Tuesday, December 29, 2009

తెలుగు సినిమాల్లో వెరైటీ

 • హీరో ఎక్కువ సినిమాల్లో పరమ పోరంబోకెందుకనో? (దర్సకుడేమో ప్రేక్షకుల నాడి పట్టుకున్ననంటాడు కొంపదీసిఇదేనా )
 • పాటల్లో ఉన్నట్టుండి పాతికేసి మంది సైడు డాన్సర్లు వచ్చేస్తారు ఎలానో? (హీరో సరిగ్గా స్టెప్పులు వేయకుంటే కవర్ చేయడానికి కామోలు)
 • వందమందిని హీరో కొట్టేస్తాడు వెను వెంటనే కులాసాగా డ్యూయెట్ సాంగ్ కి సిద్దమైపోతాడు. ఎలాక్ట్రాల్ , గ్లూకోస్ గట్రా తాగుతాడా ఏంటి?
 • నిర్మాతలు చాలా మంచోళ్ళా? ఎక్కువగా, సరైన బట్టలు కూడా లేని కట్టుకోలేని నటీమణుల్ని ఇతర రాష్ట్రాల్లో వెతికిమరీ తెస్తారు.. అయినా హీరోల పరిస్థితి కూడా అంతే ఉంది కదా.. ఎవరిననాలబ్బా?
 • సినిమా సంగీతం అంటే ? వంద రోజులు గుర్తుండేదని అర్ధం
 • విలన్ అంటే సినిమా క్లైమక్ష్ వరకూ ఉండి దెబ్బలు తినేవాడా? కధకి ఎవరో ఒకరు బకరా కావాలిగా అనుకోవచ్చు...
 • ఈ మధ్య సినిమాల్లో కెమెరా సరిగ్గా నిలబడ్డం లేదు ఎందుకు సుమీ? నటులేమైనా చేస్తే తన పని తానూ చేస్తుంది. ఎప్పుడూ తనే కష్టపడాలంటే ఎలా..
 • ఉత్తమ కుటుంబ కధా చిత్రమంటే ..? ఓ కుటుంబం తీసిన సినిమా అనే కదా ?
 • చిన్న సినిమాలు అంటే ? చిన్న చూపు చూడ బడే సినిమాలు అనుకోవచ్చేమో..
 • హాస్య నటులంటే ? మిగతా పాత్రల చేత "ఛీ.." "తూ.." అనిపించుకునే వాళ్ళు, చెంప దెబ్బలు తినేవాళ్ళు..
 • A రేటింగ్ ఇచ్చిన చిత్రాలంటే పెద్దల చిత్రాలేనా? పిల్లలు ఎక్కువ గా చూసే చిత్రాలకు కూడా అదే రేటింగ్ ఇవ్వచ్చు.. ఎందుకంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండు బ్లాకౌతుందో పిల్లలకి బాగా తెలుసు..
మొన్న ఓ స్నేహితుడంటున్నాడు నేనిక తెలుగు సినిమాలు చూడనని. ఇంకొకరు అంటున్నారు సినిమాలు వస్తున్నాయి కానీ కదిలించే సినిమాలు లేవని. చూడాలి అని అనిపించడం లేదు అని మరొకరు... ఇలా చాలా మంది సినిమా పై అసంతృప్తి వ్యక్త పరచిన వారే. గత కొన్నేళ్ళు గా ఫార్ములా పేరుతో పోటీ పడి మరీ తీస్తున్న తెలుగు సినిమా అదే మూస ధోరణి లో కొన సాగడం విచారకరం.

నోట్: సినిమా చూసి బాగుందో లేదో చెప్పడానికి సినిమా తీయడం రానక్కరలేదు

Monday, December 28, 2009

నేను మోసపోయానా?
నేను మోసపోయానా?
దయ చేసి అవునని చెప్పొద్దు

ఎందుకంటే నేను నమ్మాను..
మళ్ళీ మళ్ళీ నమ్మాను
గుర్తులేనన్ని సార్లు నమ్మి..
మాట పెగలక మిగిలిపోయాను

మిగిలిన కాస్త ఓపిక పోగేసి
సర్ది చెప్పుకున్నాను.

తెగిన ఆ రెక్కలు
ఇక రావని తెలుసు

నా భవిష్యత్తు
శాశ్వతంగా నిద్రపోయిందని తెలుసు

తిరిగి నేను నవ్వలేనని
జ్ఞాపకాల శిధిలాలో స్తభ్దంగా ఉండిపోతానని తెలుసు

ఇన్ని తెలిసినా నేను ఒక్క మాట అనలేదే..
నా అశ్రువులు ధారలైనా
ఊపిరాడక నే విల విల లాడుతున్నపుడైనా
ఏమనలేదు... ఎవ్వరినీ..

ఎవరి సంతోషంలో నన్ను భాగస్వామిని చేయమనలేదు
నా వైన క్షణాలను లాక్కోవదన్నాను
అంతే..అదే నే కోరుకున్నది

ఎందుకంటే నేను ఓటమిని ఒప్పుకోగలను కానీ
నన్ను ఓడించి నావాళ్ళు కూడా నాతోపాటే ఓడిపోయరంటే
వాళ్ళను వాళ్ళే మరింత అగాధాల్లోకి తీసుకెళ్ళి పోతుంటే
ఇక ఎవరు గెలిచినట్టు?

నేనూ నా వాళ్ళు కాక ఇంకెవరున్నారిక్కడ
ఎవరూ లేరని నాకూ తెలుసు

అందుకే
దయచేసి అవునని చెప్పొద్దు
ఓడిపోయానని గుర్తు చెయ్యొద్దు.

Saturday, December 26, 2009

దేవుడా ...ఎవరికీ చెప్పకు
దేవుడా ..?

జడపదార్ధాలకు
ఇంత జీవమిచ్చి
అంత విజ్ఞత జోడించి
మాంసపు ముద్దలను మనిషిగా చేసి కిందకొదిలేసావు

ప్రకృతి తో మమేకమయ్యి
ఆనంద నిలయాలను నిర్మిస్తాడనుకొని ఉంటావు

నీకు విశ్రాంతి నిచ్చి ...
విశ్వాన్ని ప్రేమ మయం చేయడం లో నీ పాత్ర తీసుకుంటాడని ఊహించి ఉంటావు

చివరి వరకు అతడు అతనిలానే జీవించి ..
నీ సాన్నిధ్యం చేరుతాడని ఆశించి ఉంటావు కదూ

ఎంత ముచ్చటపడి ఉంటావో మరి
నీ దిష్టి గాని తగల లేదు కదా ..?
లేక నీ లెక్క గాని తప్పు కాదు కదా ..?

ఏం చెప్పను..
పుర్రెకో బుద్దాయే!

నాది నాది అంటాడు ఒకడు
దోచుకోబడ్డానంటాడు ... ఆరళ్ళు పెడతాడు.. అల్లర్లు చేస్తాడు

తోచింది చేస్తాడు మరొకడు
స్వార్ధమెరుగనంటాడు..నా కోసమా? కాదు ... సమైక్య ప్రయోజనమంటాడు..

స్వీయ ఉద్దరణ మాని
దేశోద్ధారణ పేర ఏవేవో వింత పోకడలు పోతుంటాడు

ఇక్కడ ప్రతి వొకడూ మయసభ నిర్మాణధనుడే
ప్రతి వొకడూ దుర్యోధనుడే

పెద్ద ఎత్తున...
ఎవడి శ్మశాన వాటికలు వాడే తాయారు చేసుకుంటున్నాడు
ఎంత కాలమని ప్రపంచాన్ని అదే కిటికీ లోంచి చూస్తాడు?

అర్ధం కాని అవక తవకల ఈ స్థితికి
కారణం ఆదిలోని నీ సృష్టేనని ఎవరికీ చెప్పకు

చెప్పినా నాలాంటి ఛాందసులు నమ్మరులే గాని
బయటవరెవరైనా నవ్వి పోతారనేదే నా భయమంతా.. !

Tuesday, December 22, 2009

అవతార్ - సమీక్ష
జేమ్స్ కామోరోన్ నిర్మించి దర్సకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18 న విడుదల అయ్యింది. గొప్ప విషయం ఏంటంటే ఈ హోల్లీవుడ్ చిత్రం మన భారతీయ ఇతిహాసాలనుండి ప్రేరణ పొందిన కధ.

మానవుడు ప్రకృతిని తన చేత్తో తానే నాశనం చేస్తున్నాడు. ప్రకృతి ఉత్తమ గురువు, బందువు అని చెప్పడం చిత్ర ఉద్దేశం.
ప్రకృతి మనిషిని ఎంత జాగ్రతగా కాపాడుతుందో.. అలాగే మనిషి ఎంత అజాగ్రత్త గా వ్యవహరిస్తున్నాడో కొన్ని కొన్ని సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. చిత్రం నిండా రంగులు, అద్భుతాలు , వింతలూ కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి..ఇంకా మాక్ అప్, ఆర్ట్ వర్క్, కెమెరా, నేపధ్య సంగీతం అన్నీ ఒకదాన్ని ఒకటి మించి పోయాయి. కధానాయకుని పాత్ర మలచిన తీరు ఆకట్టుకుంటుంది. అబ్బుర పరిచే పోరాట సన్నివేశాలు ఈ చిత్రం సొత్తు. నిర్మాతలు పెట్టిన (పోసిన) డబ్బులు ప్రతి frame లో కనపడతాయి. నన్ను మెప్పించిన విషయం ఏంటంటే ఇందులో , ప్రేమ, action, sentiment, excitement, moral values వంటి ఎన్నో విషయాలు దర్శకులు చెప్పగలిగారు. Body paintngs ఉండడం వల్ల ఈ సినిమా కి U/A రేటింగ్ ఇవ్వడం జరిగింది కాబోలు. 13 ఏళ్ళు నిండిన పిల్లలు నిరబ్యంతరం గా చూడొచ్చు.

ఈ మధ్య కాలంలో నేను చూసిన ఉత్తమ చిత్రం అవతార్. చూస్తే (అవకాశం ఉంటే )ఈ చిత్రం 3D లో చూడండి. మీకు వినోదం రెండింతలు కలుగుతుంది .

Friday, December 11, 2009

అమరావతి సినిమా సమీక్ష
వారం నించీ చూద్దామని తహ తహ లాడిన అమరావతి సినిమాని చివరికి ఈరోజు చూసాను..

సినిమాకి దర్శకులు రవిబాబు ప్రాణం పోసారు. సినిమా మొదటి అర్ధభాగం ఆసక్తికరంగా సాగుతుంది. ద్వితీయార్ధం అంతా ప్రధమార్ధం లో సన్నివేశాలు, చిక్కుముళ్ళ గురించి ఉంటుంది. చిత్రంలో నటీనటుల నటన పాత్రలకు తగ్గట్టు ఉంది. ఎక్కువగా కామెడీ విలన్ గా చూసిన రవిబాబు ఈ చిత్రంలో కధానాయకుడుగా కనపడతారు. కధకి ముఖ్యమయిన పాత్ర ప్రతినాయకుని పాత్ర అందులో "తారకరత్న" ఆకట్టుకుంటారు.
ఇద్దరిదీ ఇందులో కొత్త నటన కనపడుతుంది.తారక రత్న గొంతు కొన్ని సన్నివేసాలలో మరింత గంభీరంగ ఉంటే ఇంకా బాగుండేది. ఈ కధకి భూమిక, స్నేహలాంటి established artists అవసరం లేదు. వారి బదులు మరెవరయిన నటించినా కధ నడిచేదే. సినిమాలో మలుపులెక్కువే. అయితే మొదటి పది నిమిషాల్లోనే కధలో violence ఉంటుందని చెప్పేస్తారు. మరు పదినిమిషాల్లో suspense మొదలౌతుంది. ఇక అక్కడి నించీ కధ పరుగులు పెడుతుంది. కొన్ని కొన్ని సన్నివేశాలకు ఎక్కువ లెంత్ తీసుకున్నరేమో అనిపించింది. సినిమా క్లైమాక్ష్ సన్నివేశం వేగంగా సాగుతుంది. సాగతీయలేదు కనుక మరి ప్రేక్షకులకి కూడా పాత్రలతో పాటే ఉన్నటు భావన కలుగుతుంది. ఇక సినిమాలో బాగున్నవి.. బాగోలేనివి.. ఇలా వున్నాయి..
========================================
బాగున్నవి..

చిత్రీకరణకు ఉపయోగించిన రంగులు
నటీనటుల నటన
ముఖ్యంగా సత్యానంద్ అందిచిన కధనం
శేఖర్ చంద్ర - నేపధ్య సంగీతం (సినిమాలో పాటలు లేవు)
ఆసక్తి కలిగించే కధలో మలుపులు
విశ్రాంతి సన్నివేశం
భారీగా లేని సంభాషణలు
మాక్ - అప్
========================================

బాగోలేనిది..

రక్తం ఎక్కువ సన్నివేశాలలో వాడడం
స్రీలపై దాడులు చేయడం అదే ఎక్కువ సార్లు చూపించడం
పైశాచిక ప్రేమ (అతి ప్రేమ కన్నా అతి ప్రేమ)
క్రూరత్వం (మొదటి పది నిమిషాలలో )

========================================

సినిమా బాగానే ఉంది కాని, పైన చెప్పిన "బాగోలేనిది.." వల్ల సినిమా నాకు నచ్చలేదు.
దయ చేసి గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, గుండె జబ్బు ఉన్న వాళ్లు సినిమా చూడకండి

సినిమా కధ గురించి నేను ఏమీ చెప్పను. ఎందుకంటే ఉత్కంట కలిగించే చిత్రాల కధ ముందే చెప్పేసుకుంటే మజా ఉండదు. లేదు తెలుసుకుని తీరాలంటారా.. తరువాత కింద లింకు చూడండి

http://navatarangam.com/2009/12/amaravathi-telugu-film-review/

Wednesday, December 9, 2009

నేనూ వెళ్లి పోయాను..
నీవెళ్ళిపోతున్నావు
తెలుస్తోంది...

అంతరిక్షానికెక్కి అరవాలనుంది
కదలొద్దని చెప్పడానికి..

కానీ ఏం చెయ్యను?
ఆగి పొమ్మని చెప్పను..
చెప్పి నీ భవిష్యత్తుని ఇక్కడే ఆపెయ్యను..

నీవా?

నా ప్రేయసివి కావు
పది పది మార్లు ప్రేమించానని చెప్పడానికి

చుట్టరికానివి కావు
మళ్ళీ కలుద్దామని మాట సర్దడానికి..

నేనై నాతో తిరిగావు
నీకేం చెప్పను..

ఒదిలేసి పోతున్నావు..

నేనూ ఎమనలేక నిశ్శబ్దంగా ఓ మూల నించున్నాను
చూస్తూ ఉండిపోయాను

కానీ ఎంతసేపని
నన్ను నేను ఆపుకున్నాను..?
ఆ ఆఖరి క్షణాన కౌగలించుకుని..
పసిబిడ్డకు మల్లే కన్నీరు కార్చాను..

నీవూ ఏం అనలేదు
నే చెప్పాలనుకున్నది నీకర్ధమైదనుకుంటాను
అప్పుడు మనకి మాటల అవసరం రాలేదు..

ఎందుకో.. మరి కొంత ఆ సమయాన్ని నే పొడిగించలేదు
అలాగే .. మరలి వెనుకకు చూడలేదు

నీవెళ్ళి పోయాక మాత్రం..
ఓసారి ఆకాశం కేసి చూసాను
నీవు లేక ఇక పైకి ఎగరేలేనేమో అనిపించింది

చేసేది లేక కిందకు తల వంచి
అక్కడుండలేక.. నేనూ వెళ్లి పోయాను