Sunday, February 27, 2011

ఒక ప్రశ్నార్ధకం..ఒక ఆశ్చర్యార్ధకం..ఒక నేను..ఇన్ని ఆశలు..

కదలని జీవితం లో..
శిఖరారోహణ కోసం
ఏదో కావాలని..
మరేదో కారాదని...
బతకడానికి కొన్ని ..
బ్రతికి ఉన్నందుకు మరి కొన్ని.
కధలల్లుకుంటోన్నాయి ..!

వాటికే నేను ఆశలు అని పేరు పెట్టుకున్నాను.

----------
కాసేపు పరిగెట్టించినా ..
కాసేపు నిలబెట్టి నిరీక్షింపజేసినా ..
'నేను' కు 'నా వారిని'
ఈ ఆశలే పట్టుకొచ్చాయి..

అందుకే ఈ ఆశలంటే నాకు ఎంతో ఇష్టం..

----------
ప్రేయసి ఎదురుచూపుల విలువంత..
ప్రియుడు ఆమె కోసం చేయగలిగిన ప్రయాణ దూరమంత..
రుచులలో..అభిరుచులలో..
ఒకరికోసం ఒకరు ఎంతవరకూ సర్దుకుపోగలరో అంత దూరం కూడా... ఈ ఆశలు ఉన్నాయి..

అందుకే..
వాటికి నేను విలువ కట్టలేకపోయాను..

----------
ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టమన్నంత కష్టపడిపోతున్నాను..
మొత్తం నాలో ఆశలు ఎన్నని చూసుకుందామన్నపుడు ..

పరమాణువుల నుండీ నా విశ్వమంతా..
ఎక్కడవెతికినా..అక్కడ వాటి దర్శనమే..అవుతోంది..

ఏంటో .. ఏంటో ..
ఈ ఆశల అంతరార్ధం..? నా ఆంతర్యానికి దగ్గరగా.... !
ఒక ప్రశ్నార్ధకం..ఒక ఆశ్చర్యార్ధకం..ఒక నేను..ఇన్ని ఆశలు..
-------------------

Friday, February 18, 2011

గాలిలో..

గాలి మేడలు..
గాలి కబురులు..
గాలిలో రాతలు..
వచ్చి పోయే కొత్త గాలుల వేడుక..
గాలి తీసేసిన బుడగ.. ముగిసిపోయిన నిజం జీవితం..

Wednesday, February 16, 2011

కాలం.. మన చేతిలో హత్య చేయబడింది..
గుండెకీ.. నాకూ ఎంత వేగమో ?
ఒక్కసారిగా..
నిన్ను చూస్తాను అనుకున్నప్పుడల్లా.. !

ఎన్ని ఆలోచనలో .. ఆలోకనలో
రేపటి వైపుకు.. ? ఆపై ఈ కంటికి రెప్పలు కూడా పడవు..
నిద్దురను మాని
కలలను మాత్రం అంటి పెట్టుకుని ఉండిపోతాను.. రాత్రంతా..

ఆ చుక్కలూ .. చందమామ ..
నేనేదో వాటికన్నా ఎక్కువ వెలిగిపోతున్నానని.. నిందలు వేసేందుకు రావడం...
అప్పటికి నిన్ను అడ్డుపెట్టుకుని నేను తప్పించేసుకోవడం..
నీకు చెప్పే ఉంటాను..లే..!
తలచుకున్నప్పుడల్లా ..ఎంత బాగుంటుంది ఆ రాతిరి..?
నాలో నీ అంత అందంగా..!

ఆ ప్రత్యర్ధులు..
అలసి అలసి చీకటి తో సహా చుట్టుకొని ఎప్పటికో వెళ్ళిపోతాయి..
అప్పుడు మొదలయే వెలుగు .. నిను కలిసేందుకు..
నన్ను సిద్దమవమని.. తొందర పెడుతుంది..
ఆ సమయం అందే దూరంలోనిదని నిశ్చయంగా చెపుతుంది..

ఏమవుతుందో కాని..?
ఏమీ తోచనితనంలో ఎదురుచూపుల బరువు ఒక్క సారిగా పెరిగి పోతుంది..
ఏమిటేమిటని ..అడుగుతూ అడుగులు..వడి వడిగా పరిగెడతాయి..
చూద్దును .. కదా..!
నీవెదురుచూడకూడదనీ..ఆ బరువును తీసుకునేందుకు..నేనే ముందుంటాను..

అయినా..
అన్నట్టు కాక కాస్త ఆలస్యం చేస్తావు నువ్వు..
నన్ను నేను క్షమించుకున్నట్టు.. పరవాలేదని సర్దిచెప్పేసుకుంటాను..

కాస్త అటు ఇటుగా మన మాటలు మొదలవుతాయి..
మన కలయిక ..
ఇద్దరి ఏకాంతం..
కాసేపటి నిశ్శబ్దంలో కలిసి పోతాయి..

అప్పుడప్పుడూ అప్పుడప్పుడూ..
నువ్వేదో అన్నావు..?
అదీ నా అంతరంగానికి దగ్గరగా..
అప్పుడు చెప్పలేదు కాని.. లెక్కలు కట్టలేక నాలో ఆనందం అన్యాయమైపోయింది.
చూపు వెనుక కనులను చూపించేందుకు..
నీకు కొత్తగా నేర్పించాల్సినది ఏమీ లేక పోయింది..

అన్నిటి కంటే ముఖ్యం గా..
కాలం.. మన చేతిలో హత్య చేయబడింది..


*picture credit goes to original phographer and source. It will be removed in case of any objections.

Wednesday, February 9, 2011

ఆయన సర్వాంతర్యామి ఎలా అవుతాడు?

ఏది నిజం ..?

దేవుడి పేరు మీద వాడులాడుకోవడానికి ఒక రెండు వర్గాలు..ఎప్పుడూ ఉన్నాయ్.

1 . దేవుడు ఉన్నాడు.
2 . దేవుడు లేడు.

భగవంతుడున్నాడా ? అనే ప్రశ్న నాకు లేదు.. కనుక నేను తప్పక మొదటి వర్గం లో ఉంటాను. కాని నాకు వాదులాట నచ్చదు. కొన్ని విషయాలలో లాజిక్కులు మాట్లాడడానికి ఇష్టపడను. అయితే ఒక తిక మక మాత్రం మిగిలి ఉంది చాలా కాలం గా..

దేవుడికి సంభందించి రక రకాల చర్చలలో నేను విన్న విషయాలు ఈ విధం గా వున్నై .. బహుశా ఇది చదివే మీలో చాలామంది కూడా వినే వుంటారు..

1 . దేవుడు సర్వాంతర్యామి..అని అంటారు. నీలో నాలో అందరిలో ఉన్నాడు.. ఉదాహరణ : ప్రహ్లాదుని కోసమై వచ్చిన శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు (స్తంభోద్భవం).
2 . దేవుడే సృష్టి కర్త.. సృష్టి మూలం. వివరణ: ఎక్కడో.. ఎప్పుడో మనం చూస్తున్న ఈ ప్రపంచం మొదలయి వుంటుంది. అయితే దీనిని ఎవరో సృష్టించి ఉండాలిగా? అతడే దేవుడు.

ఈ రెండూ వినడానికి ఎంత బాగున్నా.. ఒకదానిని ఒకటి ఖండిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే..

నేను ఒక గడియారం తయారు చేసాననుకుందాం. అప్పుడు నేను తయారు చేసిన గడియారం లో నేను ఉంటానా..? కచ్చితం గా ఉండను. నేను వేరు నా గడియారం వేరు. అది కేవలం నా సృష్టి. అంతే..
అయితే నేను ఆ గడియారాన్ని సమయమెంతో తెలుసుకోవడం కోసం వాడతాను .. లేక మరెవరి అవసరం కోసమో అందజేస్తాను.. తప్ప నేనే గడియరాన్నని చెప్పను. చెప్పలేను.

అలాగే దేవుడు సృష్టి కర్త అయితే ఆయన సర్వాంతర్యామి ఎలా అవుతాడు? మరి ఈయన సర్వాంతర్యామి అయితే సృష్టి (ఈయన) ని ఎవరు చేసారు?

Wednesday, February 2, 2011

నన్నా..? నా ప్రేమనా?

ఎవరిని కాదన్నావు?
నన్నా..? నా ప్రేమనా?

ఇన్నాళ్ళలో..నేనెపుడూ నీకు చేదయినట్టు నాకు గురుతు లేదు..
అయితే.. నీ తిరస్కారం నా ప్రేమకే అయి ఉంటుంది..

మరి నాలో ఇన్ని ఆలోచనలెందుకు..?
నీకు నాకు ఈ దూరమెందుకు..? ప్రేమకు కాకుండా..?

ఉన్నట్టుండి కాలం కూడా ఎంత చెడ్డదయిపోయింది?
నిను కలవని ఆ పాత రోజులకు తీసుకెళ్లదు ..
ఇక మీదట నిన్ను కలవనివ్వదు..
కాసిన్ని క్షణాల కటకటాల వెనుక కట్టి పడేసింది.

ప్రేమను వేరుగా చూడలేక
నీ నుండి వేరు పడలేక
పదే పదే తలచుకుని తడబడుతుంటాను..

నీముందు నిలబడాలన్నా..
తెలీకుండా నాకు నేను దోషిలా కనపడతాను..
అందుకే..అలాగే ఆగిపోతూ వస్తున్నాను..

లోపల ఉన్న ప్రేమ
బయటకు రాగానే...ప్రశ్న అయిపోయింది..
కలలు మాత్రం
మేలుకున్నాక ... ఇంకా కలలు గానే ఉండిపోయాయి..

నా ప్రశ్నలకు మాత్రం మెలకువ ఎప్పుడని
ఎదురు చూస్తూనే వున్నాను..నేను
ఇంకా అవునో.. కాదో.. అని.
సమాధానం తెలిసినా ఇంకా సమాధాన పరచుకోలేక..

అవును
అవతల వైపున నువ్వు వున్నావు కదూ?