Monday, November 29, 2010

జీవితానికొకటే తెలుసు..జీవితానికొకటే తెలుసు..
ఇవ్వడం..


ఈరోజు మీద ప్రేమ
ఊహలు నింపుకున్న రేపటి రోజు
బ్రతకడానికి కారణం

మనసుకు కాస్తంత నవ్వు..
మనిషిగా కాసిన్ని క్షణాలు..
తనదైన అస్తిత్వం

కొన్ని తీయనివి..
మరి కొన్ని మింగుడు పడనివి..
వెనుకటి రోజులకు, కాలం చెల్లని గురుతులు

అంతే..

Friday, November 26, 2010

ఆకలేసిన ఆదివారం ..

అది ఆకలేసిన ఆదివారం .. ఇంట్లో ఎవరూ లేరు .. డైలీ సీరియల్ లో కధ అంత క్లియర్ గా 'మనకి' 'మన వంట' గురించి తెలుసు.. పోనీ పక్కింటి వాళ్ళని అడిగి తినడానికి ఏమైనా తెచ్చుకుందామా..? అని ఆలోచిస్తే.. పోయిన వారమే తెచ్చిన అయిదు కేజీల కోటాబియ్యం, అరకేజీ బెల్లం, ఒక జాడీ ఆవకాయ ఇంకా పాడై పోతాయని వాళ్ళు ఫ్రిజ్జు లో దాచుకుంటే ఎత్తుకొచ్చుకున్న కూరగాయలు గుర్తుకొచ్చాయి. దేవుడిచ్చిన కాసిన్ని తెలివి తేటలతో పరిస్థితిని సాయంత్రం దాకా విశ్లేషిస్తే.. బయటకెళ్ళి తినాల్సిందేనని తేలిపోయింది. ఇక ఆలస్యం చేయలేదు ..

జుయ్య్ మని బయటకి పరిగెత్తాను ..
.
.


=====================================================

కుక్కకి మనసు విరిగిందీ అదే ఆదివారం.. వీధిలో ఎవరూ లేరు.. జరిగిన యానువల్ ఎప్రైసల్ లో ప్రాజెక్ట్
లీడ్
పడేసిన రేటింగ్ నోటిక్కరుచుకుని ఎక్కడికో బయలు దేరింది. లీడ్ మొరిగితే పడింది , ఆన్ సైట్ ఇవ్వకపోయినా సర్దుకుంది.. అర్ధ రాత్రి అపరాత్రి లేకుండా ఓటీ చేసింది.. అడక్కపోయినా ఓవర్ యాక్షన్ చేసింది.. అయినా ఏమిటీ దరిద్రపు గొట్టు రేటింగ్ ..? పైగా "కుక్కా - పిక్కా" ప్రాజెక్ట్ నావల్లే పోయింది అంటాడా....

నో... నో... నో.... ఒక్కసారి గట్టిగా మొరిగింది.. ఎదురుకుండా ఏదో సినిమాలో రమణ గోగుల మ్యూజిక్ కి చక్రి పాడిన పాట పాడుకుంటూ వస్తున్న నాలో తన బాసు కుక్కని చూసుకుంది...

నేను.. కుక్క.. బాసు కుక్క...
కుక్క..బాసు కుక్క... నేను..
బాసు కుక్క... నేను..కుక్క..

ఇలా అర నిమిషం ఫోటోలు మారాకా.. కచక్ కచక్ అని ఎక్కడో శబ్దం వినపడింది.. ఎక్కడా..? అని కన్ఫర్మ్ చేసుకునే లోపలే కళ్ళలోంచి నీళ్ళు, హైదరాబాద్ లో వరదనీరులా బయటకొచ్చేస్తున్నై ..

"మమ్మీ..." గట్టిగా ఒక అరుపు.. చూస్తే మా ఇంటి గేటు దూకి లోపల పడ్డాను..

======================================================కళ్ళు తిరిగినట్టున్నై.. కొంత సేపు నాకేమీ తెలీలేదు..

అమీర్ పేటలో ట్రాఫిక్కు లేనట్టు.. , మా వీదిలో కుక్కల్లేనట్టు , మధ్య రిలీసైన ' A '
సినిమాలో హీరోయిను నన్ను ప్రేమిస్తున్నానని పబ్లిక్కు లో చెప్పినట్టు.. (వచ్చింది ఇంగ్లీష్ సినిమా హీరోయిన్ ) యేవో పాడు కలలోచ్చాయి..

రియాలిటీ లోకొచ్చాకా ఇప్పుడు దాన్ని తిట్టాలి అని గుర్తుకొచ్చింది.. హీరోయిన్ ని కాదు కుక్కని

చీ చీ చీ... సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని జాలి కూడా లేకుండా ఎడా పెడా కరిచి పడేసింది.. పాడు కుక్క.. దరిద్రపు కుక్క.. దొంగనా.. కుక్క...

నేనే దాని ప్లేసులో ఉంటేనా.. ఇలా కరుస్తానా.. ? నాకు మాత్రం బాసుల్లేరా.. అప్రైసల్స్ కాలేదా..
ఆగు ఆగు ... నేను కుక్కతో పోల్చుకుంటున్నానేంటి..? ????????

తెగిన చెప్పుతో టపా టపా రెండు దెబ్బలేసుకున్నాను...

equation derived : కుక్క కాటు + చెప్పు దెబ్బ.. = ఒక్కరికే (రెండూ నాకే)

ఇంతలో ఎవరో తలుపు తట్టారు..

==========================================

చెప్పు పక్కన పడేసి తలుపు తెరిచి చూసా. పక్కింటావిడ!

(కొంప తీసి వాళ్ళాయన అరువిచ్చినవి అడగడినికి కాని రాలేదు కదా.. ఉన్న పళంగా ఆస్తులెక్కన్నించీ అమ్మాలీ ,, ?) ఆలోచనలో పడ్డా..

"బాబూ ఇంట్లో మనుషులు ఎవ్వరూ లేరా..?"

చెట్టంత మనిషిని నేనుంటే ఎవ్వరూ లేరంటుందా...? నాకూ అనుమానమొచ్చింది. అవును మధ్య అద్దంలో చూస్కోక చాలా కాలమయింది.. .. వెంటనే పరుగెత్తుకెళ్ళి అద్దం ముందు పది పాతిక భంగిమలు ప్రయత్నం చేసాక... నేను నేనే అని కన్ఫర్మ్ చేసుకుని తలుపు దగ్గరకి వచ్చా...

ఎంత
మదమెంతఅహమెంతకండకావరము?

అరిచేద్దామనుకున్నాను.. కాని పొద్దున్నే మునిసిపాలిటి పంపు దగ్గర నీళ్ళు పట్టుకునే పోటీలో ఆమే నెంబర్ వన్.

equation derived : నెంబర్ వన్ = బలమెక్కువ + అంతకు మించి నోరెక్కువ

అది గుర్తుకొచ్చిన నాలో ఎక్కడ లేనీ వినయం బయలు దేరింది "లేరండి .. చెప్పండి ఏం కావాలి ?"

"బయటకి వెళ్తున్నాను.. కొంచెం మా చంటాడిని చూస్కో అంటూ బుజ్జిగాడిని మా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయింది"

పిలిచినా వినిపించుకోకుండా వెనక్కి తిరిగి చూడకుండా అవుటయిన యువ రాజ్ సింగ్ పిచ్చి మీంచి వెళ్లిపోయినట్టు... విసురుగా వెళ్ళిపోయింది..

==========================================

వాడు బుజ్జిగాడు కాదు నన్ను టార్గెట్ చేయడానికి వాళ్ళ అమ్మ నా మీద వదిలిన "గుణ శేఖర్ సినిమా" ..

హీరో "ఉపేంద్ర " కొచ్చిన బూతుల కంటే ఎక్కువ బూతులు .. తెలుగు సినిమా హీరో కంటే ఎక్కువ స్టంట్లు.. అన్నిటికీ మించి మాంచి తమిళ సినిమాలో ఉన్న ఏడుపు .. వీడి ప్రత్యేకత.


ఒకటా రెండా.... కూర్చుంటే కాళ్ళ మధ్యలో దూరిపోతాడు.. నడుస్తుంటే కాళ్ళకడ్డంపడతాడు, అటూ ఇటూ అయితే వెల్లకిల్ల పడతాడు.. వాడు పడితే ఏడుస్తాడు .. ఏడిస్తే..వాళ్ళమ్మ వస్తుంది.. ఇక ఇలాకాదని వాడ్ని కుర్చీకి కట్టేసి కార్టూన్ చాన్నెల్ తగలేసి ..నేను పెయింటింగ్ వేయడం మొదలు పెట్టాను..

నాలో సృజనాత్మకతని మొత్తాన్ని .. జోడించి, హెచ్చవేసి, బాగించి, గుణించీ ఒక అద్భుతమైన కళా కండం గీసాను.అది నాబోమ్మే .. పోయిన సారి ఓటరు గుర్తింపు కార్డులకోసం తీయించుకున్న ఫోటో చూసి గీసాను దీన్ని...
ఎంత బాగా ఉంది పెయింటింగ్.. నిజంగా కంటే బొమ్మలో ఎంత బాగున్నాను..!? మ్మ్ మ్మ.. ముద్దొచ్చేస్తోంది..

ట్రింగ్ ట్రింగ్..ఎవరో వచ్చారు . బొమ్మ పక్కన పెట్టి డోర్ తెరవడానికి వెళ్ళాను..

ఇంతలో కరెంటు పోయిందని పక్క గది నుండీ కుర్చీ ఈడ్చుకొచ్చేసాడు బుజ్జిగాడు. నేవేసిన పెయింటింగ్ చూసి చుచ్చు పోసి కుక్క కుక్క .. కుక్క .. అని అరవడం మొదలు పెట్టాడు.

నా గుర్తింపు కార్డు పాడు చేసినందుకా.. నన్ను కు.. కు..కుక్క అన్నందుకా.. ఎందుకు ముందు ఏడవాలో తెలీక గొంతు దాక వచ్చిన ఏడుపుని అక్కడే ఆపేసుకున్నాను.. నువ్వూ మీ అమ్మ అంత అవుతావురా బుజ్జిగా అని ఆశీర్వదించి వచ్చిన వాళ్ళ నాన్నకిచ్చి పంపేసాను.. .

equation derived : effect @ బుజ్జిగాడి అల్లరి is> effect @కుక్క కాటు

===========================================

ఇక ఇలా కాదు.. మనసు శాంత పరుచుకోవాలంటే.. entertainment కావాలంతే.. అని బుజ్జిగాడొదిలేసిన టీవీ ముందు కరెంటు వచ్చేదాకా కూర్చున్నా.

నా అభిమాన సీరియల్ "ఆరేసుకుందాం రా.." నూట యిరవయ్యారో ఎపిసోడుకి మొత్తానికి హీరోయిను అక్షత, ఉతికిన బట్టలు ఆరేసింది.. అవి ఆరి, సర్ది, బీరువాలో పెట్టడానికి ఎంత లేదన్నా.. మరో రెండువందల పాతిక ఎపిసోడులు చూడచ్చన్న దీమాతో ఉన్న నన్ను.. తరువాత సీను గుండెల మీద కొట్టింది.. ఆరేసిన బట్టలు.. కుక్క ఎత్తుకెళ్ళి పోయింది.. దారుణం చూడలేని నేను ఛానల్ తిప్పేసుకున్నాను..

చానల్లో హీరోయిను 'అమల' ఇంటర్వ్యూ . నాకు తెలీకుండానే ప్రోగ్రాం నెక్స్ట్ బట్టన్ మీదకి నా వేలు వెళ్ళిపోయింది..

ఇప్పుడు జెమినిలో బయోస్కోప్ ప్రోగ్రాం వస్తోంది.. హాలివుడ్లో రికార్డుల వర్షం కురిపించి, కనీ వినీ ఎరుగని గ్రాఫిక్స్ మాయ జాలంతో, మునుపెన్నడూ చూడని భారి యాక్షన్ చిత్రం "వీధి కుక్క ". తెలుగు లో తప్పక చూడండి . "వీధి కుక్క, వీధి కుక్క, వీధి కుక్క " అని అక్క చెపుతోంది..యేవో రెండు మూడు భయపెట్టే సినిమాల ప్రోమోలు వేసాక ముచ్చట కూడా అయిపొయింది..

ఇంతలో నాన్న గారు ఫోన్ చేసారు..

"ఏరా ఎక్కడున్నావ్?"
"ఇంట్లోనే వున్నాన్ను.. నాన్న గారు "

"నీకోసం ఎవరో టీవీ వాళ్ళు ఫోన్ చేసారు"
"అవునా.. ? నాకు తెలుసు నాన్నగారండి మీరు నాగురించి గర్వ పడే రోజొస్తుందని"

"నీ బొంద ! పాడు పని చేసావ్? నువ్వెకడున్నావని అడిగి అడిగి చంపుతున్నారు "

"మీ మీద ఒట్టండీ .. నేను కుక్కనీ ఏమీ చేయలేదు.. "

"పెట్టేయ్ ఫోను వెదవా.. "
ట్రింగ్ ట్రింగ్.. ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు.
=====================================================

తలుపు తీయంగానే "వీధి కుక్క అరాచకం " "శాంతి నగర్ లో నెలకొన్న అశాంతి " అంటూ తెలుగుని మాట్లాడుతున్నట్టు కాక.. వాంతి చేసుకుంటున్నట్టు ఎవరో ఒకామె తోసుకుని లోపలి కొచ్చింది.. ఆమె తో పాటూ 3/4 షార్టు, అర కొర గొరిగిన గడ్డం, లుంబుం చొక్కా.. వేసుకుని ఒకడు తగలడ్డాడు..


"మీ పై జరిగిన అరాచకానికి మీరు ఎలా స్పందిస్తున్నారు ? మీకిదే మొదటి సారా ..? అసలెందుకిలా జరిగింది ? దీనిలో తప్పెవరిది అని మీరు భావిస్తున్నారు.. ? "

అని నన్ను లేని సిగ్గు గుర్తు చేసుకునే ప్రశ్నలడిగి నేను పూర్తి గా ఏడిచే లోపే కెమెరా కి అడ్డుగా నిలబడి .. "మీరేమంటారు ? మీరు ఎవరిని సమర్ధిస్తారు? వెంటనేXXXXXXXXకి SMS చేయండి " అని చెప్పి ఇంక చాలు రోజు కి అంది ..
3/4లాగు వాడు.. రేపు మళ్ళీ ఎమోస్తాం ఇప్పుడే మిగతాది కూడా షూటింగ్ చేస్కుని వెళ్లిపోదాం.. అంటున్నాడు.

బాబూ .. గ్లాసు మంచి నీళ్ళు యియ్యి. మేకప్ ఏమీ అక్కర్లేదు కానీ.. ఇలాంటి సీన్స్ కి బా సూటయ్యావ్.. ఏదీ ఓసారి ఇటు తిరుగు.. ఓసారి అటు తిరుగు... కుక్క కరిచిన కాలెత్తు.. అని..హెరాస్ చేయడం మొదలు పెట్టాడు..

కుక్క, బుజ్జిగాడు, టీవీ అన్నీ ఎత్తుకుపోగా నాలో మిగిలిన ఓపిక కాస్తా వీడు ఊడ్చేసాడు. ఇక నా నోటికొచ్చిన బూతులు తిట్టాను..

ఛీ ..మా వీధిలో నీకు ఓను హౌసు దొరక..! కుక్కలకీ నీకూ ఫ్యామిలీ ఫోటో తీయ్య..! బుజ్జిగాడు రోజూ మీ ఇంటికి రానూ..! మీ టీవీ లో కెమెరా యెనక కాక, ముందు నువ్వు కనపడ..!

కెమెరా వాడు.. యాంకరు.. ఇద్దరూ ఏమనుకున్నారో కానీ ఇంజక్షన్ చేయించుకోమని కొన్ని డబ్బులు జేబులో పెట్టి.. బుజం తట్టి ..మంచి నీళ్ళు తాగకుండా వెళ్ళిపోయారు..

Friday, November 19, 2010

ఎక్కడిదాకా వెళ్ళినా నీతోనే ఆగిపోతాను..


.


నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా..
నా నిశ్శబ్దానికి నీవే భావమైనట్టుంటుంది
చివరికి నా నీడకు కూడా కొత్త రంగులద్దినట్టుంటుంది

నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా..
నిద్దురలో మెలకువలు
మామూలే అనుకుంటాను
మెలకువలో మళ్ళీ మళ్ళీ వచ్చే కలలు
అలవాటు చేసుకుంటాను..

నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా..

ఏదో జరిగిందనుకుంటాను
గడిచిన కాసిన్ని క్షణాలను గంటలతో గుణించుకుంటాను
ఉన్నట్టుండి నవ్వేస్తాను
లక్షల సార్లు ఆశ్చర్యపోతాను
వేరు ఆలోచన మరిచిపోతాను
ఆకాశం కేసి చూసి ఆనందంతో అరిచేస్తాను
నీకు - నాకు మధ్య గీత చెరిపేందుకు...
వెంటపడుతున్న ఆశతో వేగంగా పరుగులు తీస్తాను
ఎక్కడిదాకా వెళ్ళినా నీతోనే ఆగిపోతాను..


అయినా అనిపిస్తోందీ..?
ఆదమరపునైనా.. మరపుకు రావుకదా..
నిన్ను గుర్తుకు తెచ్చుకోవడమేమిటని.. ?
నన్ను నేను ప్రశ్నించుకుంటే మళ్ళీ నవ్వొచ్చేస్తోంది..
ఇదేమిటని !

Monday, November 15, 2010

నువ్వు నేను - మనమిద్దరం

.తెలియలేదు కాని
ఒకరి చేయి పట్టుకుని మరొకరు.. మనమిద్దరం.. వీధి దీపాల వెలుగులో
అలా అలా ఎంతో దూరం ముందుకు వచ్చేసినట్టున్నాం

ఇప్పుడు ఎవరూ లేరు వీదిలో
కేవలం నువ్వూ నేను..
అంతే..


దారిపొడవునా
ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ నువ్వేదో చెప్పావు

నువ్వు - నేను కలిసిన మొదటి రోజుల గురించి చెప్పావు
నువ్వు నేనైన నీ గుర్తులను నాతో చెప్పావు

నేను లేనపుడు నీతో నువ్వేమిటో చెప్పావు..
నీకు నేనేమిటో చెప్పావు..

నామీద ప్రేమ దాచుకుని చూపించాలనుకున్న కోపం
వద్దు ఇక వద్దు, చాలు అనుకున్న దూరం
దూరంలోనే మళ్ళీ దగ్గరతనం
అన్నీ చెప్పావు..

చెప్పలేక ఆగిన క్షణాలు
చెప్పక దాచుకున్న మాటలు
నాకై నేనే చెప్పాలని నువ్వాపడ్డ ఇన్నాళ్ళు
అన్నిటి గురించీ చెప్పావు..
.
.
.
.
బహుశా నేను నీఅంతగా
నాలోని నిన్ను బయట పెట్టలేనేమో..?

ఇందాక అన్నాను
ఇక్కడెవరూ లేరని..
నిజానికి ఉన్నా నాకు అంతరం తెలీదు
ఇదే నేనూ నీకు చెప్పాలనుకున్నది..

నడిచే ప్రతి అడుగులో నా పక్కన నువ్వు...
నీ చేయి నా చేతిని తాకినప్పుడల్లా
నీ చిటికిన వేలు పట్టి నడుస్తానన్న నమ్మకం
ఏరోజుకారోజు జ్ఞాపకాల గదుల్లో దాచుకున్న ఆనందం
ఎప్పటికప్పుడు గుండెకి గొంతుకనిద్దామనే ఆత్రం

ఇవన్నీ నేనూ నీకు చెప్పలేదు...!

ఒక్క క్షణం నిన్ను దగ్గరకి తీసుకున్నాను..
గుండె చప్పుడు కు దగ్గరగా హత్తుకున్నాను
అంతే..

ఇక మాటల అవసరం మన మధ్య మళ్ళీ రాలేదు..

Wednesday, November 3, 2010

ఒక జీవిత కాలపు లేమి..!

"మనమ"నేదెపుడో మరణించింది
"నేను" పుట్టాక..

"నేను" కూడా కరువయింది..
మానమోదిలేసాక..

ఇంకేమి మిగిలింది..?
మనసు త్యజించాక..

చెప్పుకుంటే
సిగ్గుచేటు..
చెప్పుకోలేక రోకటి పోటు..
ఒక జీవిత కాలపు లేమి..!