Saturday, August 29, 2009

బంధాలు...
ఆశాధారితలు
స్వేచ్చ ప్రదాతలు..

బలహీనతలు
బతుకు మూలాలు..

విభేదాల అభేదాలు
గీసుకున్న గీతలు..

మాసిపోనీ..!
ఇవి రంగుల చిత్రాలు...!.

Monday, August 17, 2009

నాకు నేను చెప్పుకునేవి...

.
అరిగిపోయిన నీ చెప్పులే కాదు..సుమా..
ఎండకు నేలకంటిన పాదాలున్నాయి..ఇక్కడ..
==================================


రుచులెంచుకునే సౌకర్యం నీది..
ఓ ముద్ద నోట్లోకెళ్ళడానికి .. చేతులు చాచే జీవితాలున్నాయి చూసావా..?
====================================నీ వారి లో చిన్న చిన్న లోపాలెంచి..కలత చెందకు...
ఎవరూ లేని వారిని అడిగి చూడు..తెలుస్తుంది. తరువాత మిగిలే ఆ ఒంటరితనం ఏంటో..========================================నిరాశలో ఉండిపోతే..నీకేమి మిగులుతుందని..
నీవెవరి బాటలో నడుస్తున్నావో వారినోసారి అడిగి చూడు..ఏమి సమాధానం దొరుకుతుందో..====================================చీకటి లో ఉండిపోకు..వెలుగుకే అలవాటు పడకు..
రెండిటి కలయికే..ఓ రోజుని సంపూర్ణం చేస్తుందిగా మరి...
Saturday, August 8, 2009

చెరిగి పోతున్నై..
కిరసనాయిలు బుడ్డీలెలిగించుకుని
కాసింత చద్ది కూడు కుండలో ఎట్టుకుని
సముద్రానికి ఇంతే దూరంలో కూకుని
గుంటలడిన గోళీ కళ్ళతో..
అటు ఏపే సూత్తన్నా ..

ఏడదాకొచ్చిండో కొడుకు
ఇంతన్నం దిని తొంగునేటోడు ఈ ఏలకు

గుడిసె ఇడిచేప్పుడ్డన్నాడు ..
"ఈ ఏల బంగారం తెత్తా" నని
నవ్వి ఊరుకున్నా..గాని ఏమనలేదు ..

రానీ.. ఇప్పుడు సెపుతా ..

ఇదిగో ఈ సినిగిన గుడ్డలు ఏసుకుని.ఉంటా..
అర కొర ఆకలి నింపుకుని..
ఓ మూల పడుంటా గాని .. మరింకేటీ మనకొద్దని..

సంద్రంలో సగానికి మునిగిన పడవ లాటి బతుకులు మనయి..
బ్రతకడమే గావాలి గాని..
రేపటిమీద అత్యాశ వద్దని..

యేడి..
గంటలయిపోతున్నా..ఇంకా రాడే..

చీకట్లో గుచ్చి గుచ్చి ఎతికే కళ్లు..
ఆడిగురించింకా ఏమనట్లేదే..

అరె ..
కాసింత బుడ్డి యెలుతురూ పోయింది..
మొత్తం చీకటైంది..

చూసే లోపలే..
తీరం
అంచున ఇసుక మీద
పడీ
పడని కాలి అచ్చులు ..
అలలు తమ చివర పోగుచేసుకున్న నురగ తాకి..
చెరిగి పోతున్నై...

Tuesday, August 4, 2009

ఆకాశ వీధిలో..
మైత్రీ వనంలో వూయలూగాలని..

కలిసి..
ఆగని
గీతానికి రచన చేయాలని...

ఒకటిగా ఆదమరిచి పోవాలని..

ఇంకా..
ఇంకా...

ఎన్నెన్నో ఆలోచనలు..ఇటుకలు చేసి..
కట్టుకున్న భవంతిలో ఇలాగే వేచివున్నాను..

ఇన్నాళ్ళూ నేనేనా..
ఇంత కాలం నాదేనా.. ఆత్రుత..నీ కోసం...

అనుకుంటున్నా ...!

అప్పుడే.. ఎక్కడినుండో గాలి అలలు...
ఈ కబుర్లు తీసుకొచ్చాయి...

నీలి గగనాన ..
ఆ తారల మధ్యన..

వెలుగు తీగల.. వెనుకకు చూస్తూ
నా రాకను ఆశిస్తూ..

ఆకాశ వీధిలో..
తారాడే నీ ఊహలు ..

నాకన్నా ఎక్కువగా
మన కలయికకు ఒక వేదికను వెతుకుతోందని....