Monday, May 31, 2010

లేదిక లేదు..

కానీ కానీ ...
ఏమైనా కానీ ...
మరేమైనా రానీ ....

కాలనాగు విషం కక్కనీ
సాక్షాత్ కలి రూపు కంటపడనీ

మృత్యువు తాడై కంఠాన్ని నులమనీ
నలువైపుల నలుపే నిలవనీ
నర నరాన హిమాలయమే పుట్టనీ

భూమి రెండవనీ..

రవి గాని శి గాని..
వారు వీరవనీ..

లేదిక.. లేదిక లేదు..
భయానికి మరో పుట్టుక లేదిక్కడ...

నిస్సత్తువ
నిర్లిప్తత
నిరీక్షణ
లేవు..

సంఘర్షణ
లొంగుబాటు
లేవు..

ధైర్యేతర ధ్యాస
లేనే లేదు..
లేదు ఇక లేదు..
.
.
.

Tuesday, May 25, 2010

అటు ఇటు..

అప్పుడే వర్షం పడి తగ్గింది..చల్లగా వుంది వాతావరణం.. అంతా బురద... నీళ్ళు.. విపరీతంగా రద్దీగా ఉంది రోడ్డు..

ఎదురుగా వచ్చిన కారు హెడ్డు లైటు మొహం మీద పడుతోంటే చెమట, అలసట తో నిండిన తన మొహం దాచేసుకుంటున్నాడు అతను.. చుట్టూ పక్కల చూసుకుంటూ వస్తున్నాడు.. ఎవరో తనను గమనించకూడదన్నట్టు ఉంది అతని నడక.. ఇంకా చూపు కూడా..

అక్కడే ఓ టాక్సీ మాట్లాడు కున్నాడు.. చేతి రుమాలుతో మొహం కప్పేస్తూ ఎక్కి కూర్చున్నాడు..మాటి మాటికీ చేతికున్న వాచీ చూస్కుంటున్నాడు.. ఒళ్ళో పెట్టిన ఆ సూట్కేసు గట్టిగా పట్టుకున్నాడు..

శివాజీ నగర్కి వెళ్ళడానికి ఇంకా ఎంత సేపు పడుతుంది బాబు.. అడిగాడు..

ముప్పావు గంట అయినా పడుతుందండీ..అన్నాడా టాక్సి మనిషి..

కాస్త త్వరగా వెళ్ళ రాదూ ఓ పది రూపాయలు ఎక్కువిస్తా...?

లేదు సార్ ట్రాఫిక్ ఎక్కువుంది.. పైగా వర్షం పడి తగ్గిందిగా..! కాస్త కష్టమే..!

అడిగినంత ఇస్తా ముందు వేగంగా పోనీ నాకు చాలా పనులున్నై...

"సరే నండి అడ్డదారి లో తీస్కు పోతా.."

కారు వేగం పెరిగింది..జేబు లోంచి పర్సు తీసి చూస్కుంటున్నాడు..

విసిటింగ్ కార్డు పైన కే.అనంతం LIC agent అని రాసుంది..

కారు అద్దాల్లోంచి వచ్చే వెలుగు లో స్పష్టం గా తెలుస్తూంది..ఆ పర్సు బాగా పాత బడి వుంది.. అక్కడక్కడా చిరుగులు.. ఓ 5 రూపాయల గాడి ఉంది అందులో. అతను ఆ నాణెం తీసి చూస్కుంటున్నాడు.. బహుశా ఆ నాణెం తో అతని పరిచయం ఇప్పటిది కాదేమో..

ఇక్కడ దారిలో మంచి హోటలు ఎక్కడుంది..?

"చాలా ఉన్నాయి సార్ "

"మంచి ఆంధ్రా భోజనం తినాలని ఉంది.."

మధ్యలో ఓ చోట ఆపి భోజనం పార్సెల్ చేయించుకున్నాడు అతను..

ఇచ్చిన వెయ్యి రూపాయల నోటు కు మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వబోయాడు డ్రైవరు..
కొత్త ఐదు వందల రూపాయల నోటు మెరుస్తూంది.. ఇంకా మద్యలో వేరే నోట్లు..

"ఉంచుకో పర్లేదు"

డ్రైవరు మారు మాట్లాడలేదు..

ఎక్కి కారు పోనివ్వడం మొదలు పెట్టాడు.

మందు ఏమైనా తీస్కుంటారా సార్..?

"వైన్ తాగాలనుంది.."

కాక పోతే కొంచెం కర్చు అవ్వుద్ది సార్ పర్లేదా..?

"నీ దగ్గర రెడీ గా ఉందా..?"

ఎప్పుడూ ఒకటి రెండు స్టాకు పెట్టుకుంటానండీ

"నీ పనే బాగుందయ్యా డబల్ బిసినెస్సు..సిగరెట్టూ ఉండే ఉంటుంది.. ఓ పాకెటు ఇవ్వు.."

పెట్టెలోంచి ఓ పెద్ద నోటు తీసి యిచ్చాడు..అనంతం.. ఇదంతా మిర్రర్ వ్యూ లో చూస్తున్నాడు డ్రైవరు..
కారులోనే తాగడం మొదలు పెట్టాడు..కాసేపయ్యాక అడిగాడు..నువ్వూ కొంచెం తీకుంటావా...?

వద్దండి..డ్రైవింగ్ చేయాలిగా..

"నేనేమీ నీకులాగ డబ్బులడగను.."- నవ్వేసాడు..
"అయినా తాగితే..పెద్దనష్టం ఏం లేదులే .. ఇదిగో తీస్కో.."

శివాజీ నగర్ వచ్చేసింది సార్.. ఎక్కడికి వెళ్ళాలి..?

"మూడోవీధిలో చివరి ఇల్లు.."

వీధి చివరన కారు ఆగింది..అంతా నిర్మానుష్యంగా ఉంది..స్ట్రీట్ లైట్ వెలుగుకు కూడా చాలా దూరం గా ఉందా ఇల్లు..

మత్తులో ఎంత డబ్బులిచ్చాడో కూడా చూస్కోకుండా కారు దిగి లోపలి వెళ్లి పోయాడు అనంతం.. అటువంటి స్థితిలో కూడా అతని చేయి ఆ సూట్ కేసుని బలంగా పట్టుకునే ఉంది..

జాగ్రత్తగా లోపలి వెళ్ళాడు.. ఆ పెట్టెని తన మంచం మీద పడేసి..ఆ కారు డ్రైవర్ వెళ్ళిపోయాడో.. లేదో.. అన్నది కిటికిలోంచి చూస్తున్నాడు..అనుమానమే ఓ మత్తు.. ఇది మత్తులో అనుమానం...అతని కళ్ళు వాలి పోతున్నై.. తలుపు గట్టిగా గడియ పెట్టాడు..వెళ్లి మొహం కడుక్కొచ్చాడు..పక్కనున్న కవర్ లోంచి తీసి పార్సెల్ తెచ్చిన హోటల్ బోజనాన్ని తింటున్నాడు..అతని కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నై..ఆ కన్నీళ్ళ మధ్యలోంచి అస్పష్టంగా ఆ పెట్టెని చూస్తున్నాడు అనంతం..చాలా రోజుల తరువాత నాలుగు వేళ్ళూ నోట్లోకెల్తున్నై..జీవితంలో తను చేసిన మొదటి దొంగతనం కళ్ళ ముందే కనపడుతోంది..

కడుపు నిండుతున్న ఆనందం ఓ పక్కన, తరుముతున్న తప్పు చేసానేమో నన్న భావన ఓ పక్క..

శరీరం బాగా బరువుగా అనిపిస్తోంది...తింటున్న అన్నం మధ్యలోనే వదిలేసాడు...తిన్న చేతిని సరిగ్గా కూడా కడుక్కోకుండా నిద్రపోతున్నాడు.

----------------------------------------------
మొత్తం చీకటి అయిపోయింది .. ఉన్నట్టుండి తనలో ఓ చీలిక...

తను రెండుగా అయిపోవడం గమనిస్తున్నాడు..అవి రెండూ తనలో జరిగే అంతర్యుద్దపు ప్రతిబింబాలుగా తెలుసుకున్నాడు..

చెడు: హ హ హ... ఈ రోజుతో నీ కష్టాలు తీరి పోయాయి..ఈ పెట్టె నిండా డబ్బులు .. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని డబ్బులు..ఇకమీదట అంతా విలాసాలలో నీ జీవితం తేలిపోతుంది.. కావలసిన సౌకర్యాలు.. దండం పెట్టి పని చేసే వాళ్ళు..చిటికెలో పూర్తయ్యే వ్యవహారాలూ..శ్రమ మర్చి పోవచ్చు..మార్పు వచ్చినట్టే...

మంచి :
అవును మార్పు వచ్చినట్టే..అవసరానికి మించి ఆశలకు ఆజ్యం పోసినట్టే..
వచ్చినట్టే..మార్పు వచ్చినట్టే
ఇంతకు ముందెప్పుడూ చూడని డబ్బులు.. నిజమే..అవి నీవి కాని డబ్బులు ..అవినీతి డబ్బులు..అయినా నువ్వు వదిలినా ఈ పెట్టె నిన్ను వదలదు

చెడు: బ్రతకడం వచ్చినతరువాత ఆ భయమెందుకు..?

మంచి: అవును..వేరొకరి బ్రతుకుల మీద బ్రతకడానికి భయమెందుకు? మానసిక వికలాంగుడిగా రేపు నిన్ను తయారు చేసేందుకిది మొదటి శిక్షణ మాత్రమే.. ఇంత కాలం నీ సమస్య బయట జీవించడం ఎలాగనే..కానీ..రేపటినుండీ నీలో నువ్వు జీవించడానికి కష్టమయిపోతుంది.. ఈ చర్చే దానికి ఆధారం..

చెడు: నలుగురు నడిచేదే దారి..చెప్పేదే ధర్మం.. నీకు తెలిసిన వాళ్ళలో నలుగురిని తప్పు చెయ్యని వాళ్ళని. చూపించు..? అది నీవల్ల కాని పని.. ఎందుకంటే.. ఆ నలుగురే ఈ సంఘం..ఆ నలుగురే అసలైన నువ్వు..

మంచి : కాదు ...ఆ నలుగురు కేవలం ప్రలోభ పడ్డవారు, ప్రలోభ పెట్టబడ్డ వారు మాత్రమే. అసలు మనం చెప్పుకునే ఆ చరిత్ర నలుగురిలో గెలిచిన వాడి చరిత్రే..కానీ కనపడేది మాత్రం మిగిలిన ముగ్గురే..

చెడు : అయినా చరిత్ర ఎవడికి కావాలి? సుఖం గా బ్రతకడం కావాలి.. అంతే.. చేతకాని కబుర్లు కడుపుకింత కూడు పెట్టవు.. నిన్న నువ్వేంటో చూడని వాళ్ళు, రేపూ నిన్ను చూడరు. ఎవరి బతుకు వారిదే.. ఎవరిగురించో నీకు పట్టింపు ఎందుకు..?

మంచి: ఇక్కడ నువ్వు చెప్పే సుఖం వెనుక భయముంటుంది .. ఆనందముండదు. కేవలం మత్తు ఉంటుంది నిద్ర ఉండదు ..

చెడు: అవును..ఆ భయం ఎక్కడనుండి వస్తుంది..? వేరొకరి గురించి ఆలోచించినపుడే వస్తుంది..! ఆలోచించు.. పోలీసులు .. కోర్టులు లేవంటే.. అందరూ దొంగలే..! ఓ చెడ్డ పని చేయడం నుండి నిన్ను ఆపేది కేవలం అవి ఉన్నాయనే భయమే..చెడ్డ పనులు చేయడం... పరాన్న జీవిగా బ్రతకడమే నీ అసలైన ప్రవృత్తి..
అయినా నలుగురికి తప్పు కాని పని నీకెలా తప్పవుతుంది..?

మంచి: ఎప్పుడూ నలుగురి చర్చ కొనసాగుతూనే ఉంటుంది లోపల.. కాని ఆ నలుగురిలో మనం ఎక్కడున్నామనేదే చర్చకు ముగింపు.. మనలో లేనిది మనం చూడలేము.. మరి ఏది మనకి ఎక్కువ కనపడుతోందో మనం అలాంటి ఆలోచనా పరిధి లోనే తిరుగురుతున్నామని అర్థం.. నీవొకరి కష్టాన్ని దోచుకుంటే వేరొకరు నీకష్టాన్ని దోచుకుంటారు..ఇది ఒక ఆవృతి..దీనినుండి బయట పడడం అసాధ్యమౌతుంది..

ఇలాంటి తీయని విషాలకు లొంగకు..రేపు ఉండదు నీకు..సంజాయిషీ చెప్పుకునే అవకాసం కూడా దొరకదు..

బ్రతుకూ బ్రతకనీ.. ఇదే పరమ సత్యం..!

ఒక్క నిజం గుర్తుంచుకో ఎవరి కథకు వారే కథానాయకులు. నీకధలో పాత్రధారిగా మిగిలిపోతావో..? లేక నాయకుడివవుతావో నీదే నిర్ణయం..

-------
ఇప్పుడిక ఎవరూ మాట్లాడడం లేదు.. ఈ మౌనాన్ని భరించడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక మిగిలింది తను చేయాల్సిందే.

చెడు రంగు రంగులుగా ఉంది..మంచి తెల్లని శాంతి పావురంలా..ప్రశాంత వదనం చిందిస్తోంది..

ఇన్నాళ్ళూ తను డబ్బుకు ఇబ్బంది పడ్డాడు కానీ ఎప్పుడూ మనఃశ్సాంతి కరువయిన వాడిలా బ్రతకలేదు..
తన స్వంతమయిన లక్షణాలను తనను తాను వదులుకోలేదు..ఇక మీదట కూడా అలాగే ఉండదలిచాడు..

తన మనస్సుని మరింత దృడ పరచాడు.. మంచి వైపే తన మార్గాన్ని ఎంచుకున్నాడు..

చివరికి...

తనలో ఉన్న చెడును తను జయించాడు...ఊపిరాడని సంతోషం

అకస్మాత్తుగా.. అతనికి నిజం గానే ఊపిరాడడం లేదు.. గుండెల మీద విపరీతమైన బరువు పెట్టి నొక్కినట్టుంది..కాళ్ళూ చేతులూ చల్లబడిపోతున్నాయి..గించుకునే ప్రయత్నాన్ని ఎవరో బలవంతం గా పట్టి ఆపేస్తున్నారు..

కాని ఈ సారి తను ఓడిపోయాడు.. అనంతం .. అనంతంలో కలిసి పోయాడు..

అదే విషయం ద్రువీకరించుకుని ..టాక్సీ డ్రైవర్ ఆ పెట్టెని తీస్కుని వెళ్లి పోయాడు..
.
.
.


- కల్పితం

Friday, May 14, 2010

ఆ కాగితం చెప్పింది ...
ఒకరి బలహీనతలమీద,
వేరొకరి
బ్రతుకుల మీద బతుకుతుంది...

ఆశలను
ఆకసపు ఎత్తులకు ఎగరేసి
అక్కడ బ్రతకమంటుంది..

నిన్ను కలలకొదిలేసి ...
నీ నిద్దురను పట్టుకెళ్ళి పోయింది..

బంధుత్వాలను లెక్కలకోసం రాసుకుని
బంధాలను తాకట్టు పెట్టుకుంది..

కళ్ళమెరుపూ అదే ..కంట తడీ అదే..

అదే అడిగా... గట్టిగా.. గట్టిగా అదే అడిగా..
తనని ఏమిటిదని..?

నా ఆవేశాన్ని .. నా తీరును ఏమాత్రం పట్టనట్టు..
స్తబ్దమైన నవ్వు నవ్వి..నావైపు చూసింది.. కాగితం..

నేనేనా..? అని తిరుగు ప్రశ్నించింది..

క్షణం నా చెంప చెళ్ళుమనిపించినట్టయింది ...