Sunday, January 31, 2010

ఆ ఛాయలే నిలుస్తాయి..

చాల కాలమయింది
నాకు, సంతోషానికి ఒక చీలిక ఏర్పడి..

అంతటితో..

చీకటి లో మిగిలి పోయానని
ప్రపంచం
లోకి రావడం మానేసాను ..
ఒక్కడి గా వుండిపోవటం అలవాటు చేసుకున్నాను

విషాదం వానలా కురిసింది
నేనూ తడుస్తూనే వచ్చాను..
నన్ను నేనే బలహీన పరుచుకుంటూ వచ్చాను
చల్లని గాలి స్పర్శకూడా తట్టుకోలేని స్థితికి చేరాను..

నాలో ఎన్నో ప్రశ్నలు.. పోటెత్తనారంభించాయి..
ఉపయోగం లేని సమాధానాలు అక్కడక్కడా మసక మసక గా దర్శనమిచ్చాయి ..

ఇక రేపు లేదోమో అన్న భయం వెంట పడడం మొదలు పెట్టింది
ఎంత దూరం వెళ్ళినా నను వీడక ఉంది..

అలసి పోయాను..
అలసి పోయాను..
ఇక అటూ ఇటూ పరుగులు పెట్టడం మానేసాను..

ఒక్క నిమిషం నన్ను నేను చూసుకున్నాను
అర్ధమయింది ...
ఎంత అర్ధ రాహిత్యమని నా స్థితి !
ఒంటరివాడిననుకొని..
నాతో ఇన్ని జాడ్యాలు జత చేర్చుకున్నానని..

అంతే..!
వెంటనే ఎక్కడి నుండో గొడుగు చేతికి తగిలింది..

అనాలోచితంగా క్షణం ..
నేను, వేదన నుండి.. వేరు కాబడడం గమనించాను

ఇప్పుడు
చేతుల మీదుగా కొత్త చేతలు తీగల్లల్లు కుంటున్నాయి
కావలసిన రంగులు పూస్తున్నాయి..

ఇక ఎప్పటికీ వాడి పోని పూలు వికసిస్తున్నాయి ..
తమ పరిమళాలు వెదచల్లడానికి సిద్దమౌతున్నాయి

స్వేచ్చ యొక్క విజయ కేతనాలు విహంగాలై విహరిస్తాయి..

ఏదో రోజు చీకటి జాడలూ
సమసిపోతాయి..
ఆనందపు తరంగాల సంధి కాలంలో కూడా
పూర్తిగా ఛాయలే నిలుస్తాయి..

Tuesday, January 12, 2010

నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ

ఏటి ఒడ్డున ..
నా బుజాన తల వాల్చి నువ్వు చెప్పే కబుర్లు

నదీ తీరాన..
అడుగులో అడుగు వేస్తూ దాటిన లెక్కలేని దూరాలు

వాలిన చెట్టు అంచులనుంచి మబ్బులను చూపిస్తూ ..
చంద్రుడిని దాచేస్తూ, కాలాన్ని వెలి వేసిన సందర్భాలు

ఏవైనా కానీ..?
నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ

ఎదుటే నిలువనీ..
జ్ఞాపకాల గదిలో అడుగు పెట్టనీ...
మనసు మనసు మాట వినదు..
నీ తలపు గడియ.. ఓ ఘడియ అయినా మూసుకోనివ్వదు

Saturday, January 9, 2010

నీలం చొక్కా.. కమలా రావు..
.. నా హ్యాపీ డేస్ కి ముగింపు కార్డు పడిపోయింది ఇప్పట్లో రాదనుకున్న ఉద్యోగం వెంటబడి మరీ వెతుక్కుంటూ వచ్చింది. నిద్రపోతున్న నా జీవితం ఈ రోజు ఉదయాన్నే ఏడుగంటలకు నిద్ర లేచింది.

టైం అవుతోంది కన్నా.. రెడీ అవుతున్నావా? అమ్మ ఓ పక్కన అరుస్తోంది...

నేను : "ఆ రెడీ అయీ అర్ధగంట అవుతోంది.. కొత్త బట్టలకు పసుపు పెట్టి ఇస్తానన్నావు?"

అమ్మ : ఇదిగో వస్తున్నా.. ..

అమ్మ తెచ్చిన చొక్కా చూసి ఒక్క సారి కరెంటు షాక్ కొట్టిన "బాబూ మోహన్" లా అయిపోయాను.
( మీ అవకాశాన్ని బట్టి "బాబూ మోహన్" పదాలు interchange కూడా చేస్కోవచ్చు )

ఐదున్నర ఏళ్ళు వెనక్కెల్తే.. 10th క్లాసు సెలవులు

తణుకు పక్కన, దువ్వ అనే పల్లెటూరిలో ఓ మంగళవారం సంత...

"అమ్మా.. నేనేం అడిగినా నాన్నారు కొనిపెట్టట్లేదే..అయినా ఓ సైకిలేగా అడిగింది..నీలాగా రోజూ వంట చేయమన్నానా "

"పెద్దవాళ్ళ విషయాలు నీకేం తెలీదు ఊరుకో..అయినా ఇదంతా నీక్కాక ఎవరికి కన్నా.. కొనిపెడతారులే నువ్వైతే బాగా చదువుకో.."

నేను : 7th class అప్పుడూ ఇదే చెప్పారు

అమ్మ : "నాన్న మాట మార్చే మనిషి కాదులే "... అయినా నీకేం తెలీదు ఊరుకో...

నేను : !!!!! ???

"లేదే .. మొన్నటికి మొన్న... " అని నేనేదో చెప్పబోయేంతలో అమ్మ నీలం చొక్కా వైపు చూసింది..

పైన అమ్మ చెప్పినట్టు పెద్దగా తెలీని నేను..కూడా.. ప్రపంచంలో ఇంత వరకూ చూసిన అతి నికృష్టమైన చొక్కా అదే..

నీలం రంగు.. పసుపు చారలు.. అక్కడక్కడా ద్ది పూలు. +10 -10 సైటు ఉన్న వాడు కూడా దీన్ని వేసుకోడు చూస్తే ..

ఓ పక్క అమ్మ కళ్ళు మిల మిలా మెరుస్తున్నాయి.. వెంటనే నన్ను చూసింది ...

నేను.. చొక్కా..
చొక్కా .. నేనూ..
నేను.. చొక్కా..
చొక్కా .. నేనూ.. కెమెరాలో ఫ్లాష్ అవుతున్నాము.,.

కొంపతీసి ఈ చొక్కా నాక్కానీ కొనిపెట్టేస్తుందేమో.. ?
నాలో భయం మొదలయింది.. కెమెరా ఫ్లాష్ అవుతూనే వుంది..

అమ్మా.. "అర్జెంటు.. వెళ్ళాలి.." రెండు వేళ్ళు చూపిస్తూ అరిచా ..

"అందుకే చెప్పాను మీ నాన్న పెట్టిన రేగి వడియాలు ఎక్కువ తినొద్దని.. వింటేనా.. అవి అజీర్తిచేసినోళ్ళకి విరోచనాల మాత్రల్లా పని చేస్తాయి తప్ప ఉత్తినే తినడానికి పనికి రావు. మొన్న పక్కింటావిడ కూడా వాళ్లాయనకు రెండు రోజులు సెలవులొచ్చాయని ఓ నాలుగు వడియాలు తీసుకెళ్ళింది.. పక్కనే వెంకన్న మామయ్య ఇల్లుందిగా.. పరిగెత్తు " అని కొట్టు వాడి వైపు తిరిగింది.

అమ్మ : బాబూ ఈ చొక్కా ఎంత ?

కొట్టు వాడు: 150 రూపాయలు

అమ్మ : 30రూపాయలకిస్తావా?

నేను : అమ్మా "అర్జెంటు.. వెళ్ళాలి.."

కొట్టు వాడు: కుట్టడానిక్కూడా 30 కంటే ఎక్కువ తీస్కుంటారమ్మా.......

నేను : అమ్మా "అర్జెంటు.. వెళ్ళాలి.."

అమ్మ: చెప్పావు లేవయ్యా........................

వాదోప వాదాలు ముగిసిన తరువాత .. కేవలం అయిదు రూపాయల తేడాలో అమ్మ ఆ చొక్కా కొనకుండా వచ్చేసింది..

ఆరోజు ఎంత ఆనందమేసిందంటే .. "మామయ్య ఇంటికి వెళ్ళకుండా పని అయిపోయినంత "

ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక్క చొక్కా.. "నీలం రంగు.. పసుపు చారలు.. అక్కడక్కడా అద్దిన పూలు.."

ఇప్పుడు..

మోహన్ బాబు తేరుకున్నాడు..

కాని అదెలా ఇక్కడికొచ్చింది..

నేను..: అమ్మా ఈ చొక్కా..?

అమ్మ: మొన్న తిరనాళ్ళ కెళ్ళినప్పుడు అదే ముప్పై రూపయలకిచ్చాడు లేరా.. నేను చెప్పానా నువ్వు అదృష్టవంతుడివని.. ఆ మెత్తటి.. వెచ్చటి.. నీలం చొక్కా.. ..అంటూమురిసిపోతుంటే..

ఏడిచినట్టే ఉంది నా అదృష్టం... నాలుగేళ్ల పాటు అమ్ముడు కాని ఆ చొక్కా నా కోసమే పుట్టిందని మా అమ్మా చెపుతుంటే.. బాలకృష్ణ సినిమా బ్లాకు లో కొని చూసిన అనుభూతి కలిగింది..

చొక్కా వేసుకున్నాకా ఆ అనుభూతి "ఇంతింతై వటుడింతై" అన్నట్టయ్యింది.. వొళ్ళంతా పట్టేసింది... అటూ ఇటూ కదిలితే చిరిగి పోతుందేమో అన్న భయం..

ఎలాగొలా ఆఫీసు చేరాను..

ఓ పావుగంట ఎదురు చూపుల తరువాత .. లిఫ్టు సిటి బస్సులా నిండుగా వచ్చింది.. నాకు ఫుడ్బోర్డ్ లో నుంచునే అవకాసం ఇచ్చారు.

ఇంతలో కాలికి ఏదో మెత్తగా తగిలింది .. అమ్మాయి కాలు నాకు తగిలింది ..

ఆమె: "సారీ .. చూస్కోలేదు "
నేను : "its మై pleasure యు ఆర్ వెల్కం "

ఆమె...: ఓ రకమైన చూపు చూసింది "మీ చొక్కా చాల బాగుంది ఎక్కడ కొన్నారు"

నేను : (ఏమనలేదు)మళ్ళీ
సీన్ రిపీట్ ..

కాలుని ఏదో బలంగా తొక్కింది ... మగాడు నా కాలు మీద నుంచున్నాడు..

మగాడు: "సారీ .. తప్పైపోయింది "

నేను : ఏ కళ్ళు నెత్తికెక్కాయా..?

సాటి మగాడు: పోనీలెండి.. తప్పైపోయింది అంటున్నారుగా

నేను : ఏ నీక్కూడా కళ్ళు నెత్తికెక్కాయా..? వాడి రెండో కాలు నీ కాలు మీదే ఉంది.. చూస్కో..

సాటి మగాడు: (ఏమనలేదు)

ట్రైనింగ్ రూం లో అడుగు పెట్టాను..అందరూ ఎవరో పోయినట్టు మౌనం గా వున్నారు..

HR Manager దైవాదీనం ఏదో మాట్లాడుతున్నారు..

ఈ కంపనీ లో చేరడం మీ అదృష్టం .. మనమంతా కుటుంబ సభ్యులం... ఇక్కడ జీతం కాదు ,పని ముఖ్యం ...
అని ఏవేవో చెపుతున్నారు..

ఇంతలో కమలారావు వచ్చి మైకు లాక్కున్నాడు...దైవాదీనం అందరివైపూ ఒక సారి జాలిగా చూసారు... ఎందుకో అర్ధం కాలేదు

ఇందాక లిఫ్టులో కాలు తొక్కిన ఆ "ఒక్క మగాడు" ఈ కమలారావే.. ఈ కంపనీ మేనేజర్..నన్ను గుర్తు పట్టాడు.. చూసావా చేరక ముందే నిన్నెలా తోక్కేసానో అనే రావుగోపాలరావు చూపు వేస్కుని ... తన ప్రసంగం మొదలు పెట్టాడు..
క్రిస్టమస్ కేకును .. వేసవి సెలవుల దాక దాచుకు తినే మొఖం వాడూను..

నేను అంత.. నేను ఇంత... అంటూ, పక్కింటి ఆవిడ ... వాళ్ళాయన గురించి చెప్పినట్టు చెప్పుకుంటున్నాడు..
కంపనీని నా భుజాలపై మోసాను అని చెపుతుంటే.. నా పక్కన "సోముగాడు" వంగిన కమలా రావు నడుము చూసి అవును నిజమే అన్నట్టు తల ఊపుతున్నాడు..

పైన అర్ధం కానిది ఇప్పుడు అర్ధం అయ్యింది.

మండబెట్టినట్టే ఉంది వీడి తెలివి ....అనుకున్నాను ..

సమయం 2 గంటలయ్యింది

ఇంతలో జైల్లో కైదీలను బోజనాలకు పిలిచినట్టు ... బోజనాలకు పిలిచారు..

బోలెడన్ని వేరైటీలున్నై అక్కడ.."చారు.. పప్పు.. పప్పు చారు.."
నీళ్ళను మరిగించి రెండు కరివేపాకు రెబ్బలను తగిలించి కాస్త ఉప్పు కారం జల్లి ఒక గొప్ప వంటకం చేసారు .. దాని పేరే "చారు"

దాన్నే వేరే గిన్నెలో పోసి "పప్పు" అనే పేరు కూడా రాసారు.. మనక్కావలసింది వేసుకోవచ్చు "పప్పు" లేక "చారు"

.. బోజనాల్లయ్యాక అందరూ నిద్ర మబ్బు మొకాలేసుకుని ఒకరి మొహం ఒకరు చూస్కుంటున్నారు..

ఇంతలో కమలారావు వచ్చి "సైలెన్స్" అన్నాడు....ఆ అరుపుకి, ఒకావిడ కళ్ళు తిరిగి పడిపోయింది .. ఆవిడని తీస్కుని వేరొకావిడ బయటకు వెళ్లి పోయింది..

చాల సేపు ఏదో చెప్పాడు .. తరువాత ఓ రెండు మూడు గంటలయినట్లు ఉంది..
ఉన్నట్టుండి చెప్పడం ఆపేసి .. "ఎవరైనా ఎమన్నా అడగాలనుకుంటున్నారా?" అన్నాడు.

నేను వెంటనే ఆర్. నారాయణ మూర్తిలా ఆవేశంగా లేచి వొళ్ళు విరుచుకుంటూ.. చెయ్యి ఎత్తాను.. దెబ్బకి నా నీలం చొక్కా కాస్తా.. ఎక్కడికక్కడ కుట్లు ఊడి పోయింది..

"కళ్ళు తిరిగి పడిపోతే ఆడాళ్ళనేనా మగాళ్ళను కూడా పంపేస్తారా..?" అని అడిగాను..

సమాధానం చెప్పలేదు కాని .. నన్నూ బయటకి పంపేసారు..

Wednesday, January 6, 2010

హైదరాబాదులో పచ్చి బూతులు

రండి బాబూ రండి ... మంచి తరుణం మించిన దొరకదు. రండి బాబూ రండి.. పచ్చి బూతులు.. ఫ్రెష్ గా వినే అవకాసం.. మంచి సినిమా చూస్తున్నప్పుడు కరంటు పోతేనో.. ఎండాకాలంలో కుళాయి దగ్గర నీళ్ళు కేవలం ఓ అయిదు నిమిషాలు మాత్రమే వచ్చినపుడో.. కష్టపడి చదివినప్పుడు పరీక్ష పత్రాలు లీక్ అయినప్పుడో మాత్రం వినిపించే మధుర భాషా ప్రయోగాలు ఇప్పుడు ఏ సిటి బస్సు ఎక్కినా వినొచ్చు.. హైదరాబాదులో ఈ సువర్నావకాసం కేవలం 5 రూపాయలకే...

టియ్.. టియ్.. ఆ ఇప్పుడు 2 రూపాయల RTC ఆర్డినరి బస్సు టికెట్టు ధర, అధిక పెంపుతో కేవలం 5 రూపాయలు మాత్రమే !

గత నెలా నెలన్నర రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న బందుల మూలంగా RTC కి ఏర్పడ్డ నష్టం అయితే నేమి.. తగల బడ్డ బస్సుల నష్టం పూడ్చే నిమిత్తమైతే నేమి.. RTC ఉద్యోగుల జీతాలు పెంచడం మూలాన అయితే నేమి... రాష్ట్ర వ్యాప్తంగా నేటినించీ ప్రయాణీకుల టికెట్టు ధరలు పెంచబడ్డాయి. పెంచిన ధరలు బయట ఊర్లకు అయితే ఓ మోస్తరు పరవాలేదు. ఎందుకంటే మరీ రోజూ బయట ఊర్లకు ప్రయాణం చేసే పరిస్థితి ఉండదు గనుక. కానీ సిటి లో బస్సు లేనిదే రోజు గడవడం చాలా కష్టమయిన విషయం. అది నిత్యవసరం. అలాంటి సిటి బస్సు రేట్లు కూడా అమాంతంగా పెంచేస్తే ఎలా? ఓహో .. 15రూపాయల బియ్యం 32 అవ్వగాలేనిది .. ఈ మాత్రం పెంచితే తప్పేమనుకుని ఉంటారు కామోలు.. ఉజ్జాయింపుగా నా జీతం రోజుకు 100 రూపాయలనుకుందాం. అంటే రమా రామీ నేను పెట్టే ప్రయాణపు కర్చు కనీసం రోజుకు 14 రూపాయలుంటుంది (14%). ఇది ఎంత వరకూ సమంజసం? ఇది కేవలం హైదరాబాదులోనే కాదు రాష్ట్రంలో అన్ని ముఖ్య నగరాలలో అమలు అవుతుందేమో నాకు తెలీదు. అమలు అయ్యే అవకాసం మాత్రం లేక పోలేదు.

నష్ట పోయింది ఎవరూ..?
RTC పని చెయ్యని రోజున కూడా ఎక్కువ చార్జీల తో ఆటోల్లో (share) ప్రయానించవలసి వచ్చింది.
కుటుంబ సభ్యులూ .. స్నేహితులూ.. క్షేమంగా ఇళ్ళకు చేరారో లేదో చేరతారో లేదో నన్న ఆందోళన పడవలసి వచ్చింది (bloody insecurity). ఇందుమూలంగా తడిసి మోపెడైన టెలిఫోన్ బిల్లు!(financial loss). ఏరా రేపెమైనా బందులు గట్రా ఉన్నాయా? తెలీదురా రాత్రి ఇంటికెళ్ళి tv చూడాలి . ఏరా ఊరెల్తానన్నావు రేపే నా? అవున్రా కాకుంటే బస్సులు తిరిగితే వెళ్తాను (uncertainity).


పర్యవసానాలు ...
ఆటో వాళ్ళు తమ తమ ప్రతాపం చూపించొచ్చు
ప్రైవేటు వాహనాలు తమ చార్జీలు మరింత అధికం చేస్తారు.
పెద్దగా పెరగని బెత్తెడు జీతాల్లో (ఆర్ధిక మాంద్యం దెబ్బ కొట్టిందిగా దాని ప్రభావమన్నమాట).
only advantage* - మరింత జాగ్రత్తగా పొదుపుగా బతకడం ఎలాగా .. అన్నది నేర్చుకోవచ్చు.

*conditions apply ఈ సౌభాగ్యం, సదవకాశం ఆర్ధికం గా వెనకబడినవారికీ మరియు మధ్య తరగతి వారికి మాత్రమే

విజ్ఞప్తి..
దయచేసి ఇకమీదట ఎప్పుడు నిరసనలు తెలియ జేయాల్సి వచ్చినా బస్సులు తగల బెట్టే దుస్సంప్రదాయాన్ని మాత్రం విడనాడండి. public property కి జరిగే నష్టం మనకి మనం చేసుకునే నష్టంగా గుర్తించండి (తగల బెట్టిన వారికి మాత్రమే ). అధికారులు కూడా మీరు ప్రజలలో భాగమే కనుక ఒక సారి మీ నిర్ణయాలను పునః సమీక్ష చేయగలరు. కష్టమనుకుంటే తక్కువధరకు ఏ నగరపు చివరనైనా బాడుగకు ఇల్లు అద్దెకు తీస్కోండి .. అక్కడినుండీ మీ.. మీ.. కార్యాలయాలకు వెళ్లి రండి. సత్వరమైన గుణం కనపడుతుంది.

ఇప్పుడే తెలిసింది .. పెంచిన ధరలు స్వల్పం (అతి ) గా తగ్గించారట..

Note:- ours is a democratic country for the people, by the people of the people..

Tuesday, January 5, 2010

ఇక్కడే....
మొదలిక్కడే
తుదికి మొదలిక్కడే

తీరని నర మృగాల దప్పికలిక్కడే
బలి పసువులైన నిస్సహాయులిక్కడే

అన్నార్తుల..
శరణార్థుల.. శిబిరాల శిదిలాలిక్కడే

అక్కరకు రారని..
అక్కున చేర్చుకోని.. అభాగ్యుల భాగ్యమిక్కడే..

ఇక్కడే...
ఇక్కడే....

నెత్తురుడికి
తిమిరాలు తొలగేలా
నరాలు తెగేలా ప్రతిగటించిందిక్కడే
స్వేదపు బిందువుల సంతకాలు పడిందిక్కడే

మొదలిక్కడే
మొదలుకు తుది ఇక్కడే

ఆ కలలకు మొట్టమొదటి మజిలీ ఇక్కడే
ఆశలు ఆశగా బయలుదేరేదీ ఇక్కడే

శోకతప్త హృదయాలకు ఊరట దొరికేదిక్కడే
చరిత్ర పునరావృతమయ్యేదీ ఇక్కడే

దూరపు హద్దులు చెరిపే దిశగా
గమ్యం గడి తప్పనీయని తెరచాపలు లేచేదీ ఇక్కడే

ఇక్కడే...
ఇక్కడే....