Tuesday, June 28, 2011

అన్నిటికన్నా ఉత్తమమైన జ్ఞాపిక..

కాసేపు ఏకాకిలా అనిపిస్తాను..
కాసేపు ఒక్కడినే కాను అని గుర్తు చేసుకుంటాను..

కాసింత నిద్ర..
కాసేపు మెలకువ..
కాస్తంత చీకటి..
అంతలోనే వేకువ..
అన్ని అధ్యాయాలను కూడుకుని ఇదే నా జీవితమని తెలుసుకుంటూ ఉంటాను.

తల ఎత్తి పైకి చూసినప్పుడల్లా..
కోరుకునే రేపటి రోజు ఎంతో ఎత్తులో కనపడుతూ ఉంటుంది..
మొదటలో తడపడినా ..
నెమ్మది నెమ్మదిగా ఆకాంక్షలకు ఆచరణలను జోడించి
నిచ్చెనను తయారు చేసుకుంటాను.. పై పైకి వెడుతుంటాను..

మధ్య మధ్యలో ..
ఆశలు ఆంక్షల దెబ్బలు తగిలి జబ్బు పడతాయి..
తిరిగి తేరుకున్నాక తూరుపుని చూస్తాయి..
అటుపై..
అటువైపే పయనిస్తాయి..

పయనపు ప్రారంభంలోని దూరాలు..
ఆఖరుకు చేరువవుతాయి..
చేరుకున్న శిఖరాగ్రాలు..
చుట్టూ ప్రపంచాన్ని కొత్తగా చూపిస్తాయి..
సాధించిన విజయాలు..
ప్రపంచానికి నన్ను కొత్తగా పరిచయం చేస్తాయి...

అన్నిటినీ మించి..
నాకు నాపై గల నమ్మకం గొప్ప తృప్తినిచ్చి అభినందిస్తుంది..

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Monday, June 13, 2011

నీవు లేవు.. నాకూ తెలుస్తోంది..నీ పాదాలు ఎప్పుడో నే చేరలేనంత దూరం వెళ్ళిపోయాయి
అలసి అలసి నా అడుగులూ ఆగిపోయాయి..
ఇకపై కదలికలు లేవనీ..
నూరేళ్ళకు సరిపడా దూరం మధ్యన చేరుకుందని..
ఎలాగ నన్ను ఒప్పించుకోగలను?
ఎలాగ నా నీ నుండి తప్పించుకోగలను..?

నీ నుండీ పిలుపులు రావు
నా మాటలూ నిన్ను చేరుకోలేవు
ఈ మధ్యన నిలచిన నిశ్శబ్దం మాత్రం..
నాదగ్గర సమాధానం లేదనీ తెలిసీ
అదే ప్రశ్నను పదే పదే ఆహ్వానిస్తోంది

నీవు లేవు..
నాకూ తెలుస్తోంది
అయినా నీవు నాతో లేవనే అబద్దం నాకు నేను చెప్పుకోలేక పోతున్నాను..
నిన్నటి రోజు.. నావనుకున్న క్షణాలనుండీ
బయట పడలేకున్నాను

ఆగిపోయిన ఈ ప్రయాణంలో..
ఇకపై ఎదురుచూపులు కూడా ఉండవు..
నవ్వులకు నవ్వులు లేవు..
నేడు లేదు..రేపూ లేదు..
ఏదో జరుగుతుందన్న మిణుగురు వెలుగులూ లేవు..

అయినా నేను ఉన్నాను..!*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

Tuesday, June 7, 2011

కానీ.. నేను "ఇది.." అవునో కాదో అని..!
నోట్ల కట్ట వెనకో..
విలాసపు జీవన విధానాల కొరకో..
నన్నెవరో చూస్తున్నారనో..చూస్తారనే అప్రమత్తత వెనకో..
నేను అని..నన్నేమనుకుంటున్నానో దాని జాగ్రత్త కొరకో..
నేటి భయం వెనుకో.. రేపటి కొరకో..

యంత్రమల్లె..
మంత్రం వేసిన వాడికి మల్లె..
ఏదో ఏదేదో చేసుకు పోతుంటాను..

కాంక్షలు నావి..
కారణాలు నావి..
కొత్త కొత్త దారులు నావి..
కాంక్షల నావను అందుకోవాలని పరుగులే నావి..
కారణాలు వెతికే కొత్త దారులే నావి..
కొత్త దారులకు కారణాలే నావి..

తడబడుతుంటాను..
ఒప్పులని ఒప్పించేందుకు.. ఓపిక దారపోస్తాను..
ఏదో ఏదేదో చేసుకు పోతుంటాను..

కానీ..
కానీ..
అప్పుడప్పుడూ
అప్పటికప్పుడు..
ఒకింత అయోమయం
కాస్తంత అసంతృప్తి..
నన్ను కప్పేసినప్పుడల్లా..
అనుకుంటూ ఉంటాను..
నేను "ఇది.." అవునో కాదో అని..!

*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.