Thursday, July 30, 2009

నాకు నేనూ లేను..!





ఎవ్వరికీ
తెలియని కథ ..
"నా"..లో.. "నీ".. కధ..
మొదలయిన ఆ రోజు.. నాకింకా గుర్తు..

అక్షరాలు
అందక..
ఖాళీగా వదిలేసిన .. నా డైరీలో ..ఆ మొదటి పేజీ..
నిదుర పట్టక చందమామను వెక్కిరించిన రీతి..
ఇంకెపుడో ఆ రేపటి ఉదయమని..
దూరంగా దిక్కును చూస్తూ గడిపేసిన ఆ రాతిరి..

అలా..
అలా ..
ఎన్ని రోజులో నాతో నడిచి వచ్చేశాయి..!

ఇదే నీతో చెబుదామన్నపుడల్లా.. నాలో ఆరాటం ..
ఇంకా ఆలోచిస్తూ వుండిపోయాను..
మరింకేదో అంటూ వచ్చేసాను..

ఆలస్యం చేశానేమో..
ఉన్నట్టుండి ఓ రోజు.. వచ్చేసిందో వార్త ..
నీకు నాకు మధ్య ..ఓ దూరం శాస్వతమౌతోందని ..
నా రాతలు..నన్నే చెరిపేసుకోమని...
చెప్పింది...
చెప్పి వెళ్లి పోయింది..

కన్నీటిని రెప్పలు దాచుకోలేవని..అద్దాలు అడ్డు పెట్టుకున్నాను......
చెంపకు పై పై నవ్వులు అద్దాను..
నీ తాలూకు గురుతులు నీకే వదిలేసాను..
ఆరాట పడక ఆగిపోయాను..

ఇప్పుడు ఆ కాగితాలూ లేవు .. నీవూ లేవు..
రాసిన నేను మాత్రం.. మిగిలిపోయాను..
అయినా నాకు నేనూ లేను..!

Monday, July 20, 2009

ఓ పెద్ద మనిషీ..




నాది పరాజయం..అంటున్నాడెవడో పెద్ద మనిషి..
అదే పనిగా నన్నే చూస్తున్నాడు..
సంవత్సరాల తరబడి వెంటాడుతున్నాడు..
ఓటమి పాలైనపుడల్లా ...ఓ వెక్కిరింపు నవ్వు నవ్వాడు..

బదులుగా ...

నేను కూడా నవ్వేవాడిని..
నా గెలుపు ఓటములకు నీవెలా నిర్నేతవైనావని..
నను నిర్దేశించే నీ కొలబద్దలేమని..

మార్పు కావాలనే వాదనే కానీ...

ఆలోచించాడా ఎపుడైనా..
ఏంచేస్తున్నాడని..?

ఆదరించాడా ఎపుడైనా..
ఆశతో.. తలుపు తట్టిన వారిని..?

మార్పు కోరుకునే అతడు...
మార్పుకు సిద్దపడి లేడు...

మరి ..
ఈ నవ సమాజ నిర్మాణంలో నా పాత్రనెలా ప్రశ్నించగలడు....?




.

Thursday, July 16, 2009

ఇక ఆ యశోదకు ఏమివ్వగలను..




రంగుల జల్లునో..
దోచుకెళ్లిన హరివిల్లునో..

అతిధినా ఆ ఇంటికి నేను ..కానేమో..?
చిరకాలం ఉండిపోలేదు..
ఈ కృష్ణ పాదాల గురుతులు చెరిగిపోలేదు..

బతుకున ..వేడుకల రాయబారినా నేను..కానేమో?
సంబరాలు మోసుకొచ్చాను..
వరాల రుచి చూపి వెనుదిరిగాను..

ఇది ఆర్తి కాదని చెప్పలేను.. ఓదార్పు వెతుక్కోలేను..
అవ్యక్త భావనలో.. అటు ఇటు గా నేను..
గొంతుక గుమ్మం దాటిపోలేను...

ఇక ఆ యశోదకు ఏమివ్వగలను..


Sunday, July 12, 2009

సొంత కధ..

కధని.. మూడు పాత్రల దృష్ట్యా చదవండి.. మీకు కధలో మూడు వివిధమైన . ముగింపులు.. తెలుస్తాయి..




అనగనగ ఒక పిల్లి, కుక్క , పంది... మంచి స్నేహితులు గా ఉండేవి...పిల్లికి దేనిమీదా స్థిరత్వం లేదు.. కుక్క ఏమి చెప్పినా నమ్మేస్తుంది..(గుడ్డి నమ్మకమన్న మాట..) ఇక పందికి పద్దతులు.. పాడు..ఏమి లేవు..ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలీదు... ఎప్పుడూ ఎవ్వరితోనో తిట్లు తింటూ వుంటుంది. అది చేసే..చెత్త పనుల వల్ల..

ఓ రోజు పిల్లికి ఒక ఆలోచన వచ్చింది.. ఎన్నాళ్ళిలా ...వీటితోనే తిరుగుతాం..ప్రపంచం చాల పెద్దది కదా..! నాకు వీళ్ళే మాత్రం.. విలువ ఇస్తున్నారు.... ఎక్కడికైనా వెళ్లి పోవాలి..ఏదో చేసెయ్యాలి..నేనే గొప్ప అనిపించుకోవాలి..

ఇంక పిల్లి అనుకున్నదే తడవు గా.. ఎక్కడికో వెళ్లి పోయింది..

కుక్క , పంది.. పిల్లి కోసం ఎక్కడెక్కడో వెతికాయి.. చివరికి కనిపించలేదని..చాలా భాద పడ్డాయి..

పిల్లి తిరిగి వస్తుందని..ఎక్కడో బాగానే వుందని కుక్క..నమ్మింది..
తనవల్ల పొరపాటు ఏదైనా జరిగిందేమో అని..పంది..ఇక పైన పద్దతి గా వుండడం మొదలు పెట్టింది..

కొన్ని నెలలు గడిచాయి..
.
.
.
.
.


పిల్లి చాలా చోట్ల తిరిగింది..కాని ఎక్కడా ..ఎవ్వరూ.. తనని గొప్ప అని వొప్పుకోలేదు సరికదా .. కనీసం సరైన ఆదరణ కూడా దొరకలేదు..

చివరికి తిరిగి..తన వాళ్ళ దగ్గరకి వచ్చేసింది..

కుక్క..పంది చాలా ఆనందపడ్డాయి ..కుశల ప్రశ్నల్లో..ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు మిత్రమా ? అని అడిగేటప్పటికి..స్నేహితుల ముందు నిజాలు మాట్లాడడానికి..జంకింది.. తడుముకుంటూ..తప్పస్సు చేసుకోవడానికి వెళ్లానని..ఏవో శక్తులు వచ్చాయని..ఇప్పడు ఎలాంటి..జబ్బునైనా ... నయం చేయగలనని.ప్రగల్భాలు పలికింది..

ఇక అబద్దాలతో..కొంత కాలం గడిచింది..

పిల్లి వూళ్ళో లేని సమయంలో ..ఒక రోజు..కుక్కకి జబ్బు చేసింది..
పిల్లి కోసం ఎదురు చూసి చూసి..జబ్బు పెరగసాగింది..పంది చాలా సార్లు చెప్పి అయినా వాటిని పెడ చెవిన పెట్టింది కుక్క .ఇంకా ఏదో నమ్మకం..తన స్నేహితుడు వచ్చి కాపాడతాడని..

ఆఖరికి కుక్క చివరి క్షణాల్లో..పిల్లి తిరిగి వచ్చింది..

పిల్లికి నిజం వొప్పుకోక తప్పింది కాదు..అయినా చేసేది లేదు.. కుక్క చనిపోయాక .. పిల్లి రెండు కన్నీటి చుక్కలు విడవడం తప్ప..

కాల క్రమేణా .. పిల్లి ..పంది కూడా విడిపోయాయి....


.

Sunday, July 5, 2009

నీకు మాత్రం తెలియనిదా..?





స్నేహితులమా
?
రక్త సంభందమా?
దూరపు చుట్టరికమా?
మౌతామని ఒకరికి ఒకరం ...
మనలో ఎందుకీ మాటరాని తనం..

పైకే నా డాంబికం గానీ..
నాకే తెలియదు నేనెన్ని సార్లు సర్ది చెప్పుకున్నానో....

చూస్తుండగానే..ఆ సమయం వచ్చేసింది..
నా గడియారం నన్ను మరింత ముందుకు తోసింది..

చేతిలో చేయి వేసి ... నువ్వు వీడ్కోలు చెప్పేటప్పుడు..
నన్ను నీ గుండెకి హత్తుకున్నప్పుడు...

ఉండిపోదామనే ఉంది..
అని అరిచి చెప్పాలనుకున్నప్పుడు..

మూగ భాషనే ఆశ్రయించానేమోగాని గాని ..
మరేమీ..మాట్లాడలేదు..

ఎడబాటు తప్పదని తెలిసీ ...
మళ్లీ , .మళ్లీ...
ఎందుకు కలుస్తావని నన్నడిగిన ప్రశ్నకు...

ఏం చెప్పలేక పోయానేమో కాని...

కలిసిన ఆ కాసిన్ని క్షణాలు..ఈ ఎడబాటులో నాకు ఊపిరి పోస్తుందని...
నీకు మాత్రం తెలియనిదా..?


.