Thursday, March 10, 2011

నా భేతాళ కధలు : మీరే విక్రమర్కుడైతే..? - 1చిన్నప్పటి చందమామ భేతాళ కధలకి విక్రమార్కుడు సమాధానం చెప్పేవాడు. మౌన భంగం కలగా గానే.. ప్రతిసారి భేతాళుడు చెట్టు ఎక్కేసే వాడు. మళ్ళీ కొత్త కధతో తరువాత నెలకి ఇద్దరూ సిద్దం అయిపోయేవారు. అయితే భేతాళుడి ప్రశ్నకు సమాధానం చెప్పే విక్రమార్కుడు నేనే అయితే.. ఏమి చెపుతాను ? ఈ ఆలోచన నుండి వచ్చిందే "నా భేతాళ కధలు : మీరే విక్రమర్కుడైతే..?" ఇక ఆ ఆలోచన ఎప్పటి నుండో ఉన్నా రాయడానికి బద్దకమై ..రాయలేక పోయాను.. ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు కధ నేను రాస్తున్నాను కనుక నేను భేతాళుడి అవతారమెత్తుతున్నా. విక్రమార్కులారా ఇక చదవండి. సమాధానం చెప్పండి.
భుజాన శవాన్ని వేసుకుని విక్రమార్కుడు శ్మశానంలో మౌనంగా నడుస్తున్నాడు. విక్రమార్కా.. నీలో గల గొప్ప లక్షణం నీ ఓపిక.. కానీ ఈ లక్షణమే నీకు ప్రమాదం కాగలదు. ఎంత గొప్పవాడైనా తనలో గల గొప్ప లక్షణాలను చూసిగాని.. కలిగిన పేరుని చూసి గాని .. ఏదో ఒక సమయంలో తెలసి తెలియక అహంభావానికి లోను కాక తప్పదు. అలాంటి ఒక రాజు కధ చెపుతాను. శ్రమ తెలియకుండా విను ..

అనగనగా.. ఒక రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. అతడి పేరు ధూమ కేతు. అతడు గొప్ప విద్యాశాలి.. అనేకమంది గురువులను తన రాజ్యానికి పిలిపించి రక రకాల విద్యలను నేర్చుకున్నాడు.. ఎంత విద్య నేర్చుకుంటే అతడిలో అంతకి అంతా గర్వం పెరగసాగింది. ఇతరులు తన కన్నా తక్కువ వాళ్ళని భావించడం..అందరినీ చిన్న చూపు చూడడం.. వేరొకరు చదువుకు పనికి రారు అనే అభిప్రాయం అతడిలో ఎక్కువ అవసాగింది.

అందుకే..... ఇంత చదువుకున్న వాడు..తన రాజ్యంలో ఒకటి రెండు గురుకులాలను కూడా ఏర్పాటు చేయలేదు.

ఇలా వుండగా.. రాజు గారి 32వ పుట్టిన రోజు వేడుకలు వచ్చాయి. రాజ్యం అంతా సంబరాలతో నిండిపోయింది.. రక రకాల ప్రదర్శనలు ఇవ్వబడ్డాయి ఆ వేడుకల్లో. రాజు గారు ఊరుకోకుండా ప్రతి చోట ఏదో ఒక లోపమెత్తిచూపించి వచ్చిన వారిని అవమానించి పంపేస్తున్నారు. చాలా మంది నిండు సభలో అందరిముందూ కన్నీళ్ళూ పెట్టుకుని వెళ్ళిపోయారు కూడా..

ఇలా జరిగింతరువాత.. రాజు గారు స్వయంగా తను ఎంత గొప్పో అందరికీ చూపించుకోవడానికి .. తన విద్యలను ప్రదర్సిన్చానారంభించారు. గానం, నృత్యం, శిల్ప కళ, చిత్రలేఖనం, విలువిద్య, మల్లయుద్ధం.. అన్నిటిలోనూ సాటిలేని ప్రదర్సన ఆయనదే.

ఇక తెలివితేటల్లోనూ తన గొప్పదనం నిరూపిన్చుకుందామనుకున్నారు రాజు గారు.. ఉన్నట్టుండి ఒక సవాలు విసిరారు. మీలో ఏ ఒక్కరైనా ఒక ప్రశ్న అడగండి. అది నేను సమాధానం చెప్పలేనిది అయి ఉండాలి అన్నాడు.

పెద్ద పెద్ద పండితులు.. గణితం, పురాణాలు, చరిత్ర, భాష, సంస్కృతి , ఇలా రక రకాల విభాగాల్లో ప్రశ్నలు అడిగారు. కాని ధూమ కేతు దానికి చక చకా సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసాడు. తనే గొప్ప అని నిరూపితమౌతోందని ఎంతో ఆనందిస్తున్నాడు లో లోపల..

ఇంతలో ఒక పదిహేడేండ్ల కుర్రాడొకడు... నేనూ ఒక ప్రశ్న అడగ వచ్చునా .. అన్నాడు.. అతగాడి ధైర్యం చూసి సభ ఒక్కసారి ముక్కు మీద వేలు వేసుకుంది.

"కానీ అన్నట్టు" సైగ చేసాడు ధూమ కేతు..

"అయితే మీరు సమాధానం చెప్పలేక పోతే?" అని అన్నాడు ప్రశ్నిస్తున్నట్టు, ఆ కుర్రవాడు ఎటువంటి బెదురూ లేకుండా..

ఈసారి ఆశ్చర్యపోవడం ఒకింత ధూమకేతు వంతు అయ్యింది.. ఇతగాడికి పిచ్చిగానీ పట్టిందా అన్నట్టు చూస్తుండి పోయారు అందరూ..

ఏంకావాలి? అడుగు ఏం కావాలో .. గంభీరం గా అన్నాడు ధూమకేతు .

రాజ్యంలో ప్రతి అయిదు ఊర్లకు కూడా ఒక గురుకులాలన్ని ఏర్పాటు చేయాలి అన్నాడు.

"సరే కానీ .. " నీవు గెలిచినపుడు కదా.. ధూమకేతు గొంతులో స్వరం మారింది.

ఆ కుర్రవాడు అడగడం మొదలు పెట్టాడు. అంతటా నిశ్శబ్దం నెలకొంది. ధూమకేతు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఏం అడుగుతాడా అని.

"బ్రతికి ఉంటే.. నా ప్రమేయం లేకుండా నేను చేయగలిగింది.. ఎంత కాలం బ్రతికినా మీరు చేయలేరు" ఏమిటది?

ఇది ఒక ప్రశ్నా ? వెకిలిగా అన్నాడు రాజు... సభలో అందరూ గొల్లున నవ్వారు.. ఇదిగో సమాదానం "అవమానం పొందడం".
నీ పేదరికం.. నీ నిరక్షరాస్యత నీకు నీ ప్రమేయం లేకుండానే అవమానాన్ని తెచ్చి పెడతాయి. కానీ అది నాకు సాధ్యం కాదు. నా అధికారం, ధనం..అన్నిటినీ మించి విద్య.. నన్ను అవమానాల పాలు చేయవు.

క్షమించాలి మహా రాజ.. ఖండిస్తున్నట్టు అన్నాడు ఆ కుర్రవాడు. చదువు లేకున్నా.. గొప్ప ధనం లేకున్నా.. నేను నా పని నేను చేసుకోగలను. ఒకరి పై ఆధారపడను. ఆకలి అన్నవారికి ఇంత అన్నం పెట్టగలను. వేరొకరికి గౌరవం ఇస్తాను అలానే తీసుకుంటాను. నా అనే వారిని కాపాడుకోగల ధైర్యం నాలో ఉంది. నన్ను అవమానం ఎన్నడూ దరిచేరదు. చదువు కేవలం జ్ఞానసముపార్జనాసక్తి పై ఆదారపడి ఉంటుంది. దానికి నిగారింపు వచ్చేది ప్రవర్తన వలనే. అలానే.. ఒకరు వారి ప్రవర్తన సరిగా లేనందునే అవమానిమ్పబడతారు కానీ విద్య వలన కాదు. ధనమా ? ఈరోజు ఎవరి వద్దనుంటుందో తెలియని దానిగురించి మనం చర్చించనక్కరలేదు.

జనాల్లో కలకలం మొదలైంది..

రాజు ఒక నిమిషం మౌనం వహించాడు. ఆగి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్నది ఎరిగి ఉండడం కూడా విద్యే. అంటే ప్రవర్తన కూడా విద్య ద్వారా వచ్చేదే కాదంటావా? అది తెలియని వాడు అవమానాలు పొందడం తప్పని సరి.. కాదనగలవా? తిరిగి ప్రశ్నించాడు రాజు.

ఒప్పుకుంటాను ధూమకేతు మహా రాజా. ప్రవర్తన కనీసపు విద్య. అది తల్లి తండ్రుల నుండీ.. సమాజం నుండీ... తనంతట తానూ నేర్చుకునే విద్యయే కానీ వేరొకరు నేర్పు విద్య కాదు. అది ఆయా వ్యక్తుల నేర్పు మీద ఆధారపడేది . కనుక మీరు సమాధానం గా చెప్పిన 'చదువు' దీని నుండీ వేరుగా చూడబడేదే ..

అతడి వివరణ రాజుకు నిజమేమో అని తోచింది. అదే తనకు తాను అన్వయించుకొని ఒక నిమిషం సిగ్గుపడ్డాడు కూడా.. ఇక ధూమ కేతు ఏమీ మాట్లాడడానికి సాహసించలేదు.. చెప్పు ఏది సరియిన సమాదానమో..అన్నాడు..తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు.

ఆ యువకుడు మందహాసం చేస్తూ చెప్పడం మొదలు పెట్టాడు..

.
.
.
.
.
.
.

అంతటి తో ఆ కధ చెప్పడం ఆపివేసాడు భేతాళుడు.. విక్రమార్క మహారాజా.. అంత చదువుకున్న ఆ రాజు ఆ కుర్రవాడి చేతిలో ఓటమి పాలు ఎలా అయ్యాడు ? ఆ యువకుడు చెప్పిన సమాధానమేమి అయి ఉంటుంది? తెలిసి చెప్పక పోయావో.. నీ బ్లాగు కూడలి నుండీ..మాలిక నుండి ..హారం నుండీ..జల్లెడ నుండీ తీసివేయబడుతుంది. జాగ్రత్త..! :) (భేతాళుడు నవ్వాడు.. )

సశేషం...

---------------------------
రెండు రోజుల తరువాత నేను సమాధానాన్ని ఇక్కడ పోస్టు లో జత పరుస్తాను. మీరు మీ సమాధానాలూ.. అభిప్రాయాలు.. సూచనలు.. కామెంట్ల రూపంలో తెలియ పరచగలరు.

శివ చెరువు


*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

5 comments:

 1. చాలా బాగుంది మీ భేతాళ కథ. మీ ప్రయత్నం చాలా చాలా బాగుంది.

  అతడు బ్రతికి ఉంటే చేయగలిగేది "విద్యాదానం"
  రాజు ఎన్నాళ్లు బ్రతికినా ఇతని ప్రమేయం లేకుండా చేయలేకపోయాడు. ఇప్పుడు ఓడిపోయాడు కనుక కుర్రవాడి ప్రమేయంతో చేయాల్సి వస్తుంది.

  నా సమాధానం సరిఅయినదేనా? ఏమో వేచి చూద్దాం... :)

  ReplyDelete
 2. naaku katha artham kaledu :(

  ReplyDelete
 3. వినయ సంపన్నమైన విద్య వ్యక్తికి భూషణం గా..శోభిస్తుంది. అహంకార పూరితమైన విద్య , వ్యక్తి కి శాపం గా పరిణమిస్తుంది. రాజు గారి విషయం లో జరిగిందీ అదే.

  కాశి విశ్వనాధ ప్రసాద్

  ReplyDelete
 4. సాటి వారిని గౌరవించటం ,
  ఎదువారిలో గొప్పదాన్ని మన్నించటం రాజుగారిలో ఏకోశాన లేని విషయాలు. అదే ఆ యువకుడికీ రాజుగారికీ మధ్య తేడా..! కాశి విశ్వనాధ ప్రసాద్

  ReplyDelete