Sunday, November 29, 2009

ప్రేమే నిజమైతే..!
ఇకపైన కలలు రావు
ఊహల అవసరం కూడా నాకు రాదు

ఏ గాయాలకు నన్ను నేను సిద్దం చేసుకోనక్కరలేదు
వాస్తవ అవాస్తవ అవస్థల చర్చ కూడా నాలో ఇక లేవనెత్తదు
మరింకేదో వెతుక్కోవడమూ.. జరగదు

దూది కన్నా తేలికగా తేలిపోతుంటాను
గాలిపటాన్నై మేఘాన్నంటుతాను
మనసుననుసరించేస్తాను
భూమి చివరిదాకా పరిగెడుతాను

ఆపై మాటలు దాచక
నాకన్నా నన్ను నేను గొప్పగా వ్యక్తీకరిస్తాను

ప్రతిక్షణం...
ఆశ్చర్యానికిలోనౌతాను
జీవించేస్తాను
అభేదమైన ఓ స్థితినంటుతాను

భూత.. భవిష్యత్.. వర్తమాన.. కాలాల్లోనూ నేనే వుంటాను


:- ఈ కవిత రాయడానికి ప్రోత్సాహమిచ్చిన "పద్మార్పిత" గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

Wednesday, November 25, 2009

బస్సాయణం
ఎదురు చూసినంత సేపూ బస్సొస్తే చాలు
వచ్చిన తరువాత నుంచునేంత, నువ్వుగింజంత చోటుంటే చాలు

మరి ఆ మాత్రం చోటుంటే మనసాగుతుందా?
ఎక్కడో ఓ ఇనుప కడ్డీకి ఆనుకుందామనిపిస్తుంది
అక్కడినించీ పక్కన కూర్చున్నవాళ్ళపైన కన్ను పడుతుంది
ఇక దిష్టి, దృష్టి అంతా వారిపైనే

ఓపక్కన ఇరుకు వల్ల అసహనం, చెమట, చిరాకు వగైరా వస్తుంటే...
ఆ డ్రైవరుబాబు బ్రేకు పై కసిగా ఒక్క తొక్కు తొక్కుతాడు

ఇక మనకన్నా పెద్ద సైజులో వున్నవాడో లేక మందేసినవాడో మీదపడతాడు
అప్పుడు కదా నరకం తలుపులు తన్ని.. లోపల అడుగు పెట్టినట్టుంటుంది!

ప్రతి మలుపులో కధ మలుపులు తిరిగి మంట నషాళానికి ఎక్కుతుంది
ఓపికకు పరీక్ష పెడుతుంది
దిగి బయటకు వెళ్ళిపోదామా .. అనిపిస్తుంది
ఇంతలో ఒక సీటు చేతులు చాచి పిలుస్తుంది..
ఒకటో తారీఖుకి వారం ముందే జీతం వచ్చిన ఆనందం కలుగుతుంది ;)

యురేకా...!

అదృష్టాన్ని తలుచుకొని కూర్చోగానే
ఒళ్లో నాలుగైదు పుస్తకాల సంచీలు పడతాయి..
ఎవడో వచ్చి నాభుజం మీద ఆనుకుని తను కొత్తగా కొనుక్కున కర్లాన్ పరుపులా ఫీల్ అవుతాడు
అప్పుడు నేను అక్కడ కూర్చున్నందుకు పశ్చాత్తాప పడతాను

ఇంతలో బస్సుటైరు పంచరుపడి మంచి ట్రాఫిక్ గల నడిరోడ్డుపై ఆగిపోతుంది

ఇక అంతటితో నరకంలో అన్ని విభాగాలని దర్శించిన వాడనై

నడిచి నా గమ్యస్థానానికి మరింత ఆలస్యంగా చేరతాను

Friday, November 20, 2009

ఒక్క నిమిషం
ఒక్కో నిమిషంలో
ఎంత అందం !
ఎంత స్వేచ్చ !

అలాంటప్పుడు,
నేనేనా..? అనిపిస్తుంది
ఆనందాన్ని కనుక్కున్న అనుభూతినిస్తుంది

వెంటనే..
ఆకాశాన్ని కిందకి దించి..
రాత్రిని మేలుకొలిపేస్తాను
భూమ్యాకాశాలు చుట్టేస్తాను
ఉన్నట్టుండి నిశ్చలమైపోతాను

మళ్ళీ..
ఎంతో వేగమైన ఆలోచనలలో దొరలిపోతాను

సరిగ్గా ఈ "ఒక్క నిమిషం"
ఎందుకో తెలీదు కాని
తన స్థిరత్వం కోల్పోతుంది
ప్రవర్తన మార్చేసుకుంటూ ఉంటుంది

కాసేపు జ్ఞాపకమౌతుంది
మరి కాసేపు రేపటి ఆశకు స్వాగతచిహ్నమౌతుంది

Wednesday, November 18, 2009

ప్రేమే కల్పనైతే..?


క్రిఏటివ్ కుర్రోడు మాధవ్ గారు రాసిన "ప్రేమే కల్పనైతే.." అనే పోస్ట్ ని చూసి రాసిన కవిత ఇది...

http://creativekurrodu.blogspot.com/2009/11/blog-post_13.htmlప్రేమే కల్పనైతే..?

సొంతమనేది లేక,
సొంతం కాలేక

ఎవరికెవరో అయి..
ఓ నామ మాత్రపు బ్రతుకు వెళ్లదీస్తుంది దేహం

మసిబట్టి, మసకబారి పోతుంది
మనల్ని మనం చూసుకునే అద్దం..

భావ రాహిత్యంలో
స్పందన కరువై
శూన్యంలో విలీనమౌతుంది జీవితం..

Sunday, November 15, 2009

కుర్రాడు - సమీక్ష

నిన్న శనివారం రాత్రి సెకండ్ షో కుర్రాడు సినిమా హాలుకు వెళ్ళా. చూస్తే జనాలు పెద్దగా లేరు. అదేంటి రెండు రోజులేగా అయ్యింది సినిమా విడుదల అయ్యి ఏంటబ్బా ఇంత కాళీగా వుంది అనుకున్నా. ఇదే ముక్క టికెట్ కౌంటర్లో అడిగా.. ఏమండీ సినిమా ఎలావుంది? బాగుందా? అతను నెత్తి కొట్టుకుని, టికెట్ చేతిలో పెట్టి పక్కకు జరగమన్నాడు. అక్కడికే ముప్పావు వంతు అర్ధం అయ్యింది ఈ సినిమా తంతు ఎలా వుందా అని..సరే తినబోతూ రుచులెన్దుకని మారు మాట్లాడకుండా వెళ్లి నా సీట్ లో కూర్చున్నా.

సినిమా మొదలయింది ...

ఓ పోకిరి "కుర్రాడు" ,వీడికి బైక్ పిచ్చి ..ఓ ముగ్గురు స్నేహితులు.. ప్రేమిస్తున్నానని చెప్పుకోడానికి ఓ అమ్మాయి.. ఓ రోజు బాగా తిరిగి.. తాగి.. ఊగి..(మధ్యలో కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళోయ్ అనే పాట) ఇంటికొస్తాడు హీరో.. సహజంగా తండ్రి పాత్ర ఎంచేస్తుందో (తనికెళ్ళ భరణి ) ఈ సినిమా లో అదే చేస్తుంది..నేను బాగు పడాలంటే నువ్వు డబ్బులివ్వాలి అన్న ఆ కొడుక్కి, కూతురి పెళ్లి కోసం దాచిన కట్నం ఇచ్చేస్తాడు,కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. ఆ డబ్బు పెట్టి కుర్రాడు ఓ బండి (APACHE) కొంటాడు.

అక్కడినించి కదా.. కధ మలుపు తిరుగుతుంది. కొన్న ఆ కొత్త బండి ఆ కుర్రాడికి, అమ్మాయిని, ఉద్యోగాన్ని, భాద్యతలని అలాగే కష్టాల్ని ఎలా తెచ్చిపెడుతుందో వెండి తెరపై మీరే చూసి ఆనందించాలి.

వరుణ్ సందేశ్ కొత్తగా ఈ సినిమాలో రెండు ఫైట్లు ఎక్కువ చేసాడు అంతే..ఇంకేమీ కొత్త దనం చూపించలేదు. ఇంకా అతను తెలుగు పలకడం మీద మరింత శ్రద్ద పెడితే బాగుండేది. హీరోయిన్ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. "Emantaave" అనే పాట బాగుంది. విలన్ గా రవి శంకర్ బాగున్నారు. అలానే బుల్లెట్ పాత్రధారి నటన బాగుంది. సినిమా లో కలర్ కామ్బినాషన్ మరింత బాగుంటే బాగుండేది. సినిమా లో ఒక కామన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. తనికెళ్ళ భరణి నటన అద్భుతం!

సీన్స్ పరంగా పర్లేదు కాని... ఎడిటింగ్ లోనో ఏమో 'లేక' తీయడంలోనో అమరిక సరిగ్గా కుదరక కొంచెం అసహనం గా అనిపిస్తుంది. మొత్తం గా సినిమాలోకీ వెళ్ళలేము అలానే బయటకీ వెళ్ళలేము (అయ్యేంత వరకు).

చివరాకరికి ఏంటంటే సినిమా పెద్ద గొప్పగా లేదు. "బెటర్ వెయిట్ ఫర్ DVD"