Saturday, October 2, 2010

ఐ లవ్ యు

వీధి రెండుగా చీలిపోతోంది..ఉదయాన్నే పనుల్లోకెళ్ళేవాళ్ళు.. స్కూలుకెళ్ళేవాళ్ళు..పక్క వూరు వెళ్ళేవాళ్ళూ ఇలా అందరితో ఇప్పుడిప్పుడే రోడ్డులో రద్దీ పెరుగుతోంది.. అక్కడే వీధి చివర చిన్న బస్సు షెల్టర్ లో ఇద్దరు నిలబడ్డారు..ఒకళ్ళు బైకు మీద కూర్చుని కునికి పాట్లు పడుతోంటే.. మరొకళ్ళు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుంది..

రేయ్ .. వస్తుందంటావా...? వస్తే ఏం చెప్పాలి..? సరిగ్గా చూడు బానే వున్నాగా ? జుట్టు.. డ్రస్సు.. బానే ఉన్నట్టే గా.. చెప్పరా.. చెప్పరా..

..... .. ఆవలిస్తూ రెండో వాడు మొదలు పెట్టాడు.. కుమారూ ఎన్నిసార్లు చెప్పాల్రా నీకు.? విసుగు రాదు..? సిగ్గు లేదూ ? ఇలాగే అడిగి అడిగి రాత్రంతా నా నిద్ర చెడగొట్టావు.. కనీసం పొద్దునైనా పడుకుందామంటే పదిగంటలకొచ్చే అమ్మాయి కోసం భూమి పుట్టక ముందు నన్ను పట్టుకొచ్చేసావు.. ఇదిగో ఆఖరి సారి చెప్తున్నా.. అమ్మాయి వస్తుంది. కష్టపడి రాత్రి బట్టీ పట్టిన నాలుగు ముక్కలు చెప్పు అంతే..చాలు.. ఇంకా చెప్పడానికేముంది, నువ్వేసుకున్న చొక్కా నాదేగా.. చూడ్డానికి బానే వున్నావు.. ఇంతకు మించి మళ్ళీ అడిగితే నేను గోదారిలో దూకుతానంతే..

" అయితే సరే.. ఒరే సంతోషు.. "ఎస్" అంటుందిగా.. ? అని మళ్ళి అడిగాడు.."

సంతోష్: -------------------------------------------

కుమార్: రేయ్.. రేయ్..చెప్పరా..

సంతోష్: -------------------------------------------

కుమార్: అది సరే కానీ నీకు మమత కి ఎక్కడ దాకా వచ్చింది..?

సంతోష్: నన్ను నా గర్ల్ ఫ్రెండు వదిలేసే దాక.. ఆమె బాయ్ ఫ్రెండ్ ని వదేలిసే దాకా...!

కుమార్: అదేంట్రా?

సంతోష్: మరి ఏంటి రా.. నా బొంద.. నీకెన్ని సార్లు చెప్పాను..తన పేరు మమత కాదురా.. నమ్రత..అని ఇంకోసారి పేరు మార్చి అడిగావంటే గోదారి లో దూకేస్తానంతే..

కుమార్: సరే సరే.. రాత్రి రాసుకున్నది, ప్రాక్టీసు చేసింది ఒక సారి చెప్తా ఎలా వుందో చెప్పు...

సంతోష్: కానీ..రా కానీ..

కుమార్: సాధనా ..! నిన్ను చాల రోజుల్నించి చూస్తున్నాను.. చాలా ప్రేమిస్తున్నాను.. చాలా ఇష్ట పడుతున్నాను.. చాలా చెప్పాలనుకున్నాను.. చాలా...

సంతోష్: చాల్రా బాబు చాలు "చాలా" అయ్యింది.. ఏంట్రా ఇది.. ఇలా చెప్తే అమ్మాయే కాదు.. అమ్మాయీ కాదు.. కనీసం సాటి మగాడ్ని నేను కూడా వొప్పుకోను.. రాత్రి అనుకున్నదేంటి ఇప్పుడు నువ్వు చేసేదేంటి..?ప్రోపోస్ చేసేటప్పుడు ఎలా చెప్పాలి..? "పగలూ రాత్రి .. నీ ఆలోచనల్లో మునిగి పోయాను.. నీ తర్వాత ఇంకెవ్వరినీ చూడలేదు.. కొత్త లోకానికి తీసుకు పోయావు.. " ఇలా వుండాలి.. పొగుడుతూ ఉండాలి.. పొయెటిక్ గా వుండాలి.. పడి పోవాలి.. అర్ధం అయ్యిందా..?

కుమార్: బాగా అర్ధం అయ్యింది రా .. ఇప్పుడు చూడు ఎలా రెచ్చి పోతానో.. పిచ్చెక్కిస్తా.. విని చెప్పు ఎలా వుందో..
------------------------------------------------
నీకేం..!
నవ్వు నవ్వి ఊరుకున్నావు
కాస్త కన్నెగరేసి జారుకున్నావు
నన్నేమో ఊహల కొదిలేసావు

అదిగో అప్పటినించీ
మొదలయింది..

చూసి చూడకుండా చూపు చూస్తావే
దాని కోసం ..

కనపడనీయ కూడదని తడబాటును దాస్తావే
దాని కోసం..

నీ వెనుకే నే వున్నానని ఆగి ఆగి నడుస్తావే
దాని కోసం..

నన్నాపుకోలేక నిన్ననుసరించడం

ఏమనవు
అననీవు..

చేరువ కానిచ్చి
చొరవ తీసుకోనీవు..

ప్రశ్నల్లే కనబడతావు
జాబూ నీవేననిపిస్తావు
అర్ధం కావు...
------------------------------------------------

ఎలా వుంది.. ?

సంతోష్: ఇది "గురివింద గింజ" గాడి బ్లాగులోది కదా.. వాడు రాసింది వాడికే అర్ధం కాదు.. ఇంక అమ్మాయికేమర్ధమౌతుంది.? ఇవన్నీ చదువు కోవడానికే కాని చెపితే .."బ్రిటన్ వెళ్ళిన వాడు, ఇంగ్లిష్ రాక..ఫ్రెంచ్ ని జర్మన్ లో mix చేసి తెలుగులో మాట్లాడినట్టుంటుంది.. "

కుమార్: ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు....!!!!

సంతోష్: నువ్విలాంటి టాలెంట్లు ప్రదర్శిస్తే.. అమ్మాయి కూడా అదే అడుగుతుంది..ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు.... అని..!!

కుమార్: అయితే ఏం చెయ్యను ? డాన్సులు .. పాటలు గట్రా.. ట్రై చేయనా.. (ఉత్సాహం గా అడిగేసాడు )

సంతోష్ : నన్ను కొట్టిచ్చేదాకా వూరుకోవెంట్రా నువ్వు..? ఇలాంటి పనులు చేస్తే గోదారిలో దూకేస్తానంతే..
.
.
.
సరే.. సరే.. అదిగో తను వస్తోంది.. వెళ్ళు వెళ్ళు..


కుమార్ ఆమె వెనుక బయలు దేరాడు..
ఏమని పిలవాలి? పేరు పెట్టి పిలవాలా? హాయ్ అంటే? ఎక్ష్క్యుస్మీ? (తనలో తాను..)
కుమార్ అడుగులు ఆమెనే అనుసరిస్తున్నై.. ఆమె కూడా తన వెనుక ఎవరో వున్నారనే గమనించి నడుస్తున్నట్టుంది.

ఎలాగో ధైర్యం తెచ్చుకుని, సాధనా..! అని పరిచయమున్న వాడిలా పిలిచేసాడు..

మె అక్కడే ఆగింది.. తరువాత అతని మాట కోసం ఎదురు చూస్తున్న దానిలా..

" లవ్ యు" - చెప్పేసాడు..

ఆమె తన అడుగులు కొనసాగించింది

"చాలా అనుకున్నాను కాని ..ఇంకేం చెప్పాలో ..ఎలా చెప్పాలో తెలియలేదు.. కాని నాకు తెలిసింది నీకు చెప్పాలనుకుంది మాత్రం ఇదే.. ఒక పరిచయం లేని అబ్బాయి వచ్చి ఇలా మాట్లాడితే ......" ఇంకా ఏదో చెప్ప బోతున్నాడు

ఆమె తన అడుగుల వేగం పెంచింది..

కుమార్ ఆగిపోయాడు.. చూస్తుండగానే ఆమె అతని కళ్ళ నుండీ దూరంగా వెళ్లి పోయింది..

వెనకనే సంతోష్ వచ్చాడు.. ఏరా చెప్పావా?

కుమార్: చెప్పాను..

==========================================

రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు..

సంతోష్: ఎంతసేపురా ఎదురు చూసేది ? ఏదో నీ పేరు చెప్పుకుని రెండు గ్లాసులు తాగుదామని నేను అనుకుంటే.. నువ్వేమో అలా రకంగా మొఖం పెట్టి... ఆలోచిస్తున్నావు.

తప్పు చేసానేమో రా.. అన్నాడు కుమార్..

"దేని గురించి?"

రోజు ఉదయం .... అంటూ ఆపేసాడు కుమార్..

నేనెవరో తెలీదు .. ఎలాంటి వాడినో తెలీదు..తను నన్ను కనీసం చూడలేదు.. అలాంటిది నేను ఎలారా అమ్మాయి దగ్గరకెళ్ళి లవ్ యు అని చెప్పేసాను.. పైగా తననించి కూడా అదే ఆశించాను.. స్టుపిడిటి ప్యుర్లీ ..స్టుపిడిటి. నీకు తెలీదు. నువ్వు చూడలేదు.. బెదురుతో తను వేగంగా వేసే అడుగుల చప్పుడు .. ఆఖరి సారి ఆమె నా కళ్ళలోకి చూసిన చూపు, ఇంకా నాకు స్పష్టంగా తెలుస్తున్నై.. చెంప మీద కొట్టినట్టునై..

"చెంప ఏంటి చెప్మా..." నవ్వేసాడు సంతోష్. ఎరా నీకు గాని చుక్క పడకుండానే క్కిందా.. చాలా రోజులనుండి చూస్తున్నావు, అమ్మాయి నచ్చింది, అదే విషయం ఆమె తో చెప్పావు.. దానికి ఎందుకురా ఇంత హడావిడి చేస్తున్నావు...

నేనూ అదే చెపుతున్నా.. ఎంత సేపూ ఎలా impress చేద్దామా.. ఎప్పుడెప్పుడు express చేసేద్దామా అనే హడావిడి చేసాను..
ఊహల్లో తేలి పోయాను..తన గురించే ఆలోచించాను కానీ ఇవన్నీ నావైపు... నావైపు నుండే ఆలోచించాను..

"నువ్వేమి చెప్పదలుచుకున్నావో నాకైతే అర్ధం కాలేదు. ప్రేమించానని చెప్పడంలో తప్పేముంది .. సిల్లీ గా వుంది.." అంటూ సంతోష్ గ్లాస్ చేతిలోకి తీస్కున్నాడు.

"చెప్పడంలో తప్పు లేదు. ఎప్పుడు చెప్పాను. ఎలా చెప్పాను అనే దానిగురించే నేను మాట్లాడేదంతా..
కొంచెం ODD గా ఉన్నా ఓసారి ఆలోచించు. నీ మానాన నువ్వు పని మీద వెళ్తోంటే ఎవరో పిలిచి లవ్ యు అని చెప్పి వెళ్లి పోతే..రోడ్డు మీద నీ పరిస్తితి ఏంటి..? "

హ్హ. అమ్మాయి బాగుంటే వెంటనే అవునంటాను అంతే..దీనికేముంది..

"కొంచెం సీరియస్ గా ఆలోచించి చెప్పు "

మ్మ్..ఒకే...అమ్మాయి బిహేవియర్ చూసి బాగుందనుకుంటే అవునని చెప్తాను..

"కొంచెం సీరియస్ గా ఆలోచించి చెప్పు "

తెలిసినమ్మాయా.. కాదా.. మనకి suite అవుతుందా లేదా అని తెలుసుకుని ఏమైనా చెప్తాను..

"కొంచెం సీరియస్ గా ఆలోచించి చెప్పు "

ఫ్యూచర్ గురించి ఆలోచించి తరువాత ఒకే అంటాను.

"మరి వీటిలో ఒక్క ఆలోచనా అమ్మాయి చేయకూడదని నేను ఎలా expect చేస్తాను..? కనీసం నేను ఆమెకి ఒక్క అవకాసమైనా ఇచ్చానా?

I did not give her any scope... more over I put her in such an emabrassing situation ..


నువ్వన్నట్టు.. నేనేమీ సిల్లీ గా ఆలోచించడం లేదు.. ఆమె గురించీ ఆలోచించడం లేదు. ఆమె వైపు నుండీ ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను.. అంతే.." తనకీ నాగురించి తెలుసుకునే .. అర్ధం చేసుకునే అవకాశం.. సందర్భం ఒక్కటీ కూడా ఇవ్వలేదనే అంటున్నాను అంతే..

సంతోష్ చాలా రిలాక్స్డ్ గా వెనక్కివాలి అన్నాడు.. కాలం లో వున్నావు రా.. కాలం అమ్మాయిలు ఎంత స్పీడు గా ఉన్నారో తెలుసా..?వాళ్ళు అలాంటివి చాలా లైటు గా తీస్కుంటారు.. నేనున్నాగా మాట్లాడతా..

"థాంక్స్ రా.. నీలా మాట్లాడేవాళ్ళు లేకే నా భయమంతా.. అన్నట్టు మీ ఇంట్లో ఎంత మందిరా ఉండేది ?"

తెలియనట్టు అడుగుతావే..అమ్మా, నాన్న, నేను ఇంకా చెల్లాయి..

"సరే ఈరోజు వచ్చినట్టే.. కొంచెం రేపూ వచ్చావంటే.. మీ చెల్లికి ప్రోపోస్ చేస్తా.. తరువాత నువ్వు మాట్లాడుదువు గాని..ఏమంటావు..?"

సంతోష్ గ్లాస్ పక్కన పెట్టాడు..వేగంగా లేచి కుమార్ కాలర్ పట్టుకున్నాడు.. క్షణం లో ఎర్రబడ్డ సంతోష్ కళ్ళు తీక్షణంగా కుమార్ నే చూస్తున్నై.. ఏమాత్రం తడబడని కుమార్ "అర్ధం అయ్యిందా?" అనే ఎదురుప్రశ్న అడుగుతున్నట్టున్నాడు..

సంతోష్, కుమార్ కాలర్ వదిలేసాడు.. ఏమనాలో తెలీయడం లేదు. కళ్ళ చూపు నేల వైపే ఉంది .. ఒక్క సారి అతడి వైపు చూడడానికి దైర్యం చాలలేదు ..

"సారీరా" అన్నాడు..

"అదేంటిరా అంత ఆవేశపడ్డావు గోదారిలో దూకేస్తావేమో అని బయపడ్డాను "

సంతోష్, కుమార్.. ఇద్దరూ నవ్వుకున్నారు..

కుమార్: సరే రేపు పొద్దున్నే ఊరెళ్ళాలి.. తొందరగా కాని ..

చెరో గ్లాసూ అందుకున్నారు..
==========================================

పద పద రా తొందరగా.. ఆలస్యం అయిపోతోంది..ఏం తోలుడు ఇది..? ఇంకో అయిదు నిమిషాల్లో బస్సు..

"చూసావ్ గా.ఎలా వుందో ట్రాఫిక్..నన్నంటావే.. "అత్తననలేక మొగుడ్ని సాదించిందట వెనకటికెవరో.."

సరే సరేలే రా .. నా మొగుడా.. పోనీ..

అలాగే బండి మరో పది నిమిషాలు మెల్లగా పాకుతూ పోతోంది..

సరే నేను అడ్డదారిలో వెళ్ళిపోతాను.. ఇందులో నువ్వీదలేవులే..అంటూ బండి దిగి పరిగెట్టడం మొదలు పెట్టాడు..కుమార్

సంతోష్ రోడ్డుమీద అరుస్తున్నాడు..: " బస్సు దొరికాక మిస్డ్ కాల్ యివ్వు.. జాగ్రత్తరా డబ్బులేమైనా కావాలంటే ఫోన్ చెయ్యి"

అలాగలాగే.. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు కుమార్.

ఆదరా బాదరాగా పరిగెత్తి నందుకు , మొత్తానికి బస్సు దొరికింది.. ఎంత సేపయ్య మీకోసం చూసేది . పావుగంట ముందు బయలుదేరొచ్చుగా .. అంటూ కండక్టార్ కిందా మీదా పడుతున్నాడు.

ట్రాఫిక్ లో పొగ మూలాన మొఖానికి అడ్డు పెట్టుకున్న రుమాలు .. కంగారులో అలానే వదిలేసి ఉంచాడు కుమార్..

రుమాలు తీద్దామని అనుకుంటూ .. అనాలోచితంగా పక్కన చూసాడు..

విండో లోంచి బయటకు చూస్తూ "సాధన" కనిపించింది..

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
===========================================

5 comments:

 1. baagundi....

  pls visit this once.....
  http://neelahamsa.blogspot.com/2010/05/blog-post_4564.html

  ReplyDelete
 2. bagundi siva koncham humor ga variety ga anipinchindi
  నన్నాపుకోలేక నిన్ననుసరించడం
  naku baga nachindi.
  totally good

  ReplyDelete
 3. Super Super kekka annaya e kada motham chadivesa baga ekesindi naku e-short movie ki koda nene hero nadey camera evaranna shoot lo help chestey nuvvu nenu kumedam..... what do u say???

  -Tipper lorry

  ReplyDelete
 4. రొటీన్ కధలకు దగ్గరగానే ఉన్నా .. Narration బాగుంది .. మెప్పించారు శివగారు .. మీలో టాలెంట్ ఉన్నది ..
  కాని నాకు ఈ లైన్ ఎందుకు ఉస్ చేసారో సరిగ్గా అర్ధం కాలేదు .. "ఆ వీధి రెండుగా చీలిపోతోంది.." Surroundings ని వర్ణిచే ప్రయత్నం అని సర్దిచేప్పుకున్నాను ;)

  ReplyDelete
 5. nijamga chala bagunadi..
  oka ammai perception ni baga present chesaru..

  ReplyDelete