Sunday, March 20, 2011

కవిత పేరు - ఆకు స్వగతం


తరువు తల్లి బిడ్డగా..
పుట్టీ పుట్టగానే..
బతుకు బడిలో వేసేసారు నన్ను..
ఆఖరి బెంచీలో ఆఖరున.. చాలీ చాలని అంచున కూర్చున్నప్పుడు మొదలయాయి..
నా పాఠాలు..

ఉన్నన్నాళ్ళూ ఊపిరి పోసి..
వెళ్ళేనాడు..ఒంట్లో తడి లేక... వాలి.. రాలిపోవడమే..
ఆకుగా నా రాకకు అర్ధమనుకున్నాను.
కానీ..ఇంకా చాలా ఉన్నాయి..నాకోసం వేచి చూస్తూ పాఠ్యాంశాలు ..

నా..తోబుట్టువులు..నా అన్నదమ్ములు..
నా కళ్ళముందే.. చూస్తుండగానే..
తుంచి వేయబడ్డారు..తెంచివేయబడ్డారు ..

నా ఉమ్మడి కుటుంబ సభ్యులు..
శ్మశాన వాటికలలో కట్టెపుల్లలై..కాలిపోయారు...

అయినా నేను మిగిలే ఉన్నాను..

ఎదురు గాలులకు..
వడగళ్ళ విసురుకు ..
బారున బిగుసుకుపోయే బెదురుకు..
అవసరాల ఆకారాలు ఎత్తినట్టున్నాను..

ఏమిటో నేను..?
ఎందుకిలా అయిపోయాను..?

కన్నులెర్రబారినా.. గుండెలు బండబారినా..
తలవంచుకునే ఉండిపోతున్నాను....
మిన్ను విసిరినా.. మన్ను కసిరినా..
మరిగినా.. మంటన పడినా..
మాట మాట్లాడక..మూగనై మిగిలిపోతున్నాను..
నిందలా వేయను..!
కనీసం కసురుకోనూలేను..!

ఓపిక ఆగినంత కాలం.. అంత నీడకు ఇంత తోడవుతాను..
ఓ మంచి సమయానికి..నేనూ ముగిసిపోతాను..

4 comments:

 1. చాలా బాగుంది.

  ReplyDelete
 2. anu గారు..
  బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు..

  మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

  ReplyDelete
 3. super ga rasaru last 5 lines super ga unai...

  ReplyDelete