Monday, October 11, 2010

నా కధ పేరు "మనిషి"..

ఆలోచనలెన్ని?
ఆలోచనంతారాలెన్ని?
లెక్కలేనన్ని...
లెక్కకు రానన్ని..
అన్నీ నావే..

ఆశయాలు..ఆశలు నావే..
స్వల్ప కాలపు ఏమరపాటున, ఆకర్షణలూ నావే..
వెనువెంటనే సంఘర్షణలూ నావే..

నిజమేమో అనిపించేంత భ్రమ!
భ్రమని భ్రమింపజేసే నిజమూ!
ఒకటి తారసపడి వెళ్ళిపోతుంది
మరొకటి నన్ను ఉలిక్కి పడేట్టు చేస్తుంది..
.. రెండూ నావే..!

సంఘమనే ..సంఘీభావమనే..
మతమనే .. మానవతావాదమనే..
చించుకునరిచే గొంతుకలు నావే ..
నోటుకు.. మాటకు..
జడిసి సత్తువకు ..
నొక్కుకు పోయే కుత్తుకలూ నావే..

భారమని బ్రతుకుని దించేద్దామనుకుంటాను..
మళ్ళీ భుజానికెత్తుకుంటాను..
ఓపికలేనితనం నాదే..
ఓటమినొప్పనితనమూ నాదే..

నిదురిస్తున్నప్పుడు..నిదురిస్తున్నాననుకొన్నప్పుడు
మేల్కొన్నప్పుడు .. మేల్కొన్నాననుకొన్నప్పుడు
ప్రతి స్థితిలో జీవిస్తున్నప్పుడు..
ఏది కాను నేను ..
ఎక్కడ లేను నేను..

నాది అని చెప్పుకునే, నడిపించే నా కధలో,
నేనే కధానాయకుడను
నేనే నా నాయికను
నేనే నా సహ నటుడను
నేనే నా కధా వస్తువును ..
ఒక్కో అధ్యాయానికి జత చేరే మలుపును ..నేనే

ఇంతకీ చెప్పలేదు కదూ..!
నా కధ పేరు "మనిషి"..

6 comments:

  1. చాలా బాగుంది

    ReplyDelete
  2. చాలా బావుంది.
    ఆ చివరి రెండు వాక్యాలూ లేకపోతేనే బాగుండుననిపించింది.
    పాదాల్లో అన్నేసి చుక్కలు పెట్టనక్కర్లేదు. నేరుగా రాసుకుపోవచ్చు.

    ReplyDelete
  3. నాగార్జున గారూ ధన్యవాదాలండి.

    కొత్తపాళిగారు: ముగింపుకోసం, అలాగనే రాసినది మొత్తాన్ని ఒక్క పదంలో చెప్పాలనే ఉద్దేశంలో రాసినవి అండీ ఆ ఆఖరి రెండు లైన్లూ.. ఇక చుక్కల విషయానికొస్తే అది నాకు పెద్ద జబ్బండి. నయం చేసుకుందామనే ప్రయత్నంలోనే ఉన్నాను. మీరు వచ్చి నా టపా మీద మీ అభిప్రాయం చెప్పినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. చాలా చాలా నచ్చింది మీ "మనిషి" కవిత.
    >>భారమని బ్రతుకుని దించేద్దామనుకుంటాను..
    మళ్ళీ భుజానికెత్తుకుంటాను..
    ఓపికలేనితనం నాదే..
    ఓటమినొప్పనితనమూ నాదే..
    I really like it very much. superb..:)

    ReplyDelete
  5. నాది అని చెప్పుకునే, నడిపించే నా కధలో,
    నేనే కధానాయకుడను
    నేనే నా నాయికను
    నేనే నా సహ నటుడను
    నేనే నా కధా వస్తువును ..
    ఒక్కో అధ్యాయానికి జత చేరే మలుపును ..నేనే...




    దర్శకత్వం వదిలి పెట్టారు.. ధన్యులము...జరిపేది మనమైనా జరిగేది మన చేతుల్లొ ఉండదు కదా!!!..

    ReplyDelete
  6. bagundi mee "MANISHI" chala..:)

    ReplyDelete