Thursday, March 25, 2010

సొంత ఊరు...ఎప్పుడెప్పుడా అని చూస్తుంది
నా ఊరు..
నేనొస్తానంటే...

ఆడుకుందామని
అలసిపోయే దాకా అల్లరి చేద్దామని...

వచ్చీ రాగానే ..
గోదావరి కరకట్ట, తాత గుడి చెట్టు నీడ
ఆప్యాయంగా పలకరిస్తాయి..
కాసేపు కూర్చోమని కుశల ప్రశ్నలేస్తాయి

రాజ వీధి దీపాలు తమ వెలుగులో
వర్షపు చినుకుల మధ్యలో
పిచ్చిగెంతులేస్తూ , లల్లాయి పాటలు పాడమంటాయి ..

అక్కడక్కడా వెలిసి పోయిన కొన్ని జ్ఞాపికలు ఎదురొస్తాయి ...
చెమటోర్చి వరించిన ఎప్పటివో విజయాలు ముందుంచుతాయి ..

చిన్న నాటి స్నేహితుల గుంపు ..
పాతబడి కూలిన నా.... బడి గోడలు
గడ్డి పూల చుట్టూ తూనీగల రెక్కల చప్పుడు
నేను వచ్చి ఇంకా కనపడక పోతే..
అలిగి , పసి పాపలా ముడుచుకు పోతుంటే...
ముద్దు చేసే ముచ్చట్లు మరింత అందంగా ఉంటాయి ..

కాని అంతలోనే ...
పాత రోజులను గుర్తు చేసుకుంటూ
కొత్త జ్ఞాపకాలను తయారు చేసుకుంటూ
వచ్చిన కాసిన్ని రోజులూ గడిపేసి ..
నే వెళ్లి పోతుంటే

ఊరిచివర పచ్చిక,
తిరిగి.. తిరిగి..అరిగిపోయిన రోడ్లు..
ళ్ళీ ఎప్పుడు వస్తావని అడుగుతాయి..
కంట తడి పెట్టుకుంటూ వెళ్లిరా అంటాయి..
జాగ్రత్తలు చెపుతాయి..
వచ్చేదాకా మళ్ళీ ఎదురు చూస్తుంటాయి..

ఆ .. క్షణాలు ..
కొత్త తూరుపు గురుతులుగా నాలో శాశ్వతం గా 'భద్ర'పరుస్తాయి

Tuesday, March 9, 2010

వికసిస్తూ.. విరమిస్తూ..
ఆడుకునేందుకు..
అల్లరి నడుముల నలిగేటందుకు..

హత్తుకునేందుకు ..
ఆకలి దప్పిక తీర్చుకునేందుకు..

శివ పూజకు నేనై..
శవ పూజకు నేనై...

నలిగిపోతున్నానిలా..
పూలలో .. జనావళి లో ...

వాడిన పూవునై ..
వయసు మళ్ళిన ఆడ దానినై ..

మిగిలి పోతున్ననిలా ..
అవసరం పడని ..అంటరాని దాననై..

నేరం - శిక్ష
కాదని నను వదిలేస్తావా?
చెలియా.. నను చీకటిలో తోసేస్తావా ..?

ప్రేమే..
నా నేరం అయితే..

నీవేసిన శిక్షకు బలి అవుతాను..
మరువలేక నిను..
నే మరణిస్తూ..బ్రతికేస్తాను..

Monday, March 8, 2010

లీడర్ ....

స్లో నారేషన్ ఉన్న మైల్డ్ స్టోరీస్ బాగా తెర కెక్కించ గల శేఖర్ కమ్ముల నుండి రాజకీయాలమీద అల్లుకున్న ఒక కధని ఆశించడం.. ఊహించడం పెద్ద కలే..

కానీ లీడర్ చిత్రం అంచనాలను మించి .. కేవలం ఆకట్టుకోవడానికే కాక .. హత్తుకునేట్టు తీసిన .. చేసిన ప్రయత్నం అనిపించింది నాకు..

ముఖ్యంగా రాజకీయ 'నాయకులకులంటే' ప్రజలకు జరగాల్సిన 'న్యాయాన్ని' జరగావలసినట్టు చూసే 'భాద్యతను' వహించవలసిన వారని చెప్పిన విదానం హర్షణీయం...

గొల్లపూడి మారుతీ రావు గారి నటన చాల రోజుల తరువాత చూడడం ఆనందం. ఆయన కనిపించిన సన్నివేశాల్లో మాటలు చాల గొప్పగా పండాయి..

హీరో పరవాలేదు.. హీరోయిన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.. సుహాసిని గారి నటన ఎప్పటిలా బాగానే ఉంది..కాకుంటే ఎక్కువ సన్నివేశాలలో .. భాదగా ఉండడం కధ యొక్క అవసరం...

సాంకేతిక పరంగా...సంగీతం , నేపధ్య సంగీతం అధ్బుతం.. కెమెరా దర్శకుని ఆదేశాల మేరకు నడిచింది.. మాటలు.. దర్సకత్వం .. కమర్షియల్ గా కన్నా ఆలోచింపజేసేవిగా ఉంటాయి..

గొప్ప చిత్రం...ఇంతకు మించి నేను రాయడానికి ఏమీ లేదు..కాని అందరికీ నచ్చక పోవచ్చు.. మల్టీ ప్లెక్ష్ లో బాగా ఆడగల సినిమా...

చీర్స్ టు శేఖర్...