Thursday, September 16, 2010

లేక లేక లేఖ, లేక


నేనూ చెప్పేద్దామనే చూస్తున్నాను
కానీ ఏం చెయ్యను?

కలిసి వున్నప్పుడు నాకు నేను గుర్తుండను
కానప్పుడు నీ ఆలోచనల్లో కలిసి పోతుంటాను

నీకూ నాకు తెలియదని కాదు..
ఇన్నాళ్ళ మన పరిచయం ఎప్పుడో స్నేహమనే తీరం దాటేసిందని

తెలియనిదీ కాదు ..
మరో ప్రయాణం మొదలై మరింత కాలం గడిచిందని..

ముందు నన్నే మాట్లాడమని నీవు సైగ చేసిన సంగతి
ఎన్ని సార్లు గమనించలేదు నేను?

అన్నానని కాదు కాని...
నా ఇన్ని ప్రయత్నాలకు నీవు మాత్రం నవ్వుకోలేదూ?

సరే ఇక..
ఊగిసలాటన నిద్దుర రాని ఈ రాతిరిని
మళ్ళీ రేపటికి రానియ్యకూడదని..

మన జ్ఞాపకాల గురుతులెన్ని తరచి చూసాను?
లేఖ లెన్ని రాసాను?

సిరా చుక్కలనెంత తీసుకున్నా కాగితం నిండనంటోంది
నాకూ చెప్పాలనుకున్నదేదో మిగిలే ఉంటోంది..

ఈ లోటు లెక్కల తిక మకలో ..
తడబాటులో ..

మళ్ళీ అనిపిస్తోంది
అయినా మన మధ్య ఇంతగా ఎదిగిన ఈ ప్రేమకి ఈ అక్షరాల అవసరం ఎంతుందని..?

అవునని..
కాదని..
నీవేమంటావు మరి?

2 comments:

Malakpet Rowdy said...

ఇది నేను ఒక వ్యక్తిని ఉద్దేశించి పెట్టిన కెలుకుడు వీడియో http://pramaadavanam.blogspot.com/2010/09/blog-post_16.html

సత్య said...

నలుడు - దమయంతికి ,
రుక్మిణి - కృష్ణునికి...
ఇలా తర తరాలుగా ....అక్షరాలేగదా...ప్రేమికుల పక్షం తీసుకుంది...!!