Wednesday, March 23, 2011

ఈ కవితకి పేరు పెట్టండి ప్లీజ్..


మిల మిల మని మెరుపేదో..
మనసున పడి వెలిగింది..
అలికిడి అనిపించిందీ..అపుడే..

గల గల మని వరసేదో..
వెంట వెంట నడిచొచ్చిందీ ..
అలజడి మొదలయ్యిందీ ..అపుడే..

పరి పరి పరిగెడుతూ..ఆనందం..
ఉన్న చోట ఉండనట్టు ఉంటోంది..
ఆశలు విడుదలయ్యిందీ .. అపుడే..

గుట్టు చప్పుడవ్వకుండా గొంతు గుప్పిటలో
అంతకాలం ఆపుకున్న ఆ మాటలే ..
ఆగనంటే ఆగనంటు ఒక వరదౌతూ..
ఆపకుండా నీ ఆలాపన చేస్తోంటే..

నా కనులకు నవ్విచ్చి..
నా అడుగుకు నిన్నిచ్చీ...
మౌనాన్నే మింగేసాను..
చూస్తూ చూస్తూ ..

కలలే మానేసాను..
ఊహలనే తరిమేసాను..
నాతో నేనుంటాను..
ఇకపై ఎపుడూ..
*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

Sunday, March 20, 2011

కవిత పేరు - ఆకు స్వగతం


తరువు తల్లి బిడ్డగా..
పుట్టీ పుట్టగానే..
బతుకు బడిలో వేసేసారు నన్ను..
ఆఖరి బెంచీలో ఆఖరున.. చాలీ చాలని అంచున కూర్చున్నప్పుడు మొదలయాయి..
నా పాఠాలు..

ఉన్నన్నాళ్ళూ ఊపిరి పోసి..
వెళ్ళేనాడు..ఒంట్లో తడి లేక... వాలి.. రాలిపోవడమే..
ఆకుగా నా రాకకు అర్ధమనుకున్నాను.
కానీ..ఇంకా చాలా ఉన్నాయి..నాకోసం వేచి చూస్తూ పాఠ్యాంశాలు ..

నా..తోబుట్టువులు..నా అన్నదమ్ములు..
నా కళ్ళముందే.. చూస్తుండగానే..
తుంచి వేయబడ్డారు..తెంచివేయబడ్డారు ..

నా ఉమ్మడి కుటుంబ సభ్యులు..
శ్మశాన వాటికలలో కట్టెపుల్లలై..కాలిపోయారు...

అయినా నేను మిగిలే ఉన్నాను..

ఎదురు గాలులకు..
వడగళ్ళ విసురుకు ..
బారున బిగుసుకుపోయే బెదురుకు..
అవసరాల ఆకారాలు ఎత్తినట్టున్నాను..

ఏమిటో నేను..?
ఎందుకిలా అయిపోయాను..?

కన్నులెర్రబారినా.. గుండెలు బండబారినా..
తలవంచుకునే ఉండిపోతున్నాను....
మిన్ను విసిరినా.. మన్ను కసిరినా..
మరిగినా.. మంటన పడినా..
మాట మాట్లాడక..మూగనై మిగిలిపోతున్నాను..
నిందలా వేయను..!
కనీసం కసురుకోనూలేను..!

ఓపిక ఆగినంత కాలం.. అంత నీడకు ఇంత తోడవుతాను..
ఓ మంచి సమయానికి..నేనూ ముగిసిపోతాను..

Thursday, March 17, 2011

నేను చనిపోతున్నాను..
నేను చనిపోతున్నాను. వయసు యాభై పైన పడింది. నేను జీవించిన జీవితానికి..ఇంతకంటే ఎక్కువ ఆశించినా అత్యాసే అవుతుందేమో. నా శరీరానికి నేనెప్పుడూ గౌరవం ఇవ్వలేదు. దానికి కేవలం నా రుచులకు వాడుకున్నాను. నాకు ఉన్న దురలవాట్ల గురించి నేను గుర్తు చేసుకోవాలనుకోవడం లేదు.. ఎందుకంటే కనీసం నామీద నాకు కాస్తంత గౌరవం మిగిలి ఉండాలి అనేది నా ఆఖరి కోరిక.

కరెంటు పోయింది.. కాస్త గాలి కూడా ఆడడం లేదు. పైగా నా చుట్టూ 'నా' అనేవాళ్ళు ఉన్నారేమో? ఊపిరి సలపనీయడం లేదు. కొడుకూ.. కోడలు అందరికంటే ఎక్కువ ఏడుస్తున్నారు. నేను పోతున్నానని ముందే తెలిసింది వాళ్ళకి. నిజానికి ఏడిచే వాళ్ళు వాళ్ళ ప్రేమని చెపుతున్నామని.. వెలిబుచ్చుతున్నామని అనుకుంటారు. కానీ ఏడిచి నన్ను ఇంకొంచెం ముందే పంపేస్తున్నారని వాళ్లకి తెలీయదు. ప్రేమ కూడా ఇబ్బందికరం గా ఉండేది ఎక్కువగా ఇలాంటి సందర్భాలలోనే. ఇక చూడడానికి వచ్చేవాళ్ళు నాకోసం ఏవో పళ్ళు తీసుకొచ్చి.. నాకు అందకుండా ఎక్కడో పెట్టేస్తారు. వాళ్ళు చెప్పే పనికిమాలిన కబుర్లు వినాలనుకుంటారు. ఇలాంటి సందర్భంలోనే గుండెకి ధైర్యం కావాలని, మనిషి ఆశాజీవిగా బ్రతకాలని చెప్పి ఉన్న కష్టాలను పదే పదే వివరించి హింసించి..మరచిపోయిన ఎప్పటివో వాళ్ళ జ్ఞాపకాలను నాకు వదిలేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళను చూస్తూ చూస్తూ ఇదే మంచం మీద ఇప్పటికే ఒక నెల రోజులు గడిపేసాను. నా భార్య తెలివైనది. నాకన్నా ముందే వెళ్ళిపోయింది. తను నాఅంత ఇబ్బంది పడలేదు. నిద్రలో పోవడమంత సుఖమైన చావు మరొకటి ఉండదు. కానీ ఒక రకంగా నేనే తనకన్నా అదృష్టవంతుడిని. చావును ప్రతిక్షణం దగ్గరనుండే చూస్తూ పరిచయం పెంచుకుంటున్నాను. నేను పోతే నావాళ్ళు ఎలా స్పందిస్తారో ముందే తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నది తెలుసుకోక పోయినా పెద్దగా ఏమీ నష్టం లేదని తరువాతే తెలిసింది.

అన్నిటి కన్నా కష్టమైనా విషయం మనం దయనీయమైన స్థితిలో ఉన్నామని ఒప్పుకోలేకపోవడమే. మనిషి తను తన దగ్గర లేని దానిగురించి ఎక్కువ ఆలోచిస్తాడు. ఉన్నది తక్కువైందని భాదపదతాడు. తృప్తి లేకపోవడమే దయనీయమైన స్థితి.. అది ఎంత మాత్రమూ ఒప్పుకోడు. ఎందుకో?
నాకు డబ్బుల్లు, మనుషులు, పేరు, ఎంత సంపాదించినా.. ఎంత ఎదిగినా ఇక చాలు అనే ఆలోచన రాలేదు. ఎక్కువ అని అనిపించనూ లేదు. ఇక్కడ క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించలేదు. ఇప్పుడు కూడా నాకేదో ఆరోగ్యం తక్కువైందని ఆలోచనే. అయితే ఇలా నా ఆరోగ్యం క్షీణ దశకు వచ్చింది నావల్లే. ఉన్నపుడు దానిని గౌరవించలేదు. లేనపుడు లేదు లేదని ఆలోచించినా ప్రయోజనం లేదు అని తెలిసినా ఆలోచిస్తున్నాను. నేను సగటు మనిషిని.

నర్సు వచ్చి అందరినీ బయటకి పంపేసింది. ఇప్పుడు ఈ రూములో నేను ఒక్కడినే మిగిలిపోయాను. నాకిది కొత్త కాదు. ఈ గదిలో ఆ సిలిన్ బాటిల్ స్టాండుకు, ఈ మంచానికి, దూరంగా కనపడే ఆ మందుల స్టాండుకు, తెల్ల రంగు గోడలకు, రోజులో సగం సరిగా తిరగని ఈ పంకాకు .. నాకు మంచి స్నేహం ఏర్పడ్డాయి. అవి ఏదో చెపుతున్నట్టు. నాకు నేనే చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటాను. ఇది నెల రోజులుగా జరుగుతూనే ఉంది. మొదట్లో ఇబ్బంది గా ఉండేది. తరువాత అలవాటయిపోయింది. నిజానికి ప్రేమగా చూసే దృష్టి ఉండాలి కానీ చేతనా అచేతనా అవస్తల్లోనూ మనకి నా అనే భావం ఏర్పడడానికి, అభేదాన్ని తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ఇలాంటి విషయాలు వెళ్ళిపోయే ముందు తెలుసుకోవడం అన్నిటికంటే భాదాకరం. అలా నేను తెలుసుకున్న మరుక్షణం నా నుండి ఆశించిన ప్రేమ దొరకని వారి అందరికీ..నేను వదిలించుకున్న వస్తువులకి.. మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాను.

జీవితానికి అనేక కోణాలు ఉంటాయి. నాకిప్పుడు అనిపిస్తోంది. నేనెప్పుడూ ఒకే కోణంలో ఆలోచిన్చేవాడినేమో అనే. దానిపేరే 'నాకోసం'. నే చేసే ప్రతి పనిలో రెండు కోణాలు ఉండేవని నా అభిప్రాయం. ఒకటి 'నేను' రెండోది 'ఇతరులు'. ఇందులో తూకం ఎప్పుడూ నా వైపే తూగేది. నాకు తెలిసి అది ఎప్పుడూ నాకు చెడు చేసిందనిపించలేదు, అందుకే నేను దాన్ని నేనెపుడూ మార్చుకోలేదు. కానీ నేను చెడు చేస్తున్నానన్న విషం లాంటి విషయం తాగడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు. అది చేసుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. దీన్నే పశ్చాత్తాపం అంటారేమో. అయితే ఒకటి నిజం. ఎంత గొప్పదైనా మార్పు సమయం దాటేసాక వస్తే.. దాని విలువ సున్నాకే సమమౌతుంది.

అదిగో కరెంటు వచ్చింది..ఆ ఫాను తిరుగుతోంది నా మెదడులో ఆలోచనల్లా.. అవి ఎందుకో అస్సలు ఊరుకోవు. అలసిపోవు. ఇంతసేపూ ఎప్పుడు వస్తుందా అని చూసిన కరెంటు వచ్చేసింది. కానీ ఇకనించీ ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తూ గడిపేస్తాను సమయం. నాకు ఏదోవిధంగా.. నే వెళ్ళేంత వరకూ సమయం గడవడం కావాలి. అందుకే నా దారులు నేను వెతుక్కుంటున్నాను.

ఇంతలో నా కొడుకు వచ్చాడు. "నాన్నా చిన్న పనిమీద బయటకి వెళ్తున్నాను. ఏమైనా అవసరమైతే నీ కోడలు, మనవాళ్ళు బయటే ఉన్నారు" - చెప్పి వెళ్ళిపోయాడు. నాకిదేమీ కొత్త కాదు. వాడి చిన్నప్పటి నుండీ నేను వాడితో గడిపిన సమయం చాలా తక్కువ. ఇప్పుడు వాడు పెద్దవాడయ్యాడు..నన్నే అనుకరిస్తున్నాడు. నేను ఇంతకమించి ఎక్కువ ఆశించకూడదు. నేను ఏమి ఇచ్చానో అదే నాకు తిరిగి ఇచ్చేసి వెళుతున్నాడు. సంపాదన పేరుతో నేను నా కుటుంబానికి చాలా తక్కువ సమయం ఇచ్చాను. కానీ ఇప్పుడు నా సంపాదన ఆ కాలాన్ని వెనుకకు తిప్పలేదు. లెక్కకు మించిన సంపాదన. లెక్కలకు మించిన తప్పులతో సమానం, ఆ తప్పులను దిద్దుకోవడం అంత సులభం కాదు. నాకా అవకాశమూ లేదు.

జీవితం చాలా చిన్నది అని అంటారు. కానీ అది పెద్ద తప్పు. జీవితం చాలా పెద్దది. తప్పులు చేయడానికి.. వాటిని తెలుసుకోవడానికి తిగిరి మంచి చేయడానికి..మనిషికి చాలా జీవితం ఉంటుంది. అది తెలుసుకునేందుకే మనిషి సిద్డంగాలేడు. ఇంతకీ నేను ఇప్పుడు నాతో ఏం తీసుకెళ్ళడానికి ఇంకా ఎదురుచూస్తున్నాను? నాకూ తెలియదు.

రెప్పల బరువు నేను మోయలేనంతగా ఉంది. నెమ్మది నెమ్మది గా మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు నాకు ఏమీ కనపడడం లేదు.. ఎవరో నన్ను బలంగా లాగుతున్నట్టు నేను అనే నా అస్తిత్వాన్ని బద్దలు చేస్తూ ఏదో వెలుగులోకీ ఈడ్చబడుతున్నట్టు..అనిపిస్తోంది. నా చుట్టుపక్కలెవరో చేరుతున్నారు. అది ఏడుపే. కానీ నాకు వినపడం లేదు. ఇప్పుడు వాళ్ళ భాధ తాలూకు తరంగాలు మాత్రమే నన్ను తాకుతున్నాయి. ఇక్కడినుండీ నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. నాకు తెలుస్తోంది.. ఇప్పుడిక ఉన్నా నేను లేనట్టే.

Monday, March 14, 2011

నా భేతాళ కధలు.. నేనే విక్రమార్కుడినైతే..? - 1

ఈ పోస్టులో విక్రమార్కుడి సమాధానం అర్ధం అవ్వాలంటే.. పోస్టులో భేతాళుడి ప్రశ్న చదవండి.. :)

=========================

చూడు భేతాళా.. రాజు ఎంతో తెలివి తేటలు గలవాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ.. ఎప్పుడైతే..మనిషికి తనమీద తనకి నమ్మకం అవసరమైన దానికంటే ఎక్కువ అవుతుందో.. అది ఎంతో ప్రమాదకరం. అటువంటి స్థితిలో కి వెళ్ళాడు కనుక ధూమకేతు మహా రాజు ఆ కుర్రవాడి చేతిలో గర్వభంగానికి గురి కాక తప్పింది కాదు. రాజు ఓటమికి కారణం అర్ధం అయ్యిందనుకుంటాను.

ఇక నీ రెండో ప్రశ్న..ఆ యువకుడి ప్రశ్నకు సమాధానం ఏమై ఉంటుంది ?

ఆ యువకుడు బ్రతికి ఉంటే.. తన ప్రమేయం లేకుండా..ఇప్పటి రాజు వయసుకు చేరుకోగలడు. కానీ రాజు ఎన్నటికీ.. ఆ యువకుని వయసుకు, వెనుకకు రాలేడు. అని చెప్పి విక్రమార్కుడు తన సమాధానాన్ని పూర్తి చేసాడు..

అలా విక్రమార్కుడికి మౌన భంగం కలగగానే.. తిరిగి భేతాళుడు చెట్టెక్కాడు..

Thursday, March 10, 2011

నా భేతాళ కధలు : మీరే విక్రమర్కుడైతే..? - 1చిన్నప్పటి చందమామ భేతాళ కధలకి విక్రమార్కుడు సమాధానం చెప్పేవాడు. మౌన భంగం కలగా గానే.. ప్రతిసారి భేతాళుడు చెట్టు ఎక్కేసే వాడు. మళ్ళీ కొత్త కధతో తరువాత నెలకి ఇద్దరూ సిద్దం అయిపోయేవారు. అయితే భేతాళుడి ప్రశ్నకు సమాధానం చెప్పే విక్రమార్కుడు నేనే అయితే.. ఏమి చెపుతాను ? ఈ ఆలోచన నుండి వచ్చిందే "నా భేతాళ కధలు : మీరే విక్రమర్కుడైతే..?" ఇక ఆ ఆలోచన ఎప్పటి నుండో ఉన్నా రాయడానికి బద్దకమై ..రాయలేక పోయాను.. ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు కధ నేను రాస్తున్నాను కనుక నేను భేతాళుడి అవతారమెత్తుతున్నా. విక్రమార్కులారా ఇక చదవండి. సమాధానం చెప్పండి.
భుజాన శవాన్ని వేసుకుని విక్రమార్కుడు శ్మశానంలో మౌనంగా నడుస్తున్నాడు. విక్రమార్కా.. నీలో గల గొప్ప లక్షణం నీ ఓపిక.. కానీ ఈ లక్షణమే నీకు ప్రమాదం కాగలదు. ఎంత గొప్పవాడైనా తనలో గల గొప్ప లక్షణాలను చూసిగాని.. కలిగిన పేరుని చూసి గాని .. ఏదో ఒక సమయంలో తెలసి తెలియక అహంభావానికి లోను కాక తప్పదు. అలాంటి ఒక రాజు కధ చెపుతాను. శ్రమ తెలియకుండా విను ..

అనగనగా.. ఒక రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. అతడి పేరు ధూమ కేతు. అతడు గొప్ప విద్యాశాలి.. అనేకమంది గురువులను తన రాజ్యానికి పిలిపించి రక రకాల విద్యలను నేర్చుకున్నాడు.. ఎంత విద్య నేర్చుకుంటే అతడిలో అంతకి అంతా గర్వం పెరగసాగింది. ఇతరులు తన కన్నా తక్కువ వాళ్ళని భావించడం..అందరినీ చిన్న చూపు చూడడం.. వేరొకరు చదువుకు పనికి రారు అనే అభిప్రాయం అతడిలో ఎక్కువ అవసాగింది.

అందుకే..... ఇంత చదువుకున్న వాడు..తన రాజ్యంలో ఒకటి రెండు గురుకులాలను కూడా ఏర్పాటు చేయలేదు.

ఇలా వుండగా.. రాజు గారి 32వ పుట్టిన రోజు వేడుకలు వచ్చాయి. రాజ్యం అంతా సంబరాలతో నిండిపోయింది.. రక రకాల ప్రదర్శనలు ఇవ్వబడ్డాయి ఆ వేడుకల్లో. రాజు గారు ఊరుకోకుండా ప్రతి చోట ఏదో ఒక లోపమెత్తిచూపించి వచ్చిన వారిని అవమానించి పంపేస్తున్నారు. చాలా మంది నిండు సభలో అందరిముందూ కన్నీళ్ళూ పెట్టుకుని వెళ్ళిపోయారు కూడా..

ఇలా జరిగింతరువాత.. రాజు గారు స్వయంగా తను ఎంత గొప్పో అందరికీ చూపించుకోవడానికి .. తన విద్యలను ప్రదర్సిన్చానారంభించారు. గానం, నృత్యం, శిల్ప కళ, చిత్రలేఖనం, విలువిద్య, మల్లయుద్ధం.. అన్నిటిలోనూ సాటిలేని ప్రదర్సన ఆయనదే.

ఇక తెలివితేటల్లోనూ తన గొప్పదనం నిరూపిన్చుకుందామనుకున్నారు రాజు గారు.. ఉన్నట్టుండి ఒక సవాలు విసిరారు. మీలో ఏ ఒక్కరైనా ఒక ప్రశ్న అడగండి. అది నేను సమాధానం చెప్పలేనిది అయి ఉండాలి అన్నాడు.

పెద్ద పెద్ద పండితులు.. గణితం, పురాణాలు, చరిత్ర, భాష, సంస్కృతి , ఇలా రక రకాల విభాగాల్లో ప్రశ్నలు అడిగారు. కాని ధూమ కేతు దానికి చక చకా సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసాడు. తనే గొప్ప అని నిరూపితమౌతోందని ఎంతో ఆనందిస్తున్నాడు లో లోపల..

ఇంతలో ఒక పదిహేడేండ్ల కుర్రాడొకడు... నేనూ ఒక ప్రశ్న అడగ వచ్చునా .. అన్నాడు.. అతగాడి ధైర్యం చూసి సభ ఒక్కసారి ముక్కు మీద వేలు వేసుకుంది.

"కానీ అన్నట్టు" సైగ చేసాడు ధూమ కేతు..

"అయితే మీరు సమాధానం చెప్పలేక పోతే?" అని అన్నాడు ప్రశ్నిస్తున్నట్టు, ఆ కుర్రవాడు ఎటువంటి బెదురూ లేకుండా..

ఈసారి ఆశ్చర్యపోవడం ఒకింత ధూమకేతు వంతు అయ్యింది.. ఇతగాడికి పిచ్చిగానీ పట్టిందా అన్నట్టు చూస్తుండి పోయారు అందరూ..

ఏంకావాలి? అడుగు ఏం కావాలో .. గంభీరం గా అన్నాడు ధూమకేతు .

రాజ్యంలో ప్రతి అయిదు ఊర్లకు కూడా ఒక గురుకులాలన్ని ఏర్పాటు చేయాలి అన్నాడు.

"సరే కానీ .. " నీవు గెలిచినపుడు కదా.. ధూమకేతు గొంతులో స్వరం మారింది.

ఆ కుర్రవాడు అడగడం మొదలు పెట్టాడు. అంతటా నిశ్శబ్దం నెలకొంది. ధూమకేతు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఏం అడుగుతాడా అని.

"బ్రతికి ఉంటే.. నా ప్రమేయం లేకుండా నేను చేయగలిగింది.. ఎంత కాలం బ్రతికినా మీరు చేయలేరు" ఏమిటది?

ఇది ఒక ప్రశ్నా ? వెకిలిగా అన్నాడు రాజు... సభలో అందరూ గొల్లున నవ్వారు.. ఇదిగో సమాదానం "అవమానం పొందడం".
నీ పేదరికం.. నీ నిరక్షరాస్యత నీకు నీ ప్రమేయం లేకుండానే అవమానాన్ని తెచ్చి పెడతాయి. కానీ అది నాకు సాధ్యం కాదు. నా అధికారం, ధనం..అన్నిటినీ మించి విద్య.. నన్ను అవమానాల పాలు చేయవు.

క్షమించాలి మహా రాజ.. ఖండిస్తున్నట్టు అన్నాడు ఆ కుర్రవాడు. చదువు లేకున్నా.. గొప్ప ధనం లేకున్నా.. నేను నా పని నేను చేసుకోగలను. ఒకరి పై ఆధారపడను. ఆకలి అన్నవారికి ఇంత అన్నం పెట్టగలను. వేరొకరికి గౌరవం ఇస్తాను అలానే తీసుకుంటాను. నా అనే వారిని కాపాడుకోగల ధైర్యం నాలో ఉంది. నన్ను అవమానం ఎన్నడూ దరిచేరదు. చదువు కేవలం జ్ఞానసముపార్జనాసక్తి పై ఆదారపడి ఉంటుంది. దానికి నిగారింపు వచ్చేది ప్రవర్తన వలనే. అలానే.. ఒకరు వారి ప్రవర్తన సరిగా లేనందునే అవమానిమ్పబడతారు కానీ విద్య వలన కాదు. ధనమా ? ఈరోజు ఎవరి వద్దనుంటుందో తెలియని దానిగురించి మనం చర్చించనక్కరలేదు.

జనాల్లో కలకలం మొదలైంది..

రాజు ఒక నిమిషం మౌనం వహించాడు. ఆగి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్నది ఎరిగి ఉండడం కూడా విద్యే. అంటే ప్రవర్తన కూడా విద్య ద్వారా వచ్చేదే కాదంటావా? అది తెలియని వాడు అవమానాలు పొందడం తప్పని సరి.. కాదనగలవా? తిరిగి ప్రశ్నించాడు రాజు.

ఒప్పుకుంటాను ధూమకేతు మహా రాజా. ప్రవర్తన కనీసపు విద్య. అది తల్లి తండ్రుల నుండీ.. సమాజం నుండీ... తనంతట తానూ నేర్చుకునే విద్యయే కానీ వేరొకరు నేర్పు విద్య కాదు. అది ఆయా వ్యక్తుల నేర్పు మీద ఆధారపడేది . కనుక మీరు సమాధానం గా చెప్పిన 'చదువు' దీని నుండీ వేరుగా చూడబడేదే ..

అతడి వివరణ రాజుకు నిజమేమో అని తోచింది. అదే తనకు తాను అన్వయించుకొని ఒక నిమిషం సిగ్గుపడ్డాడు కూడా.. ఇక ధూమ కేతు ఏమీ మాట్లాడడానికి సాహసించలేదు.. చెప్పు ఏది సరియిన సమాదానమో..అన్నాడు..తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు.

ఆ యువకుడు మందహాసం చేస్తూ చెప్పడం మొదలు పెట్టాడు..

.
.
.
.
.
.
.

అంతటి తో ఆ కధ చెప్పడం ఆపివేసాడు భేతాళుడు.. విక్రమార్క మహారాజా.. అంత చదువుకున్న ఆ రాజు ఆ కుర్రవాడి చేతిలో ఓటమి పాలు ఎలా అయ్యాడు ? ఆ యువకుడు చెప్పిన సమాధానమేమి అయి ఉంటుంది? తెలిసి చెప్పక పోయావో.. నీ బ్లాగు కూడలి నుండీ..మాలిక నుండి ..హారం నుండీ..జల్లెడ నుండీ తీసివేయబడుతుంది. జాగ్రత్త..! :) (భేతాళుడు నవ్వాడు.. )

సశేషం...

---------------------------
రెండు రోజుల తరువాత నేను సమాధానాన్ని ఇక్కడ పోస్టు లో జత పరుస్తాను. మీరు మీ సమాధానాలూ.. అభిప్రాయాలు.. సూచనలు.. కామెంట్ల రూపంలో తెలియ పరచగలరు.

శివ చెరువు


*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

Tuesday, March 8, 2011

"కాదు జీవించనట్టు.." అని ఎక్కడినుండో ఓ వాణి వినపడుతుంది..

ఏమిటో ఈ జీవితం?

ఒకరికి మంచి
వేరొకరికి చెడు అవుతోంది..

ఒకరి గెలుపు
వేరొకరిని ఓటమిపాలు చేస్తోంది..

ఒకరి ఆశ
వేరొకరికి నిరాశనే మిగులుస్తోంది..

ఈ రోజు నాకు జరిగిన చెడు.. ఓటమి వలన నిరాశ మిగలడమే..!

అయితే..
రేపటి రోజు..నా గెలుపు కూడా వేరొకరికి ఇదే అనుభావాన్నిస్తుంది ..

అప్పుడే నాలో ఈ ప్రశ్న జనిస్తోంది..
నాకు మంచి జరిగినట్టా..?
నేను చెడు చేసినట్టా?


పోటీలకు..
పంతాలకు..
పరుగులు పెట్టీ పెట్టీ...

స్పృహ 'అనుభూతి' చెందడాన్ని మర్చిపోయింది..
జీవితపు కధనాన్ని వదిలి అధ్యాయాంతాలకే విలువనిస్తోంది..

లాభ నష్టాల బెరీజులో..
లభామనుకుని.. ప్రతి సారీ నష్టాన్నే జమ చేసుకుంటోంది..
*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

Sunday, March 6, 2011

అంతర్జాల వినియోగదారుడా.. ఆలోచించు..!

రోజు రోజుకూ పెరిగిపోయే కంప్యుటరు వినియోగంలో ఈ కొన్ని విషయాల గురించి..ఒక్క సారి ఆలోచించండి.

1. మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఎన్ని కొని వాడుతున్నవి..? (Genuine Windows )

2. మన వాడే సాఫ్ట్వేర్లలో ఎన్నిటికి మనం డబ్బులిచ్చి వాడుకుంటున్నాము? (Paid అండ్ Registered)

3. మనకి 500GB హార్డ్ డిస్క్ అవసరం ఏంటి? అందులో ఏమీ నింపుతున్నాము? సమాధానం - పాటలు మరియు సినిమాలు..ఇంకా ఇతర సాఫ్ట్వేర్లు (అధిక శాతం)
అయితే ఈ పాటలు.. సినిమాలు కొన్నవా? డౌన్లోడ్ చేసుకున్నవా?
కొన్నావే అయితే ఇంత హార్డ్ డిస్క్ స్పేస్ ఎందుకు బాబూ దండుగ అని అడగొద్దు ప్లీజ్..

ఇవేమీ కొత్త విషయాలు కావు.. తెలియనివి అంతకన్నా కావు..ఇంతకీ నువ్వేమి చెప్పదలచుకున్నావు శివ చెరువు ?

ఆలోచించమని చెపుదామనుకుంటున్నాను..

ఏమిటీ పైరసీ గురించి చర్చా?

అబ్బే కాదు..

మరి ఏంటో?

ఇందులో ఏ ఒక్కదానికీ మనం మూల్యం చెల్లించడం లేదు కదా!

అవునా మరి అంతర్జాలం కోసం నెల నెలా పెద్ద పెద్ద పాకేజీలకి బోలెడంత డబ్బులు ఎవరుకడుతున్నారో ?

కట్టే డబ్బులు అంతర్జాలం వాడుకోవడానికి కాని.. మరి దేనికోసమో కాదు..
పెద్ద పెద్ద పాకేజీలు కట్టేది పెద్ద పెద్ద డౌన్లోడ్ల కోసమే అనే నేనూ చెప్పేది..అది ఎంత వరకూ అవసరం అనే నేనూ చెప్పాలనుకునేది..

డబ్బులు కట్టే వాళ్ళం మాకు తెలియదా..?

తెలుసు .. కాని "అవసరానికి ".. "వినోదానికీ " మధ్య వ్యత్యాసం గుర్తించలేకున్నాం మనం..

అయితే?


అప్పుడు అవసరం మర్చిపోయి వినోదంపై ఎక్కువ ధ్యాస వెళ్ళిపోతుంది.. వినోదం ఎక్కువైతే వ్యసనమౌతుంది..
పైగా..అన్నీ (ఎక్కువ శాతం ) ఉచితంగా , ఇల్లీగల్ గా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం ఉండడం వలన మన ఉపయోగించే యే సాఫ్ట్వేరు యొక్క విలువ మనం గుర్తించలేకున్నాం..
We are not really serious about the ones we are using in our PC.You will value, respect and understand something when you pay something for it (when your contribution is there for it). ఎప్పుడైతే మనం వాటి విలువ పూర్తిగా గుర్తించలేకున్నామో ? then
we can not make most of it. Hence, no point in downloading.

ఫైనల్ గా ఏంటి?

మీరు ఏమైనా వాడదలచుకుంటే కనీసం కొంత అయినా పే చెయ్యండి..కేవలం మీ నెట్ బిల్ కోసమే కాదు..లేదు లేదు ఇష్టం లేదంటారా..? ఏదో ఒక freeware ఎంచుకునే సదుపాయం కూడా ఉంది..అసలు ఈ ఇల్లీగల్ డవున్లోడ్లు లేకపోతే ఎవరికైనా 1MBPS 2MBPS ఎంతవరకూ అవసరం..? ఆలోచించండి ..


*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

Thursday, March 3, 2011

మూసిన తలుపుల వెనుక..?
ఆ తలుపులు ఏళ్ళుగా తెరుచుకోలేదు..
చీకటిలోనే పుట్టాయా? అన్నట్టు ఉన్నాయవి..
వాటివైపు ఏ చిన్న వెలుతురు నీడ కూడా వాలి లేదు..

పగిలిన గోడలకు అతికినట్టు..అమర్చిన తలుపులవి..
ఓ మూలన ఆ గదిని..మూలపడిన గదిని..
మూసేందుకు మాత్రమే వాడిన ముడిసరుకులవి..

ఆలోచన లేకో..
ఆచరణ చేత కాకో..
ఎందుకో ఎవరూ వాటివైపు చూడడం లేదు..

విసిరేసినట్టుండే ఆ తలుపుల నలుపు
ఎప్పుడో ఓ సారి.. ఏ ఒక్కరికో మాత్రమే..
మెరిసినట్టు కనపడి మాయమైపోతుంది

అనుమానం వల్లనో..
అనేక ప్రశ్నల వల్లనో..
అశ్రద్ద వల్లనో..
భయం వల్లనో..
అప్పుడుకూడా..అవి తెరుచుకుంటాయో లేదో తెలీదు
ఎవ్వరికీ..!

ఇంతకీ ఏమీ ఉందో ఆ తలుపుల వెనుక..?

తలదాచుకోవడానికింతని దొరకక..
కనీసం తలచుకునే వారు తారస పడక..
నిస్సిగ్గుకు మొహం చూపక..
ఆనవాలు మాత్రం బయట వదిలి..
ఆ తలుపుల వెనుకన మిగిలిపోయింది..వేరేదో కాదు..
"విలువల వలువలు"

చైతన్య గారి "మూసిన తలు(ల)పులు _ Oldoor" టపా నుండి ప్రేరణ పొంది రాసిన కవిత ఇది..

Wednesday, March 2, 2011

వృద్దాప్యమంటే ..? ఇదేకదా?వయసైపోవడమా
నామమాత్రపు పెద్దరికమా
ముసలితనమంటే..!?

ధారపోసిన ఓపిక దారమంత అవడమా..
జీవితానుభవాలను అందించబోయి..చిన్నబోవడమా
ప్రేమ లేక పయనమవ్వడమా
పెద్దవాళ్ళవడమంటే..!?

ఏమిటి?

చిన్న మందు గోళీల పెట్టెతో కలిపి.. మూలన ఓ చోటు..
ఆనుకునేందుకు పెచ్చులూడిన గోడ..
అవసరమై నడిచేందుకు చిన్న కర్ర..
ఏడాదికో దీపావళి లా.."ఎలా వున్నావనే " ముక్తసరి పలకరింపు బిచ్చమేసినప్పుడు..
తిరిగి ఏమీ చెప్పలేని చేతకాని తనం..చెప్పుకోలేని ఒంటరి తనం..
ఇదేకదా వృద్దాప్యమంటే ..?
ఇదేకదా?

అందించిన విలువలు..
ఓటమిలో ఓపికనొడ్డి అవతలవైపుకు తీసుకెళ్ళిన తనం..
తరాల అంతరం రాకుండా చేసిన తపస్సు..
జ్ఞాపికల జ్ఞాపకాలను గర్వంగా నలుగురితో పంచుకోవడం..
కోల్పోయిన పసితనాన్ని మళ్ళీ పిల్లల చేతుల మీదుగా అందుకోవడం..
ఏమిటి? ఇవికాదా?
వృద్దాప్యమంటే ..

Tuesday, March 1, 2011

అందులో నాకు నేను లేను..నీకు నీవు లేవు..
సముద్రమంత నా ప్రేమ నీకోసం ఎప్పటినుంచో వేచి చూస్తోంది..
నీవొచ్చావు..

అక్కడి నుండీ..అటు ఇటుగా పక్కపక్కనే నడుస్తున్నాం..
నువ్వూ నేను..

తీరంలో ఆ తడిసిన ఇసుక..
మన ప్రతి అడుగులని పదిలపరుస్తోంది..
నీటి నురగ ఆ గురుతులని చెరిపి, మన పాదాలను తడిపి
వాటిని మనకు మాత్రమే మిగిల్చి పోతోంది..

నీమాటలు పువ్వులై విరిసాయి..
నవ్వులు పక్షులై ఎగిరాయి..
నీ.. నా ..మన ప్రతి ఊసూ..
మనసు నుండీ మనసుకూ.. మౌనం నుండీ మాటకు కదిలి వెళ్ళాయి..

అప్పుడే సరిగ్గా..అటుగా వెళ్ళే గాలి ఊరుకోక
నీ కురులను నా కన్నులకు, ఓ కోరికను గుర్తుచేసేట్టుగా నడిపించింది...
ఊరుకోలేక ఊరుకున్నాను..గాని అప్పటి నా అవస్థ నాకే తెలియాలి..!

అలా అలా అదే ఏదో నువ్వు..
నా చెవిలో చిన్నగా చెపుతానంటూ...
మరింత దగ్గరగా వచ్చావు
ఆ క్షణం నీ శ్వాస నా ఊపిరికి దగ్గరగా వచ్చేసింది..
ఎంతగా అంటే ? వేరొకరికి అర్ధం కానంతగా !
ఆ క్షణం ఒక కొత్త ప్రపంచం సృష్టించబడింది..
ఆకాశం మనకు మాత్రమే గొడుగు పట్టింది..
ఇక ఆ రాతిరి వేళ..చంద్రుడికి వెన్నెలనద్ది...
దూరానికి దగ్గర భావమిచ్చి..
మౌనానికి కూడా సంగీతాన్ని స్వరపరిచి..
ప్రకృతికి ఆకృతి మనమయ్యాం..

ఆ కొద్దిపాటి సమయం ఒక జీవితమయ్యింది..
ఎంత విచిత్రమో..?
అందులో నాకు నేను లేను..నీకు నీవు లేవు..

*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.