ కూడాను.. అలాంటి వాళ్ళ కళ్ళు నామీద పడ్డాయి. నేను పట్టించుకోకుండా లోపలినుండీ వెలుపలకు వచ్చేసాను.

ఈరోజు ఎరుపు రంగు శారీ వేసుకుంది. ఆమెని చీరలో చూడడం ఇదే మొదటి సారి నాకు. అసలే ఆ రంగంటే ఇష్టం నాకు, అందునా శారీ..ఇప్పుడు నాలో కవి పుట్టుకొస్తాడేమో అని అనుమానం వచ్చేసింది. అమ్మాయిలు ఎప్పుడూ అందంగానే ఉంటారు. పైగా అదే అమ్మాయిలు కొత్తగా కనిపించినప్పుడు కాస్త ఎక్కువ అందంగా కనపడుతుంటారు.

తననే అనుసరిస్తున్నాను. ఆమె గమనించే ఉంటుంది, కాని నేను వెనుకే ఉన్నట్టు తనకి తెలియనట్టు ముందుకు వెళుతోంది. అమ్మాయిలు ఎప్పుడూ ముందు అబ్బాయిలే చొరవ తీసుకోవాలని చూస్తుంటారని గుర్తుకొచ్చింది. Friday కావడం మూలాన సాయంత్రం ఏదో బయటకి వెళ్ళే ప్లాన్ వేసుకుందని తెలుసుకున్నాను. తన పొడవాటి జుట్టు ముడులు వేయకుండా అలానే వదిలేసింది. ఆమె నడుస్తుంటే అవి కూడా నాలాగే ఆమెననుసరిస్తున్నాయేమో అనిపించింది నాకు.

ఆమెని పలకరించడానికి ఉపక్రమించాను..excuse me .. హలో మిమ్మల్నే.. కొత్తగా చేరినట్టునారు కంపెనీలో?

"అవును" ముక్తసరిగా సమాధానమిచ్చింది ఆమె.

"అదే ఆ రిపోర్టింగ్ టీం లో చూసాను మిమ్మల్ని" అని ఏదో చెప్పబోయాను. ఆమె నా మాటలకి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు లేదు. "నేను మీ నెక్స్ట్ block లో పని చేస్తున్నాను" కొనసాగించాను.

వెనక పడే వాళ్లకి అమ్మాయిలు ఎంత ప్రియారిటి ఇస్తారో తెలిసింది అప్పుడు నాకు. ఒక్క క్షణం నన్ను నేను తిట్టుకున్నాను "నీకు ఇవ్వన్నీ అవసరమా?" అని. కాని ఆ ఎరుపు రంగు శారీ గుర్తుకు వచ్చి మళ్ళీ ఓ అడుగు ముందుకు వేసాను. దగ్గర దగ్గర ఇద్దరం కలిసే నడుస్తున్నాం కాని ఓ నిమషం ఏం మాట్లాడుకోలేదు.
ఆమెని పలకరించినప్పుడు నన్ను చూసిన ఆమె కళ్ళు మాత్రం ఇంకా నాకు అలానే కనపడుతున్నాయి.

ఆఫీసునుండీ బస్టాప్ ఎంతో దూరంలో లేదు. రెండు నిమిషాలు నడక అంతే. ఈ రెండు నిమిషాలు ఆమెతో పాటే నడుస్తూ అడుగులు లెక్క పెట్టుకుంటున్నాను. అడుగువేస్తే నేల కందిపోతుందేమో అన్నట్టు నడుస్తోంది ఆమె... గాలికి, దూది పింజె మెల్ల మెల్లగా ముందుకు వెడుతున్నట్టు..నిశ్సబ్దంగా ఒక లయతో ఉంది అది. ఎక్కడ అందంగా కనిపించదు ఈమె నాకు? అనే అనుమానం వచ్చింది.

.
.
.
.
.

ఇప్పటికే చాలా సేపు అయ్యింది ఇక్కడికి వచ్చి. బహుశా ఒక అరగంట దాటి ఉంటుంది. బస్సులు రావడం లేదు. మొదటిసారి బస్సు టైం కి రాకపోవడం నచ్చింది నాకు. ప్రతి నిమిషానికీ చేతి గడియారం చూసుకుంటోంది. ఎదురుచూపులు..కాస్త విసుగు..కాస్త కోపం..ఒకింత తొందర.. అన్నీ ఆమెలో స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏది ఏమైనా గడియారం గడిచేకొద్దీ ఆమె నాకు మరింత అందంగా కనపడుతోంది..ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాను.. అమ్మాయిలు ఎంత అందంగా వుంటారు? అయినా .. లేకపోతే అబ్బాయిలు మరి ఎలా వెంటపడతారు..? ఒక పిచ్చి ప్రశ్న ఒక పనికిమాలిన సమాధానం.. ఆలోచించడం ఆపేస్తే మంచిదేమో! లేకపోతే నన్ను నేను తిట్టుకోవాలి.

బస్సులు రావడం లేదో ఏమో, అంత పెద్ద రద్దీగా ఏమీ లేదు ఇక్కడ. ఎవరో మాట్లాడుకుంటున్నారు. ట్రాఫిక్ వల్ల ఈ పూట బస్సు రూట్లు మార్చారు..అని.
దొరికిన వాళ్ళు దొరికినట్టు ఏవో ఆటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయినా ఇంకా జనాలు ఉంటూనే ఉన్నారు. ఇలా ఉన్నా నేను ఇంటికి ఎలాగ వెళతాను అన్న ఆలోచన మాత్రం నాకు రావడం లేదు ఎందుకో? అయినా ఇంకాస్త సేపు ఇక్కడే ఉండి నేను ఏం చెయ్యాలి? అసలు ఇక్కడ ఎందుకు వున్నాను? ఆమె కోసమా? అసలు ఆమే ఎందుకు? ఇంత కాలం లేనిది ఇప్పుడెలా? ప్రశ్నలు మోహరిస్తున్నాయి..

Excuse me .. ఎవరో పిలుస్తున్నారు. ఎవరు? ఆమే!? Excuse me .. నా సెల్ ఫోన్ మిస్ అయ్యింది. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక సారి మీ ఫోన్ నుండీ నా ఫోన్ కి కాల్ చేసుకోవచ్చా? మొత్తం బాలన్సు అయ్యేదాకా మాట్లాడుకోమని చెపుదామన్నంత ఉత్సాహం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడకుండా జేబులోంచి ఫోన్ తీసి ఇచ్చాను.
ఆమె ఒకసారి చెక్ చేసుకుని చెప్పింది.. థాంక్ గాడ్ నా సెల్ ఫోన్ ఎక్కడికీ పోలేదు, డెస్క్ దగ్గరే మర్చిపోయాను. ఫోన్ ఇచ్చినందుకు థాంక్స్.. అని తిరిగి ఆఫీసుకు బయలుదేరింది.

ఏమన్నా అనుకుంటుందేమో అని కూడా లేకుండా తన వెనుకే అలాగే వెళ్లిపోదామనిపించిది ఆఫీసుకు.. కానీ పని వొదిలేసి పారిపోయిన నన్ను ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చావని నా చుట్టూ వాళ్ళు చూసే చూపులు గుర్తొచ్చాయి.. అవి వెక్కిరింతో.. జాలో..కోపమో.. అర్ధమయి చావదు.. ఆ చావు కన్నా ఇక్కడ చావడమే మేలని ఆగిపోయా..

అయిదు నిమిషాలు..
పది నిమిషాలు..
పావుగంట..
ఆమె ఇంకా రావడం లేదు..

ఎక్కడో ఆశ, వెనక్కి వచ్చినతరువాత మళ్లీ నాతో మాట్లాడుతుందని.. అందుకే వెళ్ళ బుద్ది కావడం లేదు. కానీ ఎంత సేపని ఇలా ఎదురు చూసేది? ఆమె అక్కడినుండీ ఇంకా ఎక్కడికైనా వెళ్లిపోయుంటే? ఆఫీసులో మళ్ళీ పని పడి ఆగిపోయిందా? ఎందుకని ఇంకా రాలేదు?

సరే, ఈలోపల ఏదో ఆలోచన..ఇందాక తన సెల్ ఫోన్ కు నా మొబైల్ నుండీ కాల్ చేసింది కదా.. అంటే తన నెంబర్ దొరికినట్టే.. అనుకుంటూ డయల్డ్ కాల్స్ చూసాను. ఎంత తెలివి గలది? కాల్ చేసిన తరువాత డయల్డ్ కాల్స్ లోంచి తన నెంబర్ డిలీట్ చేసి మరీ ఫోన్ ఇచ్చింది. నన్ను నేను తిట్టుకోవడం మొదలు పెట్టాను.. పని ఉండి పలకరించింది కానీ నీ మీద ఏదో పుట్టి కాదు. అయినా నిన్నేమైనా ఇక్కడ ఎదురు చూడమని చెప్పిందా? వెధవ.. వెదవన్నర వెధవ.. నడువు ముందు ఇక్కడి నుంచీ.

సరే ఏదో ఆటో వస్తోంది..
బాబు శాంతి నగర్ వస్తావా? అడిగాను. మీటర్ వెయ్యను సార్ మరి పర్లేదా? తిరిగి నన్నే ప్రశ్నించాడు. ఆటో వాళ్ళు ఎలాగూ చెప్పింది వినరు. మరి పెద్ద ఏదో చాయిస్ ఇచ్చినట్టు అడగడమెందుకో "మీటర్ వెయ్యను సార్ మరి పర్లేదా?". ఇప్పుడు వీడిని మీటర్ వెయ్యమని నేను అడిగానా? నాటకాలూ వీడూనూ.. సరే ఎంత తీసుకుంటావ్? నూట యాబై ఇవ్వండి అన్నాడు. పక్కనే ఉందికదయ్యా 100 చేస్కో అన్నాను. లేదు సార్ ఇంకో ఆటో చూస్కోండి. వాడి నమ్మకం ముందు నేను ఓడిపోయాను.. సరే కానీ 150 ఖాయం చేసుకుందాం.

ఎక్కి కూర్చున్నాను. ఈ సారి ఆమె వస్తుందేమో అని వెనక్కు చూడలేదు. మరో సారి నిరాశకు గురికావడం నాకు ఇష్టం లేదు. ఆటో బయలుదేరింది.

excuse me ..excuse me .. మిమ్మల్నే..ఎక్కడినుండో ఒక గొంతు..అది ఆమెదే.. ఆటో ఆగింది..

నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. నేను కూడా మీతోపాటూ ఆటోలో రావచ్చా?

తప్పకుండా.. అని నా మాట పూర్తి కాకుండానే తను చొరవ తీసుకుని లోపల కూర్చుంది.

To be continued ..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, July 4, 2011

ఆ కాగితాలలోనే..!
ఒకటి కాదు, రెండు కాదు..!

కాగితం..
మొత్తం కలలన్నిటినీ అక్షరాల రూపంలో తాగేసింది..

ఊహలు పుట్టినప్పటినుండీ పెరుగుతున్నంత కాలం కూడా
ఇదే జరుగుతోంది..
సిరా చుక్కలుగా రూపాంతరం చెందడం
అదే పుస్తకంలో కలిసిపోవడం..
వాటి చరిత్రను అక్కడే రాసుకోవడం..
అప్పుడప్పుడూ తెరచి చదువుకోవడం..

ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాను
ఈ పుస్తకం ఎంత పెద్దదో..! నిండదు ఎన్నటికీ.. అని

కానీ..
ఇప్పుడు భయపడుతున్నాను
కారణం..?
చోటు చాలక.. నా కొత్త ఆశలు పదాలు పెనవేసుకోవడంలో తడపడుతున్నాయి

అందుకే అంతగా తనలో ఏం నింపుకుందో అనుకుంటూ...!
ఓ సారి స్వప్నావలోకనం చేసుకోవడం మొదలు పెట్టాను

ఎంత అందంగా ఉన్నదో అక్కడ?
అద్దం లాగ..

ఎలాంటి శబ్దరాహిత్యతన ఉన్నదో అక్కడ ?
స్పష్టంగా వినగలిగేటట్టు..

ఎలాంటి అనుభూతి ఉన్నదో అక్కడ?
ఆనందమే తన్మయంచెందేట్టు..

అంతా ఒక అధ్బుతమే దర్సించినట్టయింది

కానీ..
అక్కడే మొరొకటి చూస్తాననుకోలేదు..
ఏళ్ళ నుండీ ఏవో ఆలోచనలు ఆయువు పోసుకుని
ఇక్కడే ఇల్లు కట్టుకు నివసిస్తున్నాయి..

నిజానికి వాటికి ఉనికి లేదు..
వాటి ఉనికిని నేనే!

అందుకే నా కలాన్ని కదలనీయక
కాలాన్ని కట్టేద్దామని చూస్తున్నాయి..

అవసరం లేనివి..
అవసరానికి రానివి..
ఎన్నో?

కలవనివి..
'కల్ల' అనేవి..
ఎన్నో?

వ్యక్తిత్వం లేనివి..
వ్యక్తీకరించాలేనివి..
ఎన్నో?

నిజానికి దూరంగా..
నిస్సిగ్గుగా..
ఎన్నో? ఎన్నో?

తమ అస్తిత్వం కోసం దాగివున్నవి..
అన్నీ ఆ కాగితాలలోనే..!

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.