Thursday, March 17, 2011

నేను చనిపోతున్నాను..
నేను చనిపోతున్నాను. వయసు యాభై పైన పడింది. నేను జీవించిన జీవితానికి..ఇంతకంటే ఎక్కువ ఆశించినా అత్యాసే అవుతుందేమో. నా శరీరానికి నేనెప్పుడూ గౌరవం ఇవ్వలేదు. దానికి కేవలం నా రుచులకు వాడుకున్నాను. నాకు ఉన్న దురలవాట్ల గురించి నేను గుర్తు చేసుకోవాలనుకోవడం లేదు.. ఎందుకంటే కనీసం నామీద నాకు కాస్తంత గౌరవం మిగిలి ఉండాలి అనేది నా ఆఖరి కోరిక.

కరెంటు పోయింది.. కాస్త గాలి కూడా ఆడడం లేదు. పైగా నా చుట్టూ 'నా' అనేవాళ్ళు ఉన్నారేమో? ఊపిరి సలపనీయడం లేదు. కొడుకూ.. కోడలు అందరికంటే ఎక్కువ ఏడుస్తున్నారు. నేను పోతున్నానని ముందే తెలిసింది వాళ్ళకి. నిజానికి ఏడిచే వాళ్ళు వాళ్ళ ప్రేమని చెపుతున్నామని.. వెలిబుచ్చుతున్నామని అనుకుంటారు. కానీ ఏడిచి నన్ను ఇంకొంచెం ముందే పంపేస్తున్నారని వాళ్లకి తెలీయదు. ప్రేమ కూడా ఇబ్బందికరం గా ఉండేది ఎక్కువగా ఇలాంటి సందర్భాలలోనే. ఇక చూడడానికి వచ్చేవాళ్ళు నాకోసం ఏవో పళ్ళు తీసుకొచ్చి.. నాకు అందకుండా ఎక్కడో పెట్టేస్తారు. వాళ్ళు చెప్పే పనికిమాలిన కబుర్లు వినాలనుకుంటారు. ఇలాంటి సందర్భంలోనే గుండెకి ధైర్యం కావాలని, మనిషి ఆశాజీవిగా బ్రతకాలని చెప్పి ఉన్న కష్టాలను పదే పదే వివరించి హింసించి..మరచిపోయిన ఎప్పటివో వాళ్ళ జ్ఞాపకాలను నాకు వదిలేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళను చూస్తూ చూస్తూ ఇదే మంచం మీద ఇప్పటికే ఒక నెల రోజులు గడిపేసాను. నా భార్య తెలివైనది. నాకన్నా ముందే వెళ్ళిపోయింది. తను నాఅంత ఇబ్బంది పడలేదు. నిద్రలో పోవడమంత సుఖమైన చావు మరొకటి ఉండదు. కానీ ఒక రకంగా నేనే తనకన్నా అదృష్టవంతుడిని. చావును ప్రతిక్షణం దగ్గరనుండే చూస్తూ పరిచయం పెంచుకుంటున్నాను. నేను పోతే నావాళ్ళు ఎలా స్పందిస్తారో ముందే తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నది తెలుసుకోక పోయినా పెద్దగా ఏమీ నష్టం లేదని తరువాతే తెలిసింది.

అన్నిటి కన్నా కష్టమైనా విషయం మనం దయనీయమైన స్థితిలో ఉన్నామని ఒప్పుకోలేకపోవడమే. మనిషి తను తన దగ్గర లేని దానిగురించి ఎక్కువ ఆలోచిస్తాడు. ఉన్నది తక్కువైందని భాదపదతాడు. తృప్తి లేకపోవడమే దయనీయమైన స్థితి.. అది ఎంత మాత్రమూ ఒప్పుకోడు. ఎందుకో?
నాకు డబ్బుల్లు, మనుషులు, పేరు, ఎంత సంపాదించినా.. ఎంత ఎదిగినా ఇక చాలు అనే ఆలోచన రాలేదు. ఎక్కువ అని అనిపించనూ లేదు. ఇక్కడ క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించలేదు. ఇప్పుడు కూడా నాకేదో ఆరోగ్యం తక్కువైందని ఆలోచనే. అయితే ఇలా నా ఆరోగ్యం క్షీణ దశకు వచ్చింది నావల్లే. ఉన్నపుడు దానిని గౌరవించలేదు. లేనపుడు లేదు లేదని ఆలోచించినా ప్రయోజనం లేదు అని తెలిసినా ఆలోచిస్తున్నాను. నేను సగటు మనిషిని.

నర్సు వచ్చి అందరినీ బయటకి పంపేసింది. ఇప్పుడు ఈ రూములో నేను ఒక్కడినే మిగిలిపోయాను. నాకిది కొత్త కాదు. ఈ గదిలో ఆ సిలిన్ బాటిల్ స్టాండుకు, ఈ మంచానికి, దూరంగా కనపడే ఆ మందుల స్టాండుకు, తెల్ల రంగు గోడలకు, రోజులో సగం సరిగా తిరగని ఈ పంకాకు .. నాకు మంచి స్నేహం ఏర్పడ్డాయి. అవి ఏదో చెపుతున్నట్టు. నాకు నేనే చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటాను. ఇది నెల రోజులుగా జరుగుతూనే ఉంది. మొదట్లో ఇబ్బంది గా ఉండేది. తరువాత అలవాటయిపోయింది. నిజానికి ప్రేమగా చూసే దృష్టి ఉండాలి కానీ చేతనా అచేతనా అవస్తల్లోనూ మనకి నా అనే భావం ఏర్పడడానికి, అభేదాన్ని తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ఇలాంటి విషయాలు వెళ్ళిపోయే ముందు తెలుసుకోవడం అన్నిటికంటే భాదాకరం. అలా నేను తెలుసుకున్న మరుక్షణం నా నుండి ఆశించిన ప్రేమ దొరకని వారి అందరికీ..నేను వదిలించుకున్న వస్తువులకి.. మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాను.

జీవితానికి అనేక కోణాలు ఉంటాయి. నాకిప్పుడు అనిపిస్తోంది. నేనెప్పుడూ ఒకే కోణంలో ఆలోచిన్చేవాడినేమో అనే. దానిపేరే 'నాకోసం'. నే చేసే ప్రతి పనిలో రెండు కోణాలు ఉండేవని నా అభిప్రాయం. ఒకటి 'నేను' రెండోది 'ఇతరులు'. ఇందులో తూకం ఎప్పుడూ నా వైపే తూగేది. నాకు తెలిసి అది ఎప్పుడూ నాకు చెడు చేసిందనిపించలేదు, అందుకే నేను దాన్ని నేనెపుడూ మార్చుకోలేదు. కానీ నేను చెడు చేస్తున్నానన్న విషం లాంటి విషయం తాగడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు. అది చేసుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. దీన్నే పశ్చాత్తాపం అంటారేమో. అయితే ఒకటి నిజం. ఎంత గొప్పదైనా మార్పు సమయం దాటేసాక వస్తే.. దాని విలువ సున్నాకే సమమౌతుంది.

అదిగో కరెంటు వచ్చింది..ఆ ఫాను తిరుగుతోంది నా మెదడులో ఆలోచనల్లా.. అవి ఎందుకో అస్సలు ఊరుకోవు. అలసిపోవు. ఇంతసేపూ ఎప్పుడు వస్తుందా అని చూసిన కరెంటు వచ్చేసింది. కానీ ఇకనించీ ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తూ గడిపేస్తాను సమయం. నాకు ఏదోవిధంగా.. నే వెళ్ళేంత వరకూ సమయం గడవడం కావాలి. అందుకే నా దారులు నేను వెతుక్కుంటున్నాను.

ఇంతలో నా కొడుకు వచ్చాడు. "నాన్నా చిన్న పనిమీద బయటకి వెళ్తున్నాను. ఏమైనా అవసరమైతే నీ కోడలు, మనవాళ్ళు బయటే ఉన్నారు" - చెప్పి వెళ్ళిపోయాడు. నాకిదేమీ కొత్త కాదు. వాడి చిన్నప్పటి నుండీ నేను వాడితో గడిపిన సమయం చాలా తక్కువ. ఇప్పుడు వాడు పెద్దవాడయ్యాడు..నన్నే అనుకరిస్తున్నాడు. నేను ఇంతకమించి ఎక్కువ ఆశించకూడదు. నేను ఏమి ఇచ్చానో అదే నాకు తిరిగి ఇచ్చేసి వెళుతున్నాడు. సంపాదన పేరుతో నేను నా కుటుంబానికి చాలా తక్కువ సమయం ఇచ్చాను. కానీ ఇప్పుడు నా సంపాదన ఆ కాలాన్ని వెనుకకు తిప్పలేదు. లెక్కకు మించిన సంపాదన. లెక్కలకు మించిన తప్పులతో సమానం, ఆ తప్పులను దిద్దుకోవడం అంత సులభం కాదు. నాకా అవకాశమూ లేదు.

జీవితం చాలా చిన్నది అని అంటారు. కానీ అది పెద్ద తప్పు. జీవితం చాలా పెద్దది. తప్పులు చేయడానికి.. వాటిని తెలుసుకోవడానికి తిగిరి మంచి చేయడానికి..మనిషికి చాలా జీవితం ఉంటుంది. అది తెలుసుకునేందుకే మనిషి సిద్డంగాలేడు. ఇంతకీ నేను ఇప్పుడు నాతో ఏం తీసుకెళ్ళడానికి ఇంకా ఎదురుచూస్తున్నాను? నాకూ తెలియదు.

రెప్పల బరువు నేను మోయలేనంతగా ఉంది. నెమ్మది నెమ్మది గా మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు నాకు ఏమీ కనపడడం లేదు.. ఎవరో నన్ను బలంగా లాగుతున్నట్టు నేను అనే నా అస్తిత్వాన్ని బద్దలు చేస్తూ ఏదో వెలుగులోకీ ఈడ్చబడుతున్నట్టు..అనిపిస్తోంది. నా చుట్టుపక్కలెవరో చేరుతున్నారు. అది ఏడుపే. కానీ నాకు వినపడం లేదు. ఇప్పుడు వాళ్ళ భాధ తాలూకు తరంగాలు మాత్రమే నన్ను తాకుతున్నాయి. ఇక్కడినుండీ నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. నాకు తెలుస్తోంది.. ఇప్పుడిక ఉన్నా నేను లేనట్టే.

5 comments:

 1. "జీవితం చాలా చిన్నది అని అంటారు. కానీ అది పెద్ద తప్పు. జీవితం చాలా పెద్దది. తప్పులు చేయడానికి.. వాటిని తెలుసుకోవడానికి తిగిరి మంచి చేయడానికి..మనిషికి చాలా జీవితం ఉంటుంది. అది తెలుసుకునేందుకే మనిషి సిద్డంగాలేడు. "

  Very well said!

  ReplyDelete
 2. బాగా రాసారు బాస్.... I liked it

  ReplyDelete
 3. చైతన్య గారు..
  nagarjuna..గారు..

  Thank you so much...

  ReplyDelete
 4. జీవితం ఎంతమాత్రమూ చిన్నదికాదు. చా.........లా పెద్దది .ఎంత పెద్దది... పొడవైనది అంటే దాని అది పూర్తయ్యేలోగా బోరుకొట్టకుండా వుండటానికి ఇతరత్రా కాలక్షేపాలు(బంధాలు) తప్పనిసరయ్యేంత.

  ReplyDelete
 5. Indian Minerva గారు...

  బందాలు కేవలం కాలక్షేపం కాదని నా అభిప్రాయమండీ.. అవే జీవితానికి అర్ధం. పోయినా లోకానికి మనల్ని మిగిల్చేవి అవే కదా..! Its not important what we did to the world. It is that what world felt for it.

  ReplyDelete