Monday, January 31, 2011

బ్రాహ్మణుడిగా ఎందుకు పుట్టానురా భగవంతుడా?

బ్రాహ్మణుడిగా ఎందుకు పుట్టానురా భగవంతుడా? అని మీలో ఎవరైనా అనుకున్నారా?

బ్రాహ్మణుడిగా పుట్టడం చాలా గొప్ప విషయమని పూర్వ జన్మ సుక్రుతమనీ భావిస్తాను నేను..ఎందుకు అని ప్రశ్నిస్తే.. నాదగ్గర దానికి లాజిక్కు లేదు.. నమ్మకం తప్ప.. నిజానికి ఎవ్వరికీ నా నమ్మకాన్ని వెల్లడి చెయ్యాలని మునుపెన్నడూ ప్రయత్నం చేయలేదు కూడా..ఇప్పుడూ నా ప్రయత్నం అది కాదు..

కానీ..కొన్ని సంఘటనలు మాత్రం భలే ఆశ్చర్య పరుస్తాయి.. చిన్నప్పుడు నా స్నేహితుడి వాళ్ళ అమ్మ గారు అనే వారు.."నీకేంటి బాపనోళ్ళ పిల్లోడివి..చదువు యిట్టె వచ్చేస్తుంది" అని, నాకు అర్ధం అయ్యేది కాదు.. చదువు కి నేను జన్మించిన కులానికి మధ్య సంబంధం నాకు ఇప్పటికీ తెలియడం లేదు.. ఆ తరువాత రిజర్వేషన్లు నన్ను తగలడం మొదలయినాయి.. APRJC గురించి వినే ఉంటారు. అందులో రాష్ట్ర స్థాయి ర్యాంకు వచ్చినా (154) OC అవడం చేత సీటు దొరకలేదు. బతిమలాడి తక్కువ మొత్తానికి ఓ చిన్న ప్రయివేటు కాలేజీలో చదువుకున్నా.. తరువాత ICET (921) కూడా అదే పరిస్థితి..రాంకులు వచ్చినా "అగ్ర కులాల వాళ్ళు " అనే ముద్ర వేసి వేరే ఏదో కాలేజీ అంట గట్టారు..ఇది ఇక్కడితో ఆగలేదు.. ఏ గవర్నమెంటు ఉద్యోగం రాసినా ఇది మళ్ళీ పునరావృతమౌతుంది.. OC అంటే "అదర్" కాస్ట్ ఇక్కడే.. ఈ పేరు లోనే వేరు చేయబడ్డం జరిగి పోయింది..
నోట్: ఇది ఓపెన్ కేటగిరి కూడా..ఈ కేటగిరిలో మళ్ళీ వేరే ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు.. కనుక ఎవరైతే OC అని భావిస్తున్నారో వారు విరమించుకోవడం మంచిది.. లేక పోతే నిరాశే మీకు మిగిలేది..

అన్నీ దాటుకునొచ్చినా లంచాలు అనే మరో కాన్సెప్టు ఉంది.. నేను దాని గురించి మాట్లాడ దలుచు కోలేదు..

కేవలం బ్రాహ్మణుడిగా పుట్టినందుకు..అందరికంటే ఎక్కువ చదివినా.. మార్కులు సంపాదించినా .. నన్ను(నా లాంటి వాళ్ళని ) ప్రియారిటీ లిస్టుకి దూరం గానే ఉంచడం జరిగింది. పోనీ డబ్బులు మూలిగి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో వున్నా ఏ కుటుంబమయినా ఇలాంటి పరిస్తుతులను తట్టు కాగలదు.. కాని ఆశలు.. ఆశయాలు ఉండి.. ఏదో చెయ్యాలని కలలు కనే వాళ్ళు కష్ట పడ్డా..వారికి కోరుకున్నది దొరకనప్పుడు వారు ఈ కులం నుండీ ఏమి అబ్ది పొందుతున్నారు..? వారి కలలను ఎవరు దెబ్బ కొట్టినట్టు? కులమా? ఇంకా ఇంకా ఎక్కువ చదవని చేతకాని తనమా? లేక వేరేవారి స్వార్ధమా? చేతకాని తనమా?

మనషికి ఇంత చదువు.. బ్రతకడానికో ఉద్యోగం ఇవే సమ కాలీన సమాజంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి వాటిమీద వేటు పడితే...? ఎలా?

ఇంకా ఏదో దొరకలేదు..ఇంకా ఏదో కావాలి..ఇంకా ఏదో తక్కువైందనీ సో కాల్డ్ బలహీన వర్గాలు ఏం కోరుకుంటున్నారు..? ఇంకేమి తీపి తీసింది వాళ్లకి?

అయితే నా ప్రశ్న నేను అసలు ఎందుకు ప్రతి సారి నన్ను ఎక్కువగా నిరూపించుకోవాలి..? సమానత్వం అనే పదం ఎప్పుడూ వింటుంటాను.. అది ఎవరికి కావాలి? సమానత్వమంటే రిజర్వేషానా ?

"ఇప్పుడు నేను అగ్ర కులమా కాదా?" అయితే ఎలా?

భగవంతుని వల్ల ప్రయివేటు సెక్టారు ఇంకా ఆ రేసేర్వేషన్లు గురించి మాట్లాడడం మొదలు పెట్టలేదు.. సంతోషం.. కానీ ఆ రోజు వచ్చినా కూడా నేను ఆశ్చర్యానికి లోను కానేమో.. ఎందుకంటే నేను అంతా ప్రిపేర్ చేయబడ్డాను..

ప్రభుత్వం వారికీ.. నాయకులకూ.. నాలాగే సమాజంలో బ్రతికే ప్రతి ఒక్కరికీ ఒక విన్నపం.. రేసేర్వేషన్లు కులాన్ని బట్టి కాకుండా... ఆర్ధికస్థోమతని బట్టి ఇవ్వగలిగితే అది లేని వాళ్లకి ఉపయోగ పడుతుంది.. ఎవోక్కరికీ నష్టం లేని సిస్టం కావాలి మనకి..

వెనుక బడ్డ వాళ్ళంటే..ఆర్దిక స్థోమత లేని వాళ్ళు.. చదవాలని ఉన్నా చదువు లేని వాళ్ళు చదవ లేని వాళ్ళు .. ఉద్యోగాలు లేని వాళ్ళు.. అవి క్రయిటీరియా అవ్వాలి కానీ.. కులాలు కాదు..

Friday, January 28, 2011

Wednesday, January 26, 2011

వెనుకకు రాలేక..
ఎవరో వేలు పట్టి నడిపిస్తున్నారు
నేనూ అడుగులు వేస్తున్నాను.

కాసేపు పాదాలు అటూ ఇటూ పడినట్టు జ్ఞాపకం
కాని.. నేను పడిపోలేదు..
ఇలా చాలా సార్లు జరిగింది..
నేను కూడా అలవాటు పడ్డాను..
తడబాటుకు కాదు..అడుగులకు..

నెమ్మది నెమ్మదిగా నా చేతిని లాగేసుకున్నాను
నా పాదాలపై నేను నిలబడ్డాను..
ఆక్షణం ఏదో సాధించానన్న గర్వం నాలో..

నా చేతిని పట్టుకునే మరో చేయి లేనందుకో
నన్ను 'నేను ప్రత్యేకం' గా చూసుకున్నందుకో..
ఎందుకో గర్వం..?
అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకోలేదు.

తరువాత.. తరువాత..
అప్పటికవసరం లేని స్వేచ్చ కోరుకున్నాను కాబోలు..!
అక్కరకొచ్చే పాఠాలు అందకూడదని దూరంగా.. పరిగెట్టాను..
కొత్త రెక్కలు బరువెక్కేదాకా.. ఎగురుతూ వున్నాను..
మితి మరచిన వేగం తో..ఉద్వేగం వెనుకే అనుసరిస్తూ వెళ్లాను...


అలా ఎక్కడిదాకా వెళ్ళానో గుర్తు లేదు..
ఎందుకో కూడా ఆలోచన లేదు..

ఇప్పుడు మాత్రం పరుగులిక చాలనిపిస్తోంది..

కానీ ఇంత జరిగాక ..
నడక మాట పాతదైపోయింది
నిన్నటి రోజుల్లో ..వెలిసిపోయినదైపోయింది..
వెనకబడిపోయింది..

అందుకేననుకుంటాను.. ఆగిపోలేకున్నాను..!
నవ్వే నీడల జడల ఉచ్చులు వీడలేకున్నాను...!

Wednesday, January 19, 2011

తెలియక పోవడం కూడా ప్రేమే..!

అంతరాల అడ్డుగోడల కట్టడాలు..
ప్రేమకు తెలియవు..

ఆశలు..
అవసరాలు..
అవకరాలు..
లేవు ప్రేమకు..

తడబాటులుండవు..
నిజానిజాల అక్కరలుండవు..
నిండిపోయిన ఆలోచనలు ఉండవు..
నిండుకున్న మనసులు ఉండవు..
ప్రేమలో..
అంతా పరిపూర్ణతే..

నాకు తెలిసి..నాతో మొదలవుతుంది
నను నింపుతుంది
నను మించి ఎదుగుతుంది..
మరలా నను వేరొకరిలో చూసుకోవడం జరుగుతోంది..

అవును..
ఇదే ప్రేమ..

అయితే..!
ప్రతి క్షణం ప్రేమను అనుభూతి చెందుతున్నానని..
నాకు తెలియలేదు..నేను మునుపెన్నడూ.. తెలుసుకోలేదు..

నిజమే మరి..
తెలియక పోవడం కూడా ప్రేమే..!

Tuesday, January 11, 2011

గాలి కధలు..

ఓ .. సన్నని గాలి తగిలి వెళ్లినపుడల్లా..!
కంటి ముందు ఒక కాగితం
విహంగంలా తన రెక్కలార్చుతోంది ..

దాన్ని అలా చాలా సేపు చూస్తుండి పోయాను.
రెప్పలార్పినట్టు గుర్తుకు లేదు..

ఆకాగితంలో ఏం రాసుందో అని...
నేను చూడడానికి ప్రయత్నం చేయలేదు..
ఆ గాలి ఎక్కడినించీ వస్తోంది అన్నది కూడా..నాకు తెలియదు..
నా ఆలోచనంతా.. ఆ కాగితానికి గాలికి మధ్య ఏం జరుగుతోందనే..

కాసేపు.. ఆ కాగితం నిలకడగా నిలబడాలనుకుంటుంది..
ఉన్నట్టుండి ఎక్కడి నుండో గాలి వస్తోంది..
కాగితంతోపాటు. అక్షరాలనూ తలల కిందులు చేస్తోంది..
ఈ గాలిని ఏమనను..?

ఆ గాలి అల్లరిది.. అంత సేపూ ఆడించి..
ఉన్నట్టుండి వెళ్ళిపోతుంది..
ఈ నిజం తెలిసినా..
ఆ కాగితం ఎవరో ఆత్మీయులు పోయినట్టు.. దిగాలు పడిపోతుంది..
ఇప్పుడీ కాగితాన్ని ఏమనాలి?

వీటికిది మామూలేమో..?
అని మిన్నకుండి పోయాను కాని..
ఆ గాలిని నిలువరించలేను ..
అలాగని ఆ కాగితాన్ని ఓదార్చలేక పోయానూ..
ఇప్పుడు మరి నన్నేమనుకోవాలి.. ?

ఇదే మళ్ళీ మళ్ళీ జరిగింది.
చూస్తుండగానే.. ఆ కాగితం ముక్కలై చెదిరిపోయింది..

ఇప్పుడా కాగితం లేదు..ముక్కలూ లేవు..
అయినా ఆ గాలీ వీస్తూనే వుంది..
ఎందుకో..? తెలియదు..

ఇంత జరిగినా..
నేను మాత్రం చూస్తూనే వున్నాను..
వెళ్ళిపోదామని..! ఇంకా అనిపించడం లేదు..

ఎందుకనే ప్రశ్న నన్ను నేను వేసుకోనూ లేదు
కారణం నాకు తెలుసు..
నాది కేవలం ప్రేక్షక పాత్ర..

Wednesday, January 5, 2011

సిరా చుక్కలు.. అక్షరాలూ .. ప్రేమ..
సిరా చుక్కలు..
అక్షరాలై కాగితాలను హత్తుకుంటున్నాయి..
ఈ 'కధ వెనుక ప్రేమ' నాదే కదా అని .. ఆలోచిస్తే అనుమానమొచ్చింది..!
ఎందుకు రాస్తానో..? అని..

వెళ్ళిన నిన్నటి రోజుల నీడలు..
నావెంటే తిరుగుతుంటాయి..

ఏమో..?
వాటి రంగులు వెలిసిపోగూడదని
రాస్తుంటానేమో?

ఎప్పటివో.. ఏవో..
చెప్పాలని చెప్పక ఆగిపోయి వుంటాను.
అవే మాటలు మది నుండీ తెరలు గా
తీయడానికి రాస్తున్నానో.. ఏమో?

----------------------------------------

ఆలోచనలు..లోయలలాంటివి..
లోతైన ప్రపంచానికి పట్టుకెళ్ళిపోతాయి ..
బహుశా వెళ్ళే దారికి .. గుర్తులు రాసి..
దాచిపెట్టుకుంటున్నానేమో..?

ఆకర్షణను .. అనాదరణను..
ఆర్తిని.. ఆనందాన్ని
మరి అనేకానేకానుభూతుల కదలికలను..
వేటిని స్పృశించడానికి రాస్తానో..?

----------------------------------------

నిభందనలు వర్తించే* జీవితంలో
అంతర్లీనంగా ఉన్న వివరణలను చూసినప్పుడు..
సందేహాలకు లోనవుతాను.. సందేశాలను తీసుకుంటాను..
అప్పుడు గానీ కలం కనిపెడుతుంది కాబోలు?

ఎక్కువ ఆశలు.. ఎక్కువగా ఆశలు.. అవి గాలిలో 'పేక' మేడలు
కట్టడానికీ కష్టపడాలి..
కలిసొస్తేనో.. కూలిపోతేనో..
కన్నీళ్ళూ పెట్టాలి..
అక్కడ గానీ అదే కలం సిరా నింపుకుంటుందేమో..?

----------------------------------------

ఏది ఏమైనా..
భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో..
ఎప్పుడు కానీ.. నా మస్తిష్కం, 'నేను' అనే వాడితో మాట్లాడాలనుకుంటుందో..
అప్పుడు ఒక స్పందన మొదలవుతుంది..

ఆ స్పందననే... నేను ప్రేమ అంటాను..
ఆ ప్రేమే..నా రాతల్లో.. అక్షరానికి జన్మనిస్తుంది..
అవి ఎదుగుతుంటాయి..
నేను మాత్రం ఇలాగే ఉంటే బాగుండుననిపిస్తుంది..

.

Monday, January 3, 2011

నా రాతలకు ఏడేళ్ళు.. ఆన్ లైన్ లో రెండేళ్ళు..

నారాతలు నా డిగ్రీ కాలంలో మొదలయినట్లున్నై..ఒక చిన్న సస్పెన్స్ స్టొరీ .. రాసినట్టుగుర్తు..ఎక్కువగా కొటేషన్లు అవీ రాసేవాడ్ని..మొదట్లో ..ఏవో కాగితాల్లో రాసుకోవడం.. అవి ఎక్కడో పెట్టి మర్చిపోవడం..ఏమిరాసామో కూడా గుర్తులేకపోవడం.. ఇదే పరిపాటి గా జరిగేది.. తరువాత ఒక పుస్తకం పెట్టాను.. నా ఆశ ఏంటంటే.. సబ్జెక్టు పరంగా ఏ ఒక్క రకమైన కవితలకే.. అతుక్కుపోకూడదు అని.. రక రకాలు రాసేవాడిని.. అయితే నాకు పెద్ద సమస్య ఏంటంటే.. నేను రాసినవి తిరిగి నేనే వివరించి చెప్పుకోవలసి వచ్చేది.. "అవునా ఇంత అర్ధం ఉందా అనే వాళ్ళు.. విన్న వాళ్ళంతా.." అది వెక్కిరింతో.. లేక నిజమో తెలిసి చచ్చేది కాదు.. చాలా ఘాటుగా వాడుతున్నావు పదాలు అనే వాళ్ళు ఎక్కువమంది వుండేవాళ్ళు.. అందంగా రాసినా అసహ్యం గా రాసినా మొత్తానికీనా రాతలు ఆగలేదు.. దీనికి ముఖ్య కారణం మాత్రం నా స్నేహితులే.. నచ్చినా నచ్చకున్నా నన్ను భారించేవాళ్ళు.. మధ్యలో మాటీవి వాళ్లకు నా కోడి కెలుకుడు లిపిలో ఒక కవిత రాసి పంపా.. (అప్పట్లో ఓ ప్రోగ్రామేదో వచ్చేది లెండి) పాపం కొత్త భాష నేర్చుకోలేక ఎక్కడో నా ఉత్తరం దాచిపెట్టి తరువాత పాత సామానుల వాళ్లకి ఉచితంగా ఇచ్చేసారు..

ఇప్పుడేదైనా రాయాలని కూర్చుంటే వెంటనే ఆలోచన రాదు, కలం కదలదు .. ఒక్కోసారి ఆలోచన వచ్చిన వెంటనే కలం తిరిగే మెలికలు నేనుసైతం ఆపలేను.. ఇలా రాస్తున్నామా.! పారేస్తున్నామా..! అని రోజులు కదులుతుంటే..

మొట్ట మొదట 'నేను -లక్ష్మి ' అనే బ్లాగు గురించి పేపరులో ప్రచురించిన ఆర్టికల్ చదివి మా స్నేహితుడొకడు మనకీ ఓ బ్లాగు ఉంటే బాగుంటుంది కదా..అని స్టార్ట్ చేసాడు.. అప్పటికి బ్లాగంటే కూడా తెలీదు నాకు.. సరే అని ఒకటి మొదలు పెట్టా.. ఇప్పుడు కూడలిలో రిజిస్టరు చేసుకో..అన్నాడు.. అలా నా రాతలు ముందు నలుగురిలోకి వచ్చాయి.. మా స్నేహితుల ప్రోత్సాహం తో.. ఈ బ్లాగు మొదలు పెట్టి రెండు సంవత్సరాలు..అయ్యింది.

అప్పటి నుండీ ఇక రాయడంలో వెనక్కి చూస్కోలేదు.. రాయాలనిపిచినప్పుడు అప్పటికప్పుడు ఆలోచనల్ని బ్లాగెక్కిస్తూ వుండే వాడిని.. తోటి బ్లాగర్లు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియ చేసే వారు..

నా ఎచీవ్మెంట్స్.. (అని నేను భావించేవి.)

౧. కవితలు పొందుపరచుకోగాలిగాను..
౨. కధలు కూడా రాసాను..
౩. ఒక షర్టు ఫిల్ము తీసాను. ఈ జనవరిలో ఇంకోటి ప్లాన్ చేస్తున్నాను
౪.ముఖ్యంగా నలుగురు స్నేహితులను సంపాదించుకున్నాను..

సో..ఇప్పుడేమి చెప్పదలుచుకున్నానంటే.. నేను ఏమైనా రాసానంటే.. దానికి ముఖ్యంగా తోటి బ్లాగరుల ప్రోత్సాహమే కారణం.. రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో నేను నా నమస్సులు తెలియ జేయాల్సిన భాద్యత ఉంది.. ఆ లిస్టు ఇలా ఉంది..

"నేను-లక్ష్మి" గారికి
"వీవెన్" గారికి (కూడలి)
"రాజశేఖరుని విజయ్ శర్మ"
"క్రియేటివ్ కుర్రోడు మాధవ్"
"పరిమళం " గారు
"ఆత్రేయ " గారు
"చైతన్య" గారు
"కొత్త పాళీ" గారు
"సత్య " గారు
"మరువం ఉష " గారు
"సుజన మధురం"
"పద్మార్పిత" గారు
"తృష్ణ" గారు
"సాయి ప్రవీణ్" గారు
"తోట రాముడు " గారికి

ఇలా ఇంకెవరి పేరైనా మరచిపోయి ఉంటే క్షమించండి. "బాగుంటే బాగుందని.. లేకుంటే బాలేదని, అర్ధం కాలేదని .. అర్ధం లేదని.." కొంత సమయం తీసుకుని చదివిన వారికి .. చదివి వ్యాఖ్యలు వదిలిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా.. నా ధన్యవాదాలు.. నిజంగా ఈ బ్లాగు పెట్టక పోయి వుంటే. నా రొటీను లో పడి.. ఏమైనా రాద్దాం అన్న ఆలోచన కోల్పోయి ఉండేవాడినేమో.. ?
శివ చెరువు

Sunday, January 2, 2011

ప్రశ్నలు.. 'నేను'ప్రశ్నలు వదలవు నన్ను..
ప్రశ్నిస్తాయి..
పది పది మార్లు..

తరగతి గదిలో ..
వెనుక వరుస విద్యార్ధిని కదూ..!
సమాధానాలూ అంత త్వరగా
దొరకవు నాకు..!

వెంట పడతాయి..
కారణం.. వాటికి నేనే వినోదం..
నిజానికి నాకూ అవే కాలక్షేపం..
అయినా ఎందుకో ..?
వాటికి దూరంగా జరగాలనుకుంటూ ఉంటాను ..

రవిగానీ..నిశి రానీ..
అవి రెప్పలార్పవు..
నన్ను నిద్దురమత్తుకు దగ్గర కానీవు....
'నేను' కాని వాటివద్దకు పొనీవు..
అమృతపానం గానీ చేశాఏమో?
అందుకే ఈ సురాసుర లక్షణాలు..

తిక మక పడితే..
నవ్విపోతాయని భయం..

తప్పించుకుపోదామా అంటే..
అంటి పెట్టుకు తిరుగుతున్నాయన్న ఆలోచన..

అనుమతి అడిగి బయట పడదామా అంటే..
అక్కడే ఆంక్షలు మొదలు..

అన్ని విఫల యత్నాల ఫలితాన
అలసిపోయాను..
అందుకే వాటికి ఎదురొడ్డే ఆలోచనలకు నీళ్ళోదిలేసాను ..
కలిసి తిరగడం మొదలు పెట్టాను..
సహవాస దోషం అంటింది కాబోలు..
ఇప్పుడు ప్రశ్నలకు ప్రశ్నలు మొదలయ్యాయి..
తాము వెనుక వరసకు వచ్చి కూర్చుంటున్నాయి..

మచ్చిక చేసుకున్నాక
మంచి స్నేహమయ్యాకా..
ఇప్పుడొకరికొకరం జాబులిచ్చుకుంటున్నాం..

నేను 'అవకాస'మివ్వనని మాట ఇచ్చాను..
తనూ 'అనుమాన'మవనని చెప్పింది..

ఇక ఇద్దరం కలిసే ఉంటున్నాం..
మరి నేనూ వేరుపడాలని అనుకోలేదెప్పుడూ ..