Thursday, December 30, 2010

సుజనమధురం కి అభినందనలు..

కొత్త సంవత్సరం సందర్బాన్ని పురస్కరించుకొని వివిధ బ్లాగరుల రచనలను కూర్చి"నూతన సంవత్సరాగమనం" అనే (e-పుస్తకం) 'సుజ్జి' గారు మరియు 'మధుర' గారు తాయారు చేసిన విషయం బ్లాగర్లకు విదితమే...

ఆలోచనకు కార్య రూపం ఇవ్వడం అలాగే దానిని సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. పుస్తకం చూస్తే ఏదో పెద్ద ప్రొఫెషనల్ పబ్లిషర్స్ నుండి వచ్చిన పుస్తకంలా వుంది కాని.. ఇనీషియేటివ్ తీసుకున్న తోటి బ్లాగరుల నుండి వెలువడిందంటే అది ఆశ్చర్యపరచే విషయమే..

ఈ పుస్తకం తాయారు చేయడంలో వారు వెచ్చించిన సమయం, శ్రద్ద.. నిజంగా అభినందనీయం..

Thank you both,
Siva Cheruvu

Wednesday, December 29, 2010

మళ్ళీ ఎక్కడో మొదలవుతాయి..ఆలోచనలు..
ఎందుకో అలసిపోవు..
తిరుగాడుతూనే ఉంటాయి..!

కాసేపు..భయంతో,
కాసేపు.. పరధ్యాన్నంలో..
కలలను కలుపుకు పోతుంటాయి..

------------------------------------
ఆలకించని తనం..
అతి మంచి తనం..
మధ్యే మార్గం..
ఏది తమ అస్తిత్వమో?

ఒక సారి ఆగలేక తొందర 'పడతా'యి
మరోసారి..
ఆలసించి తప్పుచేస్తాయి..

------------------------------------

క్షణకాలం..
కార్యాచరణ కాలం..
ఏంటో మరి వాటి జీవిత కాలం.. ?

చెప్పక తప్పుకు పోతూ ..
తమ పని తాము చేసుకు పోతూ..
ఆదరణ ఉన్నంత కాలం ఊపిరి పోసుకుంటాయి..

------------------------------------

గీసుకున్న గిరి వరకూ..
హద్దులు చెరిపే చొరవ చేరువను చేరే వరకు..
మరి ఎంత వరకో వాటి నడక..?

అంతర్చక్షువులను తెరిచి ..
అంతరాన్తరాలను తెలుసుకుని..
తెలియని తనమే తామయ్యామని మురిసిపోతుంటాయి..
అద్బుతాలయి కూడా అమాయకంగా చూస్తుంటాయి..
అంతా అయిపోయాక .. అంతర్దానమవక..
మళ్ళీ ఎక్కడో మొదలవుతాయి..

------------------------------------

Thursday, December 23, 2010

ఈ ఉత్తరం రాస్తాననుకోలేదు...

ఆశ్చర్యం గా ఉంది.. !
ఏళ్ళయిందా నిన్నుచూసి ?

రోజులు తెలీకుండా వెళ్ళిపోతాయి..చూస్తుండగానే దూరాలకు తీసుకెళ్ళి పోతాయి!

రోజులు మారినా ఇక్కడ ఏమీ మారలేదు..
ఉదయాన్నే నే చదివే వార్తలు... మీ అమ్మ చేసే అదే వంట..
ఏదో రకంగా కాలక్షేపం.. రాత్రి నీ ఆలోచనలతో ఆలస్యం గా నిద్ర పోయే నేను ......


కాని ఒక్క తేడా మాత్రం వుంది..
ఇంతకు
ముందు నువ్వు ఉన్నావు.. ఇప్పుడు ఇక్కడ లేవు..

.
.
.
.

నే మాట్లాడినప్పుడల్లా నీకర్ధమయిందో లేదో.. ?
వచ్చేయమని
చెప్పలేక ఎన్ని సార్లో అడిగాను నిన్ను .. ఎప్పుడొస్తున్నావని... !

గొంతు దాక వచ్చి ఆగిపోయిందనిపిస్తుంది..!
నువ్వూ
చెప్పాలనుకుని ఉంటావని .. చూడాలనిపిస్తోందని..!

నీవెంచుకున్న దారులను గ్రహచారాలకు సర్దిపెట్టావు.. కానీకష్టనష్టాలలో మా భాగస్వామ్యముందని..
మర్చిపోయావా?

నీవేమి సాదించాలనుకుంటున్నావో అది దూరం పాటి విలువ చేయదని..
ఆలోచించలేక పోయావా...?

రమ్మన్నా వెళ్ళిపోయిన రోజులు రావు... నువ్వైనా వస్తే ..
నిన్నటి రోజూ, ఈరోజూ ఒకటి కాకుండా వుంటుంది..

ఇప్పటికైనా ఈ ఉత్తరం రాస్తాననుకోలేదు..

కానీ.. వెళ్ళేలోపు ఓసారి చూద్దామనిపించింది....

............. అందుకే !

Thursday, December 16, 2010

అటు నువ్వు ఇటు నేను

DEC31


వెళ్ళేవాళ్ళు వచ్చే వాళ్ళు.. ఆఫీసంతా హడా విడిగా వుంది. ఇంత మందిలో తల తిప్పకుండా ఒకతను తన పని తానూ చేసుకుపోతున్నాడు. డెస్క్ ఫోన్ చాలా సేపటినుండీ రింగ్ అవుతోంది. ఇంకో రింగులో ఫోన్ కట్ అయిపోతుందనగా లిఫ్ట్ చేసాడు.

"హలో శశి స్పీకింగ్ .."

అవతల పక్కన గౌతం ఉత్సాహంగా మాట్లాడడం మొదలు పెట్టాడు.. ఒరేయ్ ! ఇంకా కదలవేరా.. మొబైల్ కి చేస్తే కట్ చేస్తావు. పెద్ద నువ్వే ఆఫీసులో పని చేసేవాడిలా.. రాత్రి పార్టీ ఉంది మర్చిపోయావా.. లే.
నా ఎంగేజిమేంట్ నువ్వే ఎనౌన్సు చెయ్యాలి .. ఇది కేవలం న్యూ ఇయర్ పార్టీ ఏ కాదు..

"తెలుసురా ఎన్నిసార్లు చెప్తావు. నాకు తెలీదా.. వస్తానుగా.. వర్కు ఉన్నప్పుడు పదే పదే ఫోన్ చేయొద్దని చెప్పానుగా.. " శశి గొంతులో విసుగు స్పష్టం గా కనపడుతోంది."

మునుపెన్నడూ అంతని గొంతులో ఆ కటువుతనం .. చూసి ఎరుగడు గౌతం. మరింకేమీ మాట్లాడలేదు. ఫోన్ పెట్టేసాడు.

ఆఫీసులో ఒక్కోకరుగా అందరూ వెళ్ళిపోతున్నారు. సాయంత్రం ఆరు దాటిపోతోంది. శశి ఇంకా పని చేస్తున్నట్టుగానే ఉన్నాడు. నిజానికి అతను సబ్మిట్ చేయాల్సిన పని ఒక రోజు ముందే ఇచ్చేసాడు. ఇక చేయడానికి ఏ పనీ లేదని అతనికి కూడా తెలుసు. కాని పని కల్పించుకుని ఏదో చేసే ప్రయత్నం అతనిది. మనసు నిండా యేవో జరిగిపోయిన సంఘటనలు తెరలు తెరలు గా కనిపిస్తున్నై. అతని ఆలోచనలు అతని అదుపు దాటి కొన్ని సంవత్సరాల వెనుకకు వెడుతూనే వున్నై. తనకి తను పూర్తిగా కనపడడం మొదలయింది..

ఇంతలో ఎవరో పిలిచారు.."ఏం శశి పని ఉందా? "
"అవును" కాస్త కాస్త అస్పష్టం గా చెప్పాడు..

ఇప్పుడు సమయం ఏడు గంటలవుతోంది.. చాలా మంది అప్పటికే వెళ్ళిపోయారు..సెల్ ఫోన్ పక్కన పెట్టి ఆఫీసంతా తిరగడం మొదలు పెట్టాడు. ఎందుకో కాసేపు తన ఒంటరి తనాన్ని తనతో ఉండనివ్వాలనిపిస్తోంది. బయటకి వెళ్ళడానికి కాళ్ళు నిరాకరిస్తున్నాయి. తనకి రోజూ కనపడే ఆఫీసు.. ఈఖనం అలాలేదు.. కళ్ళు తిరుగుతున్నట్టున్నై.. వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు. తనను ఎవరో పిలుస్తున్నట్టుంది. ఆ గొంతు తనకి చాలా పరిచయమున్నదే.. తనని చాలా సార్లు పిలిచినదే..

అదే గొంతు వినపదకూడదని ఇప్పటిదాకా పారిపోతూనే వున్నాడు..

DEC31 కొన్ని సంవత్సరాల ముందు..

గడియారం ఎనిమిది గంటలు కొడుతోంది. అదే ఆఫీసు అదే పక్క పక్కన సీట్లు..

అక్షరా !
'బయలుదేరుదామా.. ఇప్పటికే చాల ఆలస్యమయింది.. ఇదిగో అదిగో అని ఇప్పటి దాక చేసావు.. చూడు అందరూ వెళ్ళిపోయారు.. నువ్వు నేను మాత్రమే మిగిలి పోయాం ఇక్కడ.. పని వుంటే తరువాత చూస్కోవచ్చు.. పద పద' అని తొందర పెడుతున్నాడు శశి.

చుట్టుపక్కల అంతా నిశ్సబ్దంగా ఉంది. ఆమె ఓ నిమిషం ఆగి మాట్లాడడం మొదలు పెట్టింది.

"నేను అమ్మ నాన్న దగ్గరకి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఈరోజు దాటితే మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో..?" ఆమె తన మాట ఇంకా పూర్తి చేయలేదు. చెప్పాలనుకున్న మాట ఆగిపోతోంది.. ..పదాన్ని పదాన్ని పట్టి పట్టి మాట్లాడుతోంది.

"స్నేహితులన్నాకా కలుస్తూనే వుంటారు..కలిసే వుంటారు కాని .. లే.." అని కుర్చీలోంచి లేచాడు.

"నేను అలా అనుకోవడం లేదు.." అందామె

"అంటే?" ప్రశ్నించాడు.

మనమిద్దరం కేవలం స్నేహితులమని నేను అనుకోవడంలేదు - బదులిచ్చింది..

'కాసేపు నవ్వుకున్నాం.. కొన్నిరోజులు కలిసి వున్నాం' మరింకేమంటారు? . అతని గొంతులో స్వరం మరోలా పలుకుతోంది..

"నువ్వు ఆ గీత దాటి చూడడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా..?" ఈ సారి ఈమె ప్రశ్నించింది సమాధానంగా..

"అంటే ?" మళ్ళీ అన్నాడతను..

"నాకు నువ్వంటే ఇష్టమని చెపుతున్నాను. జీవితాంతం నీతోనే ఉండాలన్నంత ఇష్టం అని అంటున్నాను.. అర్ధం కావడం లేదా.?" ఇది చెప్పడంలో ఆమె కళ్ళు ఎక్కవ మాట్లాడుతున్నాయి..

మనం దీని గురించి ఇంతకు ముందు చాలా సార్లు మాట్లాడాం.. ఇది మొదటిసారి కాదు... నీకు నా అభిప్రాయం చెప్పాను అనుకుంటున్నాను.. అన్నాడతను.

"అవును ఇది మొదటి సారి కాదు.. కాని ఇదే ఆఖరి సారి అని చెప్తున్నాను నేను " ఆమె గొంతు కాస్త గట్టిగా వినపడుతోంది.

"నిన్ను చూసి ప్రేమిస్తున్నానని చెప్పడం ఎంత పని? అది నోటి చివరి మాట. నా లోపల లేని దాన్ని పదే పదే ఎందుకని చెప్పమని అడుగుతావు..?"
కోపం, విసుగు, ఆవేశం, ఆనందం ఇవన్నీ ఫీలింగ్స్.. ప్రేమ కూడా అంతే. కాక పోతే దానికి కాస్త బలమెక్కువ.. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు. వీటికి స్థిరత్వం లేదు.. అవి వస్తాయి పోతాయి.. అంతే..

ఈరోజు నాకు నచ్చవని నిన్ను ప్రేమిస్తున్నానని చెపితే రేపు ఇంకో నచ్చే అమ్మాయి కనపడని ఏంటి గారంటీ.. ? నీకిది stupidity గా అనిపించొచ్చు.. కాని ఇదే నిజం. నా స్నేహితుల్లో నేను ఎంత మందిని చూసాను? ఒకళ్ళని ప్రేమిస్తున్నానంటాడు. ఇంకొకళ్ళతో కనపడతాడు.. చివరికెవరినో పెళ్లి చేస్కుని కనపడతాడు.. ఇలాంటి ప్రేమలు మనకవసరమా?

"ప్రేమకి అవసరాలుండవు.." బదులిస్తున్నట్టు అంది..

ప్రేమిస్తున్నామని .. ఒకరికోసం ఒకరు ప్రాణాలిస్తామని అంటారు .. Its all fake వాళ్ళు వాళ్ళ కోసం బ్రతుకుతున్నారు. అతనికి ఆమె అంటే ఇష్టం కనుక కలిసి జీవించాలనుకుంటాడు.. ఆమె కూడా అంతే.. అదే ఏదో ఓ రోజు.. వీళ్ళిద్దరి మధ్య ఆ ఇష్టా ఇష్టాలు కలవని క్షణాలు మొదలవుతాయి. వాళ్ళే కలవడం తగ్గించేస్తారు.. దూరం పెరుగుతుంది.. నెమ్మది నెమ్మది గా ఈ ప్రేమ కి తెర పడిపోతుంది.. మళ్ళీ ఎక్కడో ఓ రెండు కొత్త తెరలు లేస్తాయి..

"నువ్వు పొరబడుతున్నావు .. ప్రేమకి ఒకటే తెలుసు కలపడం.. కలిసి ఉండేట్టు చేయడం.." చెప్పింది..

"అన్ని పరిచయాలూ ప్రేమలవవు.." అన్నాడతను. నాలుగేళ్ల మన పరిచయం లో దాదాపు మనం కలవని రోజులు లేవు.. ఇంత కాలం లో మన మధ్య ఏర్పడింది కేవలం పరిచయమేనా..? ఇదేనా నువ్వనేది..

చూడు అక్షర..! నువ్వంటే నాకు ఇష్టమే కాని నేను .. దానికి ప్రేమ అనే పేరు ఇవ్వలేను..

ఆమెకి తెలీకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి.. ఆమె కుర్చీలోంచి లేచింది.."నువ్వు చూసేది .. విన్నది ప్రేమ అవుతుందో లేదో నాకు తెలీదు.. కాని ప్రేమించకుండా మాత్రం ప్రేమ మీద ఓ అభిప్రాయానికి రాకు .." సలహా పూర్వకం గా చెప్పింది. మల్లె మన మధ్య ఈ విషయం రాదు.. ఇక బయలుదేరుదామా?

DEC31 ప్రస్తుత సంవత్సరం..

శశిగారు.. శశి గారు.
టైం పది గంటలవుతోందండీ.. గార్డు చెప్పాడు..

బయలుదేరుతున్నాను.. బద్దకంగా కుర్చీలోంచి లేచాడు..అప్పటికే ఫోన్లో 12 మిస్స్డ్ కాల్స్ ఉన్నాయ్.

"హలో గౌతం... బయలుదేరుతున్నాను ఇంకో గంటలో అక్కడుంటాను.. " ఇంకా ఏవో రెండు ఫోన్లు మాట్లాడి అక్కడినిండీ కదిలాడు.. వెనుకనుండీ హ్యాపీ న్యూ ఇయర్ సర్ .. చెపుతున్నాడు.. గార్డు.. వెనుక అద్దాల గదిలోంచి తన పక్కన సీటు మాట్లాడినట్టు అనిపించింది అతనికి..

కారు బయలుదేరింది.. పేరుకి మెలుకువ వచ్చింది కాని ఇంకా ఆ కల లోనే వున్నాడు శశి. వీది దీపాల వెలుగు లు అతని కంటిమీద పడి వెళ్ళిపోతున్నాయి.. గాలికి అతని జుట్టు ఎగుర్తోంది.. ఆలోచనల్లాగా..

రేడియో FM వాళ్ళు సెలెబ్రేషన్స్ చేస్తున్నారు.. న్యూ ఇయర్ సందర్భం గా.. ఎవరో గానీ ఆ జాకీ గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఈ ఇయర్ కి మీ రిసోల్యుషన్స్ ఏంటి.. ? ఎవరేమి సాదిద్దామనుకుంటున్నారు .. ? ఎక్కడెక్కడి నుండో ఫోన్ చేసి అందరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు పంచుకుంటున్నారు..

శశి తనలో తాను ఓ నవ్వు నవ్వుకున్నాడు. ఎలా వుంది.. ఎక్కడ వుంది.. తెలియదు. తరువాత చాలా ప్రయత్నం చేసినా విచిత్రంగా ఆమె గురించిన ఆలోచనలే దొరికాయి.. అక్కడినుండీ ఆమె వెళ్లి పోయింది.. అతని నుండీ కాదు.. ఆమె ఆలోచనలని ఎంత కట్టిపడేయాలని చూస్తే.. అంతగా అతను బందీ అవసాగాడు.. ఆఖరికి ఓ కటువైన నిర్ణయం తీసుకున్నాడు. అదే ఇప్పుడు అతని కళ్ళలో కనపడుతోంది.. కారు ఆగింది..

గౌతం రిసీవ్ చేస్కొడానికి వచ్చాడు.. హే .. రా రా.. నీకోసమే వెయిటింగ్.. మీ ఇంటివాల్లె నీకన్న ముందు వచ్చారు..ఏంటీ ఆలస్యం..

"కాస్త పని పడింది " ముక్తసరి సమాధానమిచ్చాడు. లోపలికి తీసుకెళ్ళాడు గౌతం..

అంతా సందడి గా వుంది..అప్పటికే చాలా మంది గ్లాసులు పట్టుకుని లోకాభిరామాయణం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఆడవాళ్ళు చాలా తక్కువమంది.. అందరూ తెలిసిన వాళ్ళే గనుక ఎవ్వరిలోనూ ఆ reservedness కనపడడం లేదు.. చాలా మంది ఒక చోట గుమ్మిగూడడం కనపడింది . తెలీకుండా అది అతనిని ఆకర్షించింది. అదే గుంపులోంచి ఎవరో పిలుస్తున్నారు. శశి.. శశి.. అని.. అనాలోచితం గా అటువైపు నడిచాడు. ఎదురు చూడనిదేదో జరుగుతోందని.. అతనికి తెలుస్తున్నట్టుంది. అతని కళ్ళు వెదకడం మొదలు పెట్టాయి.. అతని ఆలోచనలకి రూపమిచ్చినట్టు.. ఎదురుగా అక్షర కనపడింది. పక్కనే ఎవరో సరి జోడీలా వున్నాడు. యేవో పరిచయాలవుతున్నాయి. తను కూడా వెళ్లి ఓ అయిదు నిమిషాలు మాట్లాడాడు గాని.. ఏదీ సరిగా వినలేదు కూడా. ఓ పావుగంట అయ్యింది.. ఇప్పుడతని పేరు కూడా గుర్తుకురావడం లేదు.

హ్యాపీ న్యూ ఇయర్.. అరుస్తున్నారందరూ..

"చాలా కాలమయింది.. మనం కలిసి" వెనుకనుండి అక్షర పలకరిచింది..
"అవును సంవత్సరాలయింది.."

ఇద్దరూ నడుస్తూ మాట్లాడడం మొదలు పెట్టారు..

"ఐ కెన్ సి లాట్స్ ఆఫ్ చేంజ్ " అందామె..

'నిజమే' సమాధానం చెప్పి "నువ్వు?" ప్రశ్న లాగా ఉంది అతని పదం..

ఆమె ఏమీ మాట్లాడలేదు. పెళ్ళయిందట? - కొంతసేపాగి అంది ''

దూరంగా చూపిస్తూ అన్నాడు. తనే.. పేరు 'వసు' . ఓ ఏడు నెలలయింది పెళ్ళయి. మన ఆఫీసే..

"చాలా బాగుంది మీ ఆవిడ ..."

"అందుకే చేసుకున్నాను.." - నవ్వుతూ అన్నాడు.. 'మీ జోడి కూడా బాగుంది..' పొగడ్త జోడించాడు.

"నాన్న గారి కొలీగ్ వాళ్ళ అబ్బాయి. చిన్నప్పటి నుండీ పరిచయమే.. కాక పోతే తనే ముందు ప్రేమ అన్నాడు... ఒప్పుకోలేదు.. మళ్ళీ నావల్ల ఒకతను బాచిలరుగా మిగిలిపోతున్నాడని .. ఈ మధ్యనే చేసుకున్నాను.. "

"లవ్ మారేజీ అన్నమాట..?"

"అవును ఆయనది లవ్ నాది మారేజ్" నవ్వుతూ చెప్పింది..

"హాపి మారీడ్ లైఫ్ " అన్నాడు..

" 'మీ' క్కూడా " బదులిచ్చింది

ఆమె మాటలో అ గౌరవ వచనం అతనిని ఆశ్చర్య పరచలేదు.. కారణం అతనికి తెలుసు..

ఇప్పుడెవరి జీవితాలు వారికి ఏర్పడ్డాయి..

అతను పరిచయం మాత్రమే అనుకున్న ప్రేమ.. ప్రేమ అని తెలిసే టప్పటికీ .. ఆ ప్రేమ పరిచయమైపోయింది..

మీ మారేజీ ఎరెంజ్డా ? అడిగింది..

పెద్దవాళ్ళు చేసిందే. ఫస్ట్ ఇద్దరి పరిచయం ఆఫీసులోనే.. చెప్పానుగా. ముందు ఆమెకి నేను నచ్చాను.. కాని ప్రోపోస్ చేసింది ఫస్ట్ నేనే.. అది పెద్ద స్టోరీ..

చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా... ఉండాలని తను చేసిన పనిని మరోలా చెప్పాడు.

నీకు ప్రేమ మీద అంత మంచి అభిప్రాయం లేదు కదా.. ? ఆపుకోలేక అనేసింది ఆమె.

"తెలీదు కానీ.. నా థియరీ తప్పని తెలుసుకున్నాను.. అంతకు మించి చెప్పలేను.. ప్రేమే భావాలకు మూలం అదే నేను తెలుసుకున్నది.."

ఆమెకేదో అర్ధం అయినట్టు మళ్ళీ ఆ విషయం అడగలేదు..

ఇంతలో గౌతం వచ్చి ఇద్దరినీ మళ్ళీ పార్టీ లోకి పదండి పదండి అన్నాడు..

హ్యాపీ న్యూ ఇయర్ శశి.. ఆమె అక్కడినించీ బయలుదేరింది.
"యు టూ.." శశి కూడా కదిలాడు..

కచ్చితంగా ఇది కొత్త సంవత్సరమే..ఇక మీదట కొన్ని ఆలోచనలు.. భయాలు.. ఉండవు.. కాని గడిచిన ఈరోజు జ్ఞాపకాన్ని మాత్రం అతను తీసివేయ్యాలనుకోలేదు.. బహుశా ఆమె కూడా అంతే నేమో..

Monday, November 29, 2010

జీవితానికొకటే తెలుసు..జీవితానికొకటే తెలుసు..
ఇవ్వడం..


ఈరోజు మీద ప్రేమ
ఊహలు నింపుకున్న రేపటి రోజు
బ్రతకడానికి కారణం

మనసుకు కాస్తంత నవ్వు..
మనిషిగా కాసిన్ని క్షణాలు..
తనదైన అస్తిత్వం

కొన్ని తీయనివి..
మరి కొన్ని మింగుడు పడనివి..
వెనుకటి రోజులకు, కాలం చెల్లని గురుతులు

అంతే..

Friday, November 26, 2010

ఆకలేసిన ఆదివారం ..

అది ఆకలేసిన ఆదివారం .. ఇంట్లో ఎవరూ లేరు .. డైలీ సీరియల్ లో కధ అంత క్లియర్ గా 'మనకి' 'మన వంట' గురించి తెలుసు.. పోనీ పక్కింటి వాళ్ళని అడిగి తినడానికి ఏమైనా తెచ్చుకుందామా..? అని ఆలోచిస్తే.. పోయిన వారమే తెచ్చిన అయిదు కేజీల కోటాబియ్యం, అరకేజీ బెల్లం, ఒక జాడీ ఆవకాయ ఇంకా పాడై పోతాయని వాళ్ళు ఫ్రిజ్జు లో దాచుకుంటే ఎత్తుకొచ్చుకున్న కూరగాయలు గుర్తుకొచ్చాయి. దేవుడిచ్చిన కాసిన్ని తెలివి తేటలతో పరిస్థితిని సాయంత్రం దాకా విశ్లేషిస్తే.. బయటకెళ్ళి తినాల్సిందేనని తేలిపోయింది. ఇక ఆలస్యం చేయలేదు ..

జుయ్య్ మని బయటకి పరిగెత్తాను ..
.
.


=====================================================

కుక్కకి మనసు విరిగిందీ అదే ఆదివారం.. వీధిలో ఎవరూ లేరు.. జరిగిన యానువల్ ఎప్రైసల్ లో ప్రాజెక్ట్
లీడ్
పడేసిన రేటింగ్ నోటిక్కరుచుకుని ఎక్కడికో బయలు దేరింది. లీడ్ మొరిగితే పడింది , ఆన్ సైట్ ఇవ్వకపోయినా సర్దుకుంది.. అర్ధ రాత్రి అపరాత్రి లేకుండా ఓటీ చేసింది.. అడక్కపోయినా ఓవర్ యాక్షన్ చేసింది.. అయినా ఏమిటీ దరిద్రపు గొట్టు రేటింగ్ ..? పైగా "కుక్కా - పిక్కా" ప్రాజెక్ట్ నావల్లే పోయింది అంటాడా....

నో... నో... నో.... ఒక్కసారి గట్టిగా మొరిగింది.. ఎదురుకుండా ఏదో సినిమాలో రమణ గోగుల మ్యూజిక్ కి చక్రి పాడిన పాట పాడుకుంటూ వస్తున్న నాలో తన బాసు కుక్కని చూసుకుంది...

నేను.. కుక్క.. బాసు కుక్క...
కుక్క..బాసు కుక్క... నేను..
బాసు కుక్క... నేను..కుక్క..

ఇలా అర నిమిషం ఫోటోలు మారాకా.. కచక్ కచక్ అని ఎక్కడో శబ్దం వినపడింది.. ఎక్కడా..? అని కన్ఫర్మ్ చేసుకునే లోపలే కళ్ళలోంచి నీళ్ళు, హైదరాబాద్ లో వరదనీరులా బయటకొచ్చేస్తున్నై ..

"మమ్మీ..." గట్టిగా ఒక అరుపు.. చూస్తే మా ఇంటి గేటు దూకి లోపల పడ్డాను..

======================================================కళ్ళు తిరిగినట్టున్నై.. కొంత సేపు నాకేమీ తెలీలేదు..

అమీర్ పేటలో ట్రాఫిక్కు లేనట్టు.. , మా వీదిలో కుక్కల్లేనట్టు , మధ్య రిలీసైన ' A '
సినిమాలో హీరోయిను నన్ను ప్రేమిస్తున్నానని పబ్లిక్కు లో చెప్పినట్టు.. (వచ్చింది ఇంగ్లీష్ సినిమా హీరోయిన్ ) యేవో పాడు కలలోచ్చాయి..

రియాలిటీ లోకొచ్చాకా ఇప్పుడు దాన్ని తిట్టాలి అని గుర్తుకొచ్చింది.. హీరోయిన్ ని కాదు కుక్కని

చీ చీ చీ... సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని జాలి కూడా లేకుండా ఎడా పెడా కరిచి పడేసింది.. పాడు కుక్క.. దరిద్రపు కుక్క.. దొంగనా.. కుక్క...

నేనే దాని ప్లేసులో ఉంటేనా.. ఇలా కరుస్తానా.. ? నాకు మాత్రం బాసుల్లేరా.. అప్రైసల్స్ కాలేదా..
ఆగు ఆగు ... నేను కుక్కతో పోల్చుకుంటున్నానేంటి..? ????????

తెగిన చెప్పుతో టపా టపా రెండు దెబ్బలేసుకున్నాను...

equation derived : కుక్క కాటు + చెప్పు దెబ్బ.. = ఒక్కరికే (రెండూ నాకే)

ఇంతలో ఎవరో తలుపు తట్టారు..

==========================================

చెప్పు పక్కన పడేసి తలుపు తెరిచి చూసా. పక్కింటావిడ!

(కొంప తీసి వాళ్ళాయన అరువిచ్చినవి అడగడినికి కాని రాలేదు కదా.. ఉన్న పళంగా ఆస్తులెక్కన్నించీ అమ్మాలీ ,, ?) ఆలోచనలో పడ్డా..

"బాబూ ఇంట్లో మనుషులు ఎవ్వరూ లేరా..?"

చెట్టంత మనిషిని నేనుంటే ఎవ్వరూ లేరంటుందా...? నాకూ అనుమానమొచ్చింది. అవును మధ్య అద్దంలో చూస్కోక చాలా కాలమయింది.. .. వెంటనే పరుగెత్తుకెళ్ళి అద్దం ముందు పది పాతిక భంగిమలు ప్రయత్నం చేసాక... నేను నేనే అని కన్ఫర్మ్ చేసుకుని తలుపు దగ్గరకి వచ్చా...

ఎంత
మదమెంతఅహమెంతకండకావరము?

అరిచేద్దామనుకున్నాను.. కాని పొద్దున్నే మునిసిపాలిటి పంపు దగ్గర నీళ్ళు పట్టుకునే పోటీలో ఆమే నెంబర్ వన్.

equation derived : నెంబర్ వన్ = బలమెక్కువ + అంతకు మించి నోరెక్కువ

అది గుర్తుకొచ్చిన నాలో ఎక్కడ లేనీ వినయం బయలు దేరింది "లేరండి .. చెప్పండి ఏం కావాలి ?"

"బయటకి వెళ్తున్నాను.. కొంచెం మా చంటాడిని చూస్కో అంటూ బుజ్జిగాడిని మా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయింది"

పిలిచినా వినిపించుకోకుండా వెనక్కి తిరిగి చూడకుండా అవుటయిన యువ రాజ్ సింగ్ పిచ్చి మీంచి వెళ్లిపోయినట్టు... విసురుగా వెళ్ళిపోయింది..

==========================================

వాడు బుజ్జిగాడు కాదు నన్ను టార్గెట్ చేయడానికి వాళ్ళ అమ్మ నా మీద వదిలిన "గుణ శేఖర్ సినిమా" ..

హీరో "ఉపేంద్ర " కొచ్చిన బూతుల కంటే ఎక్కువ బూతులు .. తెలుగు సినిమా హీరో కంటే ఎక్కువ స్టంట్లు.. అన్నిటికీ మించి మాంచి తమిళ సినిమాలో ఉన్న ఏడుపు .. వీడి ప్రత్యేకత.


ఒకటా రెండా.... కూర్చుంటే కాళ్ళ మధ్యలో దూరిపోతాడు.. నడుస్తుంటే కాళ్ళకడ్డంపడతాడు, అటూ ఇటూ అయితే వెల్లకిల్ల పడతాడు.. వాడు పడితే ఏడుస్తాడు .. ఏడిస్తే..వాళ్ళమ్మ వస్తుంది.. ఇక ఇలాకాదని వాడ్ని కుర్చీకి కట్టేసి కార్టూన్ చాన్నెల్ తగలేసి ..నేను పెయింటింగ్ వేయడం మొదలు పెట్టాను..

నాలో సృజనాత్మకతని మొత్తాన్ని .. జోడించి, హెచ్చవేసి, బాగించి, గుణించీ ఒక అద్భుతమైన కళా కండం గీసాను.అది నాబోమ్మే .. పోయిన సారి ఓటరు గుర్తింపు కార్డులకోసం తీయించుకున్న ఫోటో చూసి గీసాను దీన్ని...
ఎంత బాగా ఉంది పెయింటింగ్.. నిజంగా కంటే బొమ్మలో ఎంత బాగున్నాను..!? మ్మ్ మ్మ.. ముద్దొచ్చేస్తోంది..

ట్రింగ్ ట్రింగ్..ఎవరో వచ్చారు . బొమ్మ పక్కన పెట్టి డోర్ తెరవడానికి వెళ్ళాను..

ఇంతలో కరెంటు పోయిందని పక్క గది నుండీ కుర్చీ ఈడ్చుకొచ్చేసాడు బుజ్జిగాడు. నేవేసిన పెయింటింగ్ చూసి చుచ్చు పోసి కుక్క కుక్క .. కుక్క .. అని అరవడం మొదలు పెట్టాడు.

నా గుర్తింపు కార్డు పాడు చేసినందుకా.. నన్ను కు.. కు..కుక్క అన్నందుకా.. ఎందుకు ముందు ఏడవాలో తెలీక గొంతు దాక వచ్చిన ఏడుపుని అక్కడే ఆపేసుకున్నాను.. నువ్వూ మీ అమ్మ అంత అవుతావురా బుజ్జిగా అని ఆశీర్వదించి వచ్చిన వాళ్ళ నాన్నకిచ్చి పంపేసాను.. .

equation derived : effect @ బుజ్జిగాడి అల్లరి is> effect @కుక్క కాటు

===========================================

ఇక ఇలా కాదు.. మనసు శాంత పరుచుకోవాలంటే.. entertainment కావాలంతే.. అని బుజ్జిగాడొదిలేసిన టీవీ ముందు కరెంటు వచ్చేదాకా కూర్చున్నా.

నా అభిమాన సీరియల్ "ఆరేసుకుందాం రా.." నూట యిరవయ్యారో ఎపిసోడుకి మొత్తానికి హీరోయిను అక్షత, ఉతికిన బట్టలు ఆరేసింది.. అవి ఆరి, సర్ది, బీరువాలో పెట్టడానికి ఎంత లేదన్నా.. మరో రెండువందల పాతిక ఎపిసోడులు చూడచ్చన్న దీమాతో ఉన్న నన్ను.. తరువాత సీను గుండెల మీద కొట్టింది.. ఆరేసిన బట్టలు.. కుక్క ఎత్తుకెళ్ళి పోయింది.. దారుణం చూడలేని నేను ఛానల్ తిప్పేసుకున్నాను..

చానల్లో హీరోయిను 'అమల' ఇంటర్వ్యూ . నాకు తెలీకుండానే ప్రోగ్రాం నెక్స్ట్ బట్టన్ మీదకి నా వేలు వెళ్ళిపోయింది..

ఇప్పుడు జెమినిలో బయోస్కోప్ ప్రోగ్రాం వస్తోంది.. హాలివుడ్లో రికార్డుల వర్షం కురిపించి, కనీ వినీ ఎరుగని గ్రాఫిక్స్ మాయ జాలంతో, మునుపెన్నడూ చూడని భారి యాక్షన్ చిత్రం "వీధి కుక్క ". తెలుగు లో తప్పక చూడండి . "వీధి కుక్క, వీధి కుక్క, వీధి కుక్క " అని అక్క చెపుతోంది..యేవో రెండు మూడు భయపెట్టే సినిమాల ప్రోమోలు వేసాక ముచ్చట కూడా అయిపొయింది..

ఇంతలో నాన్న గారు ఫోన్ చేసారు..

"ఏరా ఎక్కడున్నావ్?"
"ఇంట్లోనే వున్నాన్ను.. నాన్న గారు "

"నీకోసం ఎవరో టీవీ వాళ్ళు ఫోన్ చేసారు"
"అవునా.. ? నాకు తెలుసు నాన్నగారండి మీరు నాగురించి గర్వ పడే రోజొస్తుందని"

"నీ బొంద ! పాడు పని చేసావ్? నువ్వెకడున్నావని అడిగి అడిగి చంపుతున్నారు "

"మీ మీద ఒట్టండీ .. నేను కుక్కనీ ఏమీ చేయలేదు.. "

"పెట్టేయ్ ఫోను వెదవా.. "
ట్రింగ్ ట్రింగ్.. ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు.
=====================================================

తలుపు తీయంగానే "వీధి కుక్క అరాచకం " "శాంతి నగర్ లో నెలకొన్న అశాంతి " అంటూ తెలుగుని మాట్లాడుతున్నట్టు కాక.. వాంతి చేసుకుంటున్నట్టు ఎవరో ఒకామె తోసుకుని లోపలి కొచ్చింది.. ఆమె తో పాటూ 3/4 షార్టు, అర కొర గొరిగిన గడ్డం, లుంబుం చొక్కా.. వేసుకుని ఒకడు తగలడ్డాడు..


"మీ పై జరిగిన అరాచకానికి మీరు ఎలా స్పందిస్తున్నారు ? మీకిదే మొదటి సారా ..? అసలెందుకిలా జరిగింది ? దీనిలో తప్పెవరిది అని మీరు భావిస్తున్నారు.. ? "

అని నన్ను లేని సిగ్గు గుర్తు చేసుకునే ప్రశ్నలడిగి నేను పూర్తి గా ఏడిచే లోపే కెమెరా కి అడ్డుగా నిలబడి .. "మీరేమంటారు ? మీరు ఎవరిని సమర్ధిస్తారు? వెంటనేXXXXXXXXకి SMS చేయండి " అని చెప్పి ఇంక చాలు రోజు కి అంది ..
3/4లాగు వాడు.. రేపు మళ్ళీ ఎమోస్తాం ఇప్పుడే మిగతాది కూడా షూటింగ్ చేస్కుని వెళ్లిపోదాం.. అంటున్నాడు.

బాబూ .. గ్లాసు మంచి నీళ్ళు యియ్యి. మేకప్ ఏమీ అక్కర్లేదు కానీ.. ఇలాంటి సీన్స్ కి బా సూటయ్యావ్.. ఏదీ ఓసారి ఇటు తిరుగు.. ఓసారి అటు తిరుగు... కుక్క కరిచిన కాలెత్తు.. అని..హెరాస్ చేయడం మొదలు పెట్టాడు..

కుక్క, బుజ్జిగాడు, టీవీ అన్నీ ఎత్తుకుపోగా నాలో మిగిలిన ఓపిక కాస్తా వీడు ఊడ్చేసాడు. ఇక నా నోటికొచ్చిన బూతులు తిట్టాను..

ఛీ ..మా వీధిలో నీకు ఓను హౌసు దొరక..! కుక్కలకీ నీకూ ఫ్యామిలీ ఫోటో తీయ్య..! బుజ్జిగాడు రోజూ మీ ఇంటికి రానూ..! మీ టీవీ లో కెమెరా యెనక కాక, ముందు నువ్వు కనపడ..!

కెమెరా వాడు.. యాంకరు.. ఇద్దరూ ఏమనుకున్నారో కానీ ఇంజక్షన్ చేయించుకోమని కొన్ని డబ్బులు జేబులో పెట్టి.. బుజం తట్టి ..మంచి నీళ్ళు తాగకుండా వెళ్ళిపోయారు..

Friday, November 19, 2010

ఎక్కడిదాకా వెళ్ళినా నీతోనే ఆగిపోతాను..


.


నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా..
నా నిశ్శబ్దానికి నీవే భావమైనట్టుంటుంది
చివరికి నా నీడకు కూడా కొత్త రంగులద్దినట్టుంటుంది

నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా..
నిద్దురలో మెలకువలు
మామూలే అనుకుంటాను
మెలకువలో మళ్ళీ మళ్ళీ వచ్చే కలలు
అలవాటు చేసుకుంటాను..

నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా..

ఏదో జరిగిందనుకుంటాను
గడిచిన కాసిన్ని క్షణాలను గంటలతో గుణించుకుంటాను
ఉన్నట్టుండి నవ్వేస్తాను
లక్షల సార్లు ఆశ్చర్యపోతాను
వేరు ఆలోచన మరిచిపోతాను
ఆకాశం కేసి చూసి ఆనందంతో అరిచేస్తాను
నీకు - నాకు మధ్య గీత చెరిపేందుకు...
వెంటపడుతున్న ఆశతో వేగంగా పరుగులు తీస్తాను
ఎక్కడిదాకా వెళ్ళినా నీతోనే ఆగిపోతాను..


అయినా అనిపిస్తోందీ..?
ఆదమరపునైనా.. మరపుకు రావుకదా..
నిన్ను గుర్తుకు తెచ్చుకోవడమేమిటని.. ?
నన్ను నేను ప్రశ్నించుకుంటే మళ్ళీ నవ్వొచ్చేస్తోంది..
ఇదేమిటని !

Monday, November 15, 2010

నువ్వు నేను - మనమిద్దరం

.తెలియలేదు కాని
ఒకరి చేయి పట్టుకుని మరొకరు.. మనమిద్దరం.. వీధి దీపాల వెలుగులో
అలా అలా ఎంతో దూరం ముందుకు వచ్చేసినట్టున్నాం

ఇప్పుడు ఎవరూ లేరు వీదిలో
కేవలం నువ్వూ నేను..
అంతే..


దారిపొడవునా
ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ నువ్వేదో చెప్పావు

నువ్వు - నేను కలిసిన మొదటి రోజుల గురించి చెప్పావు
నువ్వు నేనైన నీ గుర్తులను నాతో చెప్పావు

నేను లేనపుడు నీతో నువ్వేమిటో చెప్పావు..
నీకు నేనేమిటో చెప్పావు..

నామీద ప్రేమ దాచుకుని చూపించాలనుకున్న కోపం
వద్దు ఇక వద్దు, చాలు అనుకున్న దూరం
దూరంలోనే మళ్ళీ దగ్గరతనం
అన్నీ చెప్పావు..

చెప్పలేక ఆగిన క్షణాలు
చెప్పక దాచుకున్న మాటలు
నాకై నేనే చెప్పాలని నువ్వాపడ్డ ఇన్నాళ్ళు
అన్నిటి గురించీ చెప్పావు..
.
.
.
.
బహుశా నేను నీఅంతగా
నాలోని నిన్ను బయట పెట్టలేనేమో..?

ఇందాక అన్నాను
ఇక్కడెవరూ లేరని..
నిజానికి ఉన్నా నాకు అంతరం తెలీదు
ఇదే నేనూ నీకు చెప్పాలనుకున్నది..

నడిచే ప్రతి అడుగులో నా పక్కన నువ్వు...
నీ చేయి నా చేతిని తాకినప్పుడల్లా
నీ చిటికిన వేలు పట్టి నడుస్తానన్న నమ్మకం
ఏరోజుకారోజు జ్ఞాపకాల గదుల్లో దాచుకున్న ఆనందం
ఎప్పటికప్పుడు గుండెకి గొంతుకనిద్దామనే ఆత్రం

ఇవన్నీ నేనూ నీకు చెప్పలేదు...!

ఒక్క క్షణం నిన్ను దగ్గరకి తీసుకున్నాను..
గుండె చప్పుడు కు దగ్గరగా హత్తుకున్నాను
అంతే..

ఇక మాటల అవసరం మన మధ్య మళ్ళీ రాలేదు..

Wednesday, November 3, 2010

ఒక జీవిత కాలపు లేమి..!

"మనమ"నేదెపుడో మరణించింది
"నేను" పుట్టాక..

"నేను" కూడా కరువయింది..
మానమోదిలేసాక..

ఇంకేమి మిగిలింది..?
మనసు త్యజించాక..

చెప్పుకుంటే
సిగ్గుచేటు..
చెప్పుకోలేక రోకటి పోటు..
ఒక జీవిత కాలపు లేమి..!

Wednesday, October 27, 2010

ప్రయాణం
ఎక్కడి నుండీ ఎక్కడి వరకూ
ఎప్పటి నుండీ ఏనాటి వరకూ
ప్రయాణం?

కనిపించే సమాధానం కొంత వరకే..

చీకటి నుండి వెలుగు మీదుగా చీకటి లోకి వెళ్ళే వరకూ
కన్నులు తెరచి రెప్పలార్పుతూ ..శాశ్వతంగా కనుమూసే వరకూ ..

ఎరుక లేక మొదలు పెట్టినా ఎదుర్కోక తప్పక..
చేసే..ప్రయాణం ఇది..

ఏళ్ళ కాలం దాటాక , వెళ్ళే క్షణాలు ఎదురు పడ్డాకా ఒప్పుకోక తప్పక..
పూర్తి చేసే..ప్రయాణం ఇది..

అప్పుడప్పుడూ
అక్కడక్కడా..
చేసొచ్చిన మజిలీలలో
మరువని మరువపు దండలు, వడలి పోయినా పరిమళిస్తూనే ఉంటాయి
మరువరాని రాకూడదని దండనలు, 'వాడి'పోయినా గాయాన్ని చేస్తూనే ఉంటాయి..

పరికిస్తే ... పరిశీలిస్తే..
అశ్రువుల ధారల కాలం
ఆకలి కాల్చే కాలం
ఎముకల భాధలు ఏకరువు పెట్టిన కాలం
స్థిరమైన ఆవ్రుతిలో అవి వచ్చి వెళుతున్నాయి అంతే..
వాటికి స్థిరత్వంలేదు..నాతో వుండవు.. చూసి పోతాయంతే..
బహుశా.. వాటి ప్రయాణపు ప్రణాళికలో నాకిచ్చిన ప్రాముఖ్యత అంతే.. కాబోలు..

నాకోసమని తోడు..
ఎవరో ఉన్నారని అనుకుందామని అనుకుంటూ వుంటాను
కానీ ఒక్కడినే ఎక్కడికో వెళుతుంటాను..

కారణం?

పరిచయాల పరంపరలో
ఇష్టా ఇష్టపు వ్యక్తి విశేషణలో
వదిలేసినవి కొన్ని
వదిలి పోనివి కొన్ని
కొన్ని 'కల'వని క్షణాలు
కొన్ని 'కధ'లని క్షణాలు


చెప్పుకోవడానికే కాని చేసిన ఇంత ప్రయాణం..
చేతికందిందెంత...? ఇంతే!
తట్టుకొనొచ్చిన రోకటి పోట్లు.
దాటుకొచ్చిన మైలు రాళ్ళు
అప్పుల, తప్పుల, జబ్బుల నొప్పులు..

ఏమని చెప్పను ఇది?
జీవితం..

మిగిలి పోయిన నేను మళ్ళీ మిగిలి పోతున్నాను..

Monday, October 11, 2010

నా కధ పేరు "మనిషి"..

ఆలోచనలెన్ని?
ఆలోచనంతారాలెన్ని?
లెక్కలేనన్ని...
లెక్కకు రానన్ని..
అన్నీ నావే..

ఆశయాలు..ఆశలు నావే..
స్వల్ప కాలపు ఏమరపాటున, ఆకర్షణలూ నావే..
వెనువెంటనే సంఘర్షణలూ నావే..

నిజమేమో అనిపించేంత భ్రమ!
భ్రమని భ్రమింపజేసే నిజమూ!
ఒకటి తారసపడి వెళ్ళిపోతుంది
మరొకటి నన్ను ఉలిక్కి పడేట్టు చేస్తుంది..
.. రెండూ నావే..!

సంఘమనే ..సంఘీభావమనే..
మతమనే .. మానవతావాదమనే..
చించుకునరిచే గొంతుకలు నావే ..
నోటుకు.. మాటకు..
జడిసి సత్తువకు ..
నొక్కుకు పోయే కుత్తుకలూ నావే..

భారమని బ్రతుకుని దించేద్దామనుకుంటాను..
మళ్ళీ భుజానికెత్తుకుంటాను..
ఓపికలేనితనం నాదే..
ఓటమినొప్పనితనమూ నాదే..

నిదురిస్తున్నప్పుడు..నిదురిస్తున్నాననుకొన్నప్పుడు
మేల్కొన్నప్పుడు .. మేల్కొన్నాననుకొన్నప్పుడు
ప్రతి స్థితిలో జీవిస్తున్నప్పుడు..
ఏది కాను నేను ..
ఎక్కడ లేను నేను..

నాది అని చెప్పుకునే, నడిపించే నా కధలో,
నేనే కధానాయకుడను
నేనే నా నాయికను
నేనే నా సహ నటుడను
నేనే నా కధా వస్తువును ..
ఒక్కో అధ్యాయానికి జత చేరే మలుపును ..నేనే

ఇంతకీ చెప్పలేదు కదూ..!
నా కధ పేరు "మనిషి"..

Saturday, October 2, 2010

ఐ లవ్ యు

వీధి రెండుగా చీలిపోతోంది..ఉదయాన్నే పనుల్లోకెళ్ళేవాళ్ళు.. స్కూలుకెళ్ళేవాళ్ళు..పక్క వూరు వెళ్ళేవాళ్ళూ ఇలా అందరితో ఇప్పుడిప్పుడే రోడ్డులో రద్దీ పెరుగుతోంది.. అక్కడే వీధి చివర చిన్న బస్సు షెల్టర్ లో ఇద్దరు నిలబడ్డారు..ఒకళ్ళు బైకు మీద కూర్చుని కునికి పాట్లు పడుతోంటే.. మరొకళ్ళు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుంది..

రేయ్ .. వస్తుందంటావా...? వస్తే ఏం చెప్పాలి..? సరిగ్గా చూడు బానే వున్నాగా ? జుట్టు.. డ్రస్సు.. బానే ఉన్నట్టే గా.. చెప్పరా.. చెప్పరా..

..... .. ఆవలిస్తూ రెండో వాడు మొదలు పెట్టాడు.. కుమారూ ఎన్నిసార్లు చెప్పాల్రా నీకు.? విసుగు రాదు..? సిగ్గు లేదూ ? ఇలాగే అడిగి అడిగి రాత్రంతా నా నిద్ర చెడగొట్టావు.. కనీసం పొద్దునైనా పడుకుందామంటే పదిగంటలకొచ్చే అమ్మాయి కోసం భూమి పుట్టక ముందు నన్ను పట్టుకొచ్చేసావు.. ఇదిగో ఆఖరి సారి చెప్తున్నా.. అమ్మాయి వస్తుంది. కష్టపడి రాత్రి బట్టీ పట్టిన నాలుగు ముక్కలు చెప్పు అంతే..చాలు.. ఇంకా చెప్పడానికేముంది, నువ్వేసుకున్న చొక్కా నాదేగా.. చూడ్డానికి బానే వున్నావు.. ఇంతకు మించి మళ్ళీ అడిగితే నేను గోదారిలో దూకుతానంతే..

" అయితే సరే.. ఒరే సంతోషు.. "ఎస్" అంటుందిగా.. ? అని మళ్ళి అడిగాడు.."

సంతోష్: -------------------------------------------

కుమార్: రేయ్.. రేయ్..చెప్పరా..

సంతోష్: -------------------------------------------

కుమార్: అది సరే కానీ నీకు మమత కి ఎక్కడ దాకా వచ్చింది..?

సంతోష్: నన్ను నా గర్ల్ ఫ్రెండు వదిలేసే దాక.. ఆమె బాయ్ ఫ్రెండ్ ని వదేలిసే దాకా...!

కుమార్: అదేంట్రా?

సంతోష్: మరి ఏంటి రా.. నా బొంద.. నీకెన్ని సార్లు చెప్పాను..తన పేరు మమత కాదురా.. నమ్రత..అని ఇంకోసారి పేరు మార్చి అడిగావంటే గోదారి లో దూకేస్తానంతే..

కుమార్: సరే సరే.. రాత్రి రాసుకున్నది, ప్రాక్టీసు చేసింది ఒక సారి చెప్తా ఎలా వుందో చెప్పు...

సంతోష్: కానీ..రా కానీ..

కుమార్: సాధనా ..! నిన్ను చాల రోజుల్నించి చూస్తున్నాను.. చాలా ప్రేమిస్తున్నాను.. చాలా ఇష్ట పడుతున్నాను.. చాలా చెప్పాలనుకున్నాను.. చాలా...

సంతోష్: చాల్రా బాబు చాలు "చాలా" అయ్యింది.. ఏంట్రా ఇది.. ఇలా చెప్తే అమ్మాయే కాదు.. అమ్మాయీ కాదు.. కనీసం సాటి మగాడ్ని నేను కూడా వొప్పుకోను.. రాత్రి అనుకున్నదేంటి ఇప్పుడు నువ్వు చేసేదేంటి..?ప్రోపోస్ చేసేటప్పుడు ఎలా చెప్పాలి..? "పగలూ రాత్రి .. నీ ఆలోచనల్లో మునిగి పోయాను.. నీ తర్వాత ఇంకెవ్వరినీ చూడలేదు.. కొత్త లోకానికి తీసుకు పోయావు.. " ఇలా వుండాలి.. పొగుడుతూ ఉండాలి.. పొయెటిక్ గా వుండాలి.. పడి పోవాలి.. అర్ధం అయ్యిందా..?

కుమార్: బాగా అర్ధం అయ్యింది రా .. ఇప్పుడు చూడు ఎలా రెచ్చి పోతానో.. పిచ్చెక్కిస్తా.. విని చెప్పు ఎలా వుందో..
------------------------------------------------
నీకేం..!
నవ్వు నవ్వి ఊరుకున్నావు
కాస్త కన్నెగరేసి జారుకున్నావు
నన్నేమో ఊహల కొదిలేసావు

అదిగో అప్పటినించీ
మొదలయింది..

చూసి చూడకుండా చూపు చూస్తావే
దాని కోసం ..

కనపడనీయ కూడదని తడబాటును దాస్తావే
దాని కోసం..

నీ వెనుకే నే వున్నానని ఆగి ఆగి నడుస్తావే
దాని కోసం..

నన్నాపుకోలేక నిన్ననుసరించడం

ఏమనవు
అననీవు..

చేరువ కానిచ్చి
చొరవ తీసుకోనీవు..

ప్రశ్నల్లే కనబడతావు
జాబూ నీవేననిపిస్తావు
అర్ధం కావు...
------------------------------------------------

ఎలా వుంది.. ?

సంతోష్: ఇది "గురివింద గింజ" గాడి బ్లాగులోది కదా.. వాడు రాసింది వాడికే అర్ధం కాదు.. ఇంక అమ్మాయికేమర్ధమౌతుంది.? ఇవన్నీ చదువు కోవడానికే కాని చెపితే .."బ్రిటన్ వెళ్ళిన వాడు, ఇంగ్లిష్ రాక..ఫ్రెంచ్ ని జర్మన్ లో mix చేసి తెలుగులో మాట్లాడినట్టుంటుంది.. "

కుమార్: ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు....!!!!

సంతోష్: నువ్విలాంటి టాలెంట్లు ప్రదర్శిస్తే.. అమ్మాయి కూడా అదే అడుగుతుంది..ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు.... అని..!!

కుమార్: అయితే ఏం చెయ్యను ? డాన్సులు .. పాటలు గట్రా.. ట్రై చేయనా.. (ఉత్సాహం గా అడిగేసాడు )

సంతోష్ : నన్ను కొట్టిచ్చేదాకా వూరుకోవెంట్రా నువ్వు..? ఇలాంటి పనులు చేస్తే గోదారిలో దూకేస్తానంతే..
.
.
.
సరే.. సరే.. అదిగో తను వస్తోంది.. వెళ్ళు వెళ్ళు..


కుమార్ ఆమె వెనుక బయలు దేరాడు..
ఏమని పిలవాలి? పేరు పెట్టి పిలవాలా? హాయ్ అంటే? ఎక్ష్క్యుస్మీ? (తనలో తాను..)
కుమార్ అడుగులు ఆమెనే అనుసరిస్తున్నై.. ఆమె కూడా తన వెనుక ఎవరో వున్నారనే గమనించి నడుస్తున్నట్టుంది.

ఎలాగో ధైర్యం తెచ్చుకుని, సాధనా..! అని పరిచయమున్న వాడిలా పిలిచేసాడు..

మె అక్కడే ఆగింది.. తరువాత అతని మాట కోసం ఎదురు చూస్తున్న దానిలా..

" లవ్ యు" - చెప్పేసాడు..

ఆమె తన అడుగులు కొనసాగించింది

"చాలా అనుకున్నాను కాని ..ఇంకేం చెప్పాలో ..ఎలా చెప్పాలో తెలియలేదు.. కాని నాకు తెలిసింది నీకు చెప్పాలనుకుంది మాత్రం ఇదే.. ఒక పరిచయం లేని అబ్బాయి వచ్చి ఇలా మాట్లాడితే ......" ఇంకా ఏదో చెప్ప బోతున్నాడు

ఆమె తన అడుగుల వేగం పెంచింది..

కుమార్ ఆగిపోయాడు.. చూస్తుండగానే ఆమె అతని కళ్ళ నుండీ దూరంగా వెళ్లి పోయింది..

వెనకనే సంతోష్ వచ్చాడు.. ఏరా చెప్పావా?

కుమార్: చెప్పాను..

==========================================

రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు..

సంతోష్: ఎంతసేపురా ఎదురు చూసేది ? ఏదో నీ పేరు చెప్పుకుని రెండు గ్లాసులు తాగుదామని నేను అనుకుంటే.. నువ్వేమో అలా రకంగా మొఖం పెట్టి... ఆలోచిస్తున్నావు.

తప్పు చేసానేమో రా.. అన్నాడు కుమార్..

"దేని గురించి?"

రోజు ఉదయం .... అంటూ ఆపేసాడు కుమార్..

నేనెవరో తెలీదు .. ఎలాంటి వాడినో తెలీదు..తను నన్ను కనీసం చూడలేదు.. అలాంటిది నేను ఎలారా అమ్మాయి దగ్గరకెళ్ళి లవ్ యు అని చెప్పేసాను.. పైగా తననించి కూడా అదే ఆశించాను.. స్టుపిడిటి ప్యుర్లీ ..స్టుపిడిటి. నీకు తెలీదు. నువ్వు చూడలేదు.. బెదురుతో తను వేగంగా వేసే అడుగుల చప్పుడు .. ఆఖరి సారి ఆమె నా కళ్ళలోకి చూసిన చూపు, ఇంకా నాకు స్పష్టంగా తెలుస్తున్నై.. చెంప మీద కొట్టినట్టునై..

"చెంప ఏంటి చెప్మా..." నవ్వేసాడు సంతోష్. ఎరా నీకు గాని చుక్క పడకుండానే క్కిందా.. చాలా రోజులనుండి చూస్తున్నావు, అమ్మాయి నచ్చింది, అదే విషయం ఆమె తో చెప్పావు.. దానికి ఎందుకురా ఇంత హడావిడి చేస్తున్నావు...

నేనూ అదే చెపుతున్నా.. ఎంత సేపూ ఎలా impress చేద్దామా.. ఎప్పుడెప్పుడు express చేసేద్దామా అనే హడావిడి చేసాను..
ఊహల్లో తేలి పోయాను..తన గురించే ఆలోచించాను కానీ ఇవన్నీ నావైపు... నావైపు నుండే ఆలోచించాను..

"నువ్వేమి చెప్పదలుచుకున్నావో నాకైతే అర్ధం కాలేదు. ప్రేమించానని చెప్పడంలో తప్పేముంది .. సిల్లీ గా వుంది.." అంటూ సంతోష్ గ్లాస్ చేతిలోకి తీస్కున్నాడు.

"చెప్పడంలో తప్పు లేదు. ఎప్పుడు చెప్పాను. ఎలా చెప్పాను అనే దానిగురించే నేను మాట్లాడేదంతా..
కొంచెం ODD గా ఉన్నా ఓసారి ఆలోచించు. నీ మానాన నువ్వు పని మీద వెళ్తోంటే ఎవరో పిలిచి లవ్ యు అని చెప్పి వెళ్లి పోతే..రోడ్డు మీద నీ పరిస్తితి ఏంటి..? "

హ్హ. అమ్మాయి బాగుంటే వెంటనే అవునంటాను అంతే..దీనికేముంది..

"కొంచెం సీరియస్ గా ఆలోచించి చెప్పు "

మ్మ్..ఒకే...అమ్మాయి బిహేవియర్ చూసి బాగుందనుకుంటే అవునని చెప్తాను..

"కొంచెం సీరియస్ గా ఆలోచించి చెప్పు "

తెలిసినమ్మాయా.. కాదా.. మనకి suite అవుతుందా లేదా అని తెలుసుకుని ఏమైనా చెప్తాను..

"కొంచెం సీరియస్ గా ఆలోచించి చెప్పు "

ఫ్యూచర్ గురించి ఆలోచించి తరువాత ఒకే అంటాను.

"మరి వీటిలో ఒక్క ఆలోచనా అమ్మాయి చేయకూడదని నేను ఎలా expect చేస్తాను..? కనీసం నేను ఆమెకి ఒక్క అవకాసమైనా ఇచ్చానా?

I did not give her any scope... more over I put her in such an emabrassing situation ..


నువ్వన్నట్టు.. నేనేమీ సిల్లీ గా ఆలోచించడం లేదు.. ఆమె గురించీ ఆలోచించడం లేదు. ఆమె వైపు నుండీ ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను.. అంతే.." తనకీ నాగురించి తెలుసుకునే .. అర్ధం చేసుకునే అవకాశం.. సందర్భం ఒక్కటీ కూడా ఇవ్వలేదనే అంటున్నాను అంతే..

సంతోష్ చాలా రిలాక్స్డ్ గా వెనక్కివాలి అన్నాడు.. కాలం లో వున్నావు రా.. కాలం అమ్మాయిలు ఎంత స్పీడు గా ఉన్నారో తెలుసా..?వాళ్ళు అలాంటివి చాలా లైటు గా తీస్కుంటారు.. నేనున్నాగా మాట్లాడతా..

"థాంక్స్ రా.. నీలా మాట్లాడేవాళ్ళు లేకే నా భయమంతా.. అన్నట్టు మీ ఇంట్లో ఎంత మందిరా ఉండేది ?"

తెలియనట్టు అడుగుతావే..అమ్మా, నాన్న, నేను ఇంకా చెల్లాయి..

"సరే ఈరోజు వచ్చినట్టే.. కొంచెం రేపూ వచ్చావంటే.. మీ చెల్లికి ప్రోపోస్ చేస్తా.. తరువాత నువ్వు మాట్లాడుదువు గాని..ఏమంటావు..?"

సంతోష్ గ్లాస్ పక్కన పెట్టాడు..వేగంగా లేచి కుమార్ కాలర్ పట్టుకున్నాడు.. క్షణం లో ఎర్రబడ్డ సంతోష్ కళ్ళు తీక్షణంగా కుమార్ నే చూస్తున్నై.. ఏమాత్రం తడబడని కుమార్ "అర్ధం అయ్యిందా?" అనే ఎదురుప్రశ్న అడుగుతున్నట్టున్నాడు..

సంతోష్, కుమార్ కాలర్ వదిలేసాడు.. ఏమనాలో తెలీయడం లేదు. కళ్ళ చూపు నేల వైపే ఉంది .. ఒక్క సారి అతడి వైపు చూడడానికి దైర్యం చాలలేదు ..

"సారీరా" అన్నాడు..

"అదేంటిరా అంత ఆవేశపడ్డావు గోదారిలో దూకేస్తావేమో అని బయపడ్డాను "

సంతోష్, కుమార్.. ఇద్దరూ నవ్వుకున్నారు..

కుమార్: సరే రేపు పొద్దున్నే ఊరెళ్ళాలి.. తొందరగా కాని ..

చెరో గ్లాసూ అందుకున్నారు..
==========================================

పద పద రా తొందరగా.. ఆలస్యం అయిపోతోంది..ఏం తోలుడు ఇది..? ఇంకో అయిదు నిమిషాల్లో బస్సు..

"చూసావ్ గా.ఎలా వుందో ట్రాఫిక్..నన్నంటావే.. "అత్తననలేక మొగుడ్ని సాదించిందట వెనకటికెవరో.."

సరే సరేలే రా .. నా మొగుడా.. పోనీ..

అలాగే బండి మరో పది నిమిషాలు మెల్లగా పాకుతూ పోతోంది..

సరే నేను అడ్డదారిలో వెళ్ళిపోతాను.. ఇందులో నువ్వీదలేవులే..అంటూ బండి దిగి పరిగెట్టడం మొదలు పెట్టాడు..కుమార్

సంతోష్ రోడ్డుమీద అరుస్తున్నాడు..: " బస్సు దొరికాక మిస్డ్ కాల్ యివ్వు.. జాగ్రత్తరా డబ్బులేమైనా కావాలంటే ఫోన్ చెయ్యి"

అలాగలాగే.. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు కుమార్.

ఆదరా బాదరాగా పరిగెత్తి నందుకు , మొత్తానికి బస్సు దొరికింది.. ఎంత సేపయ్య మీకోసం చూసేది . పావుగంట ముందు బయలుదేరొచ్చుగా .. అంటూ కండక్టార్ కిందా మీదా పడుతున్నాడు.

ట్రాఫిక్ లో పొగ మూలాన మొఖానికి అడ్డు పెట్టుకున్న రుమాలు .. కంగారులో అలానే వదిలేసి ఉంచాడు కుమార్..

రుమాలు తీద్దామని అనుకుంటూ .. అనాలోచితంగా పక్కన చూసాడు..

విండో లోంచి బయటకు చూస్తూ "సాధన" కనిపించింది..

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
===========================================

Thursday, September 23, 2010

ఎందుకు?
తల్లి తండ్రులిచ్చిన ఈ జన్మ ఎందుకు?
భగవత్ ప్రసాదితమైన ఈ ఆయువెందుకు?
గురువులు అందించిన విద్య ఎందుకు?

పై మూడూ నాకున్న ముఖ్యమైన ప్రశ్నల్లో మూడు..
ఇంకా ఇలాంటివేవో 'ఎందుక'నే ప్రశ్నలే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదురవుతూ నన్ను పూర్తిగా ఆలోచనల్లో పడేస్తూ ఉంటై..ఒక ప్రశ్నకు సమాధానం దొరికిందనగానే మరో ప్రశ్న పుడుతూనే వుంటుంది..దొరికిన సమాదానం ముందు ప్రశ్న చిన్నదైపోతుంటుంది..అచ్చూ మనిషి కోరిక లాగా..

ఒక చిన్న ఉదాహరణ..
రోడ్డు మీద ఓ ముష్టి ఆయనని చూసి (వయసు దగ్గర దగ్గర యాభై పైనే వుంటుంది ) చాల బాధగా అనిపించింది..పక్కనే ఉన్న మా స్నేహితుడినోకడిని అడిగాను ఆ పెద్దాయనను చూపిస్తూ..'ఎందుకు' ఇలా అయిపోతారు అని ? అతడు వెంటనే అన్నాడు "ప్రేమించే వారు లేక" అని. ఆ సమాధానానికి అప్పటికి నేను సంతృప్తి చెందినా .. తరువాత మళ్ళి అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడల్లా నా ప్రశ్న పునరుద్భవించేది.. వీరి సమస్య వీరిని 'ప్రేమించే వారు లేకనా' లేక "వీరి పై వీరికి ప్రేమ లేకనా..?" అని..

================================

ఒక్కోసారి విపరీతమైన సంతోషమోచ్చేస్తుంటుంది.. అప్పుడనిపిస్తుంది 'ఎందుక'ని? మరోసారి దిగాలుగా ఉన్నా ఇదే ప్రశ్న.."ఎందుకని ?"...ఈ ప్రశ్న ఎక్కడ జనించిందంటే.. భావాల మూలం ఎక్కడని తెలుసుకోవాలని ఆకాంక్ష మొదలైనప్పుడు.. భావజాలమే మనిషి తత్త్వం. జీవితంలో ఎక్కువ సమయం వేరెవరినో అర్ధం చేసుకోవడానికే వెచ్చిన్చేస్తుంటాం.. మనల్ని మనం మరిచి పోతుంటాం.. అందుకే మనల్ని మనం మరింత అర్ధం చేసుకోవడానికే తరచూ ప్రశ్నించుకోవడం తప్పనిసరేమో అనిపిస్తూ ఉంటుంది..

ప్రశ్నలకందిన సమాధానాలు పరిపూర్ణంగా ఆ ఖాళీలని నింపనప్పుడు వాటిని వెలుగు లోనికి తీసుకురాక పోవడమే మంచిది. లేకుంటే ఈ సమాధానాలే సమస్యలవగలవు..

======================================

Purpose of life…

Purpose of existence…

Purpose of learning…


పైన చెప్పిన మూడు ప్రశ్నల గురించి ఆలోచించినప్పుడల్లా ఈ మధ్య దొరికిన ఒక సమాధానం.. "ధర్మం"..

మళ్ళీ ఏది "ధర్మం" అనే ప్రశ్న తలెత్తింది నాలో .. ఇది ఒక లంకె.. కొన సాగుతూనే వుంటుంది..

ప్రశ్నలు ఆలోచనాధారిత జనితాలు.. మనిషి ఆలోచనలు అనంతం, అందుకే ప్రశ్నలూ అనేకం..

మిత్రులారా ఇలాంటి ప్రశ్నలూ మీలోనూ ఉండి ఉండవచ్చు..కనుక మీనుండి కొంత తెలుసుకుందామనే ఈ టపా రాసాను..

ధన్యవాదాలు..
శివ చెరువు

Thursday, September 16, 2010

లేక లేక లేఖ, లేక


నేనూ చెప్పేద్దామనే చూస్తున్నాను
కానీ ఏం చెయ్యను?

కలిసి వున్నప్పుడు నాకు నేను గుర్తుండను
కానప్పుడు నీ ఆలోచనల్లో కలిసి పోతుంటాను

నీకూ నాకు తెలియదని కాదు..
ఇన్నాళ్ళ మన పరిచయం ఎప్పుడో స్నేహమనే తీరం దాటేసిందని

తెలియనిదీ కాదు ..
మరో ప్రయాణం మొదలై మరింత కాలం గడిచిందని..

ముందు నన్నే మాట్లాడమని నీవు సైగ చేసిన సంగతి
ఎన్ని సార్లు గమనించలేదు నేను?

అన్నానని కాదు కాని...
నా ఇన్ని ప్రయత్నాలకు నీవు మాత్రం నవ్వుకోలేదూ?

సరే ఇక..
ఊగిసలాటన నిద్దుర రాని ఈ రాతిరిని
మళ్ళీ రేపటికి రానియ్యకూడదని..

మన జ్ఞాపకాల గురుతులెన్ని తరచి చూసాను?
లేఖ లెన్ని రాసాను?

సిరా చుక్కలనెంత తీసుకున్నా కాగితం నిండనంటోంది
నాకూ చెప్పాలనుకున్నదేదో మిగిలే ఉంటోంది..

ఈ లోటు లెక్కల తిక మకలో ..
తడబాటులో ..

మళ్ళీ అనిపిస్తోంది
అయినా మన మధ్య ఇంతగా ఎదిగిన ఈ ప్రేమకి ఈ అక్షరాల అవసరం ఎంతుందని..?

అవునని..
కాదని..
నీవేమంటావు మరి?

Wednesday, September 8, 2010

గెలుపు వెనుక
ఎంత కాలం నీకోసం చూసాను?
ఎప్పుడో రేబవలు మరిచిపోయాను..

ఎంత దూరం నీకోసం ప్రయాణం చేసాను?
దిక్కులన్నిటినీ చుట్టి .. చుక్కలు లెక్క పెట్టాను..

ఇంకెంత సిద్దపడ్డానూ నీకోసం?
నావనుకున్నవి వదులుకునే స్థితి దాకా..
నేననుకున్నది మరిచే పరిస్థితి వచ్చాక ..

అయినా..
ఇంత జరిగినా..
ఆశ నిరాశల రూపాంతరాలకు ఒప్పుకోలేదు
ఎదురు చూపుల విధిలో విసిగి పోలేదు..
నీవే వస్తావని నేనాగిపోనూలేదు

రెప్పలారిపోతున్నా..
తెప్పరిల్లిపోతున్నా..
అడుగులు వేస్తూనే వున్నాను..
నీవైపే...

ఆఖరికి ..
నిన్ను చూసేటప్పటికి..
సంబరాలు చెయ్యలేదు
పది పది మందికి పరిచయం చేయలేదు
పదే పదే చెప్పుకోను ఆరాటమూ లేదు

క్షణం కేవలం ..
తడిచేరిన కళ్ళ లోంచి
అలా చూస్తుండి పోయాను..
మనసు నిండి మాటలు కూడా రాక
నిశ్శబ్దంగా నిలుచుండి పోయాను..

Sunday, July 18, 2010

నో 'మోర్' బ్లాగింగ్*

కొన్ని రోజులు .. నేను నా కొత్త చదువులకోసం (SAP - FI ) నా పూర్తి సమయాన్ని కేటాయించా వలసి వుంది. ఫీజు కూడా చాల ఎక్కువ గనుక..(More than 3 lakhs) మరో ఛాన్స్ తీసుకునే చాన్సు లేదు..

ఫోన్లు..ఫ్రెండ్సు..ఆటలు.. పాటలు.. సినిమాలు.. ఇంకా బ్లాగింగు.. అన్నిటికి కొన్నాళ్ళు విరామమివ్వక తప్పదు..

మిత్రులారా.. నేను నా పరిక్షలు (certification) పూర్తి చేసుకుని తిరిగి వచ్చాకా కలుస్తాను..

that's why no 'more' blogging*

*షరతులు వర్తిస్తాయి.. కొంతకాలం వరకే..

Sunday, July 11, 2010

భీమిలి కబడ్డీ జట్టు..చిత్ర సమీక్ష

ఎక్కువగా టైం లేదు కనుక త్వర త్వర గా రాసే ప్రయత్నం చేస్తా...

రోజు భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమా చూసా..

సినిమా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు తీసారు అనుకుంటా.. మొదలైపోయేప్పటికే పది నిమిషాల సినిమా అయిపోయింది.

హీరో పాత్ర ఉదాత్తమైన పాత్ర.. మంచివాడు డబ్బులు లేనివాడు.. వాడికో స్నేహితుల గుంపు ఎప్పుడూ కబడ్డీ ఆడే వాళ్ళు..ఒక్కోరిదీ ఒక్కో విధమైన జీవన శైలి.. అయితే అందరూ కబడ్డీ దగ్గరే కలుసుకుంటారు..విచిత్రమేమంటే వాళ్ళు అంతవరకూ ఒక్క కబడ్డీ పోటీలో కూడా గెలవలేక పోతారు..

ఆవూల్లో తిరనాళ్లు జరుగుతాయి.. అందులో రాజమండ్రి నుండి వచ్చిన అమ్మాయి హీరో (సూరి) ని ప్రేమిస్తుంది.. అలాగే హీరో కూడా..అదే తిరనాళ్ళలో జరిగే కబ్బడ్డీ పోటీలో పాల్గొనే అవకాసం సూరికి లభిస్తుంది.. అలా హీరో కబడ్డీ పోటీలోకి ప్రవేశిస్తాడు..

తరువాత కొంత కాలానికి రాజమండ్రిలో ఏవో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి అని జట్టు అక్కడికి బయలుదేరుతుంది.. అక్కడెంజరుగుతుందో అదే సినిమా ద్వితీయార్ధం.. ఇప్పటిదాకా కధ చెప్పినా అది మీరు చూసేటప్పుడు కధ ముందే తెలుసుకున్నానే అని అనిపించదు.. అది పూర్తి దర్శకత్వ ప్రతిభ..

హీరో హీరోయిన్ చాలా బాగా నటించారు.. కబడ్డీ కోచ్ పాత్రధారుడు సరిపోయాడు .. సినిమాలో హీరోకి హీరో అనే ట్యాగ్ ఎక్కడా తగిలించి ఎక్కువ తక్కువ వేషాలేయించలేదు.. కధలో పాత్రగానే సాగిపోతాడు.. అయితే చిత్రం తమిళ చిత్రరాజానికైనా remake కావచ్చు.. చాల సన్నివేశాలు తీసిన విధానం..అలానే అనిపిస్తాయి.. లేదా దర్శకుడు తమిళ దర్శకుడై వుండాలి..

"పద పదమని" (ఇప్పటికే టీవీ లో చూసుంటారు) అనే ఒక పాట చాలాబాగుంది.. దర్శకుడు కొన్ని కొన్ని సన్నివేశాలు చాల బాగాతీసాడు.. నటులనుండి నటన బాగా రాబట్టుకున్నాడు.. కొత్త నటులు చాలా మంది కనబడ్డారు..ఇందులో..హాస్యం బాగా పండింది..కొన్ని సన్నివేశాలకి జనాలు లేచి చప్పట్లు కొట్టారు.. కాని నేను అవి అన్నీ రిసివ్ చేసుకోలేక పోయాను.. ముఖ్యం గా సెకండ్ హాఫ్ చాలా బాగుంది.. అయితే సెకండ్ హాఫ్ కోసం మొదటి గంట కాస్త తట్టుకొని నిలబడాలి.. ఎందుకంటే.. సన్నివేశాలు సాగ తీసినట్టుంటాయి..కాని చిరాకు పెట్టావు.. ఒక్క విషయం ఏంటంటే.. నేటివిటికి మ్యాచ్ చేసుకోవడం లో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది.. కాని సెకండ్ హాఫ్ కి అంతా సర్దుకుంటుంది. క్లైమాక్ష్ ఎవ్వరూ ఊహించలేరు.. అది బాగుంది.. బాలేదు..రెండూను.. చూసి మీరే ఏదో ఒకటి నిర్ణయం చేసుకోండి..


సినిమా చాల నీట్ గా ఉంది.. ఫుల్ ఫ్యామిలి తో చూడొచ్చు..

ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా బాగుంది..నాకు నచ్చింది..అద్భుతమేమీ కాదు..వందరోజులు ఆడదు. కాని చూస్తే నిరాశ మాత్రం చెందరు.. మంచి సినిమా కోసం చూస్తుంటే.. ఆలోచించకుండా వెళ్ళొచ్చు.. సిడి రిలీస్ దాక ఎడురుచూడక్కర్లేదు..

Saturday, July 10, 2010

ఐ హేట్ లవ్ స్టోరీస్..
ఉదయం 8 కూడా కాలేదు.. ఎండ మండి పోతోంది...ఇప్పటికే బస్సు స్టాప్ లో నుంచుని అరగంట అవుతోంది..ఒక్క బస్సు లేదుకదా .. షేర్ ఆటోలకు కూడా దిక్కు లేదు ఇక్కడ.. పై పెచ్చు .. పనికి వెళ్ళేవాళ్ళు .. పని మీద వెళ్ళేవాళ్ళు.. పని లేని వాళ్ళు.. చాలా మంది ఎదురు చూస్తున్నారు.. కాస్త చెమట.. కాస్త చిరాకు... కలిసి ఆవరించాయి.

రోజు కూడా ఆఫీసుకు ఆలస్యమేనన్న మాట.. "నేను ఎక్కే రైలు ఎప్పుడూ అరగంట లేటు..." లాంటి edited సామెతలేవో గుర్తు చేసుకుని నన్ను నేను సర్ది చెప్పుకుంటున్నాను...

ఆహా... బస్సు వచ్చింది.. రావడం ఆలస్యం.. కండక్టర్ బస్సు లోపలి నిన్చ్చీ అరుస్తున్నాడు.. వెనకాల ఇంకో రెండు బస్సులు కాళీగా వస్తున్నాయమ్మా... అందులో ఎక్కండి...అంటూ..
అయినా ఇందులో ఎక్కుదామన్నా చోటేక్కడుంది.. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మాచ్ చూడ్డానికి వచ్చే వారందరినీ కలిపి.. నలిపి.. బస్సులో కూరినట్టుంది...పరిస్థితి.. దీంట్లో నన్ను ఉచితంగా తీసుకెళ్ళినా నేను రాను.. భీష్మించుకుని కూచున్నాను అంతే..

అలా ఆస్ట్రేలియా .. సౌత్ ఆఫ్రికా మాచ్ బస్సులు కూడా వెళ్ళిపోయాక కూడా ఇక్కడ crowd బానే మిగిలింది.

ఏమిటబ్బా అని ఆలోచిస్తున్న టైం లో ఎవరో నన్నే పిలుస్తున్నట్టనిపించింది...

సార్.. రండి సార్... ఆటో అతను పిలుస్తున్నాడు..

అంత మందిలో అక్కడ అతనికి నన్నే ఎందుకు పిలవాలని పించిందో !!!

ఆశ్చర్యపడడం మానేసి వెంటనే పరుగేట్టుకెళ్ళాను... "మెహిదిపట్నం వెళ్తుందా? "

ఎక్కండి సార్.. అని ముందు ఆల్రెడీ ఆరుగురు.. కూర్చున్న ఫోర్ సీటర్ ఆటోలో నన్ను ఎక్కించ ప్రయత్నం చేసాడు..

అయినా రామ్ గోపాల్ వర్మ సినిమాలో కామెడీ.. షేర్ ఆటోలో కూర్చోడానికి తగినంత చోటు ఆశించకూడదు..

నిజం అనుభవం లో ఉన్న నేను ఆలస్యం చేయకుండా వెంటనే ఆటోలో ఇరుక్కున్నాను..

ఆటో బయలు దేరింది.. గతుకుల రోడ్డు.. మూల (దాదాపు బయటకే ) వేలాడి వున్న నేను గతుకుల దెబ్బకి అబ్బా.. ఆ.. ఆ.. .. అన్నాను.. లోపల కూర్చున్న వాళ్ళు గోల పెడుతున్నారు.. తొందరగా పోనీవయ్యా అని ..

సాఫ్టువేరు రంగం కూలి ఏడుస్తుంటే.. జీతాలు పెంచమన్నాడంవీడిలాంటి వాడెవడో..

"ఊరుకోండి సొంత బండి.. కొంచెం రెండు నిమిషాలు అటో ఇటో.. మిమ్మల్ని నేను జాగ్రత్త గా తీస్కువెల్లిపోతాగా.."
అంటున్నాడు ఆటో కుర్రాడు..

దీనికి సౌలభ్యం .. శ్రమ తెలీకుండా తీసుకెల్తానంటూ పాటలు పాడడం మొదలు పెట్టాడు.. నాకు నేను విక్ర మార్కుడిలా.. అతడు నన్ను మోసుకెళ్ళే భేతాళుడులా కనపడుతుంటే.. క్షణం కళ్ళు నులుముకున్నాను..

అతను ఒక 22 - 23 ఏళ్ళ వయసు ఉన్నవాడు.. ఏంపాటలు కావాలండి..? అని అడిగాడు.. వెనకనించీ ఎవరో ఉత్సాహవంతుడు "రింగా రింగా రింగా..." అంటూ అరిచాడు.. కుర్రాడు అందుకున్నాడు..

ఎంత బాగా పాడాడో..!
పొద్దున్నే తాగే కాఫీ కప్పులో గుప్పెడు ఉప్పేసినట్టు..

వెనుక కూర్చున్నవాడేవడో రెండు వారాలుగా స్నానం చేసినట్టులేదు.. కడుపులో తిప్పేస్తోంది..

చెవులు మూసుకోవాలో.. ముక్కు మూసుకోవాలో..అనే ఆలోచనలో పడ్డా..

ఇంతలో ఆటో జాంమని స్పీడ్ పెంచాడు.. మళ్ళీ వెంటనే ఆటోలోంచి పడిపోకుండా నన్ను నేను కాపాడుకునే ప్రయత్నం లో పడి పోయా..

ఆటో అతనికి ఒకటికి పది సార్లు ఫోన్లు వస్తున్నై..స్టేజి స్టేజి కి దిగే జనాలు పెరిగి పోతున్నారు.. (ఒక్కో స్టేజికి ఒక్కొక్కళ్ళు..) చూస్తే మరెవ్వరినీ ఎక్కించుకోనూ లేదు.. బాబు నేను దిగి వెనక కూర్చుంటానయ్యా అంటే.. "అరె ముందు కావలసినంత పిలేసు వుంది.. ఏన్గులు కూడా సర్పోతాయ్ కూకో నేన్చెపుతా.. " అని లాగించేస్తున్నాడు.. "ఆటోవాడికి ఎక్కేవాడు లోకువని " మరో సామెత జత చేసుకుని .. వొళ్ళు జాగ్రత్త గా పెట్టుకుని కూర్చున్నా..

సరే.. ఆటో ముందుకు వెళ్తోంది..
ఎక్కడో అరకిలోమీటరు దూరంలో మొబైలు ఫోన్ చూస్కుంటూ .. తెల్ల డ్రెస్సు 'కీర్తి రెడ్డి' కనపడింది.. క్షణం నాలో 'పవన్ కళ్యాణ్' నిద్రలేచాడు..'తొలిప్రేమ' మొదలైంది..

నా మనసే సే సే.....సే సే.....సే సే.....

అమ్మాయి చూపులు ఆటో వైపే ఉన్నాయ్.. తను కూడా తొలి చూపులోనే నే నే నే ........... అన్నమాట.
చేయి అడ్డు పెట్టి.. ఆటో ఆపే ప్రయత్నం చేస్తోంది..

నేను వెంటనే, ఆపు ఆపు ఆటో వెనకాల ఖాళీఏగా ..వెనకాల ఎక్కిన్చుకుంటే బాగుంటుంది అన్నాను. నాకు బాగుంటుందని దాని అర్థం!

ఆటో ఆగింది.. ఆమె ఎక్కింది..

ఏంటి ఈరోజు ఆలస్యం? అడిగిందా అమ్మాయి..
ఉంటారుగా పనికి మాలిన వాళ్ళు.. ఎక్కుతారు.. ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు..నీసంగతేంటి ఒకటికి పది సార్లు ఫోన్ చేయక పోతే నిమిషం వెయిట్ చేయొచ్చుగా.. అన్నాడా ఆటో వాడు..

నేను : ? ! ... , ,,,@ %

ఆమె : ఒకడున్నాడు..మా పక్క వీధిలోనే ఉంటాడు..తెగ ట్రై చేస్తున్నాడు.. చూస్తాడు చూడూ కళ్ళు ఇంతింత చేస్కునీ.. అబ్బ.. ఇందాకటిదాక అక్కడే ఉన్నాడు.. వాడ్ని తట్టుకోలేకే నీకు ఫోన్ చేసాను.. పని పాడూ ఉండదు అమ్మాయిలు కనపడతే చాలు.. కనీసం ఆటో అయిన తోలాలన్న ఆలోచన లేదు వాడికి.. (ఆఖరిది సరసమన్న మాట..)

"ఒక్కసారి నాకు నేను రేర్ వ్యూ మిర్రర్ లో కనపడ్డాను.. .."

అబ్బాయిలన్నాక అలాగే ఉంటారులే.ఇంకేంటి..? అన్నాడు ఆటో వాడు..

"ఎంత జాలి హృదయం వాడిది.."

ఏముంది కాలేజీ లేదు ఏమీ లేదు.. IMAX లో టికెట్ బుక్ చేశా.. పద పోదాం..అందామె..

నాకు తెలిసిన తెలుగు హర్రర్ సినిమాలు, డైలీ సీరియళ్ళు.. అన్నీ రీళ్ళు వేసాకా ఇక అర్ధం అయిపొయింది..

అసలు "పవన్ కళ్యాణ్" నేను కాదు .. ఆటో అతను.. యురేకా ..! సృష్టిలోనే అతి పెద్ద రహస్యం కనుక్కున్నా..

మరి నేనేంటి..?? ! ... , ,,,@ %

అప్పటి దాక గమనించలేదు కాని.. డ్రైవరుకి అవతల పక్క కూర్చున్న మరో మహేష్ బాబు ..కూడా నేను కనుగొన్న రహస్యాన్నే కనుగొన్నాడులా.. ఉంది.. తట్టుకోలేక ఏడుస్తూ ఆటో దిగేసాడు..మరీ అంత సెన్సిటివ్ అయితే ఎలాగా..?

మీరూ దిగిపోతారా..? అడిగాడు ఆటో అతను..

లేదు నేను మెహిదిపట్నంలోనే దిగుతా.. అన్నా కచ్చితంగా..

సరే ఆటో ముందుకు నడుస్తోంది..

ఎన్నింటికి షో? అడిగాడు..
మధ్యాన్నం టు క్లాక్ షో చెప్పిందామె..

"నాకు పని వుంది.. నువ్వీరోజుకి కాలేజికి వెళ్ళు.. రేపు చూస్కుందాం.."
"లేదు నువ్వు రావాలంతే "
"చెప్పానుగా కొంచెం పని ఉందని.."
"నువ్వు రాకపోతే.. ఈయన్ని తీస్కుపోతా..అంటూ నావైపు చూపించింది.."

నాకప్పుడు అదేదో సినిమాలో చెప్పినట్టు మొహమాటంతో కూడిన సిగ్గువల్ల వచ్చిన గర్వం అంటే తెలిసి వచ్చింది..

"చెప్తే వినొచ్చుగా..."
"నువ్వే విను సినిమా అంటే సినిమా అంతే.."
"లేదు అర్ధం చేస్కో.."
"ఆలోచించు.. లేదంటే ఈయన రెడీ లా ఉన్నాడు..పట్టుకెళ్లిపోతా.. అని నావైపు తిరిగింది.."

మళ్ళీ నేను మొహమాటంతో కూడిన సిగ్గు.....................................................

కాని ఆటో అతను చిరాకుతో కూడిన విసుగు వల్ల వచ్చిన..............

"సరే.. సరే ...నువ్వేమంటే అదే.. మరప్పటిదాక ఏంచేద్దాం..?"

"చూద్దాంలే పద...వీలైతే ఈలోపు ఇంకో సినిమాకి వెళ్దాం.."

ఇంతలో మెహిదీపట్నం వచ్చేసింది.. నేను దిగిపోయాను..

వెళ్తూ వెళ్తూ అతనడిగాడు నన్ను.... ఏమ్మంచి సినేమాలున్నై?

నేను చెప్పాను.. " హేట్ లవ్ స్టోరీస్ "


సినిమా చూసినా ..! లోక్లాస్ హీరో . హై క్లాస్ హీరోయిన్ .. లేకపోతే.. హై క్లాస్ హీరో లోక్లాస్ హీరోయిన్...
ప్రేమించుకుంటారు.. సినిమా సూపర్ హిట్ .. వంద రోజులు నూట పాతిక సెంటర్లు.. పోనీ మిడిల్ క్లాస్ హీరోయిన్లు ప్రేమిస్తారా అంటే.. ప్రేమించరు* షరతులు వర్తించును..(*హై క్లాసు హీరో దొరికితే తప్ప..).. ప్రేమించినా పైకి చెప్పరు.. మరి మిడిల్ క్లాసు హీరో పరిస్థితి గురించి.. ఎవరూ పట్టించుకుంటారు.. సినిమాల్లోనూ ఛాన్స్ లేక.. నిజంగాను అవకాసం దొరక్క.. నాలాటి యువకులు.. యువకులని మర్చిపోయే పరిస్థితి వచ్చింది..

అందుకే . హేట్ లవ్ స్టోరీస్....

ఎదవది ఎవడో అరుస్తున్నాడు... ఎరెంజేడ్ మారేజేస్ ఉన్నైగా..అని..
"సచ్చినాడా.. నీ జిమ్మడిపోనూ.." (ఇప్పుడు నేను గుడుంబా శంకర్.. పవన్ కళ్యాణ్..)


.