Thursday, September 23, 2010

ఎందుకు?
తల్లి తండ్రులిచ్చిన ఈ జన్మ ఎందుకు?
భగవత్ ప్రసాదితమైన ఈ ఆయువెందుకు?
గురువులు అందించిన విద్య ఎందుకు?

పై మూడూ నాకున్న ముఖ్యమైన ప్రశ్నల్లో మూడు..
ఇంకా ఇలాంటివేవో 'ఎందుక'నే ప్రశ్నలే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదురవుతూ నన్ను పూర్తిగా ఆలోచనల్లో పడేస్తూ ఉంటై..ఒక ప్రశ్నకు సమాధానం దొరికిందనగానే మరో ప్రశ్న పుడుతూనే వుంటుంది..దొరికిన సమాదానం ముందు ప్రశ్న చిన్నదైపోతుంటుంది..అచ్చూ మనిషి కోరిక లాగా..

ఒక చిన్న ఉదాహరణ..
రోడ్డు మీద ఓ ముష్టి ఆయనని చూసి (వయసు దగ్గర దగ్గర యాభై పైనే వుంటుంది ) చాల బాధగా అనిపించింది..పక్కనే ఉన్న మా స్నేహితుడినోకడిని అడిగాను ఆ పెద్దాయనను చూపిస్తూ..'ఎందుకు' ఇలా అయిపోతారు అని ? అతడు వెంటనే అన్నాడు "ప్రేమించే వారు లేక" అని. ఆ సమాధానానికి అప్పటికి నేను సంతృప్తి చెందినా .. తరువాత మళ్ళి అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడల్లా నా ప్రశ్న పునరుద్భవించేది.. వీరి సమస్య వీరిని 'ప్రేమించే వారు లేకనా' లేక "వీరి పై వీరికి ప్రేమ లేకనా..?" అని..

================================

ఒక్కోసారి విపరీతమైన సంతోషమోచ్చేస్తుంటుంది.. అప్పుడనిపిస్తుంది 'ఎందుక'ని? మరోసారి దిగాలుగా ఉన్నా ఇదే ప్రశ్న.."ఎందుకని ?"...ఈ ప్రశ్న ఎక్కడ జనించిందంటే.. భావాల మూలం ఎక్కడని తెలుసుకోవాలని ఆకాంక్ష మొదలైనప్పుడు.. భావజాలమే మనిషి తత్త్వం. జీవితంలో ఎక్కువ సమయం వేరెవరినో అర్ధం చేసుకోవడానికే వెచ్చిన్చేస్తుంటాం.. మనల్ని మనం మరిచి పోతుంటాం.. అందుకే మనల్ని మనం మరింత అర్ధం చేసుకోవడానికే తరచూ ప్రశ్నించుకోవడం తప్పనిసరేమో అనిపిస్తూ ఉంటుంది..

ప్రశ్నలకందిన సమాధానాలు పరిపూర్ణంగా ఆ ఖాళీలని నింపనప్పుడు వాటిని వెలుగు లోనికి తీసుకురాక పోవడమే మంచిది. లేకుంటే ఈ సమాధానాలే సమస్యలవగలవు..

======================================

Purpose of life…

Purpose of existence…

Purpose of learning…


పైన చెప్పిన మూడు ప్రశ్నల గురించి ఆలోచించినప్పుడల్లా ఈ మధ్య దొరికిన ఒక సమాధానం.. "ధర్మం"..

మళ్ళీ ఏది "ధర్మం" అనే ప్రశ్న తలెత్తింది నాలో .. ఇది ఒక లంకె.. కొన సాగుతూనే వుంటుంది..

ప్రశ్నలు ఆలోచనాధారిత జనితాలు.. మనిషి ఆలోచనలు అనంతం, అందుకే ప్రశ్నలూ అనేకం..

మిత్రులారా ఇలాంటి ప్రశ్నలూ మీలోనూ ఉండి ఉండవచ్చు..కనుక మీనుండి కొంత తెలుసుకుందామనే ఈ టపా రాసాను..

ధన్యవాదాలు..
శివ చెరువు

Thursday, September 16, 2010

లేక లేక లేఖ, లేక


నేనూ చెప్పేద్దామనే చూస్తున్నాను
కానీ ఏం చెయ్యను?

కలిసి వున్నప్పుడు నాకు నేను గుర్తుండను
కానప్పుడు నీ ఆలోచనల్లో కలిసి పోతుంటాను

నీకూ నాకు తెలియదని కాదు..
ఇన్నాళ్ళ మన పరిచయం ఎప్పుడో స్నేహమనే తీరం దాటేసిందని

తెలియనిదీ కాదు ..
మరో ప్రయాణం మొదలై మరింత కాలం గడిచిందని..

ముందు నన్నే మాట్లాడమని నీవు సైగ చేసిన సంగతి
ఎన్ని సార్లు గమనించలేదు నేను?

అన్నానని కాదు కాని...
నా ఇన్ని ప్రయత్నాలకు నీవు మాత్రం నవ్వుకోలేదూ?

సరే ఇక..
ఊగిసలాటన నిద్దుర రాని ఈ రాతిరిని
మళ్ళీ రేపటికి రానియ్యకూడదని..

మన జ్ఞాపకాల గురుతులెన్ని తరచి చూసాను?
లేఖ లెన్ని రాసాను?

సిరా చుక్కలనెంత తీసుకున్నా కాగితం నిండనంటోంది
నాకూ చెప్పాలనుకున్నదేదో మిగిలే ఉంటోంది..

ఈ లోటు లెక్కల తిక మకలో ..
తడబాటులో ..

మళ్ళీ అనిపిస్తోంది
అయినా మన మధ్య ఇంతగా ఎదిగిన ఈ ప్రేమకి ఈ అక్షరాల అవసరం ఎంతుందని..?

అవునని..
కాదని..
నీవేమంటావు మరి?

Wednesday, September 8, 2010

గెలుపు వెనుక
ఎంత కాలం నీకోసం చూసాను?
ఎప్పుడో రేబవలు మరిచిపోయాను..

ఎంత దూరం నీకోసం ప్రయాణం చేసాను?
దిక్కులన్నిటినీ చుట్టి .. చుక్కలు లెక్క పెట్టాను..

ఇంకెంత సిద్దపడ్డానూ నీకోసం?
నావనుకున్నవి వదులుకునే స్థితి దాకా..
నేననుకున్నది మరిచే పరిస్థితి వచ్చాక ..

అయినా..
ఇంత జరిగినా..
ఆశ నిరాశల రూపాంతరాలకు ఒప్పుకోలేదు
ఎదురు చూపుల విధిలో విసిగి పోలేదు..
నీవే వస్తావని నేనాగిపోనూలేదు

రెప్పలారిపోతున్నా..
తెప్పరిల్లిపోతున్నా..
అడుగులు వేస్తూనే వున్నాను..
నీవైపే...

ఆఖరికి ..
నిన్ను చూసేటప్పటికి..
సంబరాలు చెయ్యలేదు
పది పది మందికి పరిచయం చేయలేదు
పదే పదే చెప్పుకోను ఆరాటమూ లేదు

క్షణం కేవలం ..
తడిచేరిన కళ్ళ లోంచి
అలా చూస్తుండి పోయాను..
మనసు నిండి మాటలు కూడా రాక
నిశ్శబ్దంగా నిలుచుండి పోయాను..