Sunday, September 27, 2009

మా శ్రీశైల దర్శనం 1బ్లాగ్
మిత్రులందరికి విజయ దశమి శుభాకాంక్షలు.

ఉదయం 8.30 కి శ్రీశైలం చేరాము. ప్రశాంత వాతావరణం. అప్పుడే వర్షం పడి ఆగిపోయింది. చల్లటి గాలి, పచ్చని చెట్ల వాసన, మబ్బులు వీడి బయట కొస్తున్న భానుడు.. గొప్ప అనుభూతి తో మొదలయింది రోజు..

ఆ రోజు శంకర మఠం లో మాకు బస ఏర్పాటయింది. మఠం నుండి స్వామి వారి ఆలయ ప్రవేశ గోపురం కనపడుతూనే వుంది.. హడావిడి గా పనులు ముగించుకొని 10.౩౦ కల్లా ఆలయ దర్శనానికి బయలుదేరాము.

నాకు మొదటి నుంచి ఉచిత దర్శనమంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే, మరి కొంత సేపు స్వామి వారి ఆలయ ప్రాంగణం లో సమయం గడిపే అవకాశం వుంటుంది కనుక. చూస్తే ఉచిత దర్శనానికి చాల పెద్ద క్యూ ఉంది.
చాలా ఆలస్యం అయ్యేట్టుంది. దర్శనం జరగదేమో అన్న అనుమానం కూడా లేక పోలేదు. ఏం చెయ్యాలి
ఇంక టిక్కెట్టు తీసుకోక తప్పింది కాదు.

మేము మొత్తం నలుగురం. నేను, మా అమ్మగారు ఇంక ఇద్దరు బావలు. ఘాటి రోడ్డు ప్రయాణం లో కాస్త అలసి వున్న మేము ఇప్పటికిదే మంచిదనుకున్నాం. క్యూ కొంత ముందుకు కదిలింది. సరిగ్గా మేము ధ్వజ స్థంబం వద్దకు చేర గానే క్యూ ఆగి పోయింది. సమయం గడిచి పోతోంది. నీరసం ఆవరిస్తోంది. పక్కన ఆవలింతలు, ఏవేవో కబుర్లు, నాకు ఎవ్వరిలో భగవథ్ద్యానమ్ తాలూకు చాయలు కనపడలేదు. లైన్ లో ఆలయం లో కాసేపు వుండాలన్న నా కోరిక మాత్రం తీరింది. ఎంత సేపటికీ ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. కనీసం లోపల స్వామి వారికి ఏం సేవ జరుగుతోందో తెలిస్తే అదో ఆనందం.. చివరికి ఆ బాగ్యం కూడా లేదు. దసరాల సంధర్బంగా ఏర్పాటు చేసిన ఒక బృందం శివుని పాటలు భజన చేస్తోంది. అన్నీ చక్కటి పాటలే.. గొప్ప అర్ధవంతమైన పాటలే. కాని ఈ స్పీకర్ సిస్టం పాతది అనుకుంటా .. ఎకో ఎక్కువయింది.. కొంత చిరాకు తెప్పించిందనే చెప్పాలి. అసలే ఎదురు చూపులవల్ల, అలసట వల్ల నీరసించి చాలా మంది లైన్ లోనే ఎక్కడి కక్కడ కూర్చుంది పోయారు.. కొంత మంది నిద్ర పోయారు. అందులో నేనూ వున్నాను. మేము వున్నది శివుని ఎదురు గా ఉన్న నందీశ్వరుని పక్కనే. నందీశ్వరుడు చాలా బాగున్నారు. చుట్టూ బోలెడు చిన్న చిన్న ఉప ఆలయాలు కాన పడుతూనే వున్నై. కాని బయటకు వచ్చేదెల.. ఆ శివయ్య అనుమతి దొరికినప్పుడే కదా..ఇంక ఓం నమః శివాయ అనుకోవడం మొదలు పెట్టాను. కొద్ది సేపటికే లైన్ ముందుకు కదిలింది.. స్వామి వారి దర్శనం జరిగింది. అక్కడి ఆధ్యాత్మిక తరంగాలు మనస్సులో మలినాలను ప్రక్షాళన చేస్తాయి. అనంతరం అంతసేపు పడ్డ ఇబ్బందులేమైనా ఉంటే మొత్తం మరిచి పోతాం. అక్కడి భగవత్ దర్శనం లో ఒక చల్లని స్పర్శ వుంది. అది సర్వ రోగ నివారిణి అనిపిస్తుంది.

అక్కడి నుండి అమ్మ వారి ఆలయానికి బయలు దేరాం. అమ్మ ఎంత గొప్పగా వుందంటే, ప్రసాంతత, ప్రేమ, కరుణ, మూర్తీబవించిన రూపు ఆమెది. మాటలు చాలవు. ఎదురు గా శ్రీ చక్ర పూజలు జరుగుతున్నాయి. మండపం నిండుగా భక్త జనం. వేద మంత్రాలు చెవిన పడుతున్నాయి, చేతిలో తీర్థం తీసుకుని పాదుకల ఆశీర్వాదం అందుకుని బయటకు నడిచాము. తరువాత ఉప ఆలయాల దర్శనం చేసుకుని మఠం కి తిరిగి బయలు దేరాము.

బయటకు రాగానే లోపల ఆకలి మొదలయింది. మఠంలో అప్పుడే ఏకాదశ రుద్రాభిషేకం పూర్తి చేసుకుని భోజనాలకు ఉపక్రమిస్తున్నారు అందరూ. మేము కూడా వెళ్లి భోజనాలలో కూర్చున్నాం. అక్కడ మగ వారి వస్త్ర ధారణ పంచె వుత్తరీయం. మేము మాత్రం ప్యాంటు చొక్కాల్లో ఉన్నాం. వాళ్ల పద్దతి గమనించి మా అల్లరి కొంత తగ్గించి నడుచుకున్నాం. భోజనాల రుచి కమ్మగా వుంది. భోజనాల కార్యక్రమం ముగించిన తరువాత ఓ పెద్దాయన మెల్లగా చెప్పారు ఇక్కడ బోజనలకి పంచె కట్టుకునే రావాలని.. అప్పుడర్ధం అయ్యింది. ఎక్కడి పద్దతులు అక్కడ పాటించడం ముఖ్యమని.. ముందుగా తెలుసుకోవడం అవసరమని...

ఇంక అక్కడి నుండి శ్రీశైలం చుట్టు పక్కల విశేషమైన ప్రదేశాలు చూడ్డానికి బయలు దేరాము...
ముందుగా ఇష్ట కామేశ్వరి అమ్మవారి దేవాలయానికి బయలుదేరాము. అది శ్రీశైలం నుండి 23 కిలో మీటర్ల దూరంలో అడవిలో వుంది... ఇది గొప్ప సాహస వంతమయిన ప్రయాణం.. దీని వివరణకు మరో ప్రకరణం రాయాల్సిందే.. ఛాయా చిత్రాల సహితం గా మళ్ళీ కలుస్తాను ఉంటాను.. ప్రస్తుతానికి మాత్రం గూగుల్ లో సేకరించిన కొన్ని శ్రీశైల చిత్రాలు పైన చూడండి... ధన్యవాదములు

Monday, September 21, 2009

రంజాన్


.

బ్లాగ్ మిత్రులందరికి ... రంజాన్ పండుగ శుభాకాంక్షలు..

Sunday, September 6, 2009

నన్ను పోల్చుకొందుకు!
మునుపటి ఆ కధలలో
అతికించుకున్న నవ్వులతో
తొడుక్కున్న వ్యక్తిత్వంతో
నా అస్థిత్వాన్ని కోల్పోయానని ..

అంతరంగం వెక్కిరిస్తోంది..

అందుకే
నేను లేని నన్ను చూసుకోవడం మానేసి
.
.
.
వదిలేస్తున్నా
ఇక్కడే..
అన్నీ!

నన్ను పోల్చుకొందుకు!


.